రచయితలకి ప్రోత్సాహం, సాహిత్యాభిమానులు

“మంచి రచయితలను గొప్ప రచయితలుగా ముద్ర వేస్తే వారు సాధారణ రచయితలైపోయే ప్రమాదం ఉంది. రచయితలు పేరు, డబ్బు మీద మాత్రమే దృష్టి పెడితే మంచి రచనల నాణ్యత తగ్గిపోతుంది” అన్నారు బలివాడ కాంతారావుగారు (యోహన్ బాబుగారి ఇంటర్వ్యూ).

అలాగే మధురాంతకం రాజారాంగారు ఎవరో “నాదగ్గర డబ్బుంటే మీకు సన్మానం చేసేవాడిని” అంటే, వెంటనే “బాబ్బాబు చెయ్యకు” అని 5 కారణాలు చెప్తారు”కథకుడి అనుభవాలు” అన్నవ్యాసంలో(కథాయాత్ర). ప్రధానంగా అలాటి ఆర్భాటాలు సృజనాత్మకతకి విఘాతం, ఘన సత్కారం పొందిన రచయితకి రచన వ్యాపారం అయిపోతుంది అంటారాయన. ఆ సత్కరించినవారి అభిప్రాయాలకనుగుణంగా రచయితలు రచనలు సాగిస్తారు. నా అభిప్రాయం సుమారుగా అదే కానీ కొంచెం భిన్నంగా చెప్తాను.

ఇక్కడ నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు నేను గత పదేళ్ళలో ఇండియాలోనూ అమెరికాలోనూ ఏడు సమావేశాలలో పాల్గొన్నతరవాత, కొందరు రచయితలతో మాటాడినతరవాత ఏర్పడినవే కానీ తట్టెడు పుస్తకాలు చదివి, అంతకి రెట్టింపు తీవ్రపరిశోదనలు చేసీ ఏర్పరుచుకున్నవి కావు. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోవచ్చు కానీ ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను.

చారిత్ర్యకంగా చూస్తే బహుశా ఈ సాహిత్యసమితి, సమాఖ్య, సంఘాలలాటివి ఆధునికకాలంలో 40లలో మొదలయేయేమో.  నలుగురో పదిమందో ఒకేరకమైన అభిరుచులు గలవారు, తాము మెచ్చిన సాహితీ ప్రక్రియనో, సుప్రసిద్ధులయిన సాహితీవేత్తనో ఎంచుకుని తమతమ అభిప్రాయాలు పంచుకోడంతో మొదలయేయి. రాజమండ్రీ, విశాఖపట్నం, గుంటూరు, తెనాలివంటి పట్టణాలలో పదిమంది సాహితీవేత్తలు కలిసి ఏదో ఒక ప్రక్రియగురించో ఒక రచయిత, కవిగురించో చర్చించుకోడంతో ప్రారంభమయేయి అనుకుంటాను. తల్లావఝ్ఝల శివశంకరస్వామి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గార్లవంటి ప్రముఖుల రచనలు చదివినప్పుడు ఈ సమావేశాలప్రస్తావన చూస్తాం. ఆ సంస్థలు విశేష కృషి చేసినట్టు సాహితీవేత్తలు చెప్పుకుంటారు. వేదం వేంకటరాయశాస్త్రివంటి మహానుభావులు ప్రచురణకి కూడా పూనుకుని తెలుగు సాహిత్యానికి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టేరు. ఇవన్నీ ప్రదానంగా చెప్పుకోదగ్గ సాహత్యస్థాయి గల కవులు, రచయితలమధ్య మాత్రమే జరిగేయి అనుకుంటున్నాను. అంటే సాధారణపాఠకులు ఈ చర్చలలో పాల్గనడం మొదట్లో లేదు. బహుశా బహిరంగసభలపేరుతో పాఠకులు కూడా సభలకి హాజరవడం 50, 60 దశకాలలో ప్రారంభమయిందేమో. అలా హాజరయేవారిలో అనేకులకు ఆ రచయితలు, సాహితీవేత్తలు ఏమి చెప్తారో విందాం అన్న ఆసక్తే ప్రధానకారణం. వారిరచనలవనక రక్తమాంసాలతో కూడిన దేహి ఎలా ఉండునో అన్న కుతూహలం రెండోది. ఇందులో కుత్సితాలేమీ లేవు. లాబాపేక్షలు లేవు.

