ఆరుద్ర. వ్యాసపీఠం సమీక్ష

వ్యాసపీఠంలో 39 వ్యాసాలున్నాయి. ఒకొకవ్యాసం విడివిడిగా చూస్తే నిడివి తక్కువే అయినా వస్తుపుష్టి గలది.

తేలిగ్గా మనకి అర్థమయేభాషలో విషయం విడమర్చి సోదారణంగా చెప్పడం ఆరుద్రకి కరతలామలకం. శీర్షికలు చూస్తే చాలా మామూలువిషయం అనిపిస్తాయి కానీ ఒకొక్క వ్యాసంలోనూ ఆయన పొందుపరిచిన సమాచారం సామాన్యపాఠకులచేత అమ్మో అనిపిస్తాయి. ఇంత కథా కమామీషూ ఉందా అనిపిస్తాయి. సాహిత్యాభిమానులకి మంచివ్యాసం చదివేం అన్న తృప్తి గలిగిస్తాయి. పరిశోధకులకి విలువైన సమాచారం అందించి మరింత సమాచారం వెతుక్కోడానికి పనికొచ్చేవిగా ఉంటాయి. ప్రధానకారణం ఏ అంశాన్నయినా నిశితంగా పరిశోధించి, మూలాలను వెతికి తీసి మనముందు ఉంచుతారు. మళ్ళీ మనం మీమాటకి ఋజువేదీ అని అడగఖ్ఖర్లేదు. ప్రతివ్యాసంలోనూ ఆరుద్రగారి ఫరిశోధనాప్రవృత్తి కనిపిస్తుంది. వస్తువైవిధ్యం చూస్తే ఆరుద్రగారికి గల వస్తునిష్ఠ తెలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరుద్రరచనలలో వస్తుపుష్టి, వస్తువైవిధ్యం కూడా అసాధరణమే. “సాహిత్యపరిశోధన వడ్డించిన విస్తరి కారాదు,” అన్నారు ఒకవ్యాసంలో. (ఖడ్గ  తిక్కనా, కవి తిక్కనా). ఒట్టి మాటలు కాదు. ఈవ్యాసాలలో అడుగడుగునా ద్యోతకమవుతుంది ఆ నియమం.

ఏకలవ్యుడు అంటే ద్రోణాచార్యుడికి  బొటనవేలు కోసి ఇచ్చినవిషయమే మనకి చటుక్కున గుర్తొస్తుంది. ఏకలవ్యుని పుట్టుపూర్వోత్తరాలు అన్నవ్యాసంలో ఈ బొటనవేలు తెగ నరికే కధ నన్నయ కల్పన, మూలగ్రంథాలయిన సంస్కృతభారతం, హరివంశంలో లేదని చెప్తూ, ఆవీరుని జీవితంలోని అనేకఘట్టాలు “పువ్వు విచ్చుకున్నట్టు”  మనముందు పరిచేరు. నన్నయ, తిక్కన చెప్పని పూర్తికథ సంస్కృతభారతంలోనూ హరివంశంలోనూ ఉన్న అనేక వివరాలు అందించేరు తమవ్యాసంలో.  ఏకలవ్యునికీ పాండవులతోనూ, కృష్ణుడితోనూ కూడా రక్తసంబంధం ఉంది. భారతయుద్ధంలో పాల్గొని వీరమరణం పొందేడు. ఇలాటి విషయాలెన్నో మనకి తెలుస్తాయి ఈ వ్యాసం చదివితే.

కృష్ణుడు మత్స్యయంత్రం కొట్టాడనీ, ఆ సంఘటనను మన తపాలాశాఖవారు స్టాంపుమీద అచ్చేసేరనీ కూడా ఈ “కృష్ణుడూ కొట్టాడు మత్స్యయంత్రం” అన్నవ్యాసంద్వారానే తెలుసుకున్నాను. ఈవ్యాసం చివర ఆరుద్రగారు రాసిన తాజాకలంలో హాస్యంతోపాటు వ్యథ కూడా ఉంది. ఆరుద్రశైలి నడవలో కూర్చుని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నట్టు ఉంటుందన్నాను కదా పైన. వారి సున్నితమైన హాస్యం, వ్యంగ్యం ఆశైలిలో భాగమే.

మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన వ్యాసం ఖడ్గతిక్కనా, కవి తిక్కనా అన్నవ్యాసం. నిజానికి ఈవ్యాసంలో రెండు, మూడు కోణాలు మనని ఆకట్టుకుంటాయి. కవి తిక్కన సినిమా తీయమని కె.వి. రెడ్డిగారితో యాదాలాపంగా అన్నమాట తనని సమగ్రాంధ్ర సాహిత్యచరిత్ర రచనకి సంసిద్దుణ్ణి చేసిందన్నారు. మరోకోణం ఈ ఒకరా ఇద్దరా? అన్న అంశంమీద “మాంగారు” వెలిబుచ్చిన అభిప్రాయాన్ని పూర్వపక్షం చేస్తూ ఆరుద్ర ఎత్తి చూపిన ఋజువులు. “మీ మాంగారు ఒకరే అని అన్నాడే” అని ఎవరో ఆరుద్రతో  అనడంతో ఆరుద్ర ఈవ్యాసంపొడుగునా అదే పదం వాడడం నవ్వు తెప్పిస్తుంది. “మాంగారు అరచెవితో విని ఉంటారు,” అన్నమాట హాస్యానికే అని ఉండవచ్చు కానీ ఆరుద్రకి గల వస్తునిష్ఠకి కూడా నిదర్శనం. ఏ విషయమైనా సాకల్యంగా పరిశీలించి చూడకుండా వ్యాఖ్యానాలు చేయకూడదు. అరచెవి అన్నపదం నేను ఇదివరకు వినలేదు. “సగం సగం వింటాడు” అన్న నుడికారానికి ఆరుద్రగారి సృజనేమో ఇది.

అన్నమయ్య ఆడినమాట అమృతగావ్యం, పాడినపాట పరమగానం  అన్నవ్యాసంలో సంగీతానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలే కాక, భాషనుగురించి చెప్పిన విశేషాలు కూడా ఉన్నాయి. “తాళ్ళపాకవారిని చదవకపోతే తెలుగు రాదు,” అన్నారుట వేటూరి ప్రభాకరశాస్త్రిగారు.

కచేరీలో పాడవలసినవీ, కాపాడవలసినవి” అన్నవ్యాసంలో కచేరీలపద్దతి శాస్త్రీయంగా పూర్వం ఎంత పకడ్బందీగా ఉండేదో, ఏవరసలో ఏవి పాడాలో చెప్తూ, క్రమంగా ఎలా మారిందో వివరించేరు. ఆదిమసమాజంలో జీవనవిధానం సాముదాయకంగా ఉండేది. నాగరికత విస్తరించుకున్నకొద్దీ ప్రదర్శకులూ ప్రేక్షకులూ అన్న విబేధాలు ఏర్పడ్డాక కచేరీపద్ధతిలో కూడా చెప్పుకోదగ్గ మార్పులొచ్చేయి. ఈవ్యాసం చూస్తే, కచేరీలస్థాయి తగ్గిందన్న ధ్వని ఉంది.

నేను సుమారుగా 40 ఏళ్ళగా కచేరీలలో సంగీతం వింటున్నాను. ఈ 40ఏళ్ళలోనే మార్పు వచ్చినట్టు అనిపించింది నాకు. ఆరుద్రగారు కొన్ని వందలసంవత్సరాల చరిత్ర తిరగతీసి, చూపిన కచేరీలగతి చూస్తుంటే నాకు అయ్యో అనే అనిపించింది. పల్లవి శేషయ్యగారు సావేరి రాగం 8 గంటలసేపు గానం చేసేరుట. పాడడంమాట వదిలేయండి, ఇప్పుడు అంతసేపు కూర్చుని వినగల శ్రోతలు ఉన్నారా? మన శాస్త్రీయసంగీతంలో మనోధర్మం పాడేవారిలోనూ వినేవారిలోనూ కూడా ఒక ప్రత్యేకత గలది. ఈనాటి కచేరీలగురించి సూక్షంగా రచయిత అభిప్రాయం చూడండి.

నేను ఈమధ్య రాసిన ఒక టపాలో ఈనాటి సంగీతవిద్వాంసులు శ్రోతలఅభిరుచికి అనుగుణంగా తమ పద్ధతి మార్చుకుంటున్నారని రాసేను. ఈవ్యాసం చూసేక నాఅభిప్రాయం తప్పు కాదని తోచింది.

