నా సంగీతప్రస్థానం

మొదట స్పష్టం చేయవలసింది ఇది సాహిత్యప్రస్థానంలా కాదు.  అంటే నేను సంగీతక్షేత్రంలో చేసిన కృషి అని కాదు. ప్రస్థానం అంటే ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ తేలేను అనే కదా. సంగీతం విని ఆనందించడంలో ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడవరకూ వచ్చేనని చెప్పుకోడానికి మాత్రమే. ఈమధ్య నేను నాకు నచ్చిన కృతులు ఫేస్బుక్కులో పోస్టు చేస్తున్నాను. అందుమూలంగా జరిగిన ప్రమాదం, నాదృష్టిలో ప్రమాదమే, ఏమిటంటే నాకేదో సంగీతంగురించి తెలుసనీ, కొన్ని కృతులనిబట్టి నాఅభిరుచులు ఇలా ఉంటాయనీ అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి మామిత్రవర్గంలో. తన్మూలంగా కలగగల అపోహలను తొలగించడానిక ప్రయత్నిస్తున్నాను ఈ పోస్టేుద్వారా.

అందరిళ్ళల్లోలాగే నేను హైస్కూలులో ఉన్నరోజుల్లో నేను సంగీతం నేర్చుకుంటే బాగుండునని అనుకోడంతో మొదలయింది. ఆరోజుల్లో నేను రేడియోకి అతుక్కుపోయి రేడియోలో ప్రసామవయే లలితసంగీతం వింటూ, వీలయినప్పుడల్లా పాడడానికి కూడా ప్రయత్నించడంతో దీనికి సంగీతం ఇష్టం కాబోలనుకోడం తొలి అపోహ. నాకు వినడం మాత్రమేఇష్టం. మాఅమ్మకి నేను నేర్చుకోడం కూడా ఇష్టం అయిపోయింది. సర్వసాధారణమైన వరుసలో –గాత్రం, వాయులీనం, వీణ– ఇలా ఆరేసి నెలలచొప్పున వేలు పెట్టి నావల్లకాదని నేనూ మాఅమ్మా తేల్చేసుకోడంతో ముగిసింది. ఆ తరవాత పాతకేళ్ళు వచ్చేవరకూ అప్పుడప్పుడూ సినిమాలు చూడడం, వాటిలో పాటలు రేడియోలో వినడం, కొన్నిపాటలమీద ఇష్టం ఏర్పరుచుకోడం జరిగింది. ఇప్పుడు చెప్తాను నాకు ఏ పాటలు ఎందుకు నచ్చేయో.

ఈ పోస్టుకోసం ఏ పాట ఏ సినిమాలోదో, ఎవరు రాసేరో చూస్తుంటే, నేను చాలా సనిమాలు చూడలేదని తెలిసింది. కథా, కవితా, పాటా ఏదైనా నాకు తెలుగు నుడికారం నాకు చాలా ముఖ్యం. తెలుగుపదం ధ్వనించినంత ఆహ్లాకరంగా నాకు మరే భాషా ధ్వనించదు. అది బలహీనత కావచ్చు. బలమే కావచ్చు.

సినిమాపాటల్లో కూడా మనసుని ఆకట్టుకునే పదసౌందర్యం నాకు చాలా ఇష్టం. నిజానికి ఇలా మాటల్లో చెప్పకపోయినా పాటలు ప్రజలలో ప్రాచుర్యం పొందడానికి అదే కదా కారణం. పులకించని మది పులకించు, లాహిరి లాహిరిలో ఓహో .. వంటి పాటలు ఆ రోజుల్లో బాగానే విని ఆనందించేను. మనసులోనే పాడుకున్నాను. .

బాలరాజుకథలో మహాబలిపురం మహాబలిపురం లాటి పాటలు మనం గర్వించదగ్గ విషయాలు పొందుపరిచేరు ఆరుద్ర. దేశభక్తిగీతాలు అన్నీ కాకపోయినా బాలరాజుకథలో ఆ కథానాయకుడు బాలుడు కావడం కావచ్చు నాకు చాలా నచ్చింది. అలాగే మల్లాది రామకృష్ణశాస్త్రిగారి సన్నజాజి తీవెలొయ్, సంపెంగపూవులోయ్. మల్లాదివారి సాహిత్యానికి భానుమతిగారి గాత్రం సంపూర్ణంగా సహకరించి, ఆపాటని ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రం అయిపోయింది. అలాటిదే పి. లీల పాడిన “తెల్లవారవచ్చె నాస్వామి లేరా,” అదసలు సినిమాపాటలా అనిపించదు నాకు. నేను చిరంజీవులు సినిమా చూడలేదు కూడాను. ఇది కూడా మల్లాది రామకృష్ణశాస్త్రిగారి రచనే అని నేను పరిశోధించి తెలుసుకోవలసివచ్చింది.

ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది – ఈ పాటలకోసం యూట్యూబులో వెతికేను.

అక్కడ వివరాలు ఇచ్చినప్పుడు నిర్మాత, దర్శకులతోపాటు సంగీతదర్శకుడికీ, గాయకుడికీ, కొన్నిచోట్ల నటీనటులకీ ఇచ్చినగౌరవం రచయితకి ఇవ్వకపోవడం. ఇది విచారకరమే కాదు అన్యాయం, అక్రమం. రచయిత అంత మనోహరంగా రాయకపోతే సంగీతదర్శకుడూ, గాయకులూ చేయగలిగిందేమీ లేదు. మీకు ఇదే అభిప్రాయం ఉంటే మీబ్లాగులలో, సైటులలో, పార్టీలలో మిత్రులతో చర్చించండి. నాపోస్టుకింద అవునండీ రచయితలపరిస్తితి అధ్వాన్నం అని నాకు చెప్పడం చాలదు. రచయితలకి తగు గౌరవం ఇవ్వడం నిర్మాతలధర్మం, కర్తవ్యం.

మీకు కూడా ఇదే అభిప్రాయం అయితే దయచేసి మీ బ్లాగులలో, సైటులలో, పార్టీలలో స్నేహితులతో కూడా చెప్పండి. రచయితపేరు కూడా చేర్చేలా చేయండి.

సన్నజాజితీవెలోయిపాట పువ్వులపాటా పిల్లలపాటా కనక బహుళజనాదరణ పొందింది.

ఆరోజుల్లోనే “నీవు లేక వీణ,”లాటి పాటలు కూడా ఇష్టంగానే విన్నాను. “మాయాబజారు” చూసేను. అందులో నాకు నచ్చినపాట అహ నాపెళ్ళంట.” సందర్బం, సావిత్రీ రంగారావు ఘటోత్కచుడి పాత్రపోషణ – భలే సరదా కలిగించిన పాట అది. లాహిరి లాహిరిలో కూడా అందమైన పాట. ఇందులో అద్భుతమైన పదచిత్రాలు నాకు చాలా ఇష్టం.

కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదానా లాటి పాటల్లో సమాజంమీద వ్యాఖ్యానాలున్నాయి కనక నచ్చేయి. అయితే అవి తాత్కాలికమే. అప్పటికింకా మాటలతో సమాజంలో మార్పు తెచ్చేయగలం అనుకునే అమాయకత్వం. ఇప్పుడు నాకు అదేమంత ప్రత్యేకంగా అనిపించదు. దాంతోనే ఆ సంగీతంమీద సరదా కూడా నీరుగారిపోయింది.

భానుమతిసంగీతం ఇష్టపడనివారు ఉండరనుకుంటాను. ఆవిడ ముక్కుతో పాడుతుందని ఒక అభిప్రాయం ఉంది కానీ నన్ను బాదించలేదు. భానుమతివిషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఆవిడ నటించిన ప్రతిసినిమాలోనూ ఒక శాస్త్రీయసంగీతం ఉంటుంది. ఆవిడ తన ఆత్మకథ (నాలో నేను) పుస్తకంలో కారణం వివరించేరు. తండ్రికి సంగీతం చాలా ఇష్టం. భానుమతి సినిమాల్లో చేరడం ఆయనకి అంతగా నచ్చలేదుట. ఆసందర్భంలో తాను నటించే ప్రతిచిత్రంలోనూ శాస్త్రీయసంగీతం పాడుతానని ఆయనకి మాట ఇచ్చేరుట. కారణం ఏదైనా ఆ పాటలు మాత్రం చాలా ప్రాచుర్యం పొందేయి. ప్రక్కలా నిలబడి, ఏ తావునరా నిలకడ నీకు, సావిరహే తవదీనా … ఇలా ఎన్నో గీతాలు నాకు బానుమతిమూలంగానే ఇష్టం అయేయి. ఆ తరవాతికాలంలో విద్వాంసులు కచేరీలలో ఇవి పాడుతున్నప్పుడు లీలగా బానుమతి నామనసులో ఏమూలో మెదులుతూనే ఉండేది.