ఈ సభలతీరుతెన్నులు పూర్తిగా మారిపోవడం ఎప్పుడు ఎలా జరిగిందో నాకు తెలీదు కానీ మారిపోయినమాట నిజం.

మార్పు రెండు రకాలుగా జరిగింది. ఒకరకం సభల్లో సాహిత్యానికి, రచయతలకీ ప్రాముఖ్యం తగ్గింది. పేరుకి సాహిత్యసంఘం అన్నప్పుడు కూడా ఇతరవ్యాపకాలు కనిపిస్తాయి. సామాజికపరమైన కలుపుగోలుతనం (socializing or networking) అనొచ్చు. పదిమందో వందమందో ఒక చోట చేరుతున్నారు, కనక మనం కూడా ఓమాటు మొహం చూపితే బాగుంటుంది అన్నదొకటి. అక్కడే పూర్వపు స్నేహాలు తిరగతోడడం దగ్గర్నుంచీ పెళ్ళిసంబంధాలు వెతుక్కోడంవరకూ, స్త్రీలసమస్యలు, ఆరోగ్యసమస్యలు, పెట్టుబడివిధానాలూ–ఇలా ఎన్ననయినా జరగొచ్చు ఒక సభ లేక సమావేశంపేరుతో. ఈ రచయితని మంచి చేసుకుంటే ఎందుకైనా మంచిది అన్న ఆలోచన కూడా అంతర్గతంగా కనిపించడం చూసేను కొందరివిషయంలో.

రెండోరకం ఒక రచయితపేరున, ఆరచయితకి సత్కారం అంటూ ఏర్పాటు చేసే సభలు. అక్కడ కూడా ఆ రచయిత సృష్టించిన సాహిత్యంగురించి కాక, ఆ క్షణానికి ఏం తోస్తే అది మాటాడతారు. ఏ రాజకీయనాయకుడినో, సినిమానటుడినో అధ్యక్షుడిగా పిలుస్తారు. ఆయనో ఆవిడో తనకి తెలిసినదేదో ఉపన్యసిస్తారు. ఆ తరవాత వక్తలు కూడా అంతే. ఆ ఫలానారచయితగారి కథలమీద కన్నా గురజాడ తొలికథకుడు అంటూ మొదలు పెట్టి, పద్మరాజు, కుటుంబరావు, కాళీపట్నం రామారావు అంటూ ముగించేయవచ్చు. అసలు ఏ రచయితపేరుతో సభ ఏర్పాటు చేసేరో ఆ రచయితగురించి ఆ సభలో తెలుసుకునేది అట్టే ఉండదు. ఇది నేను ప్రత్యక్షంగా చూడడంచేతే చెప్తున్నాను. నాసభల్లో నారచనలగురించి మాటాడినవారు లేరు, నిజంగా ఎవరకీ ఏమీ తెలీదని నాకు తరవాత తెలిసింది. ఒక సభలో, సభ మొదలయేక, మాలతిగారిగురించి ఎవరైనా మాటాడతారా అని అడిగేరు అధ్యక్షులవారంటే ఆసభ ఏర్పాట్లు ఎంత లక్షణంగా జరిగేయో వేరే చెప్పఖ్ఖర్లేదు కదా. అలాగే మరోసభలో నాతో వచ్చిన మాచిన్నన్నయ్యని మాటాడమని అడిగేరు అప్పటికప్పుడు.

