మీకు వివక్ష కనిపిస్తోందా?

ఏ విషయమైనా చక్కగా తెలుసుకోవాలంటే మన పరిశీలనాదృష్టి సమగ్రం సమతుల్యం కావాలి. రెండు కథలు చెప్తాను.విస్కాన్సిన్‌లో ఉన్నరోజుల్లో చలికాలంలో నామోకాలెత్తు, ఒకొకప్పుడు నడుంవరకూ కూడా కురిసిన మంచు ఎత్తిపోసుకోడం పొద్దున్న లేస్తూనే చేసుకోవలసిన మొదటి పని. గరాజిముందు కురిసినమంచు తొలగించుకోకపోతే కారు బయటికి రాదు. నేను కాఫీ సేవించి, దట్టంగా చలికోటూ బూటూ ధరించి ఆ పనికి పూనుకునేదాన్ని అమెరికన్ ‌పారతో.

నాలుగు రోజులయేక, అలా లేచి, ముస్తాబయి పార పుచ్చుకు బయటికి వచ్చేసరికి గరేజిముందు దారి శుభ్రంగా అప్పుడే ఉతికి ఆరేసుకున్న నీర్కావిపంచెలా ఉంది. అట్టే ఆలోచించకుండానే అర్థమయిపోయింది మాపొరుగున ఉన్నాయన తన snowblowerతో వాళ్ల ఇంటిముందూ మాయింటిముందూ కూడా తుడిచేసేరు. ఆ తరవాత కూడా చాలాసార్లు చేసేరాయన అలా. ఎందుకండీ, వద్దు అని నేనన్నా వినిపించుకోలేదు. వారికి నావల్ల కలిగే లాభమేమీ లేదు. నేను వారికి చేయగలసాయం ఏమీ లేదు. మరెందుకు చేసేరంటే మంచితనం, అంతే. క్రిస్టియన్ విలువలు మనస్ఫూర్తిగా నమ్మినవారు.

మరోరోజు ఎక్కడో కూడా జ్ఞాపకం లేదు కానీ ఏదో కుర్చీలో కూర్చుని ఉన్నాను. నాపక్కన మరో కుర్చీలో మరొకావిడ కూర్చుని నన్ను కదిపింది,, “చదువుకోడానికి వచ్చేవా?”

“లేదు ఉద్యోగం చేస్తున్నాను.”

“కాబ్ లో వచ్చేవు కాబోలు.”

“లేదు. సొంత కారు.”

“పాతకారు కొన్నావా?”

“కొత్త కారే.”

మీరు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజంగానే జరిగింది. గమనించే ఉంటారు మీరు కూడా – ప్రతి ప్రశ్నలోనూ ఒక మెట్టు కిందకి తగ్గించి అడగడం.

నేను వివక్షగురించే మాటాడదలుచుకుంటే, రెండో కథలాటివి ముప్ఫై చెప్పగలను. చెప్తాను కూడా. నేను కల్పించఖ్ఖర్లేదు. ప్రతి ఒక్క కథా వాస్తవమే. మీకు కూడా ఇలాటివి కోకొల్లలు అనుభవమయే ఉంటాయి.

అలా కాక లోకంలో మంచితనంగురించి మాటాడాలనుకుంటే మొదటికథ చెప్తాను. మళ్ళీ వెనకటికథలాగే నేనేమీ కల్పించఖ్ఖర్లేదు. నిజంగా నాకు అనుభవమయినవే చెప్పగలను. చెప్తాను. నాకు తెలిసవవాళ్ళకథలూ, విన్నకథలూ కూడా కలుపుకుంటే అంతకు పదింతలవుతాయి. మీరు కూడా ఇలాటివి చెప్పగలరు.

అసలు నిజం ఎక్కడుంది అంటే ఈ రెండు కథలూ కావాలి. ఇలాటివి వేనవేలు కావాలి. ఒక్క ఉదాహరణ చాలదు ఏవిషయంలో కానీ నిర్ధారణగా ఇదే తిరుగులేనిసత్యం అని చెప్పడానికి.

మొదటికథ అమెరికనులకథ. మరో కథ మనవాళ్లకథ వివక్ష ఉందో లేదో స్పష్టంగా చెప్పలేని మరో కథ చెప్తాను. మాయింటికి దగ్గర్లోనే బెంగాలీలు నడుపుతున్న దేశవాళీ కూరగాయలదుకాణం ఉంది. కూరగాయలు కాదు అది నిజానికి మీట్ మార్కెట్. లేత బేబీ మేకమాంసం వాళ్ళ ప్రత్యేకం అనుకుంటాను. అప్పటికప్పుడు ముక్కలు తరిగి అమ్ముతుంటాడు. వాళ్ళ ఆదాయం అంతా ఆ మేకమాంసంవల్లే. మనకూరలు చిన్నవంకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు అప్పుడప్పుడు తెస్తారు. వాటికోసం నేను వెళ్తాను.

