దండం దశగుణం భవేత్ అంటే
విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు చఅంధ్యే తమసి వార్ధక్యే దండం దశ గుణం భవేత్.
అంటే పక్షులు, కుక్కలు, అమిత్రులు (జాలమిత్రులు కానివారు), పాముల, పశువులబారినుండి తప్పించుకోడానికి, బురదలో, నీటిలో, అందత్వం ప్రాప్తించినప్పుడు, చీకటిలో నడుస్తున్నప్పుడు కర్రసాయం పది విధాలు అని.
దాదాపు 20 ఏళ్లక్రితం చెట్లకింద నడుస్తున్నప్పుడు కనిపించిన ఒకకర్ర ఊరికే ఏరుకొచ్చేను. ఆ తరవాత మంచులో నడుస్తున్నప్పుడు దాన్ని చేతికర్రలా వాడుకున్నాను. విస్కాన్సిన్ వదిలేసినా ఆకర్ర
పారేయబుద్ధి పుట్టలేదు. ఇప్పుటికీ ఉంది.
ఈరోజు మామిత్రులు మళ్ళీ గుర్తుకి తెచ్చేరు ఈ చేపాటికర్ర.
000
(ఎన్నెమ్మ కతలు 23)
తెల్లారిలేచి కాఫీకప్పు పుచ్చుకుని కిటికీలోంచి చూస్తున్నాను ఉప్పుపాతరల్లా పరుచుకున్న మంచుకుప్పులు. అమెరికా వచ్చి 35 ఏళ్లయింది. ఇదే తొలిసారి నాకు మంచుని చూస్తే కోపం రావడం.
స..రీ…ఘ్ఘా ఏడాదిక్రితం ఇదే వేళకి నాజీవితంలో జరిగిన రెండు మహత్తర ఘటనలు – బ్లాగు తెరుచుకోడం, చెయ్యి విరుచుకోడం. బ్లాగు బాగానే సాగుతోంది. చెయ్యి చక్కగా పని చేస్తోంది.
బాధల్లా పునః ప్రారంభమయిన మంచే. ఇంతవరకూ ఎప్పుడూ నాఅనుభవంలోకి రాని భయం ఈసారి ఈమంచు కలిగిస్తోంది. ఇదివరకు చాలాసార్లే పడినా ఎప్పుడూ ప్రమాదాలు జరగలేదు. దానికి కారణం నేను పుడమితల్లికి అట్టే దూరం లేకపోవడమే. ఎలా కొలిచినా అయిదడుగులకి అరంగుళం తక్కువ. అంచేత వెలాసిటీ పుంజుకునేలోపున పుడమితల్లి ఆప్యాయంగా ఆదుకుని బుజ్జగించి పంపేసేదన్నమాట. ఇప్పుడు కూడా భూమాత అంతదయగానూ వుందనుకుంటాను కానీ నాలోనే భయదేవత గునుస్తోంది.
వీధిలోకి వెళ్లాలంటే గుండెల్లో చిన్న వణుకు. బుర్రలో నూతనమార్గాలకోసం వేట.
చాలామంది చాలా సలహాలు ఇచ్చేరు.
అసలు ఇల్లు కదలకు.
ఎక్సర్సైజు సైకిలు కొనుక్కుని నట్టింట్లోనే నడక సాగించు.
ఎక్సర్సైజు విడియో కొనుక్కుని టీవీలో చూస్తూ డాన్సు చెయ్యి.
షాపింగ్ మాలులుకి వెళ్లు. మాలులో ఎనిమిది ప్రదక్షణలు ఒక మైలు అని లెక్కలు కూడా చెప్పేస్తారు.
ఇవేవీ నా తత్త్వానికి సరిపడవు. ఎందుకంటే,
నేను రోజంతా ఇంట్లోనే వుంటాను కనక, నడక కూడా ఇంట్లోనే చేసేస్తే జైల్లో వున్నట్టు వుంటుంది. వీధిలోకి వెళ్లడానికి ముఖ్యమైన కారణం ఈచెరనించి బయట పడడానికే.
షాపింగు మాలులో నాలుగ్గోడలమధ్యే నడవడం కనక నాకు తృప్తిగా వుండదు. పైగా అలా తలుపులు మూసుకున్న భవనంలో తిరిగేజనాలవల్ల మరింత ఇరుగ్గా అనిపిస్తుంది. ఇంగ్లీషులో చెప్పాలంటే no fresh air అన్నమాట.
