పైచదువులు

అకారణంగానే ఈకథ గుర్తొచ్చింది  నాకు ఈరోజు.

విదేశీ చదువులమీద వ్యామోహం ఆంగ్లపాలనలోనే వచ్చింది. తరవాత బహుశా గత అర్థశతాబ్దంలో అమెరికాచదువులమీద ప్రత్యేకాభిమానం ఏర్పడింది. అయితే ఈ పైచదువుల పేరుతో మనం ఏమి పొందుతున్నాం, ఏమి పోగొట్టుకుంటున్నాం అన్నది పరిశీలించి చూసుకోవాల్సిన అవుసరం ఉందనిపిస్తుంది నాకు.  నిద్య యొసగు వినయంబు అంటారు. నిజానికి ఈకాలం చదువులలో ప్రశ్నకి ప్రాముఖ్యం ఎక్కువ. పాతంజలసూత్రాలలో కూడా ఏవిషయమైనా “అనుమానం” ఉపయోగించి, అంటే అస్పష్టమైన విషయాలను ప్రశ్నించి సమాదానాలు వెతుక్కోడంద్వారా స్ఫష్టం చేసుకోవాలంటారు. ఈరోజుల్లో చాలామంది ప్రశ్నించడంలో ఎదటివారిని కించపరచడమే ఎక్కువగా కనిపిస్తోంది.. అవతలివారికంటే తమకి ఎక్కువ తెలుసన్న అహంకారం. … )

కొత్తగా ఇండియానించి చదువులకోసం వచ్చిన ముగ్గురు అబ్బాయిలు ఇంకా కొత్తదనం పోకముందే, ఏదో పార్టీకి వెళ్ళి తిరిగి వస్తూ కారుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వార్త విన్నతరవాత రాయాలనిపించిన కథ ఇది. రాసింది నవంబరు 2001లోనే  కానీ సుమారుగా 70, 80 దశకాలలో తల్లిదండ్రుల మనోధర్మం చిత్రించడానికి ప్రయత్నించేను. ఇప్పుడు అమెరికా వస్తున్న యువత, వారి తల్లిదండ్రులభావాలలో చాలా మార్పు వచ్చింది. కానీ మౌలికమైన ఆలోచనలలో మార్పు వచ్చిందా? విద్య అంటే ఏమిటి? విద్య మనిషిన ఎటువేపు నడపాలి? అన్నవిషయాలలో నాకు ఇప్పటికీ సందేహమే.)

000

పైచదువులు

అలనాటి నేస్తం చక్రధరం రామకోటికి ఉత్తరం రాసేడు.

రామకోటికి ఓ పూటంతా ఆలోచిస్తే గానీ గుర్తుకి రాలేదు ఈ చెలికాడు. గుర్తుకొచ్చిం తరవాత “అవును సుమా. వక్రధరం అనేవాళ్ళం. అతని వాదనలు అతనికే తప్ప మరెవరికీ అర్థం అయేవి కాదు ఏ విషయంలోనైనా సరే. ఆరోజుల్లో చెట్టాపట్టాలేసుకు తిరిగినవాళ్ళమే,” అన్నాడు భార్యతో. వలస వచ్చేశాక పాతస్నేహాలు మర్చిపోయేనే అని ఒకింత నొచ్చుకున్నాడు కూడా.

ఉత్తరం మామూలే. “ఇచ్చట మేము క్షేమము, నువ్వూ నీకుటుంబం క్షేమమేనని తలుస్తాను” అంటూ మొదలుపెట్టి, “మావాడు మీదేశం వస్తున్నాడు, నువ్వున్నావు, చూసుకుంటావన్న భరోసాతో పంపిస్తున్నాను” అంటూ ముగిసింది.

తన పెద్దకొడుకుని తీసుకుని నెలరోజుల్లో దిగుతున్నాడాయన.

“ఏం చేద్దాఁవంటావు?” అని అడిగేడు రామకోటి భార్య రాజేశ్వరిమొహంలోకి చూస్తూ.

