లత – తెలుగుసాహిత్యచరిత్రలో ఒక ప్రభంజనం

1953లో “గాలిపడగలూ, నీటిబుడగలూ” అన్న 98 పేజీల చిన్నినవలతో తెలుగునాట తుఫాను రేపి తెలుగుపాఠకుల పెనునిద్దుర వదిలిస్తూ తనస్ఫూర్తిని ఘనంగా ప్రకటించుకున్నరచయిత్రి రెండక్షరాల పొట్టిపేరుగల లత. పూర్తిపేరు జానకీరమాక్రిష్ణవేణీ హేమలత. ఈనాడు చాలామంది పాఠకులకి తెన్నేటి హేమలతగా సుపరిచితం.పుట్టింది విజయవాడలో 1935లో నవంబరు 15వ తేదీన. తల్లిదండ్రులు నిభానుపూడి విశాలాక్షి, నారాయణరావుగారలు. తొమ్మిదేళ్లవయసులో పదహారేళ్ల తెన్నేటి అచ్యుతరామయ్యతో వివాహం. ఇద్దరు కుమారులు (1956, 1963లో). స్కూలు చదువు అయిదోక్లాసు వరకే అయినా ఇంట్లో తండ్రిశిక్షణలో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు గ్రంథాలు చక్కగా చదువుకుంది. తంఢ్రి మరణించే సమయానికి లతవయసు 32. తండ్రిమీద గౌరవంతో తమ్ముడిని చదివించేను అని రాసుకుందామె. ఆరోజుల్లో రచనావ్యాసంగంతో చెప్పుకోదగ్గ ఆదాయం గల కొద్దిమంది రచయిత్రులలో లత ఒకరు.

లతజీవితం విలక్షణమయినది. ఆమెరచనలు విలక్షణభావజాలంతో సుసంపన్నమయినవి. ఆమెరచనల్లో, ఆలోచనావిధానంలో అసాధారణమయిన వైవిధ్యం వుంది. లత నవలల్లో, వ్యాసపరంపరలో ఆమె ఆలోచనాపటిమ అవగాహన కావాలంటే ఆమెజీవితాన్ని కూడా నిశితంగా పరీక్షించి చూడాలి. మూడు పుస్తకాలు – లతే రాసిన “అంతరంగచిత్రం”, “మోహనవంశీ”, ఘట్టి ఆంజనేయశర్మ రాసిన “సాహితీలత” (జీవితచరిత్ర) – చాలావరకూ ఉపయోగపడతాయి ఆమెవ్యక్తిత్వాన్నీ, భావజాలాన్నీ అర్థం చేసుకోడానికి.

లతకి చాలా చిన్నతనంలోనే ప్రారంభమయిన తాత్త్వికచింతన, అంతరంగసంక్షోభ “అంతరంగచిత్రం”లో ద్యోతకమవుతాయి కొంతవరకూ. “మోహనవంశి”లో అలౌకికప్రేమకోసం ఆమెతపన చూస్తాం. ఇందులో కొన్నివాక్యాలు కలగాపులగంగా కనిపించి పాఠకుడిని గందరగోళపరుస్తాయి. వాక్యాలు అసంపూర్ణం, వ్యాకరణం అయోమయం. అదొక చైతన్యశ్రవంతిలా సాగిపోతుంది. నేను దాన్ని ఆమెమనసులో కలిగినఅలజడిగా, అంతఃక్షోభగా అర్థం చేసుకుంటున్నాను. ఆంజనేయశర్మగారి “సాహితీలత”లో ఆమె జీవితవిశేషాలూ, ఆమెకి ప్రముఖులు రాసిన ఉత్తరాలూ, ఆమెజవాబులూ బోలెడున్నాయి. ఈపుస్తకంలో రచయిత అవగాహన లేదు కానీ raw data మాత్రం చాలా వుంది.

తండ్రి జమీందారీఫాయిదాలో సాహిత్యచర్చలతోనూ, మధుపానీయాలతోనూ జీవితాన్ని గడపడం లత చిన్నతనంలోనే కళ్లారా చూసింది. భర్త అచ్యుతరామయ్య అనారోగ్యం, తన అనారోగ్యం, ఆర్థికబాధలూ  – వీటన్నిటితోనూ ఆమెకి ఒకవిధమయిన వైరాగ్యం, జీవితానికి అర్థం ఏమిటి అన్న తాత్త్విక చింతన ఏర్పడ్డాయి. బాధ పడ్డవారికే బాధ అర్థమవుతుంది. “అంతరంగచిత్రం” లో ఈవిషయం ప్రస్తావించింది, “నా ఈ చిన్నజీవితంలో ఎన్నో బాధలు అనుభవించేను–కష్టాలూ, కన్నీళ్లూ, బాధా, సంతోషం. ప్రేమా, బాధ్యతలూ .. మనోవైకల్యం, కోరికలూ. జీవితంతోనూ, ఆర్థికబాధలతోనూ కుస్తీ–వీటన్నిటిమధ్యా విమానంలో ఇంకా మొదటితరగతిలోనే ప్రయాణం చేస్తూ  .. వర్ణించలేని ఆనందాన్నీ, మాటల్లో చెప్పలేని వికృతాన్నీ-ఎన్నిసార్లు చూడలేదు ఈజీవితంలో? నాజీవితం చిన్నదే అయినా అనుభవాలతో, మెరుపులతో బెలూనులా తేలిపోతోంది. బహుశా ఏదో ఒకరోజు ఇది పగిలిపోతుంది (అంతరంగచిత్రం. 13).

ఇటువంటి ఆత్మక్షోభ దృష్టిలో పెట్టుకున్నప్పుడే ఆమెనవలల్లో సంక్షోభం అర్థమవుతుంది మనకి. ఆమెరచనల్లో విశృంఖలత్వం ఆమెమనోవేదనల్లోంచి పుట్టింది. ఆపైన పాఠకులూ, పండితులూ చేసిన బాధ్యతలేని వ్యాఖ్యలతో లోకంమీద తిరుగుబాటు ప్రకటించింది మొండిధైర్యంతో (living with abandon అనొచ్చు). తద్వారా తెలుగు సాహిత్యానికి మేలే జరిగింది.