ఇంక ఆ సభకి విచ్చేసిన విలేఖరులు, ఒకొకప్పుడు సభకి రాకుండా ఇంట్లోనే కూర్చుని ఫలానావారు సభకి వచ్చేరు, ఫలానా మాట చెప్పేరు అంటూ ఒక రిపోర్టు రాసేస్తారు. నేను ఇది హాస్యానికి అనడం లేదు. నిజంగానే నేను హైదరాబాదులో సభకి హాజరయినప్పుడు నేను చెప్పని మాటలు, నావి కాని అభిప్రాయాలూ పత్రికలలో చూసేను. సభకి రానివారి పేర్లు కూడా చూసేను.

సూక్ష్మంగా ఒక్కమాటలో చెప్పాలంటే సాహిత్యసభలు ఒక నాటకం అయేయి. ప్రజలు నాటకీయతగురించి మాటాడుకుంటున్నారు. అన్నీ ఇలాగే ఉండకపోవచ్చు. దురదృష్టవశాత్తు నా అనుభవాలు మాత్రం ఇలాగే ఉన్నాయి.

కదాచితుగా “ఫలానా సభకి వెళ్లేం, అక్కడ చాలా చక్కగా ఫలానావారు ప్రసంగించేరు” అనడం కూడా విన్నాను. అంచేత మంచి సభలు కూడా జరుగుతున్నాయనే అనుకుంటాను. నామనసులో నాటుకున్న అబిప్రాయాలు మాత్రం ఇవే. నాపేరుమీద జరిగిన ఏసభా “ఆహా మంచిమాటలు విన్నాను, మంచి సంగతులు తెలిసేయి”  అనిపించేలా లేవు. రచయితకి ఇచ్చిన ప్రాధాన్యంకంటే నిర్వాహకులకు తమకి తాము ఆపాదించుకున్న ప్రాధాన్యం పది రెట్లు ఉంది. ఇలాటి సభలమూలంగా మోపెడు శాలువాలు పోగవుతాయి కానీ సృజనకి మాత్రం ఏమాత్రం దోహదం కాదని చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ. రచయితగురించి నిజంగా తెలీకపోతే, తెలుసుకునే ఓపిక లేకపోతే ఈ సత్కారాలు తలపెట్టరాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

సాహితీసంఘాలు పెరిగిపోవడం చూస్తే కూడా ఇదే తెలుస్తుంది. ముందొక సంఘంతో మొదలు పెడతారు. సభ్యులసంఖ్య పెరిగినకొద్దీ అభిప్రాయభేదాలు కూడా హెచ్చు అవుతాయి. బహఎవరికి ఎవరు ఇష్టరచయిత అన్నది కావచ్చు. ఎవరిని సత్కరిద్దాం అన్నవిషయంలో అభిప్రాయభేదాలేమో. నాకు ఈ లుకలుకలు తెలీవు. కానీ జరుగుతున్నది మాత్రం రాచరికం రోజులలో చిన్నచిన్న రాజ్యాలు ప్రతిష్ఠాపన చేసుకున్నట్టు నలుగురేసి చొప్పున విడిపోయి వేరు పొయ్యి పెట్టుకోడం. ఊరుకొక సంఘంనుంచి వాడకొక సంఘం, వీధికొక సంఘం ఇలా విభజనలు జరిగిపోతున్నాయి.

వీటివల్ల  జరుగుతున్న అన్యాయంగురించే నాబాధంతా. ఏదో ఒక వాదం, లేదా రాజకీయనినాదం ఆధారంగా ఏర్పడిన సంఘాలు. వీరు ఏదో ఒక రచయితని తీసుకుని ఇటువంటి రచయిత న భూతో న భవిష్యతి అంటూ మొదలు పెట్టేస్తారు. అసలు అక్కడే తంటా మొదలు. భూతకాలంలో లేకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఉండరని ఎలా చెప్పగలరు?

