కాశీరత్నం, నా అభిప్రాయాలతో

ఈమధ్య పువ్వులబొమ్మలు, ఒకొకప్పుడు అర్థవంతమైన వ్యాఖ్యలు జోడించి ముఖపుస్తకంలో ప్రచురిస్తున్నాను. మామిత్రులస్పందనలు చాలా బాగుంటున్నాయి. ఆ ఉత్సాహంలో నేను పూవులమీద రాసిన రెండు కథలు గుర్తొచ్చేయి. ఈ కాశీరత్నం కథ ఒకటి, 1966లో రాసింది.

అప్పటికే నేను గ్రామదేవతలకథలు చాలా చదివి, వినీ ఉన్నాను. మాయింట్లో గేటుమీదకి ఎగబాకిన కాశీరత్నం తీగ నయనానందదాయకంగా ఉండేది. మాఅమ్మ పూజకి పూవులు కోసివ్వడం నావంతు ప్రతి ఉదయం. అన్నీ కోసేదాన్ని కానీ ఈ కాశీరత్నం మాత్రం లేదు. చూడడానికి బహుసుందరంగా ఉంటాయి కానీ అంత సుకుమారం కూడాను. ఇటు తుంచగానే అటు మొహం వేలాడేసేస్తాయి. పట్టుకుచ్చుల్లా అతి మెత్తగానూ, ఎర్రగా కెంపుల్లా ధగధగ మెరుస్తూనూ ఉండే పువ్వు ఇదొక్కటేనేమో. అంచేత నాకు దానిమీద ఓ కథ రాయాలనిపించింది. ఇది నేను కల్పించిన కథే కానీ వాస్తవంగా జరిగిన, విన్న కథ కాదని గమనించగలరు.

ఇంతకాలం తరవాత మళ్లీ ఇప్పుడు తిరిగి చూసుకోడంలో నాకు అబ్బిన వైరాగ్యం కూడా కొంత కారణం కావచ్చు దీన్ని మళ్ళీ తిరగదీయడానికి.

ఈకథ కథగా నాఅభిప్రాయాలు కథ చివరలో జోడించేను. ఆసక్తి గలవారు మాత్రమే చదువుకుంటారని.

అప్పటి ఫొటోలేమీ లేవు కానీ ముఖపుస్తకంలో మిత్రులనడిగితే, వారు అందించిన బొమ్మలు ఇక్కడ చేరుస్తున్నాను

రావూరి రేవతిగారి సౌజన్యంతో

కాట్రగడ్డ వరూధినిగారి సౌజన్యంతో

పోచిరాజు సత్యవతిగారి సౌజన్యంతో

వనజ తాతినేనిగారి సౌజన్యంతో

000

కాశీరత్నం కథ

′′బాబూ, ఒక్కచుక్క కాఫీ పోస్తావా?′′
అప్పుడే కాలేజీనుంచి వచ్చి వరండాలో కాఫీగ్లాసు పట్టుకుని ఆయాసపడుతున్న నేను ఆకొత్త బిచ్చగాడివేపు చూశాను వింతగా. కాలపురుషుడి వినోదకేళి కాకపోతే మాదాకబళం, గుక్కెడు గంజినీళ్లూ, యాచించే రోజులు పోయి, కాఫీకీ, సిగరెట్లకీ చెయ్యి చాచే రోజు రావడం ఏమిటి? వృత్తికి యాచనైనా మనేది మనిషిగానే కదా అని కాబోలు … కానీ, మరుక్షణం నాలో చిరాకు పరాకు చిత్తగించింది.

′′ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? నువ్వు ఎంతమందికి ఎన్నిమార్లు హోటళ్లలో ఇప్పించేవో, ఎంతమందిదగ్గిర పుచ్చుకున్నావో? అంత ముందూ వెనకా చూడ్డానికి నేనేమైనా నీ ఆస్తి అడిగేనా? ఆదాయం అడిగానా? కాదూ పోదూ అంటే నీ ఇంటిపడుచుని కోరేనా?′′ పొదలమీసాల్లోంచి ముసిముసి నవ్వులు కురిపించడం అంతచిరాకులోనూ నన్ను మురిపించింది.