తనరచనలగురించి, “నాకు జీవితం నిజం. ఒక యథార్థం. ఆ నిజాన్ని చిత్రించడానికి నాకలం ఒక బ్రష్. నేనో పెయింటర్ని. అక్షరాల చిత్రకారిణిని. నాచిత్రాలు ఏ రంగుల సమన్వితాలో, స్ఫూర్తిమంతాలవునో కాదో నిర్ణయించేది కాలం” అంటుంది. (కొండముది శ్రీరామచంద్రమూర్తిగారి “చలానికి, అరుణాచలానికి మధ్య లత”, ఆంధ్రజ్యోతి మే 24. సాహిత్యవేదికలో వ్యాసంనుంచి ఇక్క కోట్ చేస్తున్నాను. కానీ ఆమె “గాలిపడగలూ, నీటిబుడగలూ”నవలకి ముందుమాటలో ఈవాక్యాలు రాసినట్టు నాకు గుర్తు.)

“గాలిపడగలూ, నీటిబుడగలూ” నవలలో లత తీసుకున్న అంశానికి ఒక ప్రత్యేకత వుంది.  వాళ్లింటి అరుగుమీద నిలబడి తమవీధిచివర వున్న వేశ్యాగృహంలోకి వచ్చేపోయేవారినీ, ఆయింట్లో ఆడపిల్లల్నీ చూసి, “గాలిపడగలూ, నీటిబుడగలూ” రాసేనని అంతరంగచిత్రంలో చెప్పింది ఆమె.

ఇక్కడ మనం కాస్త చరిత్ర గుర్తు చేసుకోవాలి. వీరేశలింగంగారు రంగంలో ప్రవేశించేవరకూ వేశ్యలని సంగీతం, నాట్యం, శృంగారం పోషించే కళామతల్లులుగా చిత్రించారు. తరవాత వారిని కుటుంబాలు నాశనంచేసే సంఘద్రోహులు అంటూ గర్హించడం వీరేశలింగంగారితో మొదలయింది. ఈరెండు దృక్పథాలకీ భిన్నంగా, లత తెలుగుసాహిత్యచరిత్రలో తొలిసారిగా, ఆవేశ్యలు, ముఖ్యంగా రూపాయికీ అర్థకీ తమశరీరాలని పణంగా పెట్టి, విటుల క్రూరహింసలు భరించి, రోగాలపాలయి, రోడ్డువార హేయంగా కుక్కచావులు చచ్చే ఆడవాళ్లజీవితాలు అరటిపండు వొలిచి చేత బెట్టినంత విపులంగా చిత్రించిన తొలిరచయిత లతే.

మగవాళ్లు బాధ్యతలు విస్మరించి గాలిలో విశృంఖలంగా తేలిపోయే గాలిపడగల్లాటివారనీ, వారివల్ల స్త్రీలజీవితాలు నీటిబుడగల్లా చితికిపోతాయనీ ఆమె ఆమె ప్రతిపాదన “గాలిపడగలూ, నీటిబుడగలు” నవలలో. ఈనవలని ప్రభుత్వం నిషేధించలేదు కానీ శిష్టజనులు తమఇళ్లల్లో బహిష్కరించేరు. చాలామంది ఇళ్లల్లో ఆడపిల్లల్ని లతనవలలు చదవనిచ్చేవారు కారు ఆరోజుల్లో.

విమర్శకులూ, పాఠకులూ లతకీ చలానికీ సామ్యం చూపడం సాధారణమయిపోయింది కూడా ఆరోజుల్లోనే. నిజానికి వీరిద్దరి రచనల్లో తేడా వుంది. చలంరచనలు శృంగారంలో స్త్రీలు పొందగల ఆనందంగురించి, పాశ్చాత్యసిద్ధాంతాలు ప్రాతిపదికగా రాసినవి. లత వికృత మనస్తత్త్వాలు గల మగవాళ్లు శృంగారంపేరున స్త్రీలపై జరిపే అత్యాచారాలు క్రూరాతిక్రూరమయిన హింస చిత్రించింది. లత రాసిన సెక్స్ చలంనవలల్లోలాగ పాఠకులలో ఉద్రేకం కలిగించదు సరికదా వెగటు కలిగిస్తుంది. విషాదం కలిగిస్తుంది. చలంనవలలు మేథోపేతం.  లతరచనలు కటిక వాస్తవికతకి అంకితం.

అంతేకాదు. తాను సెక్స్ రాసింది ఒక్క “గాలిపడగలూ, నీటిబుడగలూ”లో మాత్రమే అంటారామె. నిజానికి ఈమాట నిజం కాదు. మరొక నవల, “రక్తపంకం”లో ప్రధానాంశం కూడా అదే. ఇంకా చెప్పాలంటే మొదటినవలనే అంతకు నాలుగింతలకి పెంచి రాసిన నవల ఇది. కానీ ఆ తరవాత ఆమె సృష్టించిన మొత్తం సాహిత్యం తీసుకుని చూస్తే మాత్రం ఈఅంశం ఒక చిన్నభాగం అని ఒప్పుకోక తప్పదు.

లతగారు సృష్టించిన మొత్తం సాహిత్యం చూడండి. 1982నాటికి, ప్రచురింపబడిన ఆమె రచనలు – 100 నవలలు, 700 రేడియోనాటికలు, 10 స్టేజినాటకాలు, ఊహాగానం 5 సంపుటాలు (ఇది తరవాత ఒకే సంపుటంగా, 499 పేజీలు, ప్రచురించారు), సాహిత్య విమర్శ 2 సంపుటాలు (రామాయణ విషవృక్షఖండన, లతరామాయణం)** లతవ్యాసాలు ఒక సంపుటం, 25 చరిత్రకందని చిత్రకథలు, కవితలు. (లత ఆగస్టు 17, 1982లో నాకు రాసిన వుత్తరం ఆధారం.)

—————

** (తా.క.

2015లో పై ఉత్తరంలో ఉన్నట్టు రెండు పుస్తకాలు కావనీ ఒకే పుస్తకమనీ ఒక పాఠకుడు నాదృష్టికి తెచ్చారు. ఆ పైన నేను రచయిత్రి వాక్యాన్ని నిర్ధారణ చేసుకోడానికి అనేక విధాల ప్రయత్నించేను. పుస్తకాలతో విస్తృతంగా పరిచయమున్నవారు అనేకులు అది ఒకే పుస్తకమనే నిర్ధారించేరు. పాఠకులు ఈ విషయం గమనించవలిసిందిగా కోరుతున్నాను. ఆగస్ట్ 14, 2015)

లత నాకు రాసిన ఉత్తరం  ఇక్కడ   వెనక వేజీ

————–

ఇంత సాహిత్యం సృష్టించిన లతని ఒకటి లేదా రెండు నవలలు ఆధారంగా, సెక్స్ రచయిత్రి అనడం ఆమె కృషిని కించపరచడమే. లతనవలల్లో వస్తువైవిధ్యం జనసామాన్యాన్ని ఇతోధికంగా ఆకట్టుకుంది.