ఇహ ఆయనపేరుమీద ఒక పురస్కారం ఏర్పాటు చేస్తారు ఏటా. దాంతో రచయిత, ప్రయత్నపూర్వకంగానో యాదృచ్ఛికంగానో ఆ వాదానికి అనుకూలంగా రచనలు చేస్తారు. అక్కడే రచయిత మూలతత్వానికి గంటు పడడం మొదలవుతుంది. ఇలా రాస్తే పేరొస్తుందని ప్రత్యేకంగా చెప్పుకుని మొదలు పెట్టకపోవచ్చు కానీ జరిగేది అదే. ఆ కథో కవితో అదే ధోరణిలో సాగుతుంది. అయ్యా, ఇదీ సాహిత్యసంఘాలు రచయితలకి, తద్వారా సాహిత్యానికీ చేస్తున్న ద్రోహం  – రచయితని తనదైన శైలిలో రాయనివ్వకపోవడం.

వీటికి ప్రత్యేకంగా ప్రణాళిక ఉండకపోవచ్చు. రచయితకీ ఆ సంఘంలోని ఘనులకూ వ్రాతపూర్వకంగా ఒప్పందాలు ఉండకపోవచ్చు. మరేవిధంగానూ వాచ్యం చేయకపోవచ్చు. జరిగేది మాత్రం అదే.

నా ఈ వాదనకి ప్రత్యక్ష సాక్ష్యాలు నాకు తెలిసినంతలో రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, కొందరు రచయిత్రులు. వీరందరూ తొలిదశలో రాసిన కథలూ, మలిదశలో అంటే ఏదో ఒక వాదానికి కట్టుబడి ఆవాదం ప్రచారం చేయడానికి రాసిన కథలూ చూస్తే వ్యత్యాసం బాగానే బోధపడుతుంది. ఆమధ్య నేను రావిశాస్త్రిగారి కథలగురించి ఫేస్బుక్కులో ప్రస్తావించినప్పుడు, ఆయనకథలు నాకు నచ్చవండీ అన్నవారు నేను సూచించిన కథలు చదివి ఆనందించేరు. అక్కడ ముఖ్యంగా జరిగింది రావిశాస్త్రిగారి మలిదశకథలు ఆ పాఠకులకు నచ్చికపోవడం. తొలిదశకథలగురించి తెలియకపోవడం. ఆవిధంగా ఆయా రచయితలఅభిమానులు అభిమానసంఘాలు పెట్టి, ఆరచయితల సృజనకి అన్యాయం చేసేరనే నాకు అనిపిస్తుంది.

ఈ మలిదశకథలు ప్రముఖ విమర్శకులనీ, ఘనాపాఠీ సాహితీవేత్తలనీ, సాహితీసంఘాలనీ ఆకట్టుకుంటాయి. వాళ్లంతా వీటిగురించే మళ్ళీ మళ్ళీ మాటాడుతూంటారు. అంతకు మించి సాహిత్యం లేదని ప్రచారం చేస్తారు. వీరిమూలంగా పైన రాజారాంగారు చెప్పినట్టు స్వతస్సిద్ధంగా అబ్బిన సృజన వెనక బడుతుంది. ఇది చేతనావస్థలో జరగవచ్చు. లేదా అనుకోకుండా జరగవచ్చు.

నాబ్లాగులో వచ్చిన రెండు అభిప్రాయాలు జన్మలో మరువలేనివి. ఒక వ్యాఖ్య – “మీరు రాసినవన్నీ నాకు నచ్చుతాయి. ఎంతకని ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పగలను,” అని. రెండోది, “మీరు చాలా పెద్దవారని ఇప్పుడే తెలిసింది. అంతపెద్దవారికి నేను ప్రోత్సాహం ఇవ్వడమేమిటని వ్యాఖ్యలు రాయడంలేదు,” అని. ఈ రెండూ కూడా పట్టి చూస్తే ఎంత అర్థవంతమైనవో తెలుస్తుంది. అదే పనిగా అద్భుతం, అమోఘం అంటూ ప్రతిటపాకి రాస్తుంటే, అది సామాన్యం అయిపోతుంది. నిజంగా ఆ పాఠకులు కథకో వ్యాసానికో ఎలా స్పందించేరన్నది తెలీదు. మళ్ళీ అలాటిదే రాయాలనో రాయకూడదనో రచయితకి నిర్ణియించుకునే అవకాశం దొరకదు.

