ధనం కంటే బలవత్తరం అహం

ఇండియాలో స్త్రీలదుస్థితిగురించి కుప్పలుతిప్పలుగా ఉన్నాయి కథలు. మనదేశంలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం, సరే. విదేశాల్లో కూడా ఇదే అభిప్రాయం చాలా బలంగా ఉంది. అదే అభిప్రాయాన్ని బలపరుస్తూ మనవాళ్ళు అవే కథలు చెప్తారు, అదేదో మనకి మాత్రమే ప్రత్యేకం అయినట్టు. ఇది నిజం కాదు అని అనడం లేదు నేను. చెప్పకూడదని కూడా అనడం లేదు. .కానీ ఏ దేశంలో మనుషులగురించైనా సమగ్రమైన అవగాహన కావాలనుకుంటే భిన్నకోణాలు చూడాలి. అమెరికాలో దరిద్రులగురించి, రోడ్డువార బతుకులగురించి, స్త్రీల దుస్థితిగురించి వార్తల్లో అట్టే కనిపించవు. మనవాళ్లు అది చూసైనా నేర్చుకోరు. కేవలం మనదారిద్ర్యం, స్త్రీల హీనస్థితి మాత్రమే చిత్రిస్తారు. ఎందుకంటే అవే అమెరికాలో అమ్ముడవుతాయి. వాటికే పురస్కారాలు వస్తాయి.

మరొకరికి మనసంస్కృతిగురించి మనం చెప్పినప్పుడు కనీసం మంచీ చెడూ రెండు కోణాలూ చూపాలి కదా. నేను అనువాదాలు చేసినప్పుడు కొన్ని వ్యథలకథలు చేసేను కానీ అన్నీ అవే చేయడానికి ఒప్పుకోలేదు. ప్రతిమనిషిలోనూ బలాలూ, బలహీనతలూ కూడా ఉంటాయి. అలాగే సామూహికంగా ప్రతి జాతిలోనూ బలవంతులూ, బలహీనులూ ఉంటారు. మొత్తం  సంస్కృతి పరిచయం చేయాలంటే అన్ని కోణాలు చూపడం అవుసరం.

గత 5,6 నెలలుగా అమెరికాలో మిలియనీర్లూ బిలియనీర్లూ అయి, సమాజికంగా ప్రముఖపదవులలో ఉన్నవారి ఇళ్ళలో ఆడవాళ్ళని ఎంతగా క్రూరంగా హింసించడం జరుగుతోందో వార్తల్లో చూస్తున్నాను. సమాజంలో గొప్పహోదాల్లో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఎనలేని బలంగలవారు ఇంట్లో వాళ్ళమీద తమ భుజబలం చూపించడం చూస్తే వారే వీరా అని ఆశ్చర్యపోతాం. నీటుగా మూడు పీసులసూటులో నున్నగా దువ్వుకున్న క్రాపులతో మొహాన చిరునవ్వుతో ఎంతో మర్యాదస్తులలా కనిపిస్తారు. ఇంట్లో భార్యని ఈడ్చి ఈడ్చి తంతుంటారు. అఁతే కాదు. అలా హింసకు గురైన స్త్రీలని హేళన చేసేవాళ్ళని కూడా చూస్తున్నాను.

అలా హింసకు గురైన స్త్రీలని చాలామంది అడిగే ప్రశ్న, “ఎందుకున్నావూ ఆ ఇంట్లో, ఎందుకు అతన్ని వదిలిపోలేదూ?” … ఇంకేదో ఎందుకు చెయ్యలేదూ అంటూ అదేదో ఆ స్త్రీలదే తప్పు అన్నట్టు కబుర్లు చెప్పేవాళ్లని కూడా చూస్తున్నాను. దీనిమీద మరో పేజీలు రాయొచ్చు కానీ ఇది చాలు కదా ఒకరు మరొకరిని హించించడం ఏదో ఒకదేశపు ప్రత్యేకలక్షణం కాదని.

నేనేమీ పరిష్కారాలు సూచించడంలేదు. సూచించగల పాండిత్యం నాకు లేదు. కానీ నామనసులు మెదులుతున్న ఆలోచనలు మాత్రం చెప్పకుండా ఉండలేను.

ఎందుకు అతన్ని వదిలేయలేదూ? అన్న ప్రశ్న అడగడం చాలా తేలిక. దీనికి సంద్రాలు మాటల్లో చెప్తాను. “పగలల్లా కస్టపడి, సీకటడ్డాక తాగొత్తాడు. తాగినప్డు ఒల్లు తెలవదు. నాలుగిచ్చుకుంతడు. మల్ల తెలివొచ్చినంక తప్పయిపోనాదంట ఏడస్తడు. ఆడు మంచోడేనమ్మా, సితకతంతడు గానీ మల్ల శాన పేంవ గూడ.” ఇది తెలుగుకథల్లో సర్వసాధారణంగా కనిపించే మాట. నిజానికి మధ్యతరగతి, పైతరగతి జనాల్లో కూడా ఇదే తర్కం.