సహజంగానే మనకి కుళ్లు చూడ్డం నచ్చదు. సంఘంలో ఇంత కుళ్లు వుందని ఒప్పుకోడానికి మనసొప్పదు. ఇది సౌందర్యారాధకులలో మరీ హెచ్చు. అంచేత కుళ్లుమాట వదిలేసి, ఆ రాచపుండుని బహిరంగంగా ఆరేసిన రచయిత్రిమీద విరుచుకుపడ్డారు విమర్శకులు. వారు ప్రధానంగా లేవదీసిన ప్రశ్నలు రెండు – మధ్యతరగతి కులస్త్రీకి ఇలాటివిషయాలు ఎలా తెలిశాయి? స్త్రీ అయిన లత ఇంత విపులంగా సెక్స్‌గురించి ఎలా రాయగలిగింది?

ఈరెంటికీ లత సమాధానం – “చూశాను కనక రాశాను. రెండోది, నాకలం చిత్రకారుడిచేతిలో కుంచెవంటిది. నేను చూసినదృశ్యాన్ని నాకలం చిత్రించింది. కలానికి సెక్సు ఏమిటి?” అని. అంతేకాదు. తాను రాసిన సెక్స్ వెగటు కలిగించేదే కానీ ఉద్రేకమూ, ఉత్సాహమూ కలిగించేది కాదు, తాను సెక్స్,గురించి రాసింది ఆఒక్క నవలలోనే అని కూడా అంటారామె తన “అంతరంగచిత్రం”లో (147).

ఆచంట జానకిరాంగారు అలా రాయొద్దని చెప్పేరట లతకి. “బహుశా ఆయనకి నా ‘గాలిపడగలూ, నీటిబుడగలూ’ వెగటు కలిగించివుండవచ్చు. నేను ‘మోహనవంశీ’, ‘ఉమర్ ఖయాం,’ ప్రచురించినతరవాత కూడా ఆయన నన్ను క్షమించినట్టు లేదు. ఆయన రచనల్లో (‘సాగుతున్న యాత్ర’, ‘నాస్మృతిపథంలో’) వాస్తవంకంటే కవిత్వమే ఎక్కువ అని విన్నాను. నాదృష్టిలో కవిత్వంకంటే వాస్తవమే ఎక్కువ అందమయినది …. సౌందర్యంవిషయంలో ఆయన సిద్ధాంతాల్లో చాలా కృత్రిమత వుంది. నాకు కృత్రిమత అంటే అసహ్యం” అంటుంది లత. (అంతరంగచిత్రం 147).

ఆమె తనరచనల్లో చర్చించిన వివిధ అంశాలు ఆమెదృక్పథం ఎంత విస్తృతమయినదో తెలియజేస్తాయి. “బ్రాహ్మణపిల్ల”లో ఆర్థికంగా హీనస్థితిలో వున్నా, బ్రాహ్మణపుట్టుక కారణంగా ఉద్యోగం ఇవ్వకపోవడం న్యాయమేనా, “జీవనస్రవంతి”లో తన తండ్రి మార్ఫిన్ వాడకం, జమీందారీ ఫక్కీలో జీవితం సాగించుకోడంమూలాన కలిగిన ఆర్థికబాధలూ, “నీహారిక”లో ఒకభార్యకి ఒక భర్త అన్ననియమాన్ని ప్రశ్నించడం, “పథవిహీన”లో పాతివ్రత్యంగురించిన చర్చ. (ఈనవల ఆంధ్రప్రభలో సీరియల్‌గా వచ్చినప్పుడు ఆవిడకి 7000 ఉత్తరాలు వచ్చేయిట పాఠకులనించి) – ఇవన్నీ లతలో కల్గించిన అంతర్మథనానికి సాక్ష్యాలే. అంతే కాదు. ఇలాటి ప్రశ్నలు మనకి కూడా ఏదో సందర్భంలో కలుగుతూనే వుంటాయి. అందుకే లతనవలలు ఆరోజుల్లో అంతటి ప్రాచుర్యాన్ని పొందేయి.

ఆవిడలో ఒకవైపు తిరుగుబాటుతత్త్వమూ, మరోవంక సాంప్రదాయంపట్ల గౌరవమూ కనిపించడం కొంతమందికి తికమకగా తోచవచ్చు. కానీ, నిశితంగా పరిశీలించి చూస్తే, ఆవిడా మనమూ కూడా నిత్యజీవితంలో ఎదుర్కొనే అనేక సంఘర్షణలు, పరస్పరవిరుద్ధమయినవీ, క్లిష్టతరమయినవీ ఆమె తననవలద్వారా చర్చకి పెడుతోంది అని అర్థమవుతుంది.

తాను రాసిన ప్రతినవలకీ ఆధారం ఆనవలకి ముందుమాటలో రాసేరు. తాను స్వయంగా చూసిన సంఘటనో, చదివిన ప్రముఖనవలో, లేదా ప్రముఖరచయితతో సంభాషణో ప్రాతిపదిక అయేయి అంటారామె. ఉదాహరణకి, “తిరగబడిన దేవతలు”కి స్ఫూర్తినిచ్చింది హెచ్.జీ.వెల్స్ రాసిన “టైం మెషీన్”, మామ్ పాత్రలు “భగవంతుడిపంచాయితీ”కి దోహదం చేసేయి. ఒకసారి గోపీచంద్‌తో కాఫీ తాగుతుండగా, ఒక స్త్రీ తమకి వినిపించిన కథే “తులసివనం.” ఆయన లతని ఆకథ రాయమంటే, లత “మీరే రాయండి” అందిట. కానీ ఆయన అది రాయకుండానే మరణించడంతో తాను రాశాను అంటుంది.

లతనవలల్లో వస్తువైవిధ్యం మాత్రమే కాదు అసాధారణమయిన భావుకత వుంటుంది. ఎందుకు ఇలాగే జరగాలి అన్న వేదన వుంది. నిజంగా ఎవరికీ జీవితానికి అర్థం ఏమిటో తెలీదు. గొప్ప తాత్త్వికులు అని మనం ఎవరిని అంటున్నామో వారు కూడా తమఅనుభవాల్నీ ఆలోచనలనీ అనుభూతులనీ మధించి తమకి తోచిన వ్యాఖ్యానం మాత్రమే చెప్పేరు. అవే వేదవాక్కుగా తీసుకునేవారుంటే వుండొచ్చు కానీ వాటిని ప్రశ్నించేవారు కూడా వుండకూడదని నియమేమీ లేదు కదా. లత చేసినపని అదే నా దృష్టిలో.