ముఖ్యంగా అష్టపదులు సామాన్యప్రజలనోళ్ళ ఆడడంలో భానుమతివంతు బాగానే ఉందనే నేననుకుంటాను. “ఏతావులరా నిలకడ నీకు” అంటే అర్థమయినంత తేలిగ్గా “సావిరహే తవదీనా” అన్నది అర్థం కాదు కదా. ఆరోజుల్లోనే మాయింట్లో జయదేవుని అష్టపదులు పుస్తకం కూడా కనిపించడంతో నాకు అర్థాలు చూసుకోడం కూడా గొప్ప కాలక్షేపం అయింది. దాంతో మరిన్ని వినాలన్న సరదా.

అలా సినిమాలని అలుసు చూసేవారు కూడా ఈ సంగీతానికి బాగానే స్పందించేరు.

నాసంగీతప్రస్థానంలో చెప్పుకోదగ్గ రెండో స్థాయి తిరపతిలో జరిగింది. దేవస్థానంవారు హేమాహేమీలయిన గాయకులచేత కచేరీలు పెట్టించేవారు ఉచితంగా. నిజంగా అదొక గొప్ప అనుభవం. ఆరుబయట ఇసకలో కూర్చుని (అనే గుర్తు) ఆ సంగీతం వినే అధృష్టం నాకు కలగడానికి ఒక కారణం స్నేహితులు కూడాను. నాకు ఆ ఆలాపనలూ, సంగతులూ అర్థం కావంటే, కాదులే రారమ్మని వాళ్ళు లాక్కెళ్ళడంతో నేనూ వెళ్ళేదాన్ని.

ఆ అనుభవాలే “రససిద్ధి”కథ రాయడానికి దోహదమయేయి. ఆ కథలోరాజారావులాగే నాకూ కచేరీలు మొదట్లో అయోమయంగానే ఉండేవి. చిన్నకథ కనక రాజారావుకి శాస్త్రీయసంగీతంమీద సదభిప్రాయం ఒక్క కచేరీతోనే వచ్చినట్టు రాసేను. నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది అది ఏమూలో తగిలి, ఈసంగీతం బాగానే ఉందే అనిపించడం సుమారుగా నాలుగైదేళ్లు పట్టిందనుకుంటాను. ఇది 60వ దశకంలో. మళ్ళీ 80వదశకంలో అమెరికాలో ఒక అబ్బాయి పరిచయం కావడం మరింత దోహదం చేసింది. కంప్యూటరు సైన్సు చదవడానికి వచ్చిన తెలుగు అబ్బాయి కామేశం ఏదో పార్టీలో పరిచయం అయేడు.

శాస్త్రీయసంగీతం తానుగా నేర్చుకోలేదు కానీ “నాకు ఐదుగురు అక్కలయ్యండి. అందరూ సంగీతం నేర్చుకున్నారు. మాయింట్లో గోడలు, కిటికీలు కూడా పాడతాయి,” అన్నాడు. అతను ఇండియానించి తెచ్చుకున్న టేపులు తెచ్చి మాయింట్లో నాకు వినిపించేవాడు. ఆ టేపులతో అతను సమానంగా పాడుతుంటే నేను ఆశ్చర్యంగా చూస్తూ కూర్చునేదాన్ని. ఒకసారి “షికాగోలో కచేరీట, వెళ్దాం అనుకుంటున్నాను,” అన్నాను. “నేను కూడా వస్తానండీ” అన్నాడు. అలా చాలా కచేరీలకే వెళ్ళేను మాడిసన్ నించి షికాగోలో కచేరీలకి. 3 గం. ప్రయాణం. అర్థరాత్రి తిరిగిరావడం. అంటే నాకు సంగీతాభిలాష కాస్త పైస్థాయికి చేరుకున్నట్టే కదా. బాలమురళీకృష్ణ, యం.యల్. వసంతకుమారి, ప్రియ సిస్టర్స్, హైదరాబాద్ బ్రదర్స్‌వంటి వారి కచేరీలు కనీసం ఓ పది చూసుంటాను. అప్పడే అనిపించింది బాలమురళీకృష్ణ శ్రోతలకోసం, శ్రోతలు ఎలా స్పందిస్తారో చూసుకుని పాడుతున్నట్టు అనిపించింది. వసంతకుమారి కచేరీ చేస్తారు. శ్రోతలకి అనుగుణంగా  తనపద్ధతి గిట్టించినట్టు కనిపించలేదు. నాకలా అనిపించింది. తప్పయితే మన్నించగలరు.