ఇలాటివిషయాల్లో ఇష్టాలూ కష్టాలూ ఇద్దరికీ అవగతమే. అవునన్నా తప్పే కాదన్నా తప్పే. ఓపక్క మనవాళ్ళకేదో చేద్దాఁవన్న తపన, మరోపక్క తీరా తీసుకొచ్చేక ఆ చిన్నవాడు ఏ తంటాల్తెస్తాడోనన్న భయం.

వాళ్ళు అలా తర్జనభర్జనలు పడుతూండగానే చక్రధరంనించి మరో టెలిగ్రాం వచ్చింది ఫలానా రోజున దిగుతున్నామనీ, ఎయిర్పోర్టుకి వచ్చి రిసీవు చేసుకోమని.

“ఆడపిల్లని అత్తారింటికి పంపినట్టు ఆయన కూడా వస్తున్నాడా?” అంది రాజేశ్వరి చిన్నగా నవ్వి.

“విత్తంకొద్దీ విభవం. డబ్బుంటే సరి ఎలాటి పోకడలయినా చెల్లుతాయి,” అన్నాడు రామకోటి.

000

చక్రధరం సుపుత్రుడు సనత్కుమార్‌తో అట్టహాసంగా దిగేడు సరికొత్తసూటులోనూ నాలుగు సూట్‌కేసుల్తోనూ. రామకోటి ఎయిర్పోర్టుకి వెళ్లి వాళ్లని ఇంటికి తీసుకొచ్చేడు.

ఆనవాయితీప్రకారం చక్రధరం పెట్టెలోంచి ఆవకాయా, వడియాలూ, పట్టుచీరా, పసుపు కొమ్ములూ రాజేశ్వరిముందు పెడుతూ, “మన ఆచారాలు, ఏమిటో మీవదిన చాదస్తం. మీకు నచ్చుతాయో నచ్చవో అన్నాను కానీ మీ వదిన వదిల్తేనా.”

“మాకిక్కడ ఆవకాయా, వడియాలే అపురాపఁవండీ. చీర మాత్రం అనవసరంగా తెచ్చేరు. ఉన్న చీరెలు కట్టుకోడానికే సందర్భాలుండవిక్కడ,” అంది రాజేశ్వరి మొహమాటపడుతూ.

“ఫరవాలేదులెండి. ఉంచండి. కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు బజారుకెళ్ళి తెచ్చుకోవాలంటే జరగదు కదా ఇక్కడ.”

సనత్ కుమార్ స్నానం చేసి పైజామా లాల్చీ ధరించి వచ్చేడు. ఓ మోస్తరు పొడుగూ, ఓ ఛాయ తక్కువే అయినా బెంగాలీవాడికళ వచ్చింది వేసుకున్న దుస్తులమూలంగా.

రాజేశ్వరికెందుకో అతనివరస తమాషాగా అనిపించింది. ఇదీ అని స్పష్టం కానీ సందేహాలేవో తలెత్తేయి మనసులోనే.

మాటలసందర్భంలో తెలిసిన విషయాలు – చక్రధరానికి నలుగురు పిల్లలు. ఇద్దరు పోగా మిగిలిన ఇద్దరు కొడుకుల్లో సనత్ కుమారు పెద్దవాడు. తాతగారిపేరు సన్యాసయ్య. దాన్ని ఆధునీకరించి సనత్ కుమార్ అని పెట్టుకున్నారు. చిన్నప్పట్నుంచీ బుద్ధిగా చదువుకుంటున్నాడు. అంచేత పైచదువులు చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం అతనికి పదేళ్ళప్పుడే మొదలయింది.

000

భోజనాలక్కూచున్నారు. సనత్ కుమారుడు ఇబ్బందిగా కదిలేడు కుర్చీలో.

చక్రధరం మొహంనిండా చిర్నవ్వు పులుముకుని, “వాడికి చేత్తో తినడం అలవాటు లేదు. ఫోర్కుంటే పడెయ్యి తల్లీ వాడికి. నాకు లేకపోయినా ఫరవాలేదు. వాడికే ఆ షోకులన్నీ,” అన్నాడు.

“దానికేంలెండి,” అంటూ రాజేశ్వరి ఫోర్కూ స్పూనూ తెచ్చి ఇద్దరికీ అందించింది.