మనిషిని మరోమారు చూశాను. అనకాపల్లి బాణాకర్రలా నిలవేస్తే నలుగురికి జవాబు చెప్పేలా వున్నాడు. ముసలితనం ముంచుకొస్తున్నా పడచుదనపు కొసమెరుపులు ఇంకా కొసరుతున్నట్టే వుంది. అరవై దాటేసినా హాయిగా నవ్వుతూ రాజెవరి కొడుకన్నంత ధీమాగా నిలబడి, గుక్కెడు కాఫీ కోసం వెండిగ్లాసు పట్టుకు వచ్చిన ఆవృద్ధుడిని చూస్తే మనస్సు ఎందుకో క్షణకాలం పరవశించింది.
′′ఏం కాఫీ లేకపోతే వుండలేవా?′′ అని అడగాలనిపించినా, పెదిమ కదిపే ఓపికలేక మౌనంగానే నాగ్లాసు అతనిగ్లాసులోకి వంచాను.
నామనస్సులో మాట కనిపెట్టినట్టు, ′′నాక్కాదు బాబూ′′ అన్నాడు.
నాభావం కనిపెట్టాడన్న బాధా, అడగనిప్రశ్నకు జవాబు చెప్పేడన్న కోపం, ఇహ ఇప్పుడు ′′ఇంటికాడ జొరంతో పడున్న ఏముసిల్దాని′′ కథో మొదలుపెడతాడేమోనన్న చిరాకూ మేళవించగా, ′′సర్లే, వెళ్లు′′ అన్నాను.
′′కోపం ఎందుకయ్యా? అసలు కథ తెలిస్తే అలా కసిరేవాడివా? కంట తడి పెట్టవా?′′
′′షటప్′′ అనబోయి ఆగిపోయాను. ఒక్కొక్క మొహం చూస్తే తిట్టడం కూడా కష్టమే.
తాత నవ్వేడు.
ఛీ, ఛీ, తలతీసినపని. మనస్సులో మాట మొహంలో చదివేస్తున్నాడు. పండితుడిలా మాటాడుతున్నాడు. అంతా వింతగా వుంది. తెగించి అడిగాను, ′′ఎవరు నువ్వు?′′
′′నేనా?′′ మళ్లీ అదే నవ్వు.
′′ఏం, కేసు పెడతావా? రామదాసంటే తెలీని పోలీసు లేడు. పనిప్పిస్తావా? చేయలేని పని లేదు. నీకు కాలక్షేపం అని అడిగితే మటుకు నాసంగతి కనుక్కోలేవు,′′ పందెంవేసినట్టు మందహాసం చేసేడు, కనుబొమ్మలు ఎగరేసి.
నేను మాటాడలేదు.
తాత వెనక్కు తిరిగి మళ్లీ గిరుక్కున ఇటు తిరిగేడు, ′′అయితే ఇది ఏనెల బాబూ?′′
′′నవంబరు′′ అన్నాను ముక్తసరిగా.
′′తెలుగులో చెప్పు,′′ అన్నాడు తాత.
′′నాకు తెలీదు.′′
మళ్లీ అదే నవ్వు. ′′నెలలుకూడా తెలీక ఏంచదివావు? పిల్లలకి ఏంచెపుతావు?′′
నాకు ఒళ్లు మండింది. ′′పంచాంగం కాదులే,′′ అన్నాను పళ్లు గిట్టకరిచి.
తాత నామాట వినిపించుకున్నట్టు లేదు. వేళ్లు గుణించుకున్నాడు. కళ్లు మూసుకున్నాడు. ఏదో గుర్తుకొచ్చినట్టు గబగబా గేటువేపు నడిచాడు. ఏగోడో అడ్డం తగిలినట్టు గతుక్కుమని కుడివేపు తిరిగి మూడడుగులు వేశాడు. అక్కడ ఓ చదరపుటడుగుమేర పరీక్షగా చూడసాగాడు.
ఓరెండు నిమిషాలు గడిచాయి. అక్కడ మామిడిచెట్టే మొలిపిస్తాడో! చెవులపిల్లినే పుట్టిస్తాడో! ఎదురుచూస్తున్నాను.
′′చూశావా ఇక్కడ? ఈవేళకి మూడోరోజున మొక్క మొలుస్తుంది. నామాట పొల్లు పోదు. జరిగింది చెరిగిపోదు. మణమ్మకథ కల్ల గాదయ్యా. ఆతల్లి దేవత. నమ్మినవాళ్లు నమ్మేరు. నమ్మనివాళ్లకు ఆతల్లే చెబుతుంది,′′ తాత నావేపు చూడకుండానే గొణుక్కుంటూ చేతిలో కాఫీ అక్కడ పోశాడు.
′′అదేమిటి, కాఫీ పారబోస్తావు? ఒంటిమీద తెలివి లేదా? బుద్ధి పనిచెయ్యడంలేదా?′′ గట్టిగా ఆడిగేను, నాకూ తనకూ కాకుండా నేలపాలయిన ఆ జీవనగంగను తలుచుకుని.
తాత మెల్లిగా వచ్చి అరుగుమీద స్తంభాన్ని ఆనుకుని చతికిలబడ్డాడు.
′′బాబూ దేవుడంటే ఏమిటి? దేవుడంటే మంచితనమే. మనం ఉండిపోం. మాట ఉండిపోతాది. ఆలాటిపిల్ల మామణమ్మ. పేరులాగే రూపం. మణిదీపంలా మెరిసిపోయేది. గట్టిగా చూస్తే కందిపోతుందనిపించేట్టుండేది. దానికి తగినగుణం. ఎందుకయ్యా మనమూ బతికేం. తాను ఓబతుకే తవుడూ ఓరొట్టే అన్నట్టు. హంసలా ఆర్నెల్లు బతికినా చాలు. మామణమ్మ అలాగే మెరుపులా క్షణం బతికింది. ఆక్షణంలోనే అందరిచేతా అవుననిపించుకుంది. పెళ్లినాటికి పధ్నాలుగేళ్లు. పట్టుమని నాలుగు నెల్లయినా కాకుండా బూడిదయిపోయింది. ఈచేతులతోనే మట్టి చేసేశాను,′′ తాత పైపంచె అంచులతో కళ్లు తుడుచుకున్నాడు.
′′నీకేం కావాలి తాతా?′′ అన్నాను. నామనసు ఆర్ద్రమయింది.
′′ఏం కావాలి బాబూ? ఎవరైనా ఎవరికైనా ఏటవుతారు? ఎత్తింది మనిషిజన్మ. ఇన్సాన్ బాబూ. ఆటల్లోనైనా ఒకరిని మాట అని ఎరగదు. కలలోనైనా ఎదటి చెరుపు కోరలేదు. దేహి అన్నవాడికి నాస్తి అనలేదు. ఇల్లు గుల్లయిపోతోందని తల్లి గోలెడితే, నువ్వు సంపాదించేవా అని నిలదీసింది. నేనివ్వకపోతే ఉండిపోతుందా అని దండించింది. పదేళ్లయినా లేని ఆపిల్ల తీర్పులకు అయినపెద్దలే తలలొంచుకునేవారు.′′
అంతలో ఏదో ములిగిపోయినట్టు తాత తుళ్లిపడి, ′′వస్తానయ్యా” అంటూ వెళ్లిపోయాడు. మరోపనిలేని నేను ముగ్ధమోహనమూర్తి, భువనైకసుందరి, సుగుణఖని, ధీమంతురాలు అయిన ఆ చిన్నారిని ఊహిస్తూ, ఆచిరంజీవికీ మూడురోజులనాడు మొలవబోయే మొక్కకీ సంబంధం వెతుకుతున్నాను.