లత ప్రేమకథలూ, డిటెక్టివ్ కథలూ (ఆరుద్ర నవలల స్ఫూర్తితో), చిత్రలేఖనం కూడా ప్రయత్నించి వదిలేశానని చెప్పుకున్నారు. ఆ చిత్రలేఖనంలో ఆమెఆసక్తి తాలూకు ఛాయలు ఆమెనవలల్లో కనిపిస్తాయి. లతసాహిత్యంలో అనేకానేక పాఠకులని ఆకట్టుకున్నది ఇమేజరీ, వ్యంగ్యంతో కూడినహాస్యం, నిత్యజీవితంలో మనకి ఎదురయే సంఘర్షణ.

సినిమాడైలాగులు రాసారు. 1980లో సన్నజాజి అన్నసినిమాలో డాక్టర్ లతగా నటిస్తారని పేపరులో చదివేను ఎప్పుడో. ఆసినిమా విడుదల అయిందో లేదో నాకు తెలీదు.

ఆమెజీవితకాలంలో అనేక ప్రముఖరచయితల మన్ననలందుకొని, కొన్నివేల పాఠకుల అభిమానం చూరగొన్న లతని “సెక్స్‌నవలలు రాసింది” అని వ్యాఖ్యనించడం  (తెలుగు వికిపీడియా.) సిగ్గుచేటు. ”I was the first sensational woman writer of the present age of Telugu literature”  అని సగర్వంగా చెప్పుకోగలిగిన తెలుగు రచయిత్రి తెన్నేటి హేమలత.

లతరచనలని ఆమోదించి, ఆమెని అభిమానించి, బుచ్చిబాబు, ఆచంట జానకిరాం, బెజవాడ గోపాలరెడ్డివంటి ప్రముఖులు ఎందరో ఆమెతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారు. హెమింగ్వే, షా, మామ్ వంటి రచయితలతో సామ్యాలు ఆమెరచనల్లో ఎత్తి చూపారు. (ఆంజనేయశర్మ, సాహితీలత)

1958నించీ 1963వరకూ ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికంగా అయిదేళ్లపాటు ప్రచురించిన ఊహాగానం వ్యాసాలు విశేషంగా పాఠకులఆదరణ పొందేయి. వాటిల్లో వ్యంగ్యం, హాస్యం, సంఘంలో అనేకలోపాలమీద చురకత్తుల్లాటి విసుర్లతో పాటు ఆమె పాండిత్యప్రకర్ష కూడా కనిపిస్తుంది. చాలావరకూ ప్రాచీనకావ్యాల్లోంచి ఒక పద్యం తీసుకుని, దాన్ని విశ్లేషిస్తూ, సమకాలీనసమాజంలో లోపాలనీ, అవకతవకలనీ ఎత్తిచూపడంవల్ల ఆమె సునిశితమయిన పరిశీలనాదృష్టి అభివ్యక్తం అవుతుంది.

1978లో ప్రచురించిన ఊహాగానం రెండవముద్రణలో (600 పేజీలు) 197 వ్యాసాలున్నాయి. ఇందులో అంశాలు – మహారచయితలు (టాగోర్, షేక్స్‌పియర్, టాల్స్‌టాయ్, మొపాసా, క్రిష్ణశాస్త్రి రచనల్లోంచి కొటేషన్లు), చలం, శ్రీశ్రీవంటివారి భావజాలం, ఇంకా బెంగాలీ, హిందీ, తమిళం, రష్యన్, పెర్షియన్ రచయితల భావజాలం తీసుకుని వాటిమీద చురకత్తుల్లాంటి వ్యాఖ్యలు, హాస్యం వ్యంగ్యం, హేళన చేర్చి జీవితంమీద తనఅభిప్రాయాలు అభివ్యక్తీకరించారు.

ఇంకా,  సినిమారంగంలోనూ, ఇతర రంగాల్లో కలిగిన సాన్నిహిత్యంతోనూ కలిగిన అనేక దృక్పథాలను ఈ ఊహాగానంద్వారా తెలుగుపాఠకులముందు వుంచారు. సూక్ష్మంగా చెప్పాలంటే యావత్ప్రపంచంలో ఎవరికైనా కలిగే ప్రశ్నలు -సమాజం అంటే ఏమిటి? దీనికి మూలం ఎక్కడుంది? మనిషికీ సమాజానికీ ఏమిటి సంబంధం? – వంటి ప్రశ్నలే ఆమె కూడా వేస్తున్నారు. ప్రతిసారీ జవాబు చెప్పలేకపోవచ్చు. నేనూ మీలాటిదాన్నే. మీకు కలిగినసందేహాల్లాటివే నాకూ కలుగుతున్నాయి అంటారు లత. అందుచేతనే ఆమెరచనలు విశ్వజనీనత సంతరించుకోగలిగేయి.

ఊహాగానంలో ఒకచోట “నన్ను తయారు చేసినప్పుడు ఆజగదీశ్వరుడిహస్తం విశ్రాంతి కోరివుంటుంది. విశ్రామానంతరం తిరిగి నన్ను దిద్దబోయిన ఆవిరాణ్మూర్తికి (నాకు) హృదయంగా ఏర్పర్చబోయిన మట్టి కనిపించకపోవటంవలన అందుబాటులో వున్న అరవిందపుష్పాన్ని అగ్నిశిఖల్ని కలిసిన ముద్దలా నాలో పెట్టి కీ యిచ్చి జీవించమని జన్మనిచ్చాడు కాబోలు” (154)

భీతి అన్నపదం లత నిఘంటువులో లేదు. తనతొలినవలమీద చెలరేగిన దుమారం ఆమెసాహిత్యకృషికి అంతరాయం కాలేదు. నిరాఘాటంగా అరవైయేళ్లపాటు తాను రాయదలుచుకున్నవి రాసి తనసాహిత్యవ్యవసాయం కొనసాగించుకున్నారు ఆజన్మాంతం.