కత్తులూ కఠార్లూ ఇచ్చినా సనత్ కుమార్ సరిగ్గా తిన్లేదు.

“మీ అమ్మగారివంట్లలా లేవు కాబోలు,” అంది రాజేశ్వరి సన్నగా నవ్వుతూ.

“వాడింత ఖారాలు తిన్లేడు. బ్రెడ్ లేదూ? సాండ్విచ్ వాడే చేసుకుంటాడు,” అన్నాడు తండ్రి.

రాజేశ్వరి తెల్లబోయి, అంతలోనే తెలివి తెచ్చుకుని, “అయ్యో దానికేంలెండి. ఉండండి. తెస్తాను. మామూలుగా మనదేశంనించి వచ్చినవాళ్ళు కొన్నాళ్ళదాకా మన రుచులే తింటారని చేసేను. రాత్రికి కారాలు తగ్గించేస్తాను,” అంది.

“అయ్యో, మరీ అంత పట్టింపుల్లేవులెండి. రోములో ఉన్నప్పుడు రోముపద్ధతులే మరి. వాడికోసం వేరే శ్రమ పడకండి,” అన్నాడే కానీ రాజేశ్వరికి అలా వినిపించలేదు ఆయనమాటలు. భోజనం పూర్తయేలోపున ఆయన ఆ కుర్రాణ్ణి “పైచదువుల”కోసం ఎంత పక్కాగా తీరిచి దిద్దేరో తేటతెల్లం అయిపోయింది.

ఆ అబ్బాయి చేత్తో ఏదీ ముట్టుకోడు. ముట్టుకుంటే సబ్బుతో “సుభ్భరంగా” చేతులు కడుక్కుంటాడు. చెప్పుల్లేకుండా ఇంట్లో కూడా అడుగు కదపడు. మంచి బ్రేక్‌ఫాస్టూ అవీ అన్నీ అచ్చంగా అమెరికా పద్ధతులే. “ఇక్కడ పుట్టినట్టే అనుకోండి,” అని మరో విసురు జోడించేరు చివరికి.

రాజేశ్వరికి రాను రాను ఇబ్బంది అయిపోయింది ఈ సంభాషణ.

భోజనాలయేక “టీ తాగుతారా?” అనడిగింది రాజేశ్వరి.

తండ్రీకొడుకులు మొహాలు చూసుకుని, “మీరేం తాగితే అదే,” అన్నారు. మరో క్షణం అయినంతరవాత “కాఫీ అయినా ఫరవాలేదు,” అన్నాడు సన్నీ.

వాళ్ళమాటల్లో ఏదో అంతరార్థం స్ఫురించింది రాజేశ్వరికి. ఏఁవనాలో తోచడంలేదు. మామూలుగా ఇక్కడ ఉన్న మనవాళ్ళు మన భోజనాలే తింటారు. మరీ అంత చాదస్తంగా – అడుగెట్టగానే పిడుగు – అనుక్షణం తాము అమెరికాలో ఉన్నాం అన్నసంగతి గుర్తు చేసుకుంటూ, తనకి గుర్తు చెయ్యడం ఎబ్బెట్టుగా ఉంది.

ఆవిడ కాఫీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళింది.

చక్రధరం సిగరెట్ వెలిగిస్తూ, “యాష్ ట్రే లేదూ?” అన్నాడు చుట్టూ చూస్తూ, రామకోటికీ, సన్నీకీ పేకెట్ అందిస్తూ.

రామకోటి తను కాల్చననీ, ఇంట్లో యాష్‌ట్రే లేదనీ చెప్పేడు ఇంట్లో సిగరెట్ కాల్చడం తనకి ఇష్టం లేదని అన్యాపదేశంగా తెలియజేస్తూ.

“మాకు భోజనం అయింతరవాత తప్పనిసరి. ఈ ఒఖ్ఖ దురలవాటు మాత్రం పోలేదు,” అన్నాడాయన నవ్వుతూ.

సిగరెట్ నుసి ముందున్న ప్లేటులో దులుపుతూ.

లోపల రాజేశ్వరి కాఫీలో పాలు పోయబోతే విరిగిపోయేయి. “పాలు విరిగిపోయేయి. ఇప్పుడే వస్తాను,” అంది బయల్దేరుతూ.