వారంరోజులయింది. పనిలేని నామనసు వెనక్కు తిరిగింది. వీథివాకిలికి మూడడుగులదూరంలో కాంపౌండుగోడకి దగ్గిరగా జానెడుతీగె తోకమీద నిలబడిన పసిరికలా ఊగుతూ నాదృష్టికి తగిలింది. అట్టే చూస్తూ వుండిపోయేను. కొత్తస్ప్రింగులా కొన ఉంగరాలు తిరిగి నీరెండలో నిగనిగలాడతోంది. అప్పుడే విడ్డ మూడాకులు ముచ్చటగా ముదురురంగు పులుముకుంటున్నాయి అలవాటులేని ఆర్టిస్టులా. దేవుడు బొత్తిగా లేడన్నమాట నిజం కాదేమో! ఎక్కడా గొప్పు తవ్వినజాడ లేదు. విత్తు నాటిన ఆనవాలు లేదు. ఈమొలకకు నారు పోసిన మాలి ఎవడు? నీరు పోసే దాత ఎవడు?
గేటుచప్పుడుకు అటు తిరిగాను. తాత! నాలుగు పాతవెదుళ్లు పట్టుకువచ్చాడు.
′′దానికి పందిరి వేస్తావా?′′ అన్నాను. అందులో అతనికి వున్నఆసక్తి ఇంకా నాకు ఆశ్చర్యమేమరి!
′′అవునయ్యా! ఇది ఇప్పటిదా? మీసాలు మొలవకముందు వచ్చానిక్కడికి. కొసకాలానికి కాకుండా పోతానా? ఆతల్లి వెళ్లిపోతూ చెప్పింది, ′తాతా అదే నేననుకో. కనిపెట్టి చూసుకో′ అని.′′..
తాత పనిలో మునిగిపోయాడు. నేను కొంచెందూరంలో నిల్చుని చూస్తున్నాను.
′′ఇంతకూ ఆమొక్క ఎలా వచ్చిందో చెప్పేవుకావు,′′ అన్నాను.
చేతిలో బొరిగె పక్కకు పెట్టి వెనక్కు తిరిగేడు తాత. ′′మాతల్లి వాక్శుద్ధి బాబూ. ఏదేవతో శాపవశంచేత ఈభూమ్మీద పుట్టిందనుకున్నాం. మొదట అందరిలాగే నేనూ నమ్మలేదయ్యా. చేసినపాపం చెబితే పోతుందంటారు. గోరంతలు కొండంతలు చేస్తారు. అందిస్తే అల్లుకుపోతారు. ఇలాటికతలు మొదలుపెడితే పాదరసంలా పాకిపోతాయనుకున్నాను. కాని ఒకరోజు బాబూ చూదం …తా …. కరకర కరకరలాడిపోనాది. ఆకరికి బరించలేక బావిలోకి దూకేశాను. బతుకుతానంటే గింజలెట్టదు పాడులోకం చస్తానంటే ఒల్లకుండదు. పదిమందీ కలిసి పైకి లాగేశారు. ఆచుట్టుపట్ల ఆడుకుంటున్న మణమ్మ నన్ను చూసి పక్కున నవ్వింది. ′నీకేం జబ్బు. ఈపండు తిను, పరమాత్మను తలుచుకో. రేపు మాయింట విందుకు రా′ అంది తనచేతిలో పండు నాచేతిలో పెడుతూ. అంతే. అందులో మాయేంటో నాకిప్పటికీ అంతు చిక్కలేదు. మంత్రించినట్టు మాయమయిపోయింది నాకడుపులో నొప్పి. ఆరోజు ఆరుబళ్ల బియ్యపు బస్తాలు అవలీలగా మోసేశాను.′′.
నాకు కాళ్లు పీకుతున్నాయి. అసలు సంగతికి ఎప్పుడు వస్తాడోనని ఎదురుచూస్తున్నాను. కర్రగుర్రంలా ముందుకీ వెనక్కీ ఎంత ఊగినా అంగుళం ముందుకి జరగలేదు కదా!