ఫేస్బుక్కులో సద్యఃస్పందనలు అత్యవసరంగా కనిపిస్తోంది. నేను చూసే జీలు అట్టే లేవు  కానీ ఉన్నవాటిలో ఏదో ఒక కోణం–ప్రస్తావించిన అంశం, ప్రస్తావించినతీరు, భాష, భావవ్యక్తీకరణ–ఏదో ఒకటి నచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తాను.  అందువల్ల ఆయా పేజీయజమానులు నాస్పందన కేవలం లాంఛనం కాదని గ్రహిస్తారని ఆనుకుంటున్నాను. వారు చర్చించిన అంశంమీద నేను వెలిబుచ్చే అభిప్రాయాలు కూడా చెప్పాలనిపిస్తేనే కానీ ఏదో ఒకటి రాయడం కోసమే రాయడం కాకూడదని అనుకుంటాను.  ప్రతిసారీ అలా జరక్కపోవచ్చు. వీలయినంత జాగ్రత్తగా ఉండడానికిి ప్రయత్నిస్తున్నానని మాత్రం చెప్పగలను.

మధురాంతకం రాజారాంగారు అన్నది అందుకే సత్కారాలు రచయిత రాయడం ఆపేసినతరవాత ఇవ్వాలి అని. సాహిత్యసంఘాలూ, సాహిత్యహేమాహేమీలు తీవ్రంగా ఆలోచించవలసిన విషయం.

000

గమనిక – ఈవ్యాసం నేను ఎందుకు మొదలు పెట్టేనో ఇప్పుడు గుర్తు లేదు. ఇలా రాయాలని అనుకోలేదు. అంచేత, దీనిని ఒక draftగా గుర్తించాలి. నేను మొదట్లో తలపెట్టిన అఁశం గుర్తొస్తే మళ్ళీ రాస్తాను. ధన్యవాదాలు.

000

(సెప్టెంబరు 17, 2017)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “రచయితలకి ప్రోత్సాహం, సాహిత్యాభిమానులు”

 1. అనిల్ గారూ,
  మీ అభిప్రాయాలకి ధన్యవాదాలు.
  న్యూనతాభావం – ఇక్కడే బాధ మొదలు. అది మరొకకోణం. సద్విమర్శలు లేవని రచయితలు అంటే అది న్యూనతాభావం అని పేర్లు పెట్టేస్తారు కానీ ఆవాదనలో వాస్తవం ఉందా, ఉంటే ఎంత అన్నది చర్చించరు. ఇక్కడ నేను నా అనుభవాలు మాత్రమే చెప్పేను. వాటిలో ఏమాత్రం నిజం అన్నంతవరకే నా చర్చ.
  ఉదాహరణకి నరేంద్ర సంకలనాల్లో నాకథలు లేవు. నాకథలున్న సంకలనాలు నన్ను అడిగి వేసుకున్నవి కాదు. మీవేదికమీద నాకథలచర్చ జరిగిఉంటే నాకు తెలీదు. మీవేదికమీద చర్చించగల స్థాయి నాకథలకి లేదనుకుందాం. ఇక్కడ నాబ్లాగులో మీరు వ్యాఖ్యానించినప్పుడు కూడా కథలక్షణాలమీద కాదు. మరి ఈ నేపథ్యంలో నేను మీతో వాదన పెట్టుకోగలనా చెప్పండి. నేనేమన్నా అది న్యూనతాభావంలాగే కనిపిస్తుంది. అంచేత, ఈ చర్చ ఇక్కడికి వదిలేద్దాం.
  నాకు తృప్తినిస్తున్నది బ్లాగు చూస్తున్న పాఠకులే కనక ఆ పరిమితిలోనే నేను ఆనందిస్తున్నానని చెప్పుకున్నాను. అంతే.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. రచయితల సృజనకి అన్యాయం చేసారు
  మలిదశకథలు ప్రముఖ విమర్శకులనీ, ఘనాపాఠీ సాహితీవేత్తలనీ, సాహితీసంఘాలనీ ఆకట్టుకుంటాయి.
  మీరన్నది నిజమేనేమో. కాని ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. రచయితల్లో కూడా వీరు అంటే ఆ సంకలనకర్తలు కాని సంపాదకులుగాని, “నా సాహిత్యాన్ని గుర్తించలేదే” అనే న్యూనత భావాన్ని కూడా కలిగించినట్టు కనపడుతుంది. ఊదాహరణకు సి. రామచంద్రరావు గారు సుజాత గారితో ఈమాట ముఖాముఖిలో చెప్పినట్టు. పాఠకులు విమర్శకుల ప్రశంసలూ పొందినా వారి కధ ఇజాల పరిమితులలో వెలువడుతున్న వార్షిక సంకలనాలలో చోటు దక్కించుకోలేదు. అందుకని వారి సామికుంబుడు రాసారు. 2011 లో మీరు ఉదహరించిన రాజారాం గారి తనయుడు నరేంద్రగారి సంపాదకత్వంలో వెలువడిన కధావార్షికలో ఆ కధ చోటు చేసుకుంది.

