G.V. Sitapati: History of Telugu Literature. పరిచయం

గిడుగు వెంకట సీతాపతిగారు ఇంగ్లీషులో తెలుగు సాహిత్యచరిత్ర రచించిన గ్రంథం ఇది.

కేంద్రసాహిత్య ఎకాడమీ ఆధ్వర్యంలో ఇతరభాషలవారికి తెలుగు సాహిత్యచరిత్రను పరిచయం చేయడం ఈపుస్తకం ధ్యేయం.

ఇంతకుముందు రెండో మూడో ఇంగ్లీషు పుస్తకాలు పరిచయం చేసేను కానీ అవి ఇంగ్లీషువారే రాసిన ఇంగ్లీషుపుస్తకాలు, పాశ్చాత్యభావజాలం ఆవిష్కరించినవి. ఈ పుస్తకం పరిచయం చేయడానికి కారణం కేవలం తెలుగుసాహిత్యచరిత్ర మరోమారు పాఠకులముందు ఉంచడం కాదు. సీతాపతిగారి పుస్తకంలో భారతీయభావజాలంమీద పాశ్చాత్యులప్రభావం కనిపించడం ఒకటీ, రెండేది 1968లో ప్రచురించిన ఈపుస్తకంలో కొన్ని భావాలు ఈనాటికి ఎలా వర్తించగలవో, వాటిని గమనించి మనం మనఆలోచనలను ఎలా సరి దిద్దుకోగలమో చూచుకోడానికి.

సీతాపతిగారు విషయాన్ని రెండు భాగాలుగా విభజించారు తమపరిశీలనకి అనుగుణంగా. మొదటిభాగం ప్రాచీనసాహిత్యం వీరేశలింగంయుగంవరకూ. రెండోభాగం ఆధునికసాహిత్యం.

నాకు ప్రత్యేకంగ ఆసక్తి కలిగించినవి 7వ అధ్యాయం తెలుగుభాష, సాహిత్యంపై ఆంగ్లసంస్కృతిప్రభావం, 8వ అద్యాయం వీరేశలింగం, పరవస్తు చిన్నయసూరి మున్నగువారి సాహిత్యం.

ముస్లిములు పరిపాలనకాలంలో అనేక అరబ్బీ, పెర్షియన్, హిందుస్థానీ పదాలు తెలుగులో చేరడం మొదలయింది. పోర్చుగీస్ వారి రాకతో ఇతర భాషాపదాలు మరింత విస్తరించేయి, ప్రధానంగా అధికారపత్రాలలో. కృష్ణదేవరాయలు, పెద్దన వంటి కవుల ప్రబంధాలలో పార్శీ పదాలు ఉన్నాయంటారు.

స్థూలంగా ఈ విదేశీ, విజాతీయ పదాలను క్రోడీకరించి 11 వర్గాలుగా విభజించేరు రచయిత.

 1. భూమి, వ్యవసాయం, శిస్తు
 2. పరిపాలనాయంత్రాంగం
 3. వాణిజ్యం
 4. స్థానిక విభాగాలు- జిల్లా, తాలూకా, గ్రామం
 5.  ప్రయాణసౌకర్యాలు – కారు, టాంగా
 6. కట్టడాలు – ఇల్లు, కిటికీ, మండువా
 7. ఆహారపదార్థాలు – జిలేబీ, రోటీ,
 8. వస్త్రాలు – జమారు దుప్పటీ, పావడా
 9. నగలు – కమ్మలపట్టా, జిగినీ
 10. వాద్యవిశేషాలు – గిటారు, తంబురా,
 11. తదితరములు – అలాగా, ఆరింద, తంటా

పరిశీలించి చూస్తే, అవన్నీ ఆనాటి పరిపాలనకి సంబంధించినవీ, నిత్యజీవితంలో మనసంస్కృతిలో లేనివీ అన్నది స్పష్టం అవుతుంది. (పు 95)

వీటిలో కొన్నిపదాలు తెలుగులో ఎంతగా కలిసిపోయేయంటే కొందరు తెలుగువారికి అవి తెలుగు పదాలు కావని తెలీదు కూడా అన్నారు. ఇది నేను నమ్ముతాను. వారు ఉదహరించిన కొన్ని పదాలు తెలుగుపదాలు కావని నాకు తెలీదు ఇక్కడ చూసేవరకూ.