ఆరోజుల్లోనే ఒకసారి కామేశం ఒక టేపులో ఉన్న కీర్తనలపేర్లు రాసి, రాగం, తాళం కూడా రాసి ఇచ్చేడు ఆతరవాత నేను కూడా నాదగ్గరున్న టేపులలో కీర్తనలన్నీ విని సాహిత్యం రాసుకుంటూ వచ్చేను. నామరో స్నేహితురాలు ఇండియా వెళ్లినప్పుడల్లా టేపులు కొనుక్కొచ్చి, సాహిత్యం రాసే పని నాకు ఒప్పజెప్పేది. నాకు అదొక మంచి వ్యాపకం అయిపోయింది.

మాడిసన్ చుట్టూ పల్లెలు చాలా ఉన్నాయి. నేను ఒకొకప్పుడు కారులో పది టేపులు పడేసుకుని, ఆ సంగీతం ఉంటూ ఆ పల్లెదార్లంట కారులో తిరగడం నాకు చాలా ఆనందదాయకమైన మరో వ్యాపకం. ఇప్పుడు కార్లో టేపులు వేసుకునే వసతిలేదు. అంత తేలిగ్గా హాయిగా ఆకాశం, గుట్టలూ, లోయలూ చూసుకుంటూ తిరగడానికి వీధులూ లేవు.

నాకు సాహిత్యం ముఖ్యం కనక వీణ, వయలిన్ లాటి కచేరీలు అంతగా నచ్చవు. చాలా అరుదుగా నాకు బాగా అలవాటయిన కృతులు–ప్రక్కలా నిలబడి–లాటివి అయితే వయెలిన్ వింటున్నప్పుడు పదాలు నేనే అమర్చుకుంటాను. అప్పుడు కూడా ఆలాపన ఫరవాలేదు కానీ స్వరకల్పన తెలీదు. కానీ వాద్వకచేరీలు వినడం నిజానికి లేదనే చెప్పొచ్చు.

శాస్త్రీయసంగీతంలో కాలానికి సందర్భానికీ ప్రాధాన్యం ఉంది. భూపాలరాగం, బౌళి వంటి రాగాలు మేలుకొలుపుపాటలకీ, పవళింపుసేవలు, లాలిపాటలకి కాపీ, ఖమాస్ రాగాలుట. ఆమధ్య మరెక్కడో కొన్ని రాగాలు కొన్ని దేహబాధలకి ఉపశమనం అని కూడా చదివేను. వారిచ్చిన ఉదాహరణలలో నేను నోట్ చేసుకున్నవి –

రాగములు – మానసికస్థితిమీద వాటి ప్రభావం ఇలా ఉంటుందిట.

హిందోళం – ధారణ

కాపీ – నిద్ర

కీరవాణీ – దుష్ట ప్రవృత్తులు

చారుకేసి – గుండెజబ్బులు

ఆనందభైరవి – రక్తపోటు

శివరంజని – అలసత

రేవతి – దీర్ఘకాలికరోగములవలన కలిగే బాధలు

ఖరహరప్రియ – ఆందోళన

ఇలాటివి తెలుసుకోడం చిన్న సరదా అంతే. ఏ  పినాకపాణిగారి పుస్తకమో చదివితే సంగీతంగురించి బహుశా కొంతైనా తెలుసుకోవచ్చు అని తెలుసు కానీ అంత చదివి అర్థం చేసుకునే సామర్త్యం గానీ మేధ కానీ నాకు లేవు. అందుకే నాకు నచ్చిన పాటలు ఫేస్బుక్కులో పోస్టు చేసి అక్కడ సంగీతజ్ఞానం గలవారి అభిప్రాయాలద్వారా చిన్న చిన్న మోతాదులో తెలుసుకుటూ ఉంటాను. నా అదృష్టంకొద్దీ నాఅజ్ఞానాన్ని మన్నించే మిత్రులు దొరికేరు నాకు అక్కడ.

మాఅమ్మాయి చిన్నప్పుడు పడుకునేవేళ కర్ణాటకసంగీతం, పగలు పాశ్చాత్యసంగీతం వినేది. స్థూలంగా పాశ్చాత్యసంగీతం ఉత్తేజం కలిగిస్తుంది, కర్ణాటకసంగీతం ప్రశాంతం కలిగిస్తుంది అని ఎప్పుడో ఒకసారి అన్నట్టు గుర్తు.

