జైమినీభారతం – చిన్న పరిచయం

నేను చూసిన రెండు పాఠాంతరాలూ, రెండు వ్యాసాలు సూక్ష్మంగా పరిచయం చేయడానికి మాత్రమే ఈసమీక్షావ్యాసం.

మహాభారతయుద్ధం ముగిసిన తరవాత ధర్మరాజు ఆచరించిన అశ్వమేధయాగం జైమినీభారతంలో ఆవిష్కృతము.

భారతయుద్ధం ముగిసినతరవాత, బంధుమిత్రులూ, గురువులూ, దాయాదులతో సహా అశేష జనానీకం ఆయుద్ధంలో సమసిపోయినందుకు ధర్మరాజు వ్యథ చెందుతూంటే, వ్యాసమహర్షి అశ్వమేధయాగం చేయమని సూచించడంతో ప్రారంభమవుతుంది. ఆకథను తన శిష్టుడయిన జైమిని మహర్షిని వ్రాయమని ఆదేశించారు. ఇదీ సూక్ష్మంగా జైమినీభారతానికి నాంది.

నేను చదివిన మొదటి పుస్తకం సంస్కృతమూలానికి సముఖము వేంకటకృష్ణప్ప నాయకుని తెలుగుఅనువాదం ఐదు అధ్యాయముల వచనకావ్యం. ఇది రచించిన కాలము 18వ శతాబ్దం తొలిపాదము కావచ్చునని నిర్ధారించినట్టు కనబడుతోంది.

ఈ గ్రంథానికి జయంతి రామయ్యగారు ఇంగ్లీషులోనూ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు తెలుగులోనూ విపుల పీఠికలు రాసేరు. ఆనాటి కవివంశము, కవికాలముతో పాటు వెంకట కృష్ణప్పకవి వచనశైలీ, పదప్రయోగాలు, అలంకారవిశేషాలు, జాతీయాలూ చక్కగా విపరించేరు. విషయపరిజ్ఞానం లేని నావంటివారికి ఇలాటి పీఠికలు ఎంతో విజ్ఞానదాయకం. మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు ఈ గ్రంథం భక్తిజ్ఞానవైరాగ్యాలు బోధింపబడియుండుటచేత, ఆంధ్రదేశములో సలక జనులకు ఆదరణీయమంటారు.

సత్యబ్రత దాస్, సాహు రాసిన వ్యాసంలో ఈ గ్రంథం మధ్యయుగంలో రాజసభలలో గానం చేయబడిందని, తదనుగుణంగా వీర శృంగారరసాలు ఆవిష్కరించడం జరిగిందనీ రాసేరు.

నాకు దొరికిన మరోపుస్తకం  కన్నడఅనువాదానికి Daniel Sandersonఇంగ్లీషు అనువాదం (1852). Jaimini Bharatam: A Celebrated Canarese poem. పదకొండు అధ్యాయాలున్నాయి. ఇది గూగుల్ ప్రాజెక్ట్. రానున్న తరాలకి లభింపజేయాలన్న ఉద్దేశంతో స్కాన్ చేసినట్టు చెప్పేరు. కానీ scanning సరిగా చేసినట్టు లేదు. మొదట్లో సాధారణంగా కనిపించే ముఖపత్రం, మూలరచయితపేరు, పీఠిక లేక ముందుమాట లాటివేమీ లేవు. అలాగే చివర్లో కూడా అర్థంతరంగానే ఆగిపోయినట్టుంది. ఇందులో 11 అధ్యయాలు ఉన్నాయి.

లక్ష్మీశ కవి కన్నడభాషలోకి 16వ శతాబ్దంలో అనువదించినట్టు వికిపీడియా సమాచారం. https://en.wikipedia.org/wiki/Lakshmisa.

ఈగ్రంథంలో మెచ్చుకోదగ్గ విషయం – కన్నడ పాఠం కూడా సంపూర్ణంగా అందించడం. కన్నడ పాఠం అంతా ఒక్కచోట కాక, అనువాదం కొన్ని శ్లోకాలకు తగురీతిగా చొప్పించడంతో రెండు పాఠాలు పోల్చి చూసుకోడం కూడా అనుగుణంగా ఉంది.

సాధారణంగా నేను ఇంగ్లీషు అనువాదాలు చదవను. అందులోనూ కవిత్వం అయితే అసలే వాటిజోలికి పోను. పైన ప్రస్తావించిన సముఖము వెంకటకృష్ణప్ప కవి గ్రంథం 5 అద్యాయాలయితే ఇందులో 11 ఉన్నాయి కనక అధికంగా ఏమి చెప్పేరో అన్న కుతూహలంతో చదవడం మొదలు పెట్టేను. నాకే ఆశ్చర్యం కలిగించేంతగా త్వరగానే పూర్తి చేసేను. అందుకు ఒక కారణం ఈ పుస్తకం కూడా 229 పుటలు అయినా అందులో సగానికి సగం కన్నడ మూలపాఠం కనక, ఆభాష నాకు రాదు కనక దాటవేస్తూ చదవడం ముగించేను.