అయితే మనం ఇక్కడ పరిశీలించవలసింది ఈ పదాలు తెలుగులో చేర్చవలసిన అవుసరం ఎంతవరకు అన్నది. కేవలం ఇక్కడ ఇచ్చినపదాలు మాత్రమే తీసుకుని చూస్తే, వాటిలో చాలామటుకు మనకి అంతకుపూర్వం లేనివే అని అర్థమవుతుంది. ఉదారహణకి, పరిపాలన విభాగంలో ఇంగ్లీషువారు తమ పరిపాలనకి అవుసరమైన రీతిలో ఎల్లలు గీసేరు. వాటికి తగినరీతిలో పరిపాలనాయంత్రాంగం సృష్టించేరు. కలెక్టర్లు, పంచాయితీలు  వచ్చేయి. అంచేత వాటికి తగిన పదాలు సృష్టించి ప్రాచుర్యంలోకి తెచ్చేరు. అలాగే వస్త్రాలు, నగలు, వాణిజ్య, ఆర్థికసంబంధిత పదాలు మొదలైనవి.

సుమారుగా చూస్తే ఇంగ్లీషుపదాలు తెలుగులో (బహుశా ఇతర భారతీయభాషలలో కూడానేమో) ప్రవేశించడం రెండు స్థాయిలలోజరిగింది. ఉద్యోగాలు, వాణిజ్యంస్థాయిలలో ఒకటి. వీటికి ఇంగ్లీషుచదువులు అవుసరం అని దొరలే నిర్ణయించేరు. రెండోది మతపరమైనది. క్రైస్తవం సామాన్యజనానీకంలో ప్రచారం చెయ్యడానికి వ్యవహారికభాష అవుసరమైంది. అంచేత మొదలు పెట్టేరు నిఘంటువులు, వ్యాకరణసిద్దాంతాలు. ఆ సందర్భంలోనే పండితులభాషకీ నిత్యవ్యవహారంలో భాషకీ తేడా ఉందని గమనించి, వ్యవహారికభాషకి ప్రాధాన్యం ఇవ్వాలని బ్రౌన్ దొరగారు ప్రతిపాదించారు. సాహిత్యం పండితులకి ప్రత్యేకం కాదని ఇంగ్లీషువాడే మనకి బోధించింది. విద్యాలయాల్లో  స్థానికభాష ప్ల్రవేశపెట్టాలని ప్రతిపాదించింది కూడా దొరలే.

బ్రౌన్ నిఘంటువు తయారు చేసిన ప్రధానకారణం తెలుగువారు ఇంగ్లీషు అర్థం చేసుకుని ఇంగ్లీషు పుస్తకాలు తెలుగులోకి అనువదించడానికే అనీ, ఆ కారణంగానే మామూలుగా ఇంగ్లీషువారికి అనవసరం అనిపించే వివరణలు చేర్చేననీ అని వివరించేరు బ్రౌన్ (95).

నిఘంటువులుగురించి ఇచ్చిన సమాచారం – వివిధ నిఘంటువుల స్వరూపం, ధ్యేయంవంటివి- ఆసక్తికరంగా ఉంది. ఎ. గెలెటీ సమకూర్చిన నిఘంటువుగురించి ఇలా అన్నారు, “తెలుగువారు ఇది ఏమి నిఘంటువు అని కూడా అనొచ్చు. తెలుగు యువత తెలుగు నేర్చుకోడానికీ, భాష పటిష్టం చేసుకోడానికీ, ఇంకా వినోదార్థం కూడా, ఇది సమకూర్చేను,” అని చెప్పుకున్నారు. ఈ కూర్పుకి సహాయం అందించిన ఆయనకుమారుడు ఆర్. గెలటీ, తండ్రిపుస్తకానికి పరిచయం రాస్తూ, చివరలో చెప్పిన వాక్యం ప్రత్యేకించి గమనించాలి మనం, “ప్రస్తుతం ఇంగ్లీషు పరిపాలనకీ, కోర్టు వ్యవహారాలకీ, విద్యాలయాలకీ–అంటే సకల వ్యవహారాలకీ–ఇంగ్లీషే ప్రధానభాష కనక స్థానికభాషలు సహజంగానే ఇంగ్లీషునించి గ్రహించినపదాలతో వృద్ధి పొందుతున్నాయి. అయితే రేపు ఆంగ్లపాలన అంతరించి ఆంధ్రులు స్వయంగా రాజ్యపాలన చేపట్టినట్టయితే, తప్పనిసరిగా తమవ్యవహారాలు తమ మాతృభాషలో కొనసాగించే ప్రయత్నం చేయాలి.” ఈవాక్యాలు మరోసారి చదవండి. “తప్పనిసరిగా తెలుగువారు తమ మాతృభాషలో వ్యవహారాలు కొనసాగించే ప్రయత్నం చేయాలి.”

