శ్రీమదాంధ్ర బోజచరిత్రము.

గ్రంథకర్త చిలకపాటి వేంకట రామానుజశర్మగారు. 1911.

చిలకపాటి వేంకటరామానుజశర్మగారు  తెలుగులో రచించిన ఈ గ్రంధానికి ప్రసిద్ధ సంస్కత గ్రంథం భోజరాజు చరిత్ర మూలం. రామానుజశర్మగారు తొలిభాగంలో భోజరాజు చరిత్ర నాటకరూపంలోనూ, తరవాత విద్వత్కవిగానూ, విద్వత్కవిపోషకునిగానూ భోజభూపాలుని ఔదార్యాదులు ఆవిష్కరించేరు.

భోజరాజుకథ – వృద్ధుడయిన సింధులరాజు భోజుడికి యుక్తవయసు వచ్చేవరకూ రాజ్యభారం వహించమని తమ్ముడు ముంజుడికి ఒప్పచెప్పడం, ముంజుడు రాజ్యకాంక్షతో భోజుని చంపప్రయత్నించడం, ఆపనికి నియక్తుడైన వత్సరాజు భోజుని చంపకవదిలివేయడం, ఆ తరవాత అనేక రసవత్తరమైన ఘట్టాలతో భోజుడు రాజుగా పట్టాభిషిక్తుడు కావడం చిత్రించబడింది. గ్రంథకర్త ఉపోద్ఘాతంలో ప్రస్తావించినట్టు శాంతం, సంభ్రమం, భీభత్సం, కరుణ, వీర, శృంగారంవంటి అనేక రసాలు పోషించి నాటకాన్ని రక్తి కట్టించింది.

ఇందులో నాకు నచ్చిన ఒక అంశం నాటకలక్షణాలయిన నాందీ, ప్రస్తావన, విష్కంభం వంటి పదాలు ఉపయోగించి, వాటికి వివరణ ఇవ్వడం. అలాగే నాటకంలో కొన్ని పద్యాలకి సంస్కృతమూలం, అర్థాలు, వివరణ కూడా ఇచ్చేరు. అంచేత ఇది పాఠ్యగ్రంథంవలె ఉపయోగపడగలదు.

రెండవభాగంలో (పు. 85-158) భోజరాజు ఆస్థానంలో దండి, కాళిదాసు, మాఘుడు, భవభూతి, భట్ట బాణ వంటి మహాకవులు,  తదితర కవులు చెప్పిన పద్యాలు, వారిని భోజరాజు ఔదార్యంతో ఘనంగా సత్కరించడం ప్రతిభావంతంగా చిత్రించేరు. సందర్భానుసారం కొన్ని ఉపకథలున్నాయి. ఎక్కువగా వేరు వేరు కవులు అల్లిన పద్యాలు, భోజరాజు మెచ్చి లక్షలు, పదిలక్షలు, అక్షరలక్షలతో  సత్కరించడమే. భోజరాజు స్త్రీలపాండిత్యాన్ని అదే స్థాయిలో గౌరవించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈనాటి పరిస్థితులదృష్ట్యా. కవిత్వంలో ఆసక్తి గలవారికి ఈభాగం మరింత ఆనందదాయకం.  పూర్వభాగంలో లాగే ఇక్కడ కూడా అవుసరం అనుకున్నచోట సంస్కృతశ్లోకాలు చేర్చి అర్థాలు కూడా వివరించడం మరొక విశేషం ఈ పుస్తకంలో. మహాకవుల ప్రతిభాపాటవాలు విపులీకరించే అనేక అంశాలు – శ్లేష, కవి ప్రాగల్భ్యము, చమత్కృతులువంటి విశేషాలు – వివరంచడంవల్ల ఈపుస్తకం మరింత విలువైనది.