′′వాడ వాడంతా ఒక్కతాటిమీద నడిచాం. ఆవిడ వాక్కే వేదం. పలుకే బంగారం. కాని ఎన్నాళ్లో జరగలేదలాగ. చెట్టు చెడెకాలానికి కుక్కమూతిపిందెలని వూరికే అన్నారా? యాదవకులంలో ముసలం ఎవడో లేచాడు. చెరుకుగడలా ఎదిగిపోతున్న పిల్లని ఎన్నాళ్లు ఇంట్లో పెట్టుకుంటావని. ఆపిల్ల ఆమూర్ఖుణ్ణి చూసి నవ్వింది.
′′ ′నాకు పెళ్లేమిటయ్యా! నేను సతీదేవిని. ఆయుస్సే లేదు నాకు. సంసారం ఏమిటి? నీకు కావాలంటే నిక్షేపంలాటి పిల్ల వుంది. చూపిస్తాను. కాదంటే వాదే లేదు′ అంది. కాని లోకం, బాబూ, ఆతండ్రి తలెత్తుకు తిరిగేరోజు కరువైపోయింది.
′సతా, యతా?′ అంటూ వేళాకోళాం మొదలుపెట్టారు. ఏదో మాయచేస్తూందని గోల పెట్టారు. అంతు తేలుస్తాం అని కొందరు ముందుకొచ్చారు. ఓరోజు తెల్లారేసరికి ఇంటిముందు పోగయ్యారు. ఏమిటి నీగొప్పని ఎదురు తిరిగారు.
తండ్రి వచ్చి ఆపిల్ల చేతులు పట్టుకుని కళ్లనీళ్లతో ప్రశ్నించాడు, ′అమ్మా, ఇప్పుడు మార్గం ఏమిటో నువ్వే చెప్పు. ఒప్పయినా పదిమందిని ఒప్పించినప్పుడే రాణిస్తుంది. ఇంత తెలిసిననీకు ఇది లేలీదా?′ అని.
′′మణమ్మ అందర్నీ ఆవలోకించింది. మందహాసం చేసింది. ′సరే కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు. మీఇష్టం వచ్చినట్టే కానివ్వండి. ఆపైన మీరు విచారించవద్దు. ఆపనమ్మకం ద్వాపరయుగంలోనే ప్రారంభమయింది. ఇప్పుడు మిమ్మల్ని నేను తప్పుపట్టను. అయినా చెబుతున్నాను. ఈకాఫీ ఇక్కడ పోస్తున్నాను. ఈవేళకి ఏడోరోజున ఇక్కడ కాశీరత్నం తీగె మొలుస్తుంది. దాని ఆయుస్సే నాఆయుస్సు′ అంది. ప్రజలు నిశ్చేష్టులయి నిలబడిపోయారు. ఒక్కరికీ నోట మాట రాలేదు. బుద్ధి పనిచేయలేదు. ఆముఖంలో దివ్యవర్చస్సు కన్నార్పకుండా చూస్తూ నిల్చుండిపోయారు. కాలిబొటనవేలితో నేల చివ్వి తాగుతున్న కాఫీ పారబోసింది. సరీగ్గా ఇదే స్థలం. ఉత్తములలీలలు చిన్నబుద్ధులకు అందవు. కాఫీ పోస్తే మొక్క మొలవడమేమిటని నలుగురూ నాలుగు విధాలా అనుకున్నారు. నిజం చెప్పొద్దూ, నాకూ చిత్రంగానే తోచింది. ఆదీ కాకా మా మణమ్మ విషయంలో కాఫీకీ ప్రాణానికీ లంకె చెప్పానుకదా పెద్దలచైదాలు చిన్నలకగమ్యగోచరమని. అలాటివాళ్లకర్థం అయ్యేదల్లా కాకి వాలడానకీ తాటిపండు రాలడానికీ లంగరెయ్యడమే.!