ఈ అనువాదం 1852లో ప్రచురించేరు. ప్రధానంగా చెప్పుకోవసింది మూలం పద్యకావ్యం అయితే, అనువాదం వచనంలో సాగింది. 19వ శతాబ్దపు పాశ్చాత్యపండితులభాషలోనే ఉండడంచేత కొంత ఇబ్బంది అనిపిస్తుంది ఈనాటి పాఠకులకు. ఉదాహరణకి, క శబ్దానికి c  లాటివి.  (సి.ఆర్. రెడ్డి అలా వచ్చిందే). కొన్ని పదాలకి కూర్చిన ఆంగ్లపదాలు, బ్రహ్మహత్యకి braminicide, హారతికి wave-lamp వంటివి. ధర్మనందనుడు అంటే ధర్మరాజు. భారతంగురించి తెలియనివారికి son of Dharma అంటే ధర్మరాజు కుమారుడు అని అనుకునేప్రమాదం ఉంది. మరి కొన్నిచోట్ల సంస్కతపదాలు ఉన్నవి ఉన్నట్టు వాడేరు. ముఖ్యంగా పూలు, వృక్షజాతులకి అవే వాడడం బాగుంది.

ఈ జైమినిభారతంలో అనేక శాస్త్రాలలో ఉటంకించిన ధర్మాలు స్త్రీలకీ, పురుషులకూ, వర్ణధర్మాలు కూడా విపులంగా ఉన్నాయి. ఇక్కడ పేర్కొన్న స్త్రీధర్మాలూ, వర్ణాశ్రమ ధర్మాలూ ఈనాడు సమ్మతం కాకపోవచ్చు కానీ పురుషులకి చెప్పినవి మాత్రం సార్వజనీనమే.

మరో పుస్తకం ఆచార్య డా. జి.వి. సుబ్రహ్మణ్యంగారు పిల్లలమఱ్ఱి చినవీరభద్రుడు

అన్నది. అందులో రచయిత రెండు పుస్తకాలు – శృంగారశాకుంతలము, జైమినీభారతము – విపుల విశ్లేషణ ఉంది. ఇందులో ఈసమీక్షకి సంబంధించిన జైమినీభారతము వ్యాసంలో (పు. 169-217) డా. సుబ్రహ్మణ్యంగారు కథ సంగ్రహంగా వివరించి, ఇతర అంశాలు – పినవీరభద్రుడు మూలంలోనించి గ్రహించినవీ, విభేదించినవీ, విస్తృతపరిచి స్వయంప్రతిభతో మెరుగు పరిచినవీ చక్కగా వివరించేరు. అలంకారవిశేషాలూ, భీమ కృష్ణ పరాచికాలు, ఉద్దాలకుడు చండిక కథలో reverse psychology, జాతీయములు, లోకోక్తులు, సూక్తులు ఎంతో చక్కగా వివరించేరు. ప్రధానంగా జైమినిభారతమ పురాణము అని చెప్పబడినను, జైత్రయాత్రాకావ్యమువలె కనపట్టును అంటారు.  జైమినిభారతము చదివి ఆనందించడానికి ఈ వ్యాసం చాలా ఉపయోగపడింది నాకు.

అసందర్భమే కావచ్చు కానీ మరొకవిషయం కూడా ప్రస్తావిస్తాను. ఈనాటి పాఠకులు, విమర్శకులూ కూడా కథలో విషయానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని అనేకసార్లు వ్యాఖ్యానించేను. నాకు ఇంతకుపూర్వం ఎందుకు తోచలేదో కానీ ఇప్పుడు మరింత స్పష్టంగా తెలుస్తోంది నాకు.

జైమినిభారతంలో కూడా కథావస్తువుకి ప్రాధాన్యం ఉంది. ఈ గ్రంథంలో అనేక నీతులు, ధర్మసూక్ష్మాలూ ప్రస్తావించడం జరిగింది. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు సంగ్రహంగా కథ వివరించి, కవికాలము, పినవీరభద్రకవి రచనకీ మూలగ్రంథానికి మధ్య గల వ్యత్యాసాలు, కవి ప్రత్యేకించి విస్తరించిన ప్రతిభావ్యుత్పత్తులతో చేసిన భాగాలు చర్చించేరు. ఈకవిగారి విపుల వర్ణనలు, నుడికారం, జాతీయాలు, సామెతలు సుబ్రహ్మణ్యంగారు వివరించడంచేత నన్ను ఈగ్రంథాలు ఎక్కువ ఆకట్టుకున్నాయి.