“మీరెందుకండీ. సన్నీ వెళ్తాడు,” అన్నాడు చక్రధరం.

“నేను వెళ్ళి తెస్తాను, తాళాలేవీ?” అన్నాడు తండ్రివేపు చూస్తూ. అతనెప్పుడూ బజారు చేసి ఎరగడు దేశంలో ఉన్నప్పుడు. అదంతా తమ్ముడివంతు అక్కడ. కానీ ఇక్కడ కారుంది మరి.

రాజేశ్వరి కొనకళ్ళ రామకోటివేపు చూసింది. అతను బుద్ధిమంతుడిలా తలొంచుక్కూచున్నాడు.

చక్రధరం ఆవిడ సందేహం గ్రిహించినట్టు, “మనవాడికి డ్రైవింగు ఇంటర్నేషనల్ లైసెన్సుంది. చాలా బాగా చేస్తాడు. మీకేం భయంవఖ్ఖర్లేదు,” అన్నాడు తల తాటిస్తూ.

రాజేశ్వరి ఇరకాటంలో పడింది. ఈ “మన”ధోరణి మనదేశంలో చెల్లుతుంది కానీ ఇక్కడలా కాదు. ఆమాట అతనికి రామకోటి చెప్పాలి. అతనేమో ముంగిలా మూతి ముడుచుకు కూచున్నాడు. కారణం ఏదైనా కానీ ఆవిడ కారు ఇంతవరకూ ఎవరికీ ఇవ్వలేదు. అసలు అలాటి అవసరం రాలేదు. పైగా షాపెక్కడుందని అడక్కముందే కారు తాళాలేవీ అని అడిగే కుర్రాడిని ఎలా నమ్మడం? తండ్రి వత్తాసు కూడాను!

రామకోటి కుర్రాణ్ణి చూసి సరదా పడుతున్నాడో తనఅవస్థకి ఆనందిస్తున్నాడో సరిగ్గా తెలీడంలేదు కానీ అతనిమొహమ్మీద చిర్నవ్వు చూస్తే రాజేశ్వరికి చిరాకేసింది. తినేసేలా చూస్తూ, “లేదండీ మీఅబ్బాయిగురించి కాదు నాభయం. ఇక్కడ ఇన్సూరెన్సు గొడవలు ఎక్కవ కదా. నేనే వెళ్తాలెండి. రేప్పొద్దున్న బ్రేక్‌ఫాస్టుకి కావలిసినవి కూడా తెచ్చేస్తే ఆ పని కూడా అయిపోతుంది. అతనికి ఇంకా కొత్త కదా. ఇప్పట్నుంచే పనిలో పెడితే ఝడుసుకోగలడు,” అంది బయటికి నడుస్తూ.

రామకోటి చిలిపిగా రాజేశ్వరిమొహంలోకి  చూస్తూ లేచేడు, “పాలూ, ఇంకా ఏం కావాలీ?” అని అడుగుతూ సన్నీవేపు చూసి, “పదవోయ్, స్టోరు చూసినట్టుంటుంది కూడా. పైవారం చేరుదువుగానీ డ్యూటీలో,” అన్నాడు.

సన్నీకి ఆ సలహా నచ్చలేదు. వాళ్ళనాన్నకి కూడా అది మహా అవమానంగా తోచింది. “టైరయిపోయేనండీ. పడుకుంటాను,” అని కుర్రాడూ, “టైరయిపోయేడు, ఇవాళ్టికి పడుకోనియ్‌లే,” అని తండ్రీ ముక్తకంఠంతో తమ నిరసన తెలియజేసేరు.

రాజేశ్వరీ రామకోటీ మొహమొహాలు చూసుకోలేదు కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం ఆలోచనేదో లీలగా మెదిలింది.

000

మర్నాడు పొద్దున్నే లేచి కాఫీ, బ్రేక్‌ఫాస్టూ సిద్ధం చేసింది కానీ చుట్టాలు లేవలేదు. భార్యాభర్తలిద్దరికీ టైమయిపోతోంది.

“ఏం చేద్దాం?”