′′ఆపెద్దాయన వేట సాగిస్తూనే వున్నాడు. ఈపిల్ల చిదానందమూర్తిలా నిశ్చింతగా తిరుగుతూనేవుంది. అయితే ఆఅమ్మాయి అన్నరోజుకు కాశీరత్నం మొక్క మొలవడం అందర్నీ అవాక్ చేసింది. సవాలు చేసినవాళ్లందా పరారి అయేరు. కాని, మాట పడినమనస్సు తిరగబడక ఊరుకోదు. ఊరూరా తిరిగి తిరిగి వేసారిన ఆపెద్దమనిషి, తండ్రి, మణమ్మముందు దిగాలుపడి నిలబడ్డాడు. ′′నువ్వేదో మాయలమారివనీ, నీకు క్షుద్రదేవతలు వశం అనీ లోకమంతా గగ్గోలు పెడుతోంది. నిన్ను చేసుగోడానికి మగాడన్నవాడు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇంత తెలిసినదానివి ఇది తెలీదా. నీకు తాళి కట్టే ధీరుడెవరో నువ్వే చెప్పు′ అని అడిగాడు.
′′కాశీరత్నం కొనలు ఒడుపుగా పందిరిమీదికెక్కిస్తున్న మణమ్మ ఫక్కున నవ్వింది. ′ముందే అడగకపోయినావా? పొరుగుగ్రామంలో పాపయ్యగారిని కనుక్కో′ అంది. తండ్రి తెల్లబోయాడు. నలుగురూ ముక్కున వేలేసుకున్నారు. ఆరా తీస్తే ఆబద్ధం కాదని తేలింది. ఆఊరి మోతుబరి పాపయ్య. ఆయనగారి మూడోకొడుకు ఉక్కుచువ్వలాటి యువకుడు అమ్మాయిని చూడకుండానే చేసుకోడానికి సిద్ధపడ్డాడు. ′నానెత్తిన పాలవాన పడిందని′ ఆ తండ్రి ముక్కోటిదేవతలకూ దండాలు పెట్టుకున్నాడు. పెళ్లి అయిందనిపించేసరికి పెద్దలంతా తలపుకొచ్చేరు.′′
తాత నిట్టూర్చాడు, అలుపు తీర్చుకోడానికి కాబోలు. నేను మటుకు ఆలస్యం భరించలేకపోతున్నాను. డిటెక్టివ్ నవలలు కూడా చివరిపేజీ మొదట చదివేసే తత్త్వం నాది. ఎంత ముసలివాడైనా ఇంత నానిస్తే ఎలా భరించడం?
′′అసలు ఆఖరికి ఏంజరిగింది?′′ అన్నాను.
′′′అయిపోయింది,′′ అన్నాడు తాత.
′′అది కాదు,′′ అన్నాను క్షమాపణగా.
తాత మటుకు తీవ్రంగానే వుండిపోయాడు. ′′నిజమేనయ్యా! ఆరోజుతో అంతా అయిపోయింది. పోతూ పోతూ మణమ్మ ′మొక్క చూసుకో′ అంది. అంతే. మళ్లీ ఆతల్లి ఈగడ్డమీద పాదం మోపలేదు. ఆనాడు ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చినట్టు మభూమిమీద పంటలు పండడానికీ, మాగుండెల్లో వానజల్లు కురిపించడానికీ తెచ్చుకున్నాం. మాపని కాగానే పంపించేసేం.′′
జరిగిన అకృత్యాలకి స్వయంగా తను బాధ్యత వహిస్తూ బాధపడుతున్న ఆవృద్ధుణ్ణి చూసి జాలి పడాలో నిరసించాలో నాకే తెలీలేదు.
′′వస్తా బాబూ,′′ అనేసి వెళ్లిపోయాడతను. నాకు విసుగేసింది. మరీ ఈమధ్య వచ్చే సీరియల్స్ లాగ ఇదేమిటి?
సూపర్‌ఫాస్ఫేట్ తోటలా కాశీరత్నం తీగె ననలు తొడిగి కొనలు సాగి హుషారుగా అల్లుకు పోతూంది. తాత రోజూ వచ్చి దానికి సకలసపర్యలూ చేసి వెడుతున్నాడు. దానికి కాఫీయే పోస్తున్నాడో గ్రైప్ మిక్స్చరే పోస్తున్నాడో ఎప్పుడైనా అనుమానం వచ్చినా అడిగే ఓపిక నాకు లేకపోయింది.
ఓనెల రోజులయిందేమో. ఆవేళ మామూలుగానే నేను వరండాలో కూర్చున్నాను.
తాత వచ్చి కాశీరత్నం పందిరిని పలకరించి, రోజూలా వెంటనే వెళ్లిపోలేదు. ఆలా చూస్తూ నిలబడిపోయేడు.
′′ఏం తాతా! నీ మణమ్మకి ఎక్కడైనా దెబ్బ తగిలిందా?′′ అన్నాను హేళనగా.