విడియోలు చూస్తూ డాన్సు చెయ్యడం ..ప్చ్ . ఎందుకు లెండి … మీరే ఊహించుకోండి.
ఇలా ఆలోచిస్తున్నాను. రెండు కప్పులు కాఫీ అయింతరవాత, మావీధుల్లో హిమాలయాలమీద విజయం సాధించే దారి కనిపించింది.
నాలుగురోజుల కిందట, మనసు చిక్కబట్టుకుని, అడుగులో అడుగు వేసుకుంటూ, ఒకొక కాలే ఎత్తెత్తి వేస్తూ చాదస్తపు బ్రాహ్మడిలా బయల్దేరేను. (ఎత్తెత్తి కాలేస్తే ఎంగిలాకుమీదే పడిందనీ .. )
గడ్డ కట్టిపోయిన మంచుమీద పొడి మంచు తేలిగ్గా పరుచుకుని చూడ్డానికి నిరపాయకరంగా కనిపించి మోసం చేస్తుంది. ఇవన్నీ నాకెరికే. అంచేత అన్నమాట అలా ఎత్తెత్తి కాలేస్తూ … నెమ్మదిగా నడవడం. మామూలుగా పావుగంటలో చేరే దూరానికి ముప్పావుగంట పట్టింది. సరే నడక దృష్ట్యా నేను నడిచిన దూరం అట్టే లేకపోయినా కొత్తగాలి పొందితిని కదా అని నన్ను సముదాయించుకున్నాను. నిజానికి కొత్తగాలి ఏమిటి లెండి పక్కనించి పోతున్న కారులు విరజిమ్ముతున్న బురదమంచు చూస్తే తెలుస్తుంది మన పొల్యూషన్ ఏ స్థాయిలో ఉందో.
మర్నాడు నాకు మరో ఆలోచన వచ్చింది. నేను ఎప్పుడో పదేళ్లకిందట ఓసారి అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఏరుకొచ్చిన కర్రముక్క.నాలుగడుగులు పొడుగు వుంటుంది. వంకరటింకరగా వున్నా, పైబెరడు రాలిపోయి, నున్నగా నాకయితే బాగుంది. అలా పుల్లలూ, కర్రముక్కలూ ఏరుకు తెచ్చుకోడం నాకో సరదా. ఎందుకంటే చెప్పలేను. అదంతే.
చేతిలో చేపాటికర్రా, బుజంమీద తుండగుడ్డా మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం అని నాకు గట్టినమ్మకం.
చేపాటికర్ర ఊతం మాత్రమే కాదు, మీదమీదకొచ్చేసే పాముల్ని కొట్టడానికీ, పశువుల్ని తోలడానికీ, దొంగలబారి పడకుండానూ పనికొస్తుందనే కదా కర్ర పుచ్చుకుని బయల్దేరతారు మన పల్లెల్లో. అలాగే బుజాన వేసుకునే పైపంచె కూడా ఎండవేళ తల కాయడానికీ, చేతులూ మొహం తుడుచుకోడానికీ పనికొస్తాయి. అసలు మనకి ఏవస్తువయినా multi-purpose …
ఇంతకీ నేను అలా ఏరుకొచ్చిన కర్ర ఊతగా పుచ్చుకు వెళ్లి చూద్దాం అనిపించింది. మరోపక్క చేతికర్ర పట్టుకోగానే అఫిషియల్‌గా ముసిల్దయిపోయినట్టే లెక్క.
ఇలా కొంచెంసేపు నాలో నేనే సదసత్సంశయానికి లోనై. ఆఖరికి ఎవరేం అనుకుంటే నాకేం అనీ, పురవీధుల దర్శనమే నాకు ప్రధానమనీ సమాధానం చెప్పుకుని బయల్దేరాను. ఆశ్చర్యం. ఏచెట్టుకిందో తోచక ఏరుకొచ్చిన ఆ సీదా కర్ర ఎంత బలాన్నిచ్చిందో …
నిగడదన్ని నిటారుగా, హుషారుగా నడిచేసి తిరిగొచ్చాను, నాకెంత సంతోషంగా వుందో చెప్పలేను. మాఅమ్మాయిని పిలిచి చెప్పేను నేను సాధించిన ఘనవిజయం.
“నేను నీకు నిజం చేతకర్ర కొని ఇస్తాలే” అంది అది.
నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే నాకు improvise చేయడం ఇష్టం. వున్నవాటితోనే జరుపుకోడంలో నాకు ఆనందం. అది నాకు సహజం. చాలా ప్రయత్నాలు చేసింతరవాత కుదరకపోతే అప్పుడు వెళ్తాను నిజవస్తువు కొనడానకి. ఒకొకపుడు ఇలా ఉన్నవాటిని అమర్చుకోడంలోనే ఎక్కువ ఖర్చు కావచ్చు కూడాను. ఏంచెప్పను! ఎవరి వెర్రి వారికానందం.
ఇంతకీ నేను ఏరుకొచ్చిన కర్ర కొంచెం పొడవెక్కువైనట్టు అనిపించింది. మధ్యలో వున్న గుణుపులు కాస్త మొనలు దేలి గుచ్చుకునేలా వున్నాయి. అంచేత ఆ గుణుపులు అరగదీయడానికి ఆకురాయి తెచ్చేను. పొడుగు తగ్గించడానికి చిన్న రంపం తెచ్చేను. అటో గంటూ ఇటో గంటూ పెట్టి విరవబోతే పుటుక్కున విరిగిపోయింది పెన్సిలంత తేలిగ్గా. అందుకే అంటున్నాను ఈ కర్రముక్క నాకు ప్రాణదాయకి కాకపోవచ్చు. కానీ అది ఇచ్చిన ధైర్యం మాత్రం అపారం.
మా అమ్మ అంటుండేది పశువుకి తిన్నది బలం, మనిషికి వున్నది బలం అని. నిజంగా ఆ ఎండుకొమ్మ నన్ను ఆదుకోకపోవచ్చు. కానీ అది చేతిలో వుందన్న ధైర్యం అంత బలాన్నిచ్చింది.
(డిసెంబరు 2008. )
నాగేశ్వరమ్మ, ధన్యవాదాలు.
మగవాడు, హాహా. హాస్యానికి రాసింది అందరూ హాస్యంగానే తీసుకోవాలి. చేతిలో కర్ర వుంది కనక కర్రసాము కూడా నేర్చుకుంటానేమో. :p
మెచ్చుకోండిమెచ్చుకోండి
మీ ఆలోచన ప్రకారం – “అఫిషియల్‌గా ముసిల్దయిపోయినట్టే లెక్క” పైగా మీ జవాబులో కూడ – “ఆతరవాత కర్ర పుచ్చుకు వెళ్లేను కదా.” అని అన్నారు.
దానిని సాగతీసి – చేతి కర్ర / చేపాటి కర్ర / చేవకర్ర పట్టుకున్న వారందరూ – ముసలి వారని అనుకుంటే, మీరు అందుకోవడమే కాకుండా, “వారి”ని కూడ ముసలి వారిని చేసేసారు కదా అని 🙂 నా భావన? 😉
పన్ను పన్నలేదనుకుంటా! 😦
మెచ్చుకోండిమెచ్చుకోండి
malathi garu bagundandi mee chepaati karra. America lo 35 ella nunchi vuntunna mee telugu lo lopa memi ledu. chala bagundi.
మెచ్చుకోండిమెచ్చుకోండి
రాధిక, అయ్యో. నీఫొటో చూస్తే భారీకాయం అన్నట్టులేదు. ఏమైనా జాగ్రత్త అవుసరమే. ఈరోజు నేను కూడా బయటికి వెళ్లలేనంత ఘోరంగా వుంది గాలీ మంచూ. అయితే స్నోబర్డ్ లా ప్రతియయేడూ చలికాలం భారతావనికి పారిపోతావా, హాహా
కుమార్, అవునండీ. అమెరికాలో టాక్సూ, చావూ తప్పించుకోడం ఎవరితరం కాదన్నమాట వినేవుంటారు. అందులో మంచు చేర్చడం మర్చిపోయారు వారు 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
భలే, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటగలమేమో గానీ, కాలు జారకుండా అమెరికాలో బతికి బయటపడలేము 🙂
నేనూ పడ్డా రెండు మూడు సార్లు. అదృష్టం. ఏవీ విరగలా. సెల్ ఫోన్ పచ్చడయ్యిందోసారి.