1974లో రంగనాయకమ్మ “రామాయణవిషవృక్షం” (3 సంపుటాలు) రాసినసంగతి చాలామందికి తెలిసు. ఆ గ్రంథాన్ని ఖండిస్తూ, లత 1977లో  “రామాయణవిషవృక్షఖండన” అని మరోపుస్తకం రాసారు. ఈ రెండు పుస్తకాలమీద హోరాహోరీ చర్చలు జరిగేయి. ఆనాటి ప్రముఖరచయితలూ, పాఠకులూ – ఉభయ జండరులూ – ఇరుప్రక్కలా వాదించుకున్నారు. కొడవటిగంటి కుటుంబరావుగారు “వేదాల్లో ఏముంది మరియు రంగనాయకమ్మ రామాయణవిషవృక్షం, ఒక పరిశీలన” అన్న మరో పుస్తకం ప్రచురించారు 1977లోనే. ఇద్దరు రచయిత్రులు రచించిన రెండు పుస్తకాలు కారణంగా ఇంతమంది రచయితలూ, పాఠకులూ తీవ్రంగా వాదోపవాదాలు చేయడం తెలుగుసాహిత్యంలో ఒక చరిత్ర్యాత్మక సంఘటన.

1955లోనో 1956లోనో ఆలిండియారేడియో విజయవాడకేంద్రంలో ఎనౌన్సర్‌గా మొదలుపెట్టిన లత రేడియోనాటికలు రాసారు, ఆనాటికల్లో పాత్రలు ధరించారు. ఈసందర్భంలో ఆమెకి నటనగురించి ఆమెఅభిప్రాయాలు తలుచుకోడం సమంజసం. ఆమె ఒకసారి చనిపోయినకొడుకుకోసం ఏడవవలసిన తల్లిపాత్ర ధరించవలసివస్తే ఒప్పుకోలేదుట. అంటే నటనకీ వాస్తవానికీ మధ్యగల అంతరం ఆమె గమనించలేదు. అప్పట్లో. ఈవిషయం అంతరంగచిత్రంలో ఆమె విపులంగా చర్చించేరు. అలాగే రచనావ్యాసంగంగురించి కూడా ఆమెఅభిప్రాయాలు చెప్పుకోదగ్గవే. గొప్పరచయిత సరదాకో, పేరుకోసమో రాయడు. జీవితాన్నిగురించిన అవగాహనా, దాన్ని మరింతగా విస్తృతపరుచుకోడమే అతని ధ్యేయం. … రచయిత అంతర్మథనాన్ని అంతర్లీనం చేసుకోని రచన అంటూ లేదు, వుండదు కూడా.

నవల మొదలు పెట్టడమే తనవంతు, తరవాత పాత్రలు తనని నడిపిస్తాయి అంటారు. ఇలా పాత్రలు నడిపించడం అందరు రచయితలవిషయంలోనూ జరుగుతుందని ఆమె అభిప్రాయం.

“భగవంతుడి పంచాయితీ”కి సోమర్సెట్ మామ్ ‌నవల ఒకటి స్ఫూర్తినిచ్చిందిట. అందులో టిబెట్ వారి ఆచారాలూ, హిమాలయప్రదేశం వాతావరణం తేవాలని ప్రయత్నించాను అంటారు ముందుమాటలో. భూగోళంవివరాల్లో ఏమయినా పొరపాట్లు వుంటే క్షంతవ్యురాలిని అని కూడా చెప్పుకున్నారు.

చరిత్రలోని చిత్రాలు – సాహిత్యంలో చరిత్రహీనులని కథానాయకులని చెయ్యడం సర్వసాధారణం. దీనికి కారణం “నియమాలకీ, నిబంధనలకీ అతీతమైన ఒకవిచిత్ర రాగమయమాధుర్యం మానవుడి ఆంతర్యాన్ని అనుక్షణమూ ఆవహించి వుండటం” అంటారు లత. శరత్‌ పాత్రలలాటిదే తన “చరిత్రశేషులు”లో రాధమ్మపాత్ర. ఈనవలలో తాను పడినశ్రమకి ప్రతిఫలం పొందకపోవడం అంటుంది.

“శత్రుబంధం”నవలకి ముందుమాటలో ఆమె అభిప్రాయాలు చూడండిః నవలారచన మొదలుపెట్టిన కొత్తరోజుల్లో ఒకవిధమయిన ప్రేమకథమీద మోజు వుండి, “వైతరణీతీరం”లాటి నవలలు రాశాను. అనంతరం ఇంగ్లీషు ఇన్‌ఫ్లూయన్సునుండి తప్పించుకున్నాననే చెప్పాలి. … ఇప్పుడు నాసోదరీమణులు అనేక ఇంగ్లీషుకథల్ని యథాతథంగా తెలుగులోకి దించటం చూసింతరవాత ఆమాత్రం ఘనకార్యం నేను మాత్రం ఎందుకు చెయ్యకూడదు అనే చిలిపి ఆలోచన వచ్చినమాట నిజమే!” ఈనవలకి అంకురార్పణ ఇంగ్లీషు నవలలు చదివే “యంగర్ జనరేషన్” రాయమని అడగడంట. తరవాత మళ్లీ వాళ్లే అలాటివి రాయకండి, ఒకటి మాత్రం రాయండి అని కూడా చెప్పేరుట. “చాలామంది రచయిత్రులకు సీరియల్స్ రాయకపోతే తమని ప్రజలు ఎక్కడ మర్చిపోతారో అనే భయం వుంది. నాకు అలాటిభయం ఎంతమాత్రం లేదు” అని కూడా రాసేరామె అదే ముందుమాటలో.

ఆమె నమ్మకాలు వమ్ము కాలేదు అనుకోడానికి సాక్ష్యంగా 1997లో లత మరణవార్త విని, అమెరికాలో నివసిస్తున్న జె. కె. మోహన్ రావుగారు, కవి, సి.పి. బ్రౌన్ పురస్కార గ్రహీత, “రచ్చబండ” వేదికలో ఇలా రాసేరుః

I am saddened to hear the demise of Tenneti HemaLATA. In the golden days, in the late fifties and early sixties, I was introduced to Lata through Andhra Prabha. She used to contribute a column called UhaagaanaM. It used to be down-to-earth and yet poetic. … I can call her a mix of Bucchi Babu and Chalam. She fought for the one half of the oppressed in society, viz., the women.
… She always used to write with a certain enchantment and elan that is not easy to surpass or imitate. Lata reminds me of my youth, my return to Telugu literature (particularly novels) after a break, and my rethinking about women, relationships and a sense of poetry in many activities of our daily lives.