నేను కొనేది 5.6 డాలర్లే. మహా అయితే పది. అయినా నన్ను 5 నక్షత్రాల కస్టమరంటారు. ఏదైనా కొన్నప్పుడు 5, 10 సెంట్లు తక్కువయితే, ఫరవాలేదు అని “తగ్గింపు” ధరకి ఇచ్చేస్తారు. అది వ్యాపారలక్షణం కదా ప్ర్తత్యేకంగా ఎందుకు చెప్పడం అంటే, అమెరికాలో ఇది సర్వసాధారణం కాదు. తమ వ్యాపారం అభివృద్ధి కావాలంటే కొనుగోలుదారులని మర్యాదగా చూడాలని చెప్తారు కానీ అందులో చిన్న చిన్న లుకలుకలున్నాయి. ఆ మర్యాదలన్నీ కులాసాయేనా,  నీకు ఏమి సాయం కావాలి, నీఓపికకి ధన్యవాదాలులాటి కబుర్లకే.

మన దేశీ దుకాణాల్లో కూడా ఒకొకప్పుడు మర్యాదగా ఉంటారు. ఒకొకప్పుడు నీలెక్కంత అన్నట్టుంటారు. అలాటిదుకాణాలు ముప్ఫై ఉండవు, ఏ షికాగోలోనో న్యూయార్కులోనో తప్ప. అంచేత సాధారణంగా మనం అక్కడికే వెళ్తాం అని వాళ్లకి తెలుసు. మాయింటిదగ్గర దుకాణంలో ఇప్పుడు ఉన్న యజమానులు అలా కాదు. ముందటి యజమాని నాకు మహ చిరాకు కలిగించేవాడు. అది మరోటపాలో రాసేను (ఆ టపా ఇక్కడ అర్థాంతరీకరణము ఇక్కడ).

అంతే కాదు. అమెరికనులు కూడా ఇలాటి చిన్న దుకాణాల్లో మర్యాదగా ఉండొచ్చు ముఖ్యంగా చిన్న ఊళ్ళలో అయితే. (mom and pop store అంటారు.). అదే ఏ Chain or department store అయితే, మేనేజరు మనవాడే అయినా, “నాలుగు పెన్నీలు తక్కువైతే ఫరవాలేదు, తీసుకో, తరవాత ఇవ్వొచ్చు,” అనడు. అలా అంటే చిక్కుల్లో పడతాడు. తమవాడని షాపు దోచేస్తున్నాడని వాడినెత్తిమీది దేవత సూపర్వైజరు గొడవ పెట్టొచ్చు. కాస్త గోరోజనం గలవాడైతే, ఉద్యోగానికి ఎసరు కూడా కావచ్చు. ఇలాటివన్నీ తట్టుకోవాలి ఆ మేనేజరు కనక, నామొహం చూసి, ఏం అనలేక, “ఆ వస్తువులు ఇక్కడ పెట్టి, వెళ్ళి డబ్బు తీసుకురా. నీసామాను ఇక్కడే ఉంచుతాను” అనొచ్చు. ఇది కూడా సర్వసాధారణం కాదు.

దుకాణదారులవరస అలా ఉంటుంది. మరి “మన” అంటే కష్టమర్లమాట ఏమిటి? నిక్కచ్చిగా చెప్పాలంటే మనం మనం అంటూ మన నెత్తిన చేయి పెట్టడానికి చూసేవాళ్ళు కూడా మనవాళ్ళలో ఏమీ తక్కువ కాదు. ఇక్కడ వివరాలు చెప్పను కానీ కొన్ని పరిస్థితులలో నేను అల్లాటివాళ్ళపాల బడి, చిప్ప చేతికొచ్చినంత పనై ఊళ్ళో ఉన్న ఇండియనులందరిస్నేహాలకీ స్వస్తి చెప్పేశాను. ఆ తరవాత ఎంతో హాయిగా ఉన్నాను. ప్రస్తుతం జాలస్నేహాలే కానీ వ్యక్తిగతస్థాయిలో స్నేహాలు చెయ్యను.

అలాగే ఏదో ఒకరంగంలో మహోన్నతస్థాయిలో సమాజసేవ చేసే చాలామంది ఇళ్ళలో మనుషుల్ని మాత్రం మనుషుల్లా కాక తమ కార్యకలాపాలకి ఉపకరణాలలా వాడుకోడం చూస్తూనే ఉన్నాం కదా. అందుకే అంటున్నాను ఏ ఒక్కసంఘటనతోనో ఒక నిర్దుష్టమైన అభిప్రాయానికి రాలేం ఎవరివిషయంలో కూడా.