“ఇక్కడిపద్ధతులు తెలిసినవాళ్ళే కదా. అంతా క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చేరు. చిన్న నోట్ పెట్టేసి వెళ్ళిపోదాం,” అన్నాడు రామకోటి.

“వాళ్ళేం అనుకుంటారో?” అంది రాజేశ్వరి సందిగ్ధంగా.

“అనుకుంటే బాధే లేదు,” అన్నాడు రామకోటి నర్మగర్భంగా.

అతనిక్కూడా వాళ్ళధోరణి బాగులేదని గ్రహించింది. కానీ ఆవిడకి ఊరుకోడానికి మనసొప్పలేదు. ఆఫీసులో పర్మిషనడిగి, లంచివేళకి ఇంటికొచ్చింది అతిధులు తిన్నారో లేదో చూడ్డానికి. పన్నెండు దాటింది.

తండ్రీకొడుకులు అప్పుడే లేచినట్టున్నారు. ముస్తాబయి వీధిలోకి బయల్దేరుతున్నారు. ఇంటిముందు టాక్సీ ఉంది.

రాజేశ్వరి అయోమయంగా “ఎక్కడికెళ్తున్నారు? బ్రేక్‌ఫాస్టు తిన్నారా?” అనడిగింది.

“బ్రేక్‌ఫాస్టా? మాక్కనిపించలేదే?” అన్నారిద్దరూ తమ అసంతృప్తిని ఏమాత్రం దాచుకోకుండా.

“ఫ్రిజ్‌లో ఉంది. ఫ్రిజ్ మీద నోట్ పెట్టేను కూడా.”

“ఫ్రిజా?” – ఫ్రిజెక్కడుంది అన్నట్టు మొహాలు పెట్టేరిద్దరూను.

“మీరు శలవు పెట్టేరనుకున్నాం,” అని కూడా చెప్పేరు తప్పేఁవేనా ఉంటే ఆవిడదే అన్నట్టు.

“పోన్లెండి. రేపు తినొచ్చు. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు?” అంది టాక్సీవేపు చూస్తూ.

“ఊరు చూసొస్తాం. ఊరికే కూచోడం బోరు కదా.”

రాజేశ్వరి సరేనన్నట్టు తలూపి, లోపలికి నడిచింది, “ఎలాగా వొచ్చేను కదా. నేను లంచి తిని వెళ్తాను.”

చక్రధరం, సన్నీ కూడా ఆవిడవెనకే లోపలికొచ్చేరు.

“కాబ్ పంపించేశాం. ఎలాగా వచ్చేరు కదా. మీరు మమ్మల్ని ఊళ్ళో దింపేసి వెళ్ళిపోతే మేం వచ్చేటప్పుడు కాబ్‌లో  వస్తాం,” అన్నాడు చక్రధరం.

రాజేశ్వరి మళ్ళీ ఇరుకున పడింది. లంచ్ టైంలో డౌన్‌టౌన్ వెళ్ళడం అంటే ఆ పూట ఆఫీసు గోవిందా. వీల్లేదని చెప్పడమూ కష్టమే వీళ్ళకి. అప్పటికే పొద్దున్న టిఫిను విషయంలో అవమానం అయిపోయింది కదా.

“ఉండండి, ఆఫీసుకి ఫోను చేసి వస్తాను,” అని లోపలికెళ్ళి మేనేజరుకి సంజాయిషీ ఇచ్చుకుని వచ్చింది.

“మీరు కూడా కొంచెం లంచి తినండి. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఆలస్యం అవచ్చు,” అని మూడు ప్లేట్లు పెట్టింది బల్లమీద.

అదయింతరవాత, బయల్దేరేరు.

“నువ్వు ముందు కూర్చోరా,” అని కొడుక్కి పురమాయించి, చక్రధరం వెనకసీటులో కూర్చున్నాడు.