ఇంతదూరం ఎందుకు చెప్తున్నానంటే ఈ పాట విన్నాను కాక ఆపాట నచ్చుతుంది, వీరి కచేరికి వెళ్లేను కనక వారి కచేరీకి వెళ్తాను అని భావముద్రలకి ఎవరూ లోను కాకూడదు అని చెప్పడానికి.

స్థూలంగా ఏ సంగీతం ఎప్పుడు నచ్చుతుంది అంటే ఎవరిపద్ధతి వారిదే. వయసు, అనుభవాలు, వాతావరణం, పరిస్థితులు, చుట్టుపట్ల ఉన్న మనుషులూ – ఇవన్నీ కలిసి వివిధ సమయాల్లో వివిదరకాలయిన సంగీతం ఆస్వాదించేలా చేస్తాయి. ఒకప్పుడు ఎంతో నచ్చినవి ఆ తరవాత ప్చ్ అనిపించవచ్చు. సినిమాపాటలవిషయంలో నాకు జరిగింది అదే అనుకుంటాను. ఒకప్పుడు చాలా నచ్చినవి ఇప్పుడు వినాలనిపించడం లేదు. ప్రధానంగా ఈమద్య వస్తున్న సినిమాపాటలకి ఉపయోగిస్తున్న వివిధ వాద్యవిశేషాలేమో. అసలు పాట వదిలేసి వీటిమీద ధ్యాస ఎక్కువ అయిందేమో ఆ సంగీతదర్శకులకి అనిపిస్తోందిప్పుడు.

ఇప్పటికే చాలా రాసేను. చివరిమాటగా పైన చెప్పిందే, ఎవరికి ఎప్పుడు ఏ సంగీతంమీద ఆసక్తి కలుగుతుందో చెప్పలేం. శిశివులూ, పశువులూ, ఫణిగణమూ కూడా సంగీతానికి దాసోహం అంటాయంటారు కదా. అందులో ఏదో ఒక జాతికి చేరి ఉంటాననుకుని ఆనందించడమే మనం చేయగలిగింది.

000

(మార్చి 31, 2018)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “నా సంగీతప్రస్థానం”

 1. మేము కూడా మీరు చెప్పిన వాతావరణం లో పెరిగిన వాళ్ళమే !కొన్నిసార్లు పాట మొదలు చెప్పి రచయిత పేరు లేదా సంగీత దర్శకుడి పేర్లు (-హిందీ ,తెలుగు రెండు భాషలలోని )అడిగే ఆట కాని ఆట లా చెప్పుకునే వాళ్ళం . ఈ మధ్య నేను ఆనాటి పాటలు చూడటం లో ఎక్కువ ఆనందిస్తున్నాను ………….చిరంజీవులు సినిమా లోదే మల్లాది వారి పాట—చెక్కిలింత …వింటూ ఉంటే సంగీత సాహిత్యాలు రెండూ మనసుని దోచుకుంటాయి .ఆపయిన అభినయం .ఈపాట ఈ సినిమా లోదని నేను అసలు ఊహించలేదు .ఎందుకంటే చిరంజీవులు అనగానే –కనుపాప కరువయిన ….పాటే మనసులో నిలిచిపోయింది.

  మెచ్చుకోండి

 2. నిజం. మీఅమ్మ కూడా ఇలా రాసుకునేవారిని నాతొ ొకసారి అన్నట్టు గుర్తు. అవును మనం గోయరచయితలపేర్లు చెప్పుకునేవాళ్ళం. సముద్రాల, ఆత్రేయ, మల్లాది రచన – కనీసం సాహిత్యంతో అంతో ఇంతో పరిచయం ఉన్నవాళ్ళం. వీళ్ళకి సంగీతదర్శకులు ఎందుకంత ముఖ్యం అయిపోయేరో తె
  లీడంలేదు.

  మెచ్చుకోండి

 3. చాలా బావుందండీ. మా అమ్మ కూడా నోటు పుస్తకాల్లో కృతుల సాహిత్యం రాసు కునేది. సినిమా పాటల విషయంలో రచయిత పేరు వెయ్యక పోవడం దారుణం. కానీ నేను గమనించిన ధోరణిలో, కనీసం ఆ రోజుల్లో, ఫలాని రచయిత పాట అనే శ్రోతలు చెప్పుకునే వాళ్ళు, సంగీత దర్శకుడు పేరు కంటే.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.