లత గృహలక్ష్మి స్వర్ణకంకణం 1963లో, ఆంధ్రాయూనివర్సిటీనించి 1977లో కళాప్రపూర్ణ బిరుదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి “extraordinary woman of the year” award 1981లో అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీలో గౌరవసభ్యత్వం దాదాపు 20 సంవత్సరాలపాటు నిర్వహించారు. “I was the only elected woman member of the academy” అన్నారు నాకు రాసిన వుత్తరంలో. సాహిత్య ఎకాడమీ ఎవార్డు అందుకున్నారు అని కొండముది రామచంద్రమూర్తి తనవ్యాసంలో పేర్కొన్నారు.

ఇరవయో శతాబ్దపు తెలుగురచయిత్రులలో లతకి మొక్కవోని ఒక ప్రత్యేకస్థానం వుంది. ఈతరంవారు మన రచయితలభావజాలం ఎంత పటిష్ఠమయినదో తెలుసుకోవాలంటే తెన్నేటి హేమలతరచనలు కూడా చదవాలి.

తాజాకలం. లతగారి గాలిపడగలూ, నీటిబుడగలూ నేను ఇంగ్లీషులోకి అనువదించాను. ఇది జైకో వారు ప్రచురించిన Short Stories from Andhra Pradesh అన్న సంకలనంలోనూ, thulika.net లోనూ వుంది. లింకు ఇక్కడ

తా.క. 2 – కల్పన రెంటాల జ్ఞాపకాలలో లత ఇక్కడ చూడండి

లతగారి ఇంటర్వ్యూ

(జనవరి 10, 2010)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

35 thoughts on “లత – తెలుగుసాహిత్యచరిత్రలో ఒక ప్రభంజనం”

 1. లత గారి నవల “బహుచర” గురించి మీరు విన్నారా ..చదివారా ..మాలతి గారూ .. ఈ మధ్య నాతో ఒకరు ఈ నవల గురించి ప్రస్తావించారు .

  మెచ్చుకోండి

 2. పింగుబ్యాకు: మహిళావరణం-7 « sowmyawrites ….
 3. పింగుబ్యాకు: 2010 in review « తెలుగు తూలిక
 4. @ సూర్యప్రకాశ్, సంతోషం అండీ మీఅందరికీ లత రచనలయందు గల అభిమానానికి. నేను స్వర్ణసీత గురించి రాయకపోవడానికి కారణం నాకు తెలియకపోవడమే. నేను అప్పటికి అమెరికా వచ్చేశాను. కనీసం ఇప్పుడు మీమూలంగా తెలిసింది. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. @రవి: మాలతిగారు స్వర్ణసీత గురించి ప్రస్తావించలేదని అనుకుంటుంటే మీరు నా మనసులో వున్నది చెప్పారు. మా ఇంటిలో కూడా ఆంధ్రజ్యోతిలో ధారావాహికగా వెలువడినప్పుడు కుట్టిన పుస్తకం వుంది. నాకెంతో ఇష్టమైన నవలలో ఇది ఒకటి. “శివశిరశ్చంద్రముఖీ సఖీ” అని శ్రీరాముడు సీతాదేవిని పిలవడంతో మొదలవుతుంది.
  లతగారు అప్పుడు ముఖాముఖిలో ఇచ్చిన జవాబులలో తనకి హారర్ నవలలు రాయడం/చదవడం అంటే ఇష్టం అని చెప్పిన గుర్తు (యండమూరి ఆ సమయంలో “తులసి” వంటి వాటితో బాగా పాపులర్).
  ఏమైనా లతగారి గురించి చక్కని పరిచయం చేసిన మాలతిగారికి నెనరులు.

  సూర్యప్రకాష్

  మెచ్చుకోండి

 6. నా చిన్నతనంలో ఆంధ్రజ్యోతిలో లత గారి సీరియల్ “స్వర్ణ సీత” వచ్చేది. అది వారం వారం కత్తిరించుకుని, పుస్తకం కుట్టుకుంది అమ్మ. ఆ పుస్తకం మా ఇంట్లో ఏదో మూలన ఇప్పటికీ ఉన్నట్లు నాకు గుర్తు. నేనా పుస్తకం చాలాసార్లు చదివాను. ఆ తర్వాత ఆమె వ్రాసిన ఇతర రచనలు వెతికితే దొరకలేదు. ముఖ్యంగా విషవృక్ష ఖండన దొరకడం లేదు. మీ రచన చాలాబావుంది. ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.

  మెచ్చుకోండి

 7. కాలాతీతవ్యక్తులు నవల “చదువుకున్న అమ్మాయిలు”గా సినిమా వచ్చింది. లత గారిదే రామాయణాన్ని అందులోని సీత మరికొన్ని ఇతర పాత్రలని విలక్షణంగా చిత్రీకరిస్తూ ఒకవార పత్రికలో 1970 లలో సీరియలుగా చదివిన జ్ఞాపకము. దానిని గురించి మీరుగాని, పాఠకులెవరైనాగాని ఏమైనా చెప్పగలరా?

  మెచ్చుకోండి

 8. @ వెంకటరమణ, ఏరచయితనైనా మనం అర్థం చేసుకోవాలంటే కాస్త శ్రమ తీసుకుని ఆలోచించాలి అని నేను అనుకుంటాను. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 9. చాలా మంచి వ్యాసం మాలతి గారు. లత గారివి మోహన వంశీ, మిగిలిందేమిటి నవలలు చదివాను. అవిరెండూ సంప్రదాయానికి ఎదురు తిరిగే భావాలు కల పుస్తకాలే అనిపించింది.
  మీ వ్యాఖ్య
  // ఆవిడలో ఒకవైపు తిరుగుబాటుతత్త్వమూ, మరోవంక సాంప్రదాయంపట్ల గౌరవమూ కనిపించడం కొంతమందికి తికమకగా తోచవచ్చు. కానీ, నిశితంగా పరిశీలించి చూస్తే, ఆవిడా మనమూ కూడా నిత్యజీవితంలో ఎదుర్కొనే అనేక సంఘర్షణలు, పరస్పరవిరుద్ధమయినవీ, క్లిష్టతరమయినవీ ఆమె తననవలద్వారా చర్చకి పెడుతోంది అని అర్థమవుతుంది. //
  ఆసక్తికరం.
  ఈ విషయాన్ని గురించి ఆలోచించేవాడిని.
  ఎందుకంటే ‘విషవృక్ష ఖండన’ రచన మన ప్రజల నమ్మకాలపై గౌరవాన్ని సూచిస్తుంది. ఒక పరిధి దాటిన తిరుగుబాటు ధోరణి మంచిది కాదు అని తోస్తుంది.