సన్నీ ముందుసీటులో కూర్చుని రెడ్ లైటు, గ్రీన్ లైటు, ఛేంజి లేన్ అంటూ చక్కని అమెరికనింగ్లీషులో చెప్తూ తన కారు చోదక పరిజ్ఞానాన్ని ప్రదర్శించేడు. అతను ఎందుకు ముందుసీటు అధిష్ఠించేడో ఆవిడికి అర్థమయింది. తాను కారు నడపడంలో నిష్ణాతుడని ఆవిడ అంగీకరించాలని అతడి తాపత్రయం. వాళ్ళు కారు దిగింతరవాత సుదీర్ఘమయిన నిట్టూర్పు విడిచిందావిడ. ఈకథ ఎక్కడికి దారి తీస్తుందో ఆవిడకి స్పష్టంగా తెలిసిపోయింది. “ఆపద్రాక్షకా!” అని మనసులోనే ఓ చిన్న యస్.ఓ.యస్ ప్రసారం చేసుకుంది.

రామకోటి సాయంత్రం వచ్చేక మధ్యాహ్నం జరిగిన నాటకం చెప్పింది. అతనికీ ఏం చెప్పాలో తోచలేదు.

“ఓ నెల్రోజులు కళ్ళు మూసుకుంటే అబ్బాయి dorm కెళ్ళిపోతాడు. తండ్రి చుట్టాల్ని చూడ్డానికి కాలిఫోర్నియా పోతాడు. కుర్రాడివరస చూస్తుంటే అతను మళ్ళీ మనమొహం చూసేలా లేడు,” అన్నాడు బీన్సు ముక్కలు తరుగుతూ రాత్రి కూరకి.

“అందరం సుఖపడతాం అలా అయితే,” అంది రాజేశ్వరి బియ్యం కొలుస్తూ.

రాత్రి తొమ్మిదయింది. తండ్రీకొడుకుల జాడ లేదు.

“తప్పిపోయేరేమో,” అంది రాజేశ్వరి బెదురుగా.

రామకోటికి కూడా అదే అనుమానం వచ్చింది కానీ అతను చెయ్యగలిగింది మాత్రమేముంది? “వాళ్ళకి వాళ్ళియి తగుదునమ్మా అంటూ ఊరుమీద పడ్డారు. వారు అమెరికా క్షుణ్ణంగా స్టడీ చేసి వచ్చేం అన్న ధీమాతో వెళ్ళేరే కానీ. మనం పంపలేదు కదా. ఎక్కడని వెతుకుతాం?” అన్నాడతను.

మరో అరగంట చూసి వాళ్ళు తినేశారు. మళ్ళీ పొద్దున్నే లేచి ఆఫీసులకి వెళ్ళాలి.

000

చక్రధరం సన్నీతో వచ్చేసరికి రాత్రి ఒంటిగంటయింది. రామకోటి తలుపు తీసేడు.

“మీకిద్దరికీ పని. మాకు ఊరు చూపడానికి తీరిక ఉండదు కదాని మేమే వెళ్ళేం,” అన్నాడు చక్రధరం. “పైగా మనదేశంలోలా కాదు కదా. ఇక్కడ అన్నీ్ను చక్కగా క్రమపద్ధతిలో ఉంటాయి. తెలీనివాళ్ళకయితే బాధ గానీ మనకేంటి,”

“ఏమేం చూశారు?” అన్నాడు రామకోటి బల్లమీద కంచాలూ, గిన్నెలూ పెడుతూ.

“ఏదో బజార్లు తిరిగేం. ఆతరవాత సినిమా చూసి వచ్చేసరికి ఆలస్యం అయింది. మీకు కష్టం అవలేదు కదా,”

రామకోటికి “అవలేద”నక తప్పలేదు. “రండి, భోంచేద్దురు గాని. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.”

“మేం మెక్డొనాల్డులో తినేశాం. ఇండియాలోలా కాదు. ఇక్కడ హేంబర్గరు చాలా రుచిగా ఉంది,” అన్నాడు సన్నీ.

“ఆఁ, అవును, బాగుంటుంది” అనేసి రామకోటి వంటకాలు ఫ్రిజ్జికి తరలించేసి పడుకోడానికి వెళ్ళిపోయేడు.

“వాళ్ళు భోజనాలు చెయ్యలేదా?” అనడిగింది అలికిడి విని లేచిన రాజేశ్వరి.

“తిన్నార్ట,” అన్నాడతను ముక్తసరిగా.