  పుస్తకం ఆవిష్కరణ సభలలో కూడా మీరన్నట్టు ఇదే తంతు. అమెరికాలో అమ్మాయి, అబ్బాయి సంపాదన నుంచి ఇండియాలో తను కొన్న ఫ్లాటు ఖరీదు – అంతా అర్ధికమే లేదా అరోగ్యం గురించే. అలాగని సామాజికపరమైన కలుపుగోలుతనం కూడదు అనడం కుదరదేమో! మన భావజాలానికి దగ్గిరగా ఉన్నవాళ్లతోనే కదా మన చెలిమి! వారే కదా ఈ చర్చలకి వచ్చేది.

  ప్రస్తుతం మాత్రం ఏ భావజాలానికి, ఏ ఒక వర్గానికో చెందని సాహిత్య సభలు దాదాపు లేనట్టే. కాకపోతే మేము నిర్వహిస్తున్న వేదిక లో మాత్రం మా వరకు ఇటువంటి అపోహలకు తావివ్వకుండా చేస్తున్నామనే తృప్తి ఉంది. రాళ్లు విసిరేవాళ్లు ఎప్పుడూ ఉంటునే ఉంటారు.

  మీ డ్రాఫ్ట్ టపా కి ఈ వ్యాఖ్యకూడ ఒక డ్రాఫ్ట్‌గానే గుర్తించగలరు. చి న

  మెచ్చుకోండి

 3. మీఅభిప్రాయాలకి దన్యవాదాలు. ఇంకా తయారవుతోందన్నాను కానీ ఇక్కడా ఫేస్బుక్కులోనూ వ్యాఖ్యలు చూసేక, ఇది సమగ్రంగానే ఉన్నట్టు అనిపిస్తోంది. ఇంతా ఏమైనా ఆలోచనలుంటే మరో వ్యాసం అవుతుంది. చూడాలి. పరిష్కారాలు సూచించడానికి నేనంతటిదానినండి. ఈనాడు సాహిత్యక్షేత్రం ఏలుతున్న అతిరథులు, మహారథులదృష్టిలో నేను రచయితనే కాను. అంచేత నేనేం చెప్పినా అరణ్యరోదనే. మరెందుకు రాస్తానంటే నా కాలక్షేపంకోసం.
  మీరడిగిన చివరివాక్యంలో ప్రశ్న నాకు సరిగా అర్థం కాలేదు కానీ అన్యాయం ఎలా జరుగుతోందంటే, నావ్యాసంలో చెప్పేను. రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు వంటి రచయితలు అభిమానులప్రోత్సాహంతోనే ఒక వాదనకి అనుకూలంగా రాయడం మొదలుపెట్టేక రచనల్లో సృజన ఎలాటి మార్పు చెందిందో మీరు గమనించే ఉంటారు. ఘనాపాఠీ విమర్శకులూ, సాహీతీవేత్తలమెప్పులకనుగుణంగా ఉన్నాయి. కానీ కథ కథకోసమే చదివే వేలాది సాదారణపాఠకులను అవి ఆకట్టుకోలేదనే నా అభిప్రాయం. ఉపన్యాసాలూ, ఫాఠాలూ ఎక్కువయిపోయి కథ నీరసించిపోయింద