జైమిని మహర్షి అశ్వమేధయోగము మాత్రమే వ్రాసేరా, మొత్తం భారతము వ్రాస్తే, అన్ని భాగాలు సమసిపోయి, ఈ అశ్వమేధయాగము భాగము మాత్రమే మిగిలిందా అన్న చర్చ ఉంది ఈ పుస్తకాలలో. కానీ నాసందేహం ఈ మిగిలినభాగానికి భారతము అన్నపేరు ఎలా స్థిరపడింది అని. ఒకవేళ ఆకాలంలో భారతదేశపరిస్థితులను వివరించుతున్న గ్రంథము అనేమో.

నేను ఉదహరించిన మరో వ్యాసంలో (Aswamedha Episode and Jaimini Bharata in the Tradition of Mahabharata : Bengali, Assamese and Oriya Version, Dr. Sutyabrata Das and Dr. U.N. Sahu) ఇది ప్రస్తావించేరు. ఈవ్యాసంలో నాకు ఆసక్తి కలిగించిన విషయాలు – 1. ఈ అశ్వమేధయాగం భారతదేశంలో తొలిసారిగా అనువాదాలు చేసింది తూర్పు సరిహద్దులో ఉన్న బెంగాల్, ఒరిస్సా, అస్సాం రాష్ట్రాలలో. రెండోది, నిజానికి ఇదే ఎక్కువ ఆసక్తి కలిగించింది – జైమినిభారతం వీరశృంగారరస ప్రధానంగా వ్రాయబడింది అని వీరు అభిప్రాయపడ్డారు. మహాభారతయుద్ధం ముగిసేక ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితులకి అద్దం పడుతుంది జైమినిభారతం అంటారు ఈవ్యాసకర్తలు. యుద్ధంతో కలత చెందిన ప్రజలకూ ప్రభువులకూ వినోదం, ఉత్సాహం కలిగించడానికి రాజసభలలో ఈ జైమినిభారతము విస్తృతంగా గానం చేసేరు అంటారు.

ఈ వ్యాసకర్తల మరొక అభిప్రాయం కూడా గమనార్హం. సాధారణంగా వెనక వచ్చిన అనువాదాలు తరవాత వచ్చిన అనువాదాలకి ఉపయోగపడతాయి. వీరు ఉటంకించిన ప్రాంతాలలో తమ భాషలలో మహాభారతం అనువాదాలలో ఈ జైమినిభారతం ప్రభావం కనిపిస్తుందంటారు. అంటే చారిత్రకంగా భారతమే మొదటిగ్రంథం అయినా, అనువాదాలలో ఆతరవాత వచ్చిన గ్రంథాలప్రభావం కనిపించవచ్చు.

000

సంప్రదించిన గ్రంథాలు, వ్యాసాలు

1, పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు. జైమినిభారతము. ఆంద్రసాహిత్య పరిషత్, 1916

https://archive.org/details/jaiminibharatamu020409mbp

 1. జైమినిభారము.  కన్నడ అనువాదం, ఇంగ్లీషు అనువాదం.

https://archive.org/details/jaiminibharataa00sandgoog

 1. డా. జి.వి. సుబ్రహ్మణ్యం. పిల్లలమఱ్రి పినవీరభద్రకవి. హైదరాబాదు. మాధవీ బుక్ సెంటరు. 1978

http://www.teluguthesis.com/2013/05/srungara-shakuntalamu.html

 1. Dr. Sutyabrata Das and Dr. U.N. Sahu. “Aswamedha Episode and Jaimini Bharata in theTradition of Mahabharata : Bengali, Assamese andOriya Version”  http://magazines.odisha.gov.in/Orissareview/2010/April/engpdf/72-80.pdf

 

(నవంబరు 5, 2017)

 

 

 

 