కర్నాటకసంగీతానికి, తెలుగు కృతులకీ తమిళులు చేసిన సేవ మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. “తనగీతి అరవజాతిని పాటకులుగా తీర్చి దిద్దిన తెలుగువాణి” అని మురిసిపోతాం. ఈ గొప్పలవెనక తమిళులఅవగాహన ఆరుద్ర ఎంతో సంయమనంతో విడమర్చి చెప్తారు. గారవించవలసినచోట గౌరవం ఇవ్వడం ముఖ్యం. అయితే తమభాషని తక్కువ చేసుకోనక్కర్లేదు. “మాతృభాషను గౌరవించేవారే మరొకభాష ఘనతను అవగాహన చేసుకోగలరు,” అంటారు ఆరుద్ర. (తమిళ ఇశై, చెట్టినాడు సేవై). తమిళ ఇశై చెట్టినాడు సేవై, సుందర తెలుంగినిల్ పాట్టై సేత్తు-  ఈ రెండు వ్యాసాలలో సమాచారం మరో పుస్తకం రాయడానికి సరిపడినంత ఉంది. 1942లో అణ్ణామలై చెట్టియార్ ఆధ్వర్యంలో తమిళగాయకులు కచేరీలలో ఆదినీ తుదినీ తమిళపాటలనే పాడాలని తీర్మానం ప్రతిపాదించేరుట. అనేకమంది ప్రముఖ గాయకులు, వాగ్గేయకారులు స్పందించి తమిళకృతులు రాసేరు.

నాకు కొత్తగా తెలిసిన మరొకవిషయం తెలుగు చదవడం రాని తమిళులు, మహారాష్టులు ఆయాభాషలలిపిలో తెలుగు కృతులు రాయించుకుని పాడించుకున్నారన్నది. ఒక భాష మరొకభాష లిపిలో రాయడం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని నాకు ఇప్పుడే తెలిసింది.

శీర్షికలు కుతూహలం రేపేవిగా ఉంటాయి కానీ వ్యాసంలో వస్తువు మాత్రం శీర్షికకి మించి మరింత విస్తృతంగా ఉంటుంది. అశోకుడూ- ఆడవాళ్లూ శీర్షిక చూస్తే అశోకుడికాలంలో ఆడవాళ్ళస్థానం కాబోలు అనుకుంటాం కానీ ఆకాలంలోని అనేక ఇతరఅంశాలు ఉన్నాయి. ఆనాటి నోములూ వ్రతాలు సూచనప్రాయంగా ప్రస్తావించినా, శిలాశాసనాలగురించి విపులంగా రాసేరు.

ఈవ్యాసం చివరివాక్యం మాత్రం నాకు సందేహాస్పదంగానే అనిపించింది. “స్త్రీలు మారరేమో” అన్నది. నేను చూసినంతవరకూ చాలామంది మగవాళ్ళలోనే భక్తి, కులం పట్టుదలలూలాటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముందంజ వేస్తున్న స్త్రీలని, ముఖ్యంగా కూతుళ్ళని వెనక్కి లాగే గుణం మగవాళ్లలోనే ఎక్కువ. ఆడపిల్ల తాను కోరినవరుడిని పెళ్ళి చేసుకుంటానంటే మొదట అడ్డు పడేది తండ్రే. ఇది మనకి గౌరవం కాదు, మనవంశంలో లేదూ అంటూ ఆడపిల్లలికి ఎక్కువ ఆంక్షలు పెడుతున్నది మగవాళ్లే. ఇది నేను ప్రత్యక్షంగా చాలా ఇళ్ళల్లో చూసేను.

కొన్ని వ్యాసాలు సాహిత్యచరిత్రకి చెందినవయితే, కొన్ని సామాజికచరిత్రకి చెందినవి.

సంఘంలో స్త్రీలహక్కులగురించిన చర్చ రావణాకాష్టంలా అనాదిగా కాలుతూనే ఉంది. “పుత్రిక ఎలాంటి కూతురు“వ్యాసంలో చాలా ఆసక్తికరమైన వ్యాసం.  సూక్ష్మంగానే అయినా వేదకాలంనుండీ ఇప్పటివరకూ వచ్చిన మార్పులలో వారసత్వం, ఆస్తిహక్కులగురించి చదువుతుంటే మనం నిజంగా ముందుకొచ్చేమా వెనక్కొచ్చేమా అన్న సందేహం కలక్కమానదు. పుత్రిక అన్నపదానికి ప్రత్యేకమైన అర్థమూ. తద్వారా ఆ అమ్మాయిస్థానంగురించిన వివరణ తప్పకుండా ప్రతివారూ చదివి తెలుసుకోవాలి.