000

వారం రోజులయింది. విజిటమెరికా టికెట్ తెచ్చుకుని వచ్చేడు కనక చక్రధరం దేశాటనకి బయల్దేరేడు. సన్నీకి క్లాసులు మొదలయేయి. ఆదిలో అనుకున్నట్టుగానే తండ్రి దేశంలో ఉన్నన్నాళ్ళూ వీళ్ళింట్లో ఉండి తరవాత డోర్ముకి మారిపోతానని చెప్పేడు. కానీ ఇంట్లో ఉన్నా లేనట్టే. ఎప్పుడు లేస్తాడో ఎక్కడ ఏం తింటున్నాడో ఎప్పుడింటికొస్తాడో తెలీడం లేదు. అన్నీ ప్రశ్నలే. స్నేహాలు బాగానే కూడగట్టుకున్నట్టున్నాడు అట్టే ఆలస్యం చెయ్యకుండానే. సినిమాలూ, పార్టీలూ, డాన్సులూ, … ..

ఓ రోజు మధ్యాహ్నం సమయం కాని సమయంలో ఇంటికొచ్చిన రాజేశ్వరిని చూసి గబుక్కున చూస్తున్న విడియో ఆపు చేసేశాడు.

“మా ఫ్రెండు ఏదో పాతసినిమా ఇచ్చేడు. చెత్తగా ఉంది,” అన్నాడు ఆవిడ అడక్కముందే.

“స్నానం చేసొస్తాను,” అంటూ పక్కనించి అతను వెళ్తుంటే ఓడ్కా వాసన గుప్పున తగిలిందావిడకి.

ఆ సాయంత్రం సన్నీ ఏమనుకున్నాడో బయటికెళ్ళలేదు. రాజేశ్వరితో కబుర్లు మొదలెట్టేడు – తన high I.Q., తల్లిదండ్రుల high expectations,  dirty India, stupid Indians, …

ఇక్కడ వీధులు విశాలంగా ఉంటాయి

మనుషులు శుభ్రంగా ఉంటారు

ఇక్కడి మ్యూజిక్కూ, ఇక్కడి మూవీసూ, ఇక్కడి ఆడపిల్లల తెల్లతొక్కా, ఆఖరికి ఇక్కడ పొట్లాలు కట్టుకునే కాయితాలు సైతం ఎంత అందంగా ఉంటాయో …. పట్టలేని తన్మయత్వంతో అతను వర్ణిస్తుంటే రాజేశ్వరికి తల తిరిగిపోయింది.

“మీ తమ్ముడేం చేస్తున్నాడు?” అనడిగింది ఆ ప్రవాహానికి అడ్డు తగిలి.

“వాడొట్టి లోఫర్. బజారుకెళ్ళి కూరలు తేరా అని పది రూపాయలిచ్చి పంపితే, నాలుగు రూపాయలకి కూరలు కొని నాలుగు రూపాయలు చిరుతిళ్ళకి తగలేసుకొస్తాడు,”

ఇంతకుముందు చక్రధరం కూడా ఇలాగే మాటాడేడు చిన్నకొడుకుగురించి. పెద్దవాణ్ణి పెద్ద చదువులకోసం మాలీసు చేస్తూ చిన్నవాణ్ణి నిర్లక్ష్యం చేసేరు కాబోలు. వాడు తిరగబడి లోపరయేడు అనుకుంది రాజేశ్వరి.

ఆసాయంత్రం రామకోటితో మాటాడుతూ కుర్రాడిగురించి తన అనుమానాలు వ్యక్తం చేసింది. “పై చదువులా? పైపై చదువులా?” అంది హేళనగా.

“ఏం చేస్తాం? కొందరివిషయంలో పైమెరుగులకేనేమో ఈ పరుగులన్నీ,” అన్నాడు రామకోటి ఆవిడతో ఏకీభవిస్తూ.

000

రెండు వారాలయింది. శనివారం ఉదయం. రాజేశ్వరి పూజ చేసుకుని కూర్చుంది. మామూలుగా శనివారం ఉదయంపూట కర్నాటసంగీతం వింటూనో భరతనాట్యం టేపులు పెట్టుకుని చూస్తూనో గడుపుతారు. మద్యాహ్నంనించీ మామూలే – క్లీనింగూ, షాపింగూ, లాన్ మోయింగూ లేక స్నో బ్లోయింగూ ..