తాత మౌనంగా ఇటు రా అన్నట్టు సౌంజ్ఞ చేసేడు. ఆతని ప్రవర్తనలో నిర్లక్ష్యానికి నాఆత్మగౌరవం దెబ్బదిన్నా, మొదటితప్పుకింద క్షమించి అక్కడికి వెళ్లేను.
′′చూడు. ఇది మొదలు. ఇలా వాడిపోతుంది. ఇంక పువ్వులుండవు,′′ అన్నాడు.
నిజమే. కొన్ని కొసలు విరిగినట్టున్నాయి. కొన్ని రెమ్మలు రాలిపోయాయి. చాలామటుకు వసివాడి వుంది. కాని పందిరినిండా మొగ్గలు వున్నాయి.
′′ఎందుకని?′′ అన్నాను, అతడివేపు తిరిగి. తరులతాగుల్మాదులగూర్చి నాకు తెలిసింది నిండుసున్నా.
′′చెప్పేను కదయ్యా. మణమ్మ ముందే చెప్పింది పెళ్లికీ తనకీ పడదని. ఆలాగే అయింది. వారాలూ, వర్జ్యాలూ అన్నీ చూసుకుని, పసుపుకుంకుమలతో, సారెచీరెలతో అపురూపంగా పెంచుకున్న కూతుర్ని అత్తవారింటికి పంపించేరు. కాని అచ్చిరావద్దూ. కర్మశేషం ఉండిపోయి ఈభూమ్మీద పుట్టినతల్లికి మానవధర్మాలతో పనేమిటి? అయితే అక్కడ ఆసంగతి గ్రహించినవాళ్లేరీ? అమ్మాయి అదోలా ఉంటూందని హోరెత్తిపోయేరే కాని అసలు విషయం ఆరా తీసినవారే లేకపోయారు. అల్లుడు మటుకు ఏమీ అనేవాడు కాడట. అత్తగారూ, ఆడబడుచులూ, తోడికోడళ్లూ, బావగార్లూ, ఇరుగుపొరుగువారూ కాకుల్లా పొడిచేస్తున్నా, ఆమెభర్త మాత్రం అటుగానీ ఇటు గానీ పెదవి కదపలేదట. ఆలాగే పరమయోగిలా నిశ్శబ్దంగా వుండిపోయేట్ట. మిగిలినవాళ్లు మాత్రం ఉడికిపోయేరు …
′′మొదట్లో అంతా ఇంకా చిన్నతనం వదల్లేదు అనుకున్నారు. ధగ్గర కూర్చుని సుద్దులు చెప్పసాగేరు. కాని ఆఅమ్మాయిలో చలనం లేదు. వేళకి ఎవరైనా పెడితే తినేది, లేకపోతే లేదు. అలా పెరట్లో తులసిమొక్కదగ్గర కూచునేది. రాత్రి నిద్ర లేదు. పగలు భోజనం లేదు. ′ఇంటిమీద బెంగపెట్టుకున్నావా?′ అని అడిగారు. లేదంది. ఆఖరికి మనసునలేని మనువేమోనని అనుమానపడ్డారు. కలకల్లాడుతూు నట్టింట నడయాడవలసిన కొత్తకోడలు మూతి ముడుచుక్కూచుంటే ఎవరికి మాత్రం మనసు విరగదా అని విసుగుకున్నారుట. ఆపిల్ల మాత్రం దేనికీ జవాబు చెప్పలేదు.
′′అలా రోజులు గడుస్తూ వున్నాయి. ఆపిల్ల అక్కడ నిద్రాహారాలు మాని ఆలా శల్యమయిపోతూంది. ఇక్కడ ఈమొక్క ఇలా వాడిపోతూనే వుంది,′′
′′అదేమిటి?′′ గతుక్కుమన్నాను.
′′అదే బాబూ! అందరం ఆశ్చర్యపోయింది. అక్కడ ఆఅమ్మాయి భోజనం మానేసినరోజునే ఇక్కడ ఈలత వాడిపోడం మొదలయింది. మరి పదిహేనురోజులనాడు అక్కడ మణమ్మ మొహం తిరిగిపడిపోయింది. అదేరోజున ఇక్కడ ఈమొక్క పూలు పూయడం మానేసింది. అంతే … ఆతరవాత నెలరోజులైనా కాలేదు. ఒక్కరోజులో నిలువునా ఎండిపోయింది …′′
తాత గుక్కతిప్పుకోలేక మొహం కప్పుకున్నాడు పైపంచెతో. … నేను ఎంతసేపు అలా వుండిపోయేనో!