కొన్నివ్యాసాలలో సాంఘికచరిత్రకి సంబంధించిన అంశాలు పరామర్శించేరు. “స్థలనామపరిశోధనాసంస్థల ఆవకశ్యత” అన్నవ్యాసంలో ఊళ్లపేర్లూ, ఇంటిపేర్లూ గురించిన విషయాలు అంత ఆసక్తికరంగానూ ఉన్నాయి. శీర్షిక ఊళ్ళపేర్లూ, ఇంటిపేర్లూ అన్నా, వ్యాసం అంతా ఒక్క రాజమండ్రిగురించే.  రాజమండ్రిగా చాలామందికి తెలిసిన రాజమహేంద్రవరం పేరుచరిత్ర. ఇది ఉదాహరణగా చెప్పి ఇలా ఊరుపేర్లగురించిన చరిత్ర పరిశోధనలు జరిపితే ఎన్ని వింతలూ విశేషాలూ తెలిస్తోయో అంటారు ఆరుద్ర!

ధర్మవడ్డీ వ్యాసంలో వడ్డీ పుట్టు పూర్వోత్తరాలు చెప్పుకొచ్చేరు. చదువుతుంటే ఈరోజుల్లో క్రెడిట్ కార్డు కథలకి తీసిపోదనిపించింది. ఈనాటి వడ్డీకి కొన్ని వందలసంవత్సరాలక్రితం ఉన్న పద్ధతికీ సహస్రాంతం తేడా కనిపిస్తోంది.

1982ప్రాంతాలలో ఆరుద్ర లండన్, బర్మింగ్‌హాం పర్యటించేరు. ఈవ్యాససంపుటిలో చివరి ఎనిమిది వ్యాసాలు ఆయన ఆపర్యటనలో సేకరించిన సమాచారం, సేకరించడంలో అనుభవాలు, కలిసినమిత్రులు సాకల్యంగా సందర్భానుసారంగా Tennyson, Wordsworth, Byron, Shakespeare వంటి సుప్రసిద్ధ రచయితలగురించి ఎన్నో విషయాలు ప్రస్తావించేరు.  విషయం పూర్తిగా సాహిత్యపరంగానే.

బ్రిటిష్ గ్రంథాలయంలో వ్రాతప్రతులగురించి చెప్పినవిషయం ఒకటి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అట్టలమీద ఉన్న పేరు వేరు, లోపల ఉన్న పుస్తకం వేరు. అట్టమీద సిరిసిరమువ్వలు అని ఉంటే, లోపలిపుస్తకం లిమరిక్కులు. ఆశాఖలో ఉద్యోగిని correction slips రాసిస్తే, సరి చేస్తాం న్నారుట. అలాగే విక్రమార్కుడికథలు అన్నపుస్తకం తెరిచి చూస్తే రంగనాథరామాయణం ఉందిట.

కొన్ని తప్పులు దిద్దుకోగలం. కాని కొన్ని దిద్దుకునేలోపున తప్పులు ప్రచారం అయిపోతాయి. ఈమధ్య నాకు షాకు ఇచ్చిన ఒక ఉదంతం, అసందర్భమే అయినా ప్రజలకు తెలియవలసిన అవుసరం ఉంది కనక మనవి చేస్తాను.

సుప్రసిద్ధ గేయరచయిత బాలాంత్రపు రజనీకాంతరావుగారి జీవితవిశేషాలు తెలుసుకుందాం అని అంతర్జాలంలో వెతకబోతే నీలితెరమీద కుడివేపు గూగులాచార్యులు అఁదించిన సమాచారం ఇలా ఉంది.

వారికి ఇలా ఎక్కడ కనిపించిందో అని గంటన్నరసేపు గాలించేను కానీ స్పష్టంగా తెలీలేదు. ఇంగ్లీష్ వికిపీడియాలో వాక్యనిర్మాణం మూలంగా జరిగిన పొరపాటు కావచ్చు. (అక్కడ ఆ వాక్యం మార్చేను నిన్న). ఇలాటి పొరపాట్లు ఎన్ని అపార్థాలకి దారి తీస్తుందో నేను చెప్పఖ్ఖర్లేదు కదా.

నావ్యాసాల్లో కూడా అప్పుడప్పుడు పొరపాట్లు ఎత్తిచూపుతారు పాఠకులు. నేను దిద్దుకుంటాను ఈబ్లాగులోనే కనక. అదే ప్రింటులో వచ్చినవి శాశ్వతంగా ఉండిపోయి, అలాగే ప్రచారం అవుతాయి. చెప్పొచ్చేదేమిటంటే నాపొరపాట్లు కూడా ఇలాగే జరిగిఉంటాయి. ప్రచురించిన పుస్తకాలు చూసి నేను రాస్తాను. నేను రాసింది చూసి మరొకరు రాయొచ్చు.