ఇక్కడ నాకు కొట్టొచ్చినట్టు కనిపించిన అంశం ఇప్పుడు ప్రతివారు ఆంగ్లం వాడడానికి చెప్పే కారణం– ఉద్యోగాలు, ప్రపంచవ్యాప్తమైన సాంకేతిక, వైజ్ఞానిక పరిజ్ఞానంవంటివి కారణంగా చెప్తారు, అలవాటయిపోయింది అని కూడా అనొచ్చు. కానీ ఈవాదనలో పాలూ, నీళ్ళూ, ఆదివారంలాటి పదాలు వాడవలసిన అవుసరం కనిపిస్తోందా?

ఆమధ్య ఏదో కూర ఎలా చేస్తారో ఒక విడియో చూసేను. ప్రతి మూడో మాటా మాత్రమే తెలుగు!ఇంగ్లీషువారు తమభాష మననెత్తిన రుద్దేరు అని అనేవారు కూడా ఉన్నారు. కానీ ఆర్. గెలెటి చెప్పిన ఆ చివరివాక్యం మాత్రం గాలిలో కలిసిపోయింది. ఆంగ్లేయులు ఉన్నంతకాలం తమభాషని ప్రచారం చేసేరు. వెళ్ళిపోతూ, మీరు మాభాష నిలబెట్టాలంటూ ఆంక్ష పెట్టలేదు. ఆంగ్లం కొనసాగించకపోతే మళ్ళీ రాజ్యం లాక్కుంటాం అంటూ బెదిరించలేదు. పైగా, ఆంద్రులు తమభాషని పునరుద్ధరించుకుంటారన్న ఆశాభావం కూడా వెలిబుచ్చేరు.

19వ శతాబ్దంలో బ్రిటిష్ అధికారులు స్కూళ్లూ, కాలేజీలు స్థాపించి, విద్యాభివృద్ధి ప్రణాళికలు ఏర్పాటు చేసినప్పుడు వారి ధ్యేయం దేశభాషలను అణిచివేయడం కాదనీ, ఆంగ్లసాహత్యంలో ఉత్తమమైనవాటిని దేశభాషలలో అందించడమేనని అంటారు సీతాపతిగారు. (పు. 119)

అది సాధించడానికి ఇంగ్లీషు నేర్చిన తెలుగు పండితులను అనువదించడానికి నియమించేరు. ఇక్కడ ఆంగ్లేయులకు ఎదురైన క్లిష్టసమస్యే నాకు ఆసక్తికరంగా తోచింది. ఈ పండితులు ఇంగ్లీషులో తగిన వైదుష్యం సంపాదించుకున్నారు. అదేసమయంలో తెలుగుని నిర్లక్ష్యం చేసేరనీ, అంచేత అనువాదాలు అనుకున్న స్థాయిలో లేవు అనీ అంటారు రచయిత. ఇప్పుడు మనం ఈనాటి తెలుగురచనలు చూసినా ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది కదా. అయితే సీతాపతిగారే  ఈ పరిస్థితికి మరో కారణం కూడా చెప్పేరు. ఆంగ్లేయులపాలనలో ఆ వ్యవస్థకి సంబంధించిన అనేక పదాలకి తెలుగులో సమానార్థకాలు లేవు. అంచేత ఆ పదాలు యథాతథంగా తెలుగులో వాడుకలోకి తెచ్చేరు. ఈపరిస్థితికి పూర్తిగా ఇంగ్లీషువిద్యనే నిందించడం తగదు అంటారు గ్రంథరచయిత. ఈవిషయం మరింత విపులంగా కావాలంటే మూలగ్రంథం చూడండి. (పు.119)

ఆతరువాతికాలంలో వీరేశలింగంగారూ వ్యావహారికభాషనే ఎన్నుకున్నారు. సూక్ష్మంగా ఆలోచిస్తే, పండితులు తమ పాండిత్యం ప్రదర్శించుకునే భాషగా ప్రాచీనభాష సమర్థిస్తే, జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోవలిసినభాషగా “గ్రామ్యం” గుర్తించడం జరిగింది. ఈ గ్రామ్యం అన్నపదం పండితులు కానివారిభాషగా ఒక నిరసనభావంతో వాడడం జరిగిందని సీతాపతిగారు అన్నారు. ఈ భాషావాదనల విషయంలో వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం పంతులు, వేదం వేంకటరాయశాస్త్రిగారు చాలా వాదించుకున్నారని నాకు తెలుసు కానీ ఈ పుస్తకంలో మరింత చక్కగా వివరంగా ఉంది. ఆతరవాత గిడుగు రామమూర్తిపంతులుగారు సారధ్యం వహించి వ్యవహారికభాషవిషయంలో చేసిన కృషి అందరికీ తెలిసినదే.