′′రేపటినుండీ ఈమొక్క పుయ్యదు,′′ తనలో తను గొణుక్కుంటూ వెళ్లిపోయాడు తాత.
పందిరివేపు చూశాను. గులాబీముళ్లలా నిలువుగా, నున్నగా, నిగనిగలాడుతూ మొగ్గలు కనిపించాయి. కొన్ని ఇవాళ పూసి వాడిపోయేయి. కొన్ని రేపు విడాలి. విడితీరాలి. తాత సరిగ్గా చూడలేదా?
రాత్రంతా అవే ఆలోచనలు. ఎంత తొందరగా లేద్దామనుకున్నా, అలవాటయిన వేళ తప్పలేదు. ఇంగ్లీషులో వార్తలు వింటుంటే హఠాత్తుగా కాశీరత్నంపువ్వులసంగతి జ్ఞాపకం వచ్చింది. వరండాలోకి వెళ్తూ ఫలితాలకోసం చూసే పరిశోధకుడిలా కంగారుపడిపోయేను.
డామిట్! పువ్వులు లేవు!
′′ఇంద, కాఫీ,′′ అమ్మమాట విని వెనక్కి తిరిగేను.
అమ్మ తెల్లబోయి, ′′అదేమిట్రా, అలా వున్నావేమిటి? ఏమయింది?′′ అంది కంగారు పడిపోతూ.
అవును, ఏమయింది? ఏమయింది? ′′ఏంలేదు′′ అన్నాను.
′′మరి అలా వున్నావేం?′′
′′ఏంలేదు,′′ అని, కాఫీ తీసుకున్నాను. తాగబోతూంటే, ఎవరో చేతిమీద కొట్టినట్టయింది.
అమ్మకి ఒకటే కంగారు. ′′ఏమిట్రా, ఒంట్లో బాగులేదా? ఏదీ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది?′′
′′అది కాదమ్మా, మణమ్మకథ నీకు తెలీదు.′′ ఆకథ నేనే కనిపెట్టినట్టి అనిపించింది నాప్రాణానికి.
′′మణమ్మెవరూ?′′ అమ్మకి ఇట్టే అనుమానం వస్తుంది.
′′అదే ..′′
′′ఏదీ?′′
′′అదే .. ఆకాశీరత్నంమొక్కసంగతి తెలుసా?′′
అమ్మ ′హమ్మయ్య′ అన్నట్టు నిట్టూర్చింది. కాని ఇంకా ఆశ్చర్యమే. ′′ఏమయిందిప్పుడూ?′′ అంటే అమ్మకి కొంతలో కొంతయినా తెలుసన్నమాట.
కాలరు సర్దుకుని, కాలజ్ఞానతత్త్వాలు బోధించినట్టు ధ్వనిస్తూ, ′′అది ఎవరో ఒక సత్యచరిత వేసినమొక్కట. ఆఅమ్మాయికి ప్రతిరూపంట ఆమొక్క,′′ అని చెప్పాను.
అప్పుడే టిఫిను తీసుకొస్తున్న అక్కయ్య ఫక్కున నవ్వింది. ′′… అని ఎవర్రా చెప్పింది? తాతేనా?′′ అంది నవ్వుతూనే వుంది.
నేను తెల్లమొహం వేశాను. నేను ఢోకా తిన్నానా?
′′ముసిలాడయినా చిలిపితనం పోలేదు. కథలు చెప్పడంలో దిట్ట,′′ అంది అమ్మ.
′′కథా11′′
′′ మరి అంతలో వుంది మన జనరల్ నాలెడ్జి. ఓనమాలు దిద్దనివాడు కాజాలు తినిపించాడు తమరిచేత,′′ అక్కయ్య నవ్వుతూనే వుంది.
నాకు మటుకు నమ్మకం కలగలేదు. పైగా మరో సందేహం. మెల్లిగా అక్కయ్యపక్కన చేరి జవాబు రాబట్టేసరికి మరో మూడురోజులు పట్టింది. మురిపించి, మురిపించి అసలు రహస్యం చెప్పింది.
′′పువ్వులా? … ఇంటావిడ వూరినించి తిరిగి వచ్చింది చూడలేదూ? పూజకని తిరుక్షవరం చేసేస్తుంది తెల్లారగట్లే లేచి. తమరు దొరలఫాషనులో తొమ్మిదిగంటలకి లేచి చూస్తే మొండిమొక్క దర్శనమిస్తుంది …′′