నేను ఈమాటలు హాస్యానికి చెప్పడం లేదు. పట్టి చూస్తే, ఆమాటలవెనక ఉన్న నిజం వివరంచడం తేలిక కాదు. అసలు చెప్పలేం. ఎందుకంటే ఓ ఒక్క వ్యక్తి పరిస్థితి, మనస్తత్వం, వాస్తవాలు ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి. అనుభవమయి ఉంటాయి. అమ్మ, అక్క, చుట్టాలు, స్నేహితులు, సైకో తెరపిస్టులు- అందరూ కూడా తాము చూసిందో విన్నదో మాత్రమే గమనించి వ్యాఖ్యానాలు చేస్తారు. పుస్తకాలఉపయోగం కూడా ఈవిషయంలో పరిమితమే.

అందుకే ఎవరైనా నన్ను సలహా అడిగితే, నిర్మొహమాటంగా నాతరం కాదని చెప్తాను. నాకు తెలుసు. నాఅనుభవాలు, నాఅవగాహన, నాపరిస్థితులు ప్రాతిపదికగా నేనేం చేస్తానో ఏమి చేయగలనో నాకు తెలుసు కానీ అది ఇతరులకి పనికిరాదు. ఎందుకంటే వారి అనుభవాలు, అవగాహన, పరిస్థితులు, చిత్తస్థాయి వేరు కనక. ఎవరికి వారు నిర్ణయాలు చేసుకోవాలి గానీ మరొకరు చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అది అంతరాంతరాల ఎక్కడో తగినదే అని తోస్తేనే ఆ సలహా ఆచరణలో పెట్టడం జరుగుతుంది.

స్కూలు చదువులు సమాజంలో నెగ్గుకు రావడానికి, పేరు తెచ్చుకోడానికీ, ఐదంకెల ఆర్జనలకీ తగినట్టు తయారు ఇస్తాయి కానీ మనిషిని మనిషిగా చేసేవి కావు. ఈరోజుల్లో పిల్లలని సమాజంలో ఉన్నతస్థాయికి చేరేలా నానాయాతనలూ పడే తల్లిదండ్రులు మనిషిగా సాదారణ నీతులు–పొరుగువాడికి కాస్త చేయందించు, వాడు కూడా మనిషే, నీలాటివాడే వాడు కూడా–లాటివి మప్పడం లేదేమోనని నాకనిపిస్తోంది. కష్టపడి పకొచ్చినవారి కథలు చెప్తారు. నువ్వేం కావాలనుకుంటే అదే కాగలవు. నీఅంత తెలివైనవాడు లోకంలో లేడు అంటూ ప్రో్త్సహిస్తారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అమెరికాలే చూసేను. ఇండిాయలో కూడా ఇదే పద్ధతి సాగుతోంది ఇప్పుడు. సగటు తెలివితేటలు ఉంటే, అద్భుతం, అమోఘం, అంటూ ఆకాశానికెత్తేయడం. ఇదే ప్రమాదం. ఇదే కళ్ళు నెత్తికెక్కేలా చేస్తుంది. “నాఅంతటివాడు మరి లేదు,” అన్న ఆలోచనకి ఇక్కడే బీజం పడుతుంది. అదే మిగతావారిని తక్కువగా చూడడానికి దారి తీస్తుంది. వ్యక్తివిజయానికున్న విలువ వైయక్తికనీతికి లేకుండా పోతుంది. ఇప్పుడు ఇలా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదనే అనుకుంటున్నాను.

ప్రోత్సాహం పేరుతో అతి చేసి, మనిషిని డబ్బుతో కొలిచే యంత్రంగా తయారు చేయడం న్యాయం కాదు. కష్టపడి ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్నవాడు ఒకడుంటే, కష్ఠపడ్డా సామాన్యుడుగా మిగిలిపోయేవారు వందల్లో వేలల్లో ఉంటారు. ఇది వాస్తవం. పిల్లలకి ఈ వాస్తవం కూడా తెలియాలి. అప్పుడే అహంభావం తగ్గించుకుని, తనలా విజయం సాధించనివారిని, ఆర్థికంగా తనకంటే తక్కువ అయినవాడిని కూడా గౌరవించడం జరుగుతుంది.

అఁదుకే అంటున్నాను ఇది ఇంట్లోనే ప్రారంభం కావాలి. పిల్లలు చెప్తే వినరు. చూసి నేర్చుకుంటారు. అమ్మా నాన్నా ఎలా మాటాడుతున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళూ అదే మాటాడతారు, అదే చేస్తారు. సరేలెండి, ఇవన్నీ కాపీబుక్కు నీతులు. అఁదరికీ తెలిసినవే.

అంచేత, ఇంతటితో ఈ టపా సమాప్తం.

000

(మార్చి 20, 2018)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.