వాళ్ళలా కూచునుండగా, ఫోను మోగింది. రామకోటి తీసుకున్నాడు .. “ఘాష్! వెన్?  అంటూ అరుస్తున్నాడు ఫోన్లో.

రాజేశ్వరి ఉలికిపడి తలెత్తి చూసింది.

రామకోటి ఫోను పెట్టేసి, చెప్పేడు రాత్రి ఘోరమయిన ప్రమాదం జరిగిందిట. ఇద్దరూ హడావుడిగా బట్టలేసుకుని ఆస్పత్రికి చేరుకున్నారు. సెల్లో పిలిచి చక్రధరాన్ని పిలిచి వెంటనే బయల్దేరి రమ్మని చెప్పేడు. ఆస్పత్రికి వెళ్ళేక కానీ వివరాలు తెలీలేదు. ముందు రోజు రాత్రి మరో ముగ్గురు మిత్రులతో కలిసి సన్నీ ఏదో  పార్టీకి వెళ్ళేడుట. నలుగురికీ కొత్తే ఊరూ కారూ కూడా. పార్టీలో మామూలే. పాటలూ, డాన్సులూ, తాగడాలూ … రాత్రి మూడయింది. ఒకొక్కరే వీధిన పడుతున్నారు. సన్నీ డ్రైవ్ చేస్తున్నాడు. ఏమయిందో తెలీదు కానీ కారెళ్ళి దారిపక్కనున్న చెట్టుకి కొట్టుకుంది. మిగిలిన ముగ్గురుకీ అక్కడిక్కడే ప్రాణాలు పోయేయి. సన్నీ ఒంటినిండా కట్లతో ఇజిప్షన్ మమ్మీలా పడున్నాడు మంచంమీద. స్పృహ లేదతనికి. పోలీసులు చెప్పడం అతని blood alcohol level మితికి మించి మూడింతలుందట.

చక్రధరం సాయంత్రానికి వచ్చేశాడు న్యూయార్క్ నించి గాభరా పడిపోతూ. ఆయన పూర్తిగా డీలా పడిపోయేడు. ఈ ఒక్కదెబ్బతోనూ మనిషి సగానికి సగం అయిపోయేడు. ఈ పుత్రుడిమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడాయన. “వాళ్ళమ్మ ఈమాట వింటే గుండె పగిలి చచ్చిపోతుంది. నలుగుర్ని కంది. ఇద్దరు జబ్బులతో పోయేరు. ఆఖరివాడు దేశాలట్టుకుపోయేడు. వీడిమీదే మా కళ్ళన్నీను…”

“ఆఁ?” అంది రాజేశ్వరి ఆయనేం అంటున్నారో అర్థం కాక.

ఆర్నెల్లయిందిట చిన్నవాడు ఇంట్లోంచి పారిపోయేడు. ముంబైలో ఉన్నాడని ఎవరో అన్నారు కానీ జాడ తెలీదు ఇప్పటికీను.

ముద్దు చేసి ఒకణ్ణీ, మొరటుతనంతో మరొకడినీ – మొత్తంమీద ఇద్దర్నీ పనికిరానివాళ్ళగా చేసేసేరు అమ్మా, నాన్నా అనుకుందామె.

ఆ తండ్రిని చూస్తుంటే ఎక్కళ్ళేని జాలీ ముంచుకొచ్చింది రాజేశ్వరికి. పిల్లాణ్ణి పక్కాగా తయారు చేయదలుచుకున్న ఈ పెద్ద మనిషి ఓ అందమైన బొమ్మనే చూసేడు కానీ అవతలపక్క బొరుసుంటుందని గ్రహించలేదు. అమ్మ అంటూండేది “కళ్ళు వెనక్కుండవు ఎవరికీను. చూసుకు నడుస్తారంతే,” అని.

మరక్కడుండలేక హాల్లోకి వచ్చేసింది రాజేశ్వరి.

000

(నవంబరు 2001. ఇ-పత్రికలో ప్రచురించిన కథ)

2 thoughts on “పైచదువులు

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.