000

ఈకథగురించి

పైన చెప్పినట్టు గ్రామదేవతలకథలలో గల నుడికారం వాడుకోవాలని నిశ్చయించుకున్నాను. ముఖ్యంగా విశాఖపట్నం మెయిన్ రోడ్డుమీద కనకమహలక్ష్మి గుడినిగురించిన కథ ఒకటి చాలా ప్రాచుర్యంలో ఉండేది ఆరోజుల్లో. అంచేత ఆ భాష వాడడానికి ప్రయత్నించేను. ఇందులో నాకు చాలా ఇష్టమైన పదబంధాలు చాలా ఉన్నాయి. నాకు కాఫీ కూడా చాలా ఇష్టం. అంచేత దాంతో ప్రారంభించేను.

రెండో అంశం – ముగింపు. ఈవిషయంలో రెండు కోణాలున్నాయి. మొదటిది, వేళాకోళంతో ముగించేను కనక నాకు ఆస్తికులంటే హేళన అని కాదు. మనసంస్కృతిలో భగవంతుడిని మానవమాత్రుడుగానే భావిస్తాం. భద్రాచల రామదాసుకీర్తనలు, అన్నమాచార్యకీర్తనలు చూస్తే, వాటిలో మానవస్వభావాలు చాలా కనిపిస్తాయి. అలా అనుకోడంవల్లే భగవంతుని సఖుడుగా గుర్తించడంవల్ల మనసు విప్పి బాధలన్నీ నిర్భయంగా చెప్పుకోగలుగుతాం.

రెండోకోణం ఈనాటి కాలేజీ చదువులు నిత్యజీవితంలో నిరర్థకం అని. ఈ అభిప్రాయం కొంతవరకూ రావిశాస్త్రిగారికథల్లో కనిపిస్తుంది. ఆయనకథలలో సాధారణంగా ఏ చదువూ లేనివారు ఎంతో అర్థవంతంగా మాటాడతారు.

– ఇవీ నేను ఆవిష్కరించదలుచుకున్న అంశాలు ఈ కథ రాసినప్పుడు. శిల్పం, పాత్రచిత్రణవంటివి మీరే చెప్పాలి.

నాచిన్నతనంలో విశాఖపట్నం మెయిన్ రోడ్డుమీద వెలసిన కనకమహలక్ష్మికథ —

ధన్యవాదాలు నాగజ్యోతి రమణగారూ. నాకథ చదివి మీ అభిప్రాయాలు చెప్పడం నాకు చాలా సంతోషం.

కనకమహలక్ష్మి కథ – విశాఖపట్నం మెయిన్ రోడ్డుమీద వెలిసింది. రోడ్డుమధ్య ఉంటే వాహనాలకి అంతరాయం అని మునిసిపాలిటీవారు ఆ విగ్రహాన్ని రోడ్డువారకి మార్చడానికి ప్రయత్నించారు. ఊరంతా కలరా వ్యాపించింది. ఆ దేవత మునిసిపల్ ఛేర్మనుకి కలలో కనిపించి, తనకు అలా రోడ్డుమధ్య ఉండడమే ఇష్టమనీ, కదలించవద్దనీ, అక్కడే గుడి కట్టించమనీ చెప్పింది. మునిసిపాలిటీవారు ఆప్రయత్నం మానుకుని, గుడి కట్టించేరు. ఇప్పటికీ విశాఖపట్నం మెయిన్ రోడ్డుమీద ఆగుడి ఉంది. వాహనాలు గుడి పక్కనించి పోతుంటాయి. ఇదీ నేను విన్న కథ

ధన్యవాదాలు.

మాలతి.

(నవంబరు 5, 1966, ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో ప్రచురితం. — మాలతి)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “కాశీరత్నం, నా అభిప్రాయాలతో”

  1. మీ కధలు ఒక అరశతాబ్దం కిందవంటే నమ్మశక్యం కాదు. ఏతరానికయినా సరిపోతాయవి. మీ కధ నడక, శిల్పం, శైలి ఎంత బావుంటాయండి. కధలోకి క్రిష్ణబిలంలా లాగేస్తారు. మంచి కధకు ధన్యవాదాలు

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  2. ఒప్పయినా పదిమందిని ఒప్పించినప్పుడే రాణిస్తుంది. – బహుశా ఈ తరానికి ఇది తెలియాలేమో.

    పై వాక్యం చదివితే నాకు జయభేరి సినిమాలోని dialogue ” పాతను కాదనటం ప్రతిభ కాదు. కొత్తను ఔననిపించుకోవటమే గొప్ప. ” గుర్తొచ్చింది. సినిమా అంతా ఒకెత్తు, ఈ ఒక్క dialogue ఒకెత్తు అనిపిస్తుంది.

    కథ భలే ఉంది.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.