  మెచ్చుకోండి

 4. ముందుగా మీకు కృతజ్ఞతలు. కారణాలు – ఒకటి మీ అంతరంగాన్ని ఆవిష్కరించటం, రెండు సభల్లో జరుగుతున్న తతంగాల్ని నిర్మొహమాటంగా బయట పెట్టడం. మిగిలిన అన్ని రంగాల లాగే మన దృక్పథం నాకేంటి అన్న ధోరణిలోకి వెళ్ళిపోయింది కాబట్టి మీరు చెప్పినవన్నీ ఆశ్చర్యంగా లేవు.
  ఈ వ్యాసం ఇంకా తయారవుతున్న ఆలోచన అన్నారు కాబట్టి మీరు స్పృజించిన సమస్యలకు ఏమైనా పరిష్కారాలు మరో సారి చెప్తారు అని ఆశిస్తున్నాను. “వీటివల్ల జరుగుతున్న అన్యాయంగురించే నాబాధంతా”. ఈ వాక్యంలో న్యాయం అందని వాళ్లెవరు అన్నది తెలియజేయగలరా?

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 5. ధన్యవాదాలు వసుధా రాణీ, ఏదో ఒక భావజాలానికి లోను కావడమే ప్రమాదం. అంతరూ అలా కాలేదు అనే అనుకుంటున్నాను నేను. అందుమూలంగా వారు ఎంత మంచి రచనలు చేసినా అట్టే ప్రసిద్ధులు కాలేదు. అది మరో కథ.

  మెచ్చుకోండి

 6. మీరన్నది నిజమే రచయితలు మొదటగా రాసినరచనలు వారి సృజనాత్మకతకు అద్దంపడితే తరువాత తరువాత వచ్చినరచనలు కొంతమేర ఏదోఒక ప్రభావానికి భావజాలానికి లోనైనవిగా ఉంటాయి…

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 7. నిర్మొహమాటంగా వ్రాసారు . మీ స్వీయ అనుభవాలు, నేను విన్నవీ, కన్నవీ కూడా ఒకేలా ఉన్నాయి. రచనలపై ఎప్పుడూ ఒకే మాటతో అభిప్రాయం చెప్పడం కూడా చెడ్డ చిరాకు నాకు. కొందరి స్పందనలైతే ఒక్క ముక్కతో ముగిస్తారు. అలాంటి స్పందనని నేను నమ్మను. ఈ టపా లో చాలా విషయాలు వ్రాసారు మాలతీ గారూ. ఇవన్నీ నిజాలే కాదు అందరూ ..ఆలోచింపతగినవి.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 8. నిజంగా మధురాంతకం రాజారాంగారిపేరు వినలేదా? ఈ బ్లాగులో కూడా ఆయనరచనలు పరిచయం చేసేను. మీరు చూసే ఉండాలి. చెప్పేను కదా మీవ్యాఖ్యలలో ప్రధానాంశం ప్రస్తావించరు.రాను రాను మీపేరు ఏదో విధంగా నాబ్లాగులో కనిపించడం ప్రధానం అన్నట్టు కనిపిస్తోంది.
  అయినా రాజారాంగారి పేరు మీకు తెలీకపోవడం బాగులేదు కనక లింకులు ఇస్తున్నాను చూడండి.
  http://wp.me/p9pVQ-1bG

  http://wp.me/p9pVQ-1kM

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.