ఆరుద్రని హేతువాదిగా గుర్తిస్తారు ఈనాటి సాహిత్యప్రముఖులు. అది ఆయనే చెప్పుకున్నారో హేతువాదులు ఆయన్ని దత్తత తీసుకున్నారో నాకు తెలీదు. నన్ను అభ్యుదయవాది అనీ, స్త్రీవాది అనీ అన్నవాళ్ళు కూడా అన్నారు కనక నాకు ఈ సందేహం కలిగింది.

సాహిత్యం, సమాజంలో భావజాలం మారుతాయి. కొందరు ఏదో ఒకవాదాన్ని తీసుకుని ఏకోన్ముఖంగా, తిరుగుబాటుధోరణిలో రాస్తే, కొందరు మార్పులకనుగుణంగా పూర్వపు భావజాలాన్ని ఆధునీకరణ చేస్తూ తమభావాలను కూడా తదనుగుణఁగా మలుచుకుంటారు. రావిశాస్త్రీ, ఆరుద్రా ఈ రెండోకోవలో చేర్తారని నాకు అనిపిస్తుంది.

దీపావళికి ముఖ్యం నరకాసురుడా బలి చక్రవర్తా?” అన్నవ్యాసంలో “మన వ్రతగ్రంథాలలో ఉన్నతవర్గాలవారివే తడుముతారు కానీ శ్రమజీవుల ఆచారాలనూ నోములనూ చెప్పరు. చెప్పినా అంతరార్థాలు చెప్పరు” అనడంలో ఈప్రవృత్తి కనిపించింది నాకు.

అనడంలో కూడా అదే నాకు ధ్వనించింది. పండుగలను, వ్రతాలనూ ప్రస్తుతానికి అన్వయించుకోవాలి. మేధావులు స్ఫూర్తితో ఈ అన్వయాలు ఇస్తే, సామాన్యులు అనుసరిస్తారు.

నేను కూడా మాలపల్లిగురించి రాస్తున్నప్పుడు అదే అడిగేను పుస్తకంపేరు మాలపల్లి కానీ మొత్తం నవలలో మాలవారి ఆచారవ్యవహారాలగురించి మనకి తెలిసిందేమీ లేదు అని.

ఇలా రాసుకుంటూ పోతే, ఈ పుస్తకంమీద మరో పుస్తకం రాయొచ్చు అనిపిస్తోంది. దాదాపు ఈ వ్యాససంపుటిలో ఈనాడు సాహిత్యంలో ఉన్న అన్ని రంగాలూ చోటు చేసుకున్నాయి. సినిమా, నాటకాలతో సహా. ఆరుద్రగారి వ్యాసపీఠంలో వ్యాసాలు ఎంత ఆసక్తికరమైనవో, ఎంత వస్తుపుష్టి గలవో చెప్పడానికి ఇది చాలేమో.

ఈ పుస్తకం ప్రచురణకర్తలు New Students Book Center, Vijayawada. 1985.

Archive.org లో పిడియఫ్ కాపీ కూడా ఉంది.

ఆరుద్రగారి “చిన్న కథలు” మీద నావ్యాసం ఇక్కడ

000

(ఏప్రిల్ 22, 2018)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఆరుద్ర. వ్యాసపీఠం సమీక్ష”

 1. బాగా రాసేరు.
  కవి తిక్కన సినిమా తీయమని బి.యన్. రెడ్డిగారితో యాదాలాపంగా అన్నమాట తనని సమగ్రాంధ్ర సాహిత్యచరిత్ర రచనకి సంసిద్దుణ్ణి చేసిందన్నారు.
  కాదేమో.
  కె.వి. రెడ్డి గారేమో.
  శ్యామ్

  మెచ్చుకోండి

 2. మీకు నచ్చినందుకు సంతోషం వనజగారూ. వ్యాసంలో లింక్ ఇస్తే మళ్ళీ లింకు మారిపోయనప్పుడల్లా నేను చూసుకోవలసివస్తుందని ఇవ్వలేదు. ఆర్కైవ్.ఆర్గ్ లో పిడియప్. ఉంది ఇదుగో లింకు https://archive.org/stream/in.ernet.dli.2015.497194/2015.497194.aarudra-rachanalu#page/n5/mode/1up

  మెచ్చుకోండి

 3. చాలా పరిచయం చేసారు . వ్యాస పీఠం కోసం వెతుక్కోవాలిప్పుడు . ఒకే విషయాన్ని తీసుకుని మూర్ఖంగా వాదించే వాళ్లకి ఈ వ్యాసాలు చదవడం అత్యవసరం. చాలా చాలా ధన్యవాదాలు .

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.