  మెచ్చుకోండి

 10. @భావన, కాలిన జీవితానుభవం నున్చి వచ్చిన రచన మాత్రం ఆ అనుభపు తీవ్రత ను పాఠకుడి కి కూడా అనుభూతి ని కలిగించకలదేమో – నిజమేనండీ. నేను అలాగే అనుకుంటాను. ఇక్కడివ్యాఖ్యకి, ఉచితఇక్కట్లమీద వ్యాఖ్యకి కూడా ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 11. మాలతి గారు, చాలా బావుందండి లత గారి గురించి ఎన్తో సమగ్రం గా ఇచ్చారు. నిజమే కదా కొందరి రచనలు ఎందుకో తిరిగి ప్రచురించరు. ఆమె ను చూసిన అనుభూతి కలిగింది మీ పరిచయం చదివేక. అన్ని సార్లు అనుభవాలే రచనలు అవ్వనక్కర్లేదేమో కాని కాలిన జీవితానుభవం నున్చి వచ్చిన రచన మాత్రం ఆ అనుభపు తీవ్రత ను పాఠకుడి కి కూడా అనుభూతి ని కలిగించకలదేమో కదా.

  మెచ్చుకోండి

 12. శిరాకదంబంగారూ, మీకు కూడా శుభాకాంక్షలు.
  వి.బి.సౌమ్య, థాంక్స్, ఇలా నిర్లక్ష్యం చేయబడినరచయితలని వెలుగులోకి తీసుకురావాలని నాక్కూడా చాలా కోరికగా వుంది.
  నరసింహారావుగారూ, మీవ్యాఖ్య నాకు అర్థం కాలేదు. కాలాతీతవ్యక్తులు రాసింది శ్రీదేవి అని కింద గద్దె స్వరూప్ కి ఇచ్చిన సమాధానంలో వుంది. శ్రీదేవిగారి నవలగురించి తెలుగురచయిత్రులమీద నాపుస్తకంలో విపులంగా చర్చించేను కూడాను.

  మెచ్చుకోండి

 13. మంచి వ్యాసం అందించారు… ధన్యవాదాలు
  ’లత’ పేరు వినడమే కానీ ఎప్పుడూ చదవలేదు.. ’మోహనవంశీ’ చదివా అనుకుంటా కొంతభాగం ఇదివరలో ఎవరింట్లోనో…
  ఇలా ఇప్పుడు దొరకని రచనల గురించీ, రచయిత్రుల గురించీ మరిన్ని వ్యాసాలు రాయండి…

  మెచ్చుకోండి

 14. ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
  అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
  *** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
  SRRao
  శిరాకదంబం
  http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

  మెచ్చుకోండి

 15. @ వైదేహీ,
  @ మధురవాణీ,
  ఇప్పుడు ఈపుస్తకాలు ఎక్కడా దొరకవు. ఉంటే లైబ్రరీల్లో వుండాలి. డిజిటల్ లైబ్రరీలో కనిపించడంలేదు. నాబాధ అదే. మహారచయితలంటూ కొందరిపుస్తకాలు మళ్లీ మళ్లీ ప్రచురించవచ్చు కానీ కొందరిని నిర్లక్ష్యం చేయడం కూడా జరుగుతోంది. అంచేత మనసాహిత్య చరిత్ర అసంపూర్ణంగానే మిగిలిపోతోంది ఎంతో పురోభివృద్ధి సాధించినట్టు కనిపించినా.

  మెచ్చుకోండి

 16. మాలతి గారూ,
  ‘లత’ గారెవరో, ఆవిడ రచనలేవిటో బొత్తిగా తెలియకపోయినా కూడా మీ వ్యాసం చూసాక ఆవిడ తప్పక తెలుసుకోవాల్సిన రచయిత్రి అనిపించింది. తెలుగు సాహిత్యం గురించి పెద్దగా తెలియని నాలాంటివాళ్లకి చాలా ఆసక్తికరమైన రచయిత్రి గురించి వ్యాసం రాసి కొత్త విషయాలు తెలిసేలా చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఆవిడ పుస్తకాలు చాలానే ఉన్నాయంటున్నారుగా..మామూలు పుస్తకాల షాపుల్లో దొరుకుతాయా అవి?

  మెచ్చుకోండి

 17. మాలతి గారూ,
  వ్యాసం సమగ్రంగా బావుంది. మీరన్నట్లు ఆవిడ నిజంగా ప్రభంజనమే. ఊహాగానం,కొన్ని కధలు వారపత్రికలలో ఎప్పుడో చదివిన గుర్తు.లత గారి పుస్తకాలకోసం ప్రయత్నించినా దొరకలేదు. ఎక్కడ దొరుకుతాయో మీకు తెలిస్తే చెప్పండి
  మీరు ఇటువంటి వ్యాసాలు ఇంకా రాయాలి.

  వైదేహి

  మెచ్చుకోండి

 18. @ సుజాత, తప్పకుండాను. సాయంత్రం రారాదూ, తీసుకుపోదువు గానీ, 😀 లేదా, ఫరవాలేదనుకుంటే, గాలిపడగలూ, నీటిబుడగలు నవలకి నా అనువాదం నా తూలిక.నెట్ లోవుంది. ఇదుగో లింకు.http://www.thulika.net/2002June/Kites.html

  మెచ్చుకోండి

 19. మాలతి గారూ,
  నాకు లత గారి గురించి సమగ్రంగా తెలుసుకోవాలని ఎప్పటినుంచో ఉంది. వికీ పీడియాలో కేవలం “సమాచారాత్మకం” గా దొరికే వ్యాసం కాక. చాలా చాలా థాంక్స్! ఈ మధ్య లత రాసిన ఉమర్ ఖయాం ఒక పాత పుస్తకాల కొట్లో దొరికింది. గాలిపడగలూ నీటి బుడగలూ మాత్రం ఎక్కడా దొరకలేదు. ఇస్తారా నాకు, చదివేసి ఇస్తాను? 🙂

  ఆమె రాసిన పుస్తకాల్లో మా అమ్మకి బాగా ఇష్టమైన పుస్తకం ఒకటుండేది “పౌలస్త్యుని ప్రేమకథ” అని (రావణుడి ని సున్నితమైన ప్రేమికుడిగా వర్ణిస్తూ రాసిన నవల అనుకుంటాను)!అమ్మ చెప్పాక దాని కోసం ప్రయత్నిస్తే అది కూడా దొరకలేదు.దాని గురించి మీకేమైనా తెలిస్తే రాస్తారా?