స్థూలంగా చూస్తే ఈ వివక్షలకి – వేరు పెట్టడానికి – కారణాలు ఒకటి ఆర్థికలాభం. రెండోది తమ ఆధిక్యత ప్రకటించుకోడం,

కాన్డబ్బు పోయేచోట లేని వివక్ష వేయి రూపాయలు పోయేచోట కొచ్చొచ్చినట్టు కనిపిస్తుంది. సాంఘికంగానో ఆర్థికంగానో కావలిసిన లాభం. ఇంగ్లీషులో high stakes అంటారు. ఒకరు రెండోవారిమీద ఆధిక్యత నిరూపించుకోడానికి పడే తాపత్రం. అంరాంతరాల గల న్యూనతాభావం కూడా కావచ్చు.

ఇవేవీ లేనిచోట వివక్ష చూపించరు. అలాటి సందర్బాలలో కొందరు చూపే ఔదార్యం మనని అవాక్ చేస్తుంది. అనంత ఆశ్చర్యాంబుధిలో ముంచేస్తుంది. “ఏదో మనసులో కుళ్ళు ఉండే ఉంటుంది,” అన్న అనుమానం కూడా వస్తుంది ఒకొకప్పుడు.

ఈవ్యాసం మొదలు పెట్టినప్పుడు అనుకోలేదు కానీ సాహితరంగంలో ఈనాడు విస్తృతంగా చెలరేగిపోతున్న వివక్షలగురించి కూడా చెప్పాలనిపిస్తోంది ఇప్పుడు నాకు. నేను కూడా అంతో ఇంతో సాహిత్యరంగంలో చెలగినమనిషిని కనక, కనీసం నేనలా అనుకుంటున్నాను కనక, వివక్షకి సంబంధించిన నాఅనుభవాలు చెప్తాను, బహుశా నాకు మళ్ళీ చెప్పుకునే అవకాశం రాకపోవచ్చు. అంచేత మరీ వివరంగా కాకపోయినా సుమారుగా ఈవ్యాసంలో ఇముడగలవిషయాలు చెప్తాను. అనవసరం అనుకున్నవారు చివరి పేరాకి గెంతు వేయండి.

ఈనాడు ప్రముఖంగా 20వ శతాబ్దపుకథలు, రచయితలు అంటూ స్థూలంగా పేరు పెట్టుకు ప్రచురించిన సాహిత్యసంకలనాలు తెలుగుకథ, నూరేళ్లపంట, 20వ శతాబ్దపు తెలుగు రచయిత్రులు, వందేళ్లకథకు వందనాలు లాటివి. ఇంకా మధురాంతకం నరేంద్ర, పాపినేని శవశంకర్, వాసిరెడ్డి నవీన్ వంటివారు ప్రచురించే సంకలనాలు–వీటిలో ఎక్కడా నాకథలు కనిపించవు. ఈ సంకలనకర్తలందరికీ నన్ను తెలుసు దశాబ్దాలుగా. అంటే నేను రాయడం మొదలుపెట్టినప్పపట్నించీను. ఎదురు పడ్డప్పుడూ, ఉత్తరాలలో నన్ను సంప్రదించినప్పుడూ నేనెంత గొప్పదాన్నో, నేనెంత సాహిత్యసేవ చేస్తున్నానో నాకే చెప్తారు ఎంతో ఉత్సాహంగా.  నాకథ ఎందుకు వేసుకోలేదంటే తాము పెట్టుకున్న నియమితుల పరిధిలో లేవంటారేమో. కావచ్చు. ఇది ఒక్క నావిషయంలోనే కాదు. ఇంకా కొంతమంది రచయితలను కూడా ఈనాడు వస్తున్న సంకలనాలలో వదిలివేయడం జరుగుతోంది. అలాటప్పుడు ఆసంకలనాలు 20వ దశాబ్దపు కథలకు సమగ్రమైన రూపం అని ఎలా అనగలం? మరో యాభై ఏళ్లతరవాత ఈ కథలు మాత్రమే చదవితే, ఆ పాఠకులకి 20వ శతాబ్దం సమాజంగురించి ఎటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది, అది మీకు సమ్మతమేనా?