మెచ్చుకోండిమెచ్చుకోండి
బాగుందండి.కానీ ఇంత చలిలో ఎంత కప్పుకుని వెళ్ళినా అది ఆరోగ్యకరం కాదనుకుంటాను.ఎంత ఆచితూచి అడుగులువేసినా ఈ జారుడుకార్యక్రమం మనకు తెలియకుండానే జరిగిపోతుంది.నాలాంటి భారీకాయులయితే మరీజాగ్రత్తగా నడవాలి.ప్రాణాలన్నీ పాదాల్లో పెట్టుకుని నడుస్తున్నాను గత మూడువారాలుగా..రెండు రోజులక్రితం మా అబ్బాయి పడబోతుంటే హడావుడిగా వంగి పట్టుకోవడంలో నా కాలు జారితే నిలదొక్కుకునే ప్రయత్నంలో నడుం పట్టేసింది 😦 ఇంకో పది రోజులు జాగ్రత్తగా వుంటే చాలు. భారతావనికి చెక్కేసి వింటర్ అయ్యిపోయాకా వస్తాను.
మెచ్చుకోండిమెచ్చుకోండి
మగవాడు, మీభావం నాకు అర్థం కాలేదండీ. ముసిల్ది అన్నది ఒక ఆలోచన మాత్రమే. ఆతరవాత కర్ర పుచ్చుకు వెళ్లేను కదా.
కొత్తపాళీ, ఓ, అలాగా. సరే.
మెచ్చుకోండిమెచ్చుకోండి
చేవ .. అంటే బలం అని, నాకు తెలిసినంతలో. చేపాటి అంటే తెలీదు
మగవాడు గారిది నిశిత పరిశీలన.
మెచ్చుకోండిమెచ్చుకోండి
“మరోపక్క చేతికర్ర పట్టుకోగానే అఫిషియల్‌గా ముసిల్దయిపోయినట్టే లెక్క” , మరి వారితోటి “మీకొకటీ” అని అంటున్నారు 😉
మెచ్చుకోండిమెచ్చుకోండి
తెరెసా, – చూసిన వాళ్ళు నవ్వుతారని సగం మొహమాటం — హా. అరటితొక్కమీద కాలు జారి ఎదటివారు పడితే కామెడీ, మీరు పడితే ట్రాజెడీ అంటే ఇదే. సరేలెండి, జాగ్రత్త.
రాజేంద్ర – మీరెందుకన్నారో కానీ మరో కథ సిద్ధంగా వుంది. సోమవారం పెడదాం అనుకుంటున్నా. అన్నీ ఒకేసారి పెడితే అందరూ చదవరని 🙂
కొత్తపాళీ, – చేవకర్రా చేపాటికర్ర అంటే. చేపాటి అంటే ఏమయివుంటుందా అని ఆలోచిస్తున్నా. న్వూమెక్సికో వెళ్లినప్పుడు చూస్తా నేనేమయినా తేగలనేమో. రెండు తెస్తే, మీకొకటీ, నాకొకటీ.
మదురవాణి, – కొత్త అయినా తొందరగానే పట్టేశారు నన్ను. థాంక్స్.
మెచ్చుకోండిమెచ్చుకోండి
నేను బ్లాగ్గింగ్ కి కొత్త. మీ బ్లాగ్ లో post చదవడం ఇదే మొదటిసారి.
మీరు రాసిన విధానం చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. సంతోషం 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
మీ కర్ర భలే ఉందిగా! న్యూమెక్సికో కొండల్లో ఒకసారి నాకు ఇలాంటి చేవకర్ర దొరికింది. అక్కడ తిరిగినన్నాళ్ళు పట్టుకు తిరిగాను, కానీ విమానంలో వెనక్కి తీసుకురానివ్వ లేదు (అందులో అది 911 జరిగిన కొత్తలు). ఆ తరవాత ఇటువంతి కర్రలకే కాస్త అలంకారాలు గట్రా తగిలించి నేటీవ్ అమెరికను షాపుల్లో చూశాను, కానీ నూరు డాలర్ల పైమాటే చెప్పారు!
మెచ్చుకోండిమెచ్చుకోండి
ఇందులోనుంచి కనీసం ఒక అరడజను కధలు లాగొచ్చు,కానివ్వండి రాసుకున్నంతవారికి రాసుకున్నన్ని 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
నాకూ Black ice ఉంటుందని చ్హచ్చే భయం మాలతి గారూ. పదేళ్ళ క్రితం పార్కింగ్లాట్లో పడి మొహం పగలగొట్టుకున్న దగ్గర్నించీ కళ్ళు నేల మీదే తాపడం చేసి అడుగులు ఎత్తెత్తి వేస్తుంటా. పడిన బాధ గాక చుట్టూ చూసిన వాళ్ళు నవ్వుతారని సగం మొహమాటం.
మీ చేపాటికర్ర బావుంది , చెప్పిన విధానం ఇంకా చాలా బావుంది 🙂
Happy winter strolls!
మెచ్చుకోండిమెచ్చుకోండి