ఎటొచ్చీ  రామమూర్తిపంతులుగారు కృషి చేసిన వ్యావహారికానికీ ఈనాడు మనం వాడుతున్న వ్యవహారికానికీ చాలా వ్యత్యాసం ఉంది. తెలుగుభాషకోసం కృషి చేసిన ఆనాటి మహానుభావులు ఈనాటి తెలుగు వింటే ఏమనుకుంటారో, ఏమంటారో ఊహించడం కూడా కష్టమే.

పరిపాలనాయంత్రాంగం, వాణిజ్యం, ఇతరవ్యవహారాల్లో మనసంస్కృతిలో లేనివి తెలుగుభాషలో చేర్చి భాషాభివృద్ధి చేయడం బాగుంది. కానీ ఉన్న తెలుగుమాటలు వదిలేసుకోమని ఎవరు చెప్పేరు? పాలూ, నీళ్లూ, అరిటికాయా, మిరపకాయా కూడా ఇంగ్లీషులోనే చెప్పుకోవాలా? good, bad, okay, parents, kids లాటి పదాలకి తెలుగుమాటలు తెలీని తెలుగువాడున్నాడా? తెలిసి వాడనివాళ్ళు ఎంతమంది? ప్రాచీన తెలుగుగ్రంథాలను పునరుద్దరించి, సంస్కరించి ప్రచురించడంలో ప్రధానపాత్ర వహించేరు ఆంగ్లేయులు. అయితే వాటిన సంస్కరించేవిధానంలో మన పండితులపద్ధతిని గర్హించేరు. బ్రౌన్ తాను అనుసరించిన పద్ధతి విపులంగా వివరించేరు. (పు 112). ఆయనకి పండితులంటే ఉన్న నిరసనభావం “He discouraged the vainglorious exhibition of scholarship” అన్న వ్యాఖ్యలో స్పష్టమవుతుంది. ప్రాచీనకవుల ప్రతిభ పాండిత్యం ప్రదర్శించడంలోనేగా మనం గుర్తిస్తున్నాం. ఆ పాండిత్యం మెచ్చుకోడానికి పాఠకులకి ఆ స్థాయి ఉండాలి. ఆ పాండిత్యాన్ని నిరసించి, సంస్కరించిన పుస్తకం ఎలా ఉంటుందో అని నాకు సందేహం కలిగింది. నేను ఆ పుస్తకాలేవీ చూడలేదు కనక నాది ప్రస్తుతానికి సందేహం మాత్రమే.

ఇక్కడ ప్రస్తావించవలసిన మరో అంశం ప్రబంధాలను వ్యవహారికభాషలోకి “అనువదించడం”, అంటే గ్రాంథిక తెలుగును వ్యావహారికతెలుగులోకి అనువదించడం. ఇది బహుశా గ్రాంథికభాష అర్థం కానివారిసౌకర్యార్థం అనుకోవచ్చు. ఈ పద్ధతి కూడా దొరలప్రసాదమే. వసుచరిత్రను వ్యవహారికంలోకి అనువదించమని ఆదేశించేరుట. ఇది ఇప్పుడు మితి మీరి, పెద్దనవలలను, మాలపల్లిలాటివి, కుదించి తిరగరాయడం. నాకు మటుకు ఇది ఉచితంగా లేదు. ప్రతి కవికీ, రచయితకీ తమదైన శైలి ఉంటుంది. ఆ శైలిలో విస్తృతమైన పదవిన్యాసం, ఉక్తివిశేషాలు, అలంకారవిశేషాలు ఎన్నో ఉంటాయి. ఆ శైలిని ఆస్వాదించడం పాఠకునికి భావ్యం. అశైలి భాషకి పుష్టి చేకూరుస్తుంది. నాకు తెలీనిమాటలు వాడని పుస్తకాలు చదువుతానంటే నాభాష అభివృద్ధి అయే అవకాశం లేదు కదా.

 

19వ శతాబ్దం తొలిదశలో తెలుగులో వాడుతున్నఇంగ్లీషుకి ఆదరణ లేకపోయింది, పైన చెప్పినట్టు యంత్రాంగం, వ్యవహారం కాక, నిత్యజీవితంలో మనకి లేని వస్తువులు, సిగరెట్టు, కాఫీ, లంగా, కైజారువంటివి చేర్చుకోడం ఆమోదించేరు. మిగతా సందర్బాలలో హాస్యానికి దోహదమయింది.

