ఇది నా అరణ్యం

పూర్వం  మునులు అరణ్యాలకు వెళ్లిపోయేవారు

నిత్యజీవితంలోని ఝంఝాటాలు తెంచుకు

అంతరాయాలు లేకుండా ధ్యాననిమగ్నులు కావడానికి.

ఇంట్లోనే ఉండి చేయడం సాధ్యం కాదు కనకనే

అరణ్యాలు ఆశ్రయించేరప్పుడు.

000

శ్రేయోభిలాషులూ సుహృన్మిత్రులూ చుట్టాలూ పక్కాలూ చేసే

రణగొణధ్వనులతో ధ్యానానికి అవాంతరం కలిగిస్తారని కాదు

వారు గతంలో చేసిన పాపకార్యాలు ప్రస్తావించి

మరింత తలనొప్పి కలిగిస్తారు.

మరుద్దామన్నా మరిచిపోనివ్వరు.

పాపం, ఆ మానుడు ఎంత చెవులూ కళ్ళూ మూసుకుని

ధ్యానముద్ర పట్టినా,

పనిగట్టుకు కెలికి కెలికి గతం గుర్తుకి తెస్తారు

సానుభూతితోనే.

000

ఇది నా అరణ్యం

నాకు నేను సృష్టించుకున్న అదృశ్యహవేలీ

ఆదానప్రదాల కార్యక్రమం ఇక్కడ పని చేయదు.

ఇక్కడ పూవులు రారమ్మని భ్రమరాలను పిలువవు

నన్ను కొరుక్కుతినమంటూ జాంపండు చిలుకను ఆహ్వానించదు.

నాకిష్టమైనది ఆస్వాదించడం నా ఆదర్శం

ఇష్టమైనవి గైకొనమని నీకు నా సలహా.

000

నాకు ఎవరిమాటలూ వినిపించవు

ఎవరు ప్రదర్శించే చిత్రాలూ నాకు కనిపించవు.

కాదూ కూడదని మారాంచేస్తే

delete, ignore, block, unfollow, unfriend

నాకు యఫ్బీ ప్రసాదించిన వరాలు.

బాగున్నావా? అని వారు అడిగితే

ఎవరండీ మీరు అని నాకు వినిపిస్తుంది.

ఇదీ నీబతుకు అంటూ వారు ఆవిష్కరించి చిత్రరాజం

నాకు శూన్యంగా కనిపిస్తుంది వినీలాకాశంంలా.

అంచేత అట్టే శ్రమ పడకు

నేను క్షేమం. నువ్వు క్షేమమనుకుంటానంటూ

శలవు తీసుకుంటాను ఎప్పటికప్పుడు.

000

(జనవరి 25, 2018)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.