ఈ భాగంలో కొన్ని ఉపకథలున్నాయి. వాటిలో ఒకటి భోజరాజు చేతికెముక లేనంతగా కవులకు లక్షలు లక్షలు ఔదార్యంతో దానం చేస్తుంటే మిగతా రాచకార్యాలు నిర్వర్తించడం ఎలా సాధ్యం? ఆవిషయం మంత్రి బుద్ధిసాగరుడు సూటిగా చెప్పలేక, రాజుగారి పడకగదిలో గోడమీద ఒక పద్యపాదం రాస్తాడు. రాజు అది చూసి, మంత్రిఆంతర్యం గ్రహించి, సమాధానంగా రెండోపాదం రాస్తాడు. మంత్రి మళ్ళీ మూడో పాదం, రాజు నాలుగోపాదం రాసి పద్యం పూర్తి చేస్తారు. ఇందులో సందేశం నాకు పరిశీలించి చూడదగ్గదిగా తోచింది.

సాధారణంగా మనం పూర్వకవుల రచన విశ్లేషిస్తున్నప్పుడు ఆకాలపుభావాలు, సంప్రదాయాలు గమనించాలి కానీ ఈనాటి భావజాలంతో విమర్శించకూడదు అఁటారు. నేను కూడా అది గౌరవిస్తాను. అలా ఆలోచించినప్పుడు, భోజుడు ఎంతో ఘనంగా సాహిత్యపోషణ నిర్వహించేడు, వితరణశీలుడు అనే మనం గ్రహించాలి. కానీ, మంత్రి బుద్ధిసాగరుడు కూడా ఆవిషయం ప్రస్తావించడంచేత నాకు సందేహం కలిగింది. కేవలం కవులే కాక మిగతా ప్రజల సంక్షేమం కూడా గమనించవలసినధర్మం రాజుకు ఉంది. ఉపోద్ఘాతంలో రచయిత భోజుని కవిపోషణ మాత్రమే ప్రస్తావిస్తున్నారని మనం సమాధానపడవచ్చు.

నేను వెనకటి పుస్తకాలు పరిశీలిస్తున్నప్పుడు ఈనాటి జీవనవిదానానికి అన్వయించుకుని మనం నేర్చుకోవలసింది ఏమైనా ఉందా అని చూస్తాను. ఆ దృష్టితో ఆలోచిస్తే, ఈనాడు కొందరు సంఘసంస్కర్తలు సమాజసేవకి ఆస్తులు ధారాదత్తం చేసి, కుటుంబానికి చిప్ప చేతికిచ్చినవాళ్లు ఉన్నారు. సాహిత్యసేవ, సంఘసేవ, అన్నిటిలో కుటుంబం కూడా భాగమే అని గమనించకపోవడం విచారకరం. ఇది అనాడూ ఉంది ఆనాడు ఉందేమో అనిపించింది క్షణకాలం.

కాళిదాసు వేశ్యాలోలుడని తెలిసి భోజరాజు కినుక వహించడం, రాణి ఆయనకి నచ్చచెప్పి, మళ్ళీ రాజీకి అంగీకరింపజేయడం కథ, కాళిదాసు భవభూతి తారతమ్యపరీక్ష కథలు బాగున్నాయి.

నన్ను ఆకట్టుకున్న మరోకథ – భోజరాజుసభకి వచ్చిన క్రీడాచంద్రుడు అన్న కవిని పేరు అడిగితే, పొడుపుకథలాంటి పద్యం చెప్పడం. గ్రంథకర్త ఇచ్చిన వివరణ చాలా బాగుంది.

1911లో ప్రచురించిన ఈ చిన్న పుస్తకం, 159 పుటలు, కవులని అలరిస్తుంది. కవులు కానివారికి నూతన అంశాలను విశదీకరిస్తుంది. జీరాక్స్ దోషాలమూలంగా మొదటి 20 పుటలలో 5,6 చోట్ల సిరామరకలవల్ల కొన్ని పదాలు అలుక్కుపోయి, చదవడం కుదరదు కానీ వాటిని దాటుకు పోగలవారిని ఆకట్టుకోగల గ్రంథమిది.

000

శ్రీమదాంద్ర భోజచరిత్రము. చిలకపాటి వేంకట రామానుజశర్మ. Bhoja charitram

Archive.org సౌజన్యముతో.

(జనవరి 6, 2018)