8 thoughts on “జైమినీభారతం – చిన్న పరిచయం

 1. జైమినిభారతం – జైమిని సందేహాలు (మార్కండేయ పురాణం)
  పాండవుల మహాప్రస్థానం తరువాత పరీక్షిత్తు 64 సంవత్సరాలు ధర్మపాలన చేసి మునిశాపం వలన పాముకాటుతో మరణిస్తాడు. అంతకు ముందు జైమిని వ్యాసుని వద్ద 8000 శ్లోకాల జయం వింటాడు. ఆతనికి కొన్ని సంశయాలు వస్తాయి ఎథికల్ డైలెమాన్ ఇన్ మహాభారత – అని నేటి వరకు వ్యాసాలూ పుడుతూనే ఉన్నాయి. ఆ సంశయాలు తీర్చుకోవడానికి మార్కండేయ మహర్షి యొద్దకు వెడతాడు జైమిని. సందేహాలు నేడూ ఉన్నవే 1 మహా విష్ణువు ఏ కారణం వలన శ్రీ కృష్ణుడనే మానవుడిగా జన్మించాడు? 2. ద్రుపద పుత్రిక ద్రౌపది ఐదుగురు భర్తలను ఎందుకు స్వీకరించ వలసి వచ్చింది.? 3. బలరాముడు యుద్ధములో భాగం తీసుకొన కుండా తీర్థ యాత్ర కు ఎందుకు వెళ్ళాడు? 4. బ్రహ్మ హత్యా దోషం అతడు (బలరాముడు) ఎలా పోగొట్టుకున్నాడు? 5 పాండవులు కృష్ణుడు ఉండగా ఉపపాండవులు దిక్కులేని చావు ఎందుకు పొందారు ? మార్కండేయుడు తానూ తపోదీక్షలో ఉన్నానని వింధ్య పర్వతానికి వెడితే అక్కడ నాలుగు మానవ భాషలోసంభాషించేవి, పింగాక్ష, విబోధ, సుపత్ర , సుముఖ అనేవి నీ సంశయాలు తీరుస్తాయి అని పంపిస్తాడు. తన సందేహాలు తీరాక ఆయన తన భారత రచన చేసి ఉండవచ్చు

  మన సారస్వతంలో ఆస్తికుడంటే వేదం ప్రమాణం గా తీసుకున్నతీసుకోవడమే. మీమాంస ఆస్తిక దర్శనమే. వ్యాసునిది భాగవత మతం భక్తి అక్కడ మార్గం. జైమిని దృష్టిలో “స్వర్గ కామయ యజేత” యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్లడం పురోగతి మార్గం. అంటే కర్మ కాండ. దైవ భక్తి కాదు. వేదం అగ్ని ముఖతా అనేక దేవతలను పూజించడం చెబుతుంది. పరమేశ్వర శబ్దం అక్కడా లేదు. అనేక దేవతలు.

  మెచ్చుకోండి

 2. రమణారావుగారూ, వివియస్. శర్మగారు ఇచ్చిన సమాచారం ఇది –
  వ్యాసుడు కేవలం 8 వేల శ్లోకాల జయం వ్రాసాడు. జైమిని అశ్వమేధ పర్వమే 4 వేల శ్లోకాలు. వైశంపాయనుడు జనమేజయునికి, చెప్పిన తరువాత సూతుడు నైమిశారణ్యంలో చెప్పాడు అప్పటికి లక్ష శ్లోకాలయింది. అందులో అశ్వమేధ పర్వం 3వేల శ్లోకాలే. వైశంపాయనునికి యజుర్వేదం, జైమినికి సామవేదం ఇచ్చాడు జైమిని పూర్వ మీమాంస అనే దర్శన సూత్రం గ్రంథానికి ఆద్యుడు. వ్యాసుడు భక్తి ప్రధానమైన పురాణాలు వ్రాయగా జైమినికి దైవ భక్తిలేదు. ఆయన కర్మకాండకె ప్రాధాన్యం ఇచ్చాడు . వారి భేదాభిప్రాయాలు భారత రచన పై కూడా పడినవి అంటారు. జైమినికి అర్జునుడంటే గొప్ప అభిప్రాయంలేదు. జైమిని వ్యాస భారతాలకి చాలా తేడాలున్నాయి.

  మెచ్చుకోండి

 3. రమణారావుగారూ, భారతం మూలగ్రంథంలో ప్రమీలార్జునలఉదంతం లేదనీ, జైమినిభారతంలో ఉందనీ వివియస్. శర్మగారూ పేస్బుక్ లో చెప్పేరు. నేను ఇచ్చిన లింకులలో తెలుగు పాఠంలో ఉంది.కన్నడపాఠంలో లేదు

  మెచ్చుకోండి

 4. మాలతి గారూ, కవిత్రయ భారతం మళ్ళీ verifyచేసి వ్రాస్తున్నాను.అందులో “ప్రమీలార్జునీయం”కథ లేదు.జైమినీ భారతంలో కూడా లేకపోతే ఏ కావ్యంలో ఉందో ఎవరైనా తెలిసినవారుంటే చెప్పగలరా?

  మెచ్చుకోండి

 5. కానీ కన్నడ అనుావాదానికి చేసిన ఇంగ్లీషు అనువాదంలో కనిపించలేదండి. అనువాదాలన్నీ రచయిత స్వతంత్రరచనలు కనక తమ ప్రతిభావ్యుత్పత్తులననుసరించి చేసినట్టుంది మీస్పందనకి ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 6. వ్యాసభారతంలో లేని ”ప్రమీలార్జునుల ఉదంతం”కథ జైమినీ భారతం లో ఉంది.కథలోను, పాత్రల స్వభావ చిత్రీకరణ లోను కొన్ని భేదాలు ఉన్నాయి.

  మెచ్చుకున్నవారు 2 జనాలు

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.