కొంతకాలం క్రితం గుంటూరు రచయితలసంఘం విస్మృతకథ అని ఒక చిన్న సంకలనం వేసేరు. అలాగే ఏ సాహితీ హేమాహేమీలో పూనుకుని left out రచయితలు (విసర్జితరచయితలు లేక సంతబెట్టిన రచయితలు) అని ఒక సంకలనం వేస్తే బాగుంటుందేమో. ఆలోచిస్తుంటే “సంత బెట్టిన రచయితలు” పేరు బాగుంటుందనిపిస్తోంది. :p

మరో రెండు సంకలనాలలో –స్త్రీవాదకథలు, తెలుగుకథకి జేజేలు—నా కథలు వేసుకున్నారు. కానీ ఈ ఘనాపాఠీ సాహిత్యవేత్తలు నాతో సంప్రదించకుండా వేసేసుకున్నారు.  నాకథని స్త్రీవాదకథ అని ఎవరైనా అనుకుంటే, నేను ఆపలేను. కానీ ఆపేరుతో సంకలనం వేస్తూ నన్ను అడక్కుండా వేసుకోడం మాత్రం తప్పే. వాసిరెడ్డి నవీన్ తానే వేసుకోమని సలహా ఇచ్చేనని చెప్పేరు ఆతరవాత నేను ఆయనని కలిసినప్పుడు. మీకు ఆ అధికారం ఎవరిచ్చేరని అడగలేకపోయేను, ఆహో ధన్యోస్మి అని కూడా అనలేదు.

ఈ సంఘటనలకి ప్రతిగా, మరో రెండు సంఘటనలు జరిగేయి. ఆంధ్రాయూనివర్సిటీలో ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారి పర్యవేక్షణలో బోనాల సుబ్బలక్ష్మి నాకథలు పది కథలు పరిశోధానంశంగా తీసుకుని యం.ఫిల్ పట్టా పొందేరు 2003లో.

రెండేళ్ళక్రితం డా. దార్ల వెంకటేశ్వరరావుగారు నాకథ రంగుతోలు తమ కోర్సులో పాఠ్యభాగంగా తీసుకున్నారు. ఆసందర్భంలోనే నారచనలమీద ఇంతవరకూ ఎవరూ పి.హెచ్.డి పట్టాకి పరిశోధన జరపలేదని తెలిసి ఆశ్చర్యం వెలిబుచ్చారు. ప్రస్తుతం ఒక విద్యార్థిని డా. దార్ల వెంకటేశ్వరరావుగారి పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నారు. ఇవి నేను ఆనందించవలసిన విశేషాలు.

నాకు తృప్తినిచ్చిన మరొక   విషయం తెలుగు వికిపీడియాలో నాగురించి సమాచారం చేర్చడం. ముఖపరిచయాలమూలంగానో ఆదానప్రదాన సంప్రదాయంలోనో జరిగినది కాదు. తగును అనుకున్నవారు చేర్చిన సమాచారం  అది.

ఇప్పుడు మళ్ళీ మొదటికొస్తాను. వివక్ష ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు అని నిర్ధారణగా చెప్పలేం. ఏ మణిపూసకైనా అనేక పలకలు ఉన్నట్టే, ఏ చిన్న సన్నివేశం తీసుకున్నా అనేక రకాలుగా వాదించవచ్చు. అది మంచా చెడా అని ముక్కా చెక్కా చేసి తీర్పులిచ్చేయలేం. కొందరు నాకు సాయం చేయడానికి పూనుకున్నప్పుడు ఏదో కుట్ర అనిపిస్తుంది నాక్కూడా. కాదనను. మరొకప్పుడు పాపం వారిమంచితనంవల్లే, కేవలం సదుద్దేశంతోనే సాయం చేస్తున్నారని కూడా అనిపిస్తుంది. స్వతహాగా నాది తీవ్రవాదనలకి దిగే మనస్తత్వం కాకపోవడంచేత మంచితనంవేపే మొగ్గుతాను. ఒకొకప్పుడు వివక్ష ఆలస్యంగా గుర్తిస్తాను. మందబుద్ధి కావడంచేతేమో మరి. ఈ వివక్షలు అసలు ఎలా గుర్తిస్తాం అంటే ఖచ్చితంగా సూచించడానికి రూల్సేమీ లేవనే నాకనిపిస్తుంది. సాంఘికశాస్త్రవేత్తలు చెప్పగలరేమో కానీ నామటుకు నేను మాత్రం దినదినం అనుక్షణం ఎవరికి వారే సందర్భాన్నిబట్టి తెలుసుకుంటారు, చాలావరకు అచేతనావస్థలోనే అని అనుకుంటాను.

“నాకలా అనిపించింది ఆక్షణంలో”. అంతే. అదే నాసిద్ధాంతం, నాకు ప్రమాణం కూడా.

000

(జనవరి 21, 2018)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.