  మెచ్చుకోండి

 20. @ కల్పన, నేను రాసినా, నువ్వు మళ్లీ రాయొచ్చు. నీబ్లాగు చూసేవారు నాబ్లాగు చూడకపోవచ్చు. లతలాటి రచయిత్రిమీద రాయడానికి ఎంతైనా వుంటుంది.
  @ఉష, ధన్యవాదాలు. తప్పక చదివి మీఆలోచనలు రాయండి
  @వేణు, మీరు అన్న factual error చూస్తానండీ మరొకసారి. ఇంకా ఎవరైనా ఈవిషయం సవిస్తరంగా చెప్పగలరేమో కూడా చూస్తాను. ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు.
  @గద్దె స్వరూప్, ఆంధ్రలో తెలుగు యూనివర్సిటీ, విశాలంధ్రలో దొరుకుతాయి. అమెరికానించి తెప్పించుకోవాలంటే పోస్టేజి ఎంతవుతుందో కనుక్కుని చెప్తాను. మీ ఈమెయిలు ఇవ్వగలరా? my ID malathini@gmail.com. Thanks.
  @ బుడుగోయ్, ఇప్పుడు ఆపుస్తకాలు బజారులో దొరక్కపోవచ్చు. లైబ్రరీల్లో తప్పకుండా వుంటాయి. ఫాయిదా అన్న వాడుక కూడా వుందండీ. ధన్యవాదాలు.
  @ SRRao, ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 21. మాలతి గారూ !
  తనలోని భావాలకు ఎలాంటి ముసుగులు లేకుండా, నిర్మొహమాటంగా బయిటపెట్టడం అందరికీ సాధ్యంకాదు. అలాంటి ధైర్యం గల రచయిత్రి లత. ఆవిడ గురించి వివరంగా, సమగ్రంగా అందించినందుకు ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 22. లత గారి గురించి ఎప్పుడూ చదవడమే తప్ప పుస్తకాలు మాత్రం ఎక్కడా దొరకవు ఈ తరానికి. అవెక్కడ కొనుక్కోవాలో కాస్త చెబుదురూ..

  అలాగే మీ వ్యాసంలో “జమీందారీ ఫాయిదాలో” అన్న పదప్రయోగం ఎందుకో తప్పనిపిస్తుంది. “జమీందారీ ఫాయాలో” అని రాయాలనుకుంటా. correct me if i am wrong.

  మెచ్చుకోండి

 23. “తెలుగు రచయిత్రులమీద నేను రాసిన పుస్తకం మీరు చదవాలి. చాలా విషయాలు తెలుస్తాయి ఆకాలం రచయిత్రులగురించి.”
  నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఎలా తెప్పించుకోవచ్చో చెప్పగలరా? నెనర్లు.
  కల్పన గారూ తప్పకుండా చదువుతాను.

  మెచ్చుకోండి

 24. మాలతి గారూ, లత గారి గురించి మీ టపా చాలా విశేషాలు తెలియజేసింది.ఆమె వ్యక్తిగత జీవిత సంఘర్షణ రచనల్లో ప్రతిఫలించిన సంగతి బాగా రాశారు. మీకు అభినందనలు!

  అయితే, ఒక factual error దొర్లింది. రంగనాయకమ్మ గారి ‘రామాయణ విషవృక్షం’ వాల్మీకి ‘రామాయణం’పై విమర్శ. అంతే కానీ అది విశ్వనాథ సత్యనారాయణ గారి ‘శ్రీ మద్రామాయణ కల్పవృక్షం ’పై విమర్శ కాదు. మీరొక్కరే కాదు; కల్ప వృక్షం- విష వృక్షం అనే పేర్లను బట్టి చాలామంది సాహితీ వేత్తలు కూడా ఇలా పొరబడుతుంటారు.

  మెచ్చుకోండి

 25. ఈ వీకెండ్ మంచి వ్యాసం చదవటంతో పూర్తైంది. థాంక్స్ మాలతి గారు. మునుపు లత గారి రచనలు చదివాను కానీ ఇంత లోతుగా తరిచి చెప్పిన విశ్లేషణ చూడటం ఇదే. నిజానికి చదివినవి కూడా మరిచిపోయాను. ప్రయత్నించి చదవాలిక. “బాధ పడ్డవారికే బాధ అర్థమవుతుంది.” ఇది మాత్రం నేను నమ్మే, నన్ను నడిపే జీవిత సూత్రం,

  మెచ్చుకోండి

 26. మాలతి గారు, లత మీద నా వ్యాసం కూడా పూర్తి కావచ్చింది. మీరు నాకన్నా ముందున్నారు. అభినందనలు. మీరు రాసేసిన పాయింట్లు నేను రాయక్కరలేదుకదా…అందుకు…
  గద్దే స్వరూప్ గారు, లత గురించి మరి కొన్ని వివరాలు, నా జ్ఞాపకాలు నా బ్లాగ్ లో త్వరలో పెట్టబోతున్నాను. అలాగే మీరు ప్రస్తావించిన కాలాతీత వ్యక్తుల గురించి కూడా. వీలైతే అవి పెట్టినప్పుడు వచ్చి చదివి మీ అభిప్రాయం చెప్పండి.

  మెచ్చుకోండి

 27. @ gaddeswarup, కాదండీ. కాలాతీతవ్యక్తులు రాసింది పి. శ్రీదేవి. ఈవిడ లతగానే సుప్రసిద్ధురాలు. తెలుగు రచయిత్రులమీద నేను రాసిన పుస్తకం మీరు చదవాలి. ఆనాటి నవలలు,కథలూ, గాలిపడగలూ, నీటిబుడగలూ, కాలాతీతవ్యక్తులూ కూడా విస్తృతంగా చర్చించాను నాపుస్తకంలో.

  మెచ్చుకోండి

 28. లీలగా గుర్తుకు వచ్చింది. ‘కాలాతీతవ్యక్తులు ‘ రచయిత్రి ఈవిడేనా? ఈపుస్తకంబాగుంది ఎవరూ ఈరచయిత్రిని గురించి రాయటంలేదేమిటి అనుకునేవాడిని.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.