రాయసం వెంకటశివుడుగారి ఆత్మకథలో పాఠశాల అంటే ఇంగ్లీషువారు స్థాపించిన స్కూలు అనీ, బడి అంటే తెలుగువారు సాంప్రదాయసిద్ధంగా నడిపే బడి అనీ నిర్ధారణగా నిర్వించలేదు కానీ వారి వాక్యాలు చదివితే అదే అభిప్రాయం కలుగుతుంది. ఇక్కడ సూక్ష్మంగా మన, పెరవారి అన్నది నిర్ధారణ చేయడానికి భాష వాడినతీరు తెలుస్తోంది.

2వ భాగం మొదలు పెట్టేసరికి అనేకమంది కవులు, రచయితలపేర్లు వింటున్నవే కావడంచేత మరింత ఆసక్తికరంగా ఉంది. సాహిత్యసంస్థలచరిత్ర చాలా బాగుంది. ఈ 20వ శతాబ్దంలో ఎవరు తెలుగుసాహిత్యం తెలుగుభాష సంపన్న చేసేరు, ఆంగ్లభాష సాహిత్యం, భావజాలంప్రభావం ఎవరిమీద ఎంత ఉంది లాటి విషయాలు తెలుసుకోడానికి పనికొచ్చింది. అనువాదాలగురించిన విభాగంలో మణిప్రవాళంలాటి అనువాదాలు అంటూ ఆరు భాషలలో ఆరుచరణాలుగా రచించిన కీర్తనలగురించి ప్రస్తావించేరు. ఇది నిజానికి వింత కాదు. మనదేశంలో ఏ ఒక్కరిని తీసుకున్నా నాలుగు భాషలు నేర్చినవారయిఉంటారు. కనీసం ఉండేవారు పూర్వం. రాజకీయాలు కారణంగా రాష్ట్రవిభజన జరిగినా అటూ ఇటూ రాష్ట్రాలకి రాకపోకలు బాగానే ఉంటాయి కనక. కానీ ఆపేరే నాకు కొత్తగా అనిపించింది.

వీరేశలింగంగారి రాజశేఖరచరిత్రగురించిన వాదోపవాదాలు కూడా ఇక్కడే మరింత విపులంగా తెలుసుకున్నాను. ఇంతకుముందు ఈనవలకి Vicar of Wakefied మూలం కాకపోతే కనీసం ఆధారం అని విని ఉన్నాను. రాజశేఖరచరిత్రనే మూలంగా గ్రహించి Hutchinson మహాశయుడు Wheel of Fortune అన్న మకుటంతో ఇంగ్లీషులోకి అనువదించేరుట. London Times సమీక్షలో కథ అతి సాధారణమే అయినా ఆనాటి హైందవకుటుంబం జీవనవిధానం, మతపరమైన సంప్రదాయాలు, వివాహం విషయంలో స్త్రీలకు స్వయంనిర్ణయాధికారాలు లోపంవంటి విషయాలు ఎంతో వివరంగా ఆవిష్కరించేరు రచయిత అని.

1836లోనే సరస్వతీబాయి అన్న రచయిత్రి వంటలపుస్తకం రాసేరనీ, దానిని కావలి వెంకటరామస్వామి అన్న పేరుగలవారు ఇంగ్లీషులోకి అనువదించేరనీ తెలుసుకోడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. న

ఆధునికయుగం సాహిత్యంలో అన్ని ప్రక్రియలు – నాటకం, కవిత్వం, బాలసాహిత్యం, ప్రత్యేకంగా చెప్పుకోవలసిన స్త్రీలరచనలు,  వైజ్ఞానికసాహిత్యం, హరికథలు– ఇలా ప్రతి ప్రక్రియలోని విశేషాలు ప్రస్తావించారు.

నాాకు మరో సందోహం కూడా.  ఆంగ్లేయులు తెలుగుబాషకి చేసినంత సేవ మరే ఇతర భారతీయభాషలలో కూడా చేసారా  అని.

తెలుగు సాహిత్యచరిత్ర స్థూలంగా తెలుసుకోదలచినవారికి తప్పక ఉపయోగపడగలదు. రచయిత గిడుగు సీతాపతిగారికి కృతజ్ఞతలు.

ఈపుస్తకం archive.orgలో ఉచితంగా లభ్యం.

000

(జనవరి 6, 2018)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.