ఋణాఢ్యుల కథ

ఇది పూర్వకాలపుకథ కాదు. ఈనాటి కథే.

మూడు తరాలకి ముందు అప్పు చేయడం తప్పు, అప్పు ముప్పు తెచ్చును అని గట్టిగా నమ్మేరు. నాకు ఇప్పటికీ అప్పుంటే తోచదు. నేను అప్పు చేయను. కానీ ఈనాటి సమాజంలో అప్పులేనివాడంటే చాలా గరికపోచతో సమానం.

గట్టిగా ఆలోచిస్తే లోకం అంతా అప్పుమీదే పరిభ్రమిస్తోందని తెలుస్తుంది. అందుకు గొప్ప నిదర్శనం చెరువులూ సూర్యుడూను. ఏర్లూ, చెరువులూ, నదులూ మొదనయినవన్నీ అప్పుమయమే కదా. సూర్యుడు ఎండలు మండించి అప్ తీసుకుని కుంభవృష్టి రూపంలో తీర్చేస్తాడు. అంటే ఏమిటి? అప్పు తీసుకుని తీర్చేయడమే కదా. ఈ ఋణభ్రమణంమీద సృష్టి, స్థితి లయాదులు సక్రమంగా నడుస్తున్నాయి.

ఇక్కడ మరో మినహాయింపు కూడా చెప్పాలి. మీలో చాలామందికి మరి మన ఋణరాజు అప్పులు తీర్చరాదని కూడా బోధిస్తున్నాడు కదా అన్నది. దానిలో మరో కిటుకు లేక మాయ ఉంది. ఈనాడు మొత్తం ప్రపంచం అంతా మాయామేయమే అంటే అప్పారాయుళ్లు మాయారూపులయిన వాస్తవములు.

అమెరికాఅధ్యక్షుడు ఈవిషయంలో నిష్ణాతుడు. అప్పులు చేయడంలో తనకంటె ఘనుడు లేడని సగర్వంగా చెప్పుకుంటాడు. తనకి తానే ఋణరాజునని ప్రకటించుకున్నాడు.  మహా మహోపాధ్యాయ పదవికి తగునని గట్టిగా నమ్నినవాడు. ఆయనగారి సిద్ధాంతాలలో కొన్ని – అప్పు చేసి పప్పుకూడు తినడంలో తప్పు లేదు. అసలు అలా బతకడమే గొప్ప.  పీకలవరకూ అప్పులు చేసి ఎగ్గొట్టడానికి కావలసినంత సమాచారం ఉందాయనదగ్గర. ఇచ్చే నాథుడు లేడు కానీ ఉంటే Ph.D. పొందదగినవాడు. అసలు ఆయనే ప్రకటించుకుని ఉండును Trump యూనివర్సిటీ దీవాలా తీయకపోతే.  కానీ కాలం కలిసిరాక లోకానికీ ఆ విద్యాలయాలచరిత్రకీ తీరని అన్యాయం జరిగిపోయింది.

అలా ఆలోచిస్తే అప్పు చేయడం చతుష్షష్టికళలలో ఒకటిగా చేర్చి, పంచషష్టి కళలు అనాలనుకుంటాను.

ఇంతకీ అప్పులమాట తీసుకుంటే పైన చెప్పినట్టు అప్పులేనివాడు ఉప్పురాయికి కొరగాడు. అలాగే విపర్యయమున్నూ యథార్థమే. అంటే అప్పు లేనివాడికి అప్పు పుట్టదు. అప్పులేనివాడు కాసుకి కొరగాడు. అరిగిపోయినచెప్పు కన్నా హీనం. విరిగిపోయిన కుర్చీ కన్నా అర్థ్వాన్నం. నిన్నటి అన్నంకన్నా హేయం. కాలదోషం పట్టిపోయిన ఇంసూరెన్సు కార్డులాటివాడు అప్పులేనివాడు.

పూర్వకాలంలో అంటే 2, 3 తరాలక్రితం ఇరుగూపొరుగూ ఇళ్ళలో పంచదార, కాఫీపొడిలాటివి,   ఆఫీసుల్లో ఐదూ పదీ చేబదులు తీసుకోడం, కొన్ని తిరిగిచ్చేయడం, కొన్ని ఇవ్వకపోవడం వరకూ జరిగేయి. అన్నీ నిత్యసత్యాలే.

ఇప్పుడలా కాదు. ఇంట్లో కాఫీ లేకపోతే హోటలుకి పోతారు. కాసు కావాలన్నా క్యాషు కావాలన్నా క్రెడిట్ కార్డు ఆదుకుంటుంది. అసలు ఎవరైనా ఎందుకు అప్పు పుట్టించుకోవాలి అంటే అప్పు పుట్టించగలను అని నిరూపించుకోడానికి. అమెరికాకి కొత్తగా వచ్చినవారికి ఇది అనుభవం అయే ఉండవచ్చు. కారు కొనడానికెళ్తే నీకు అప్పు పుచ్చుకునే అర్హత ఉందని నిరూపించమంటాడు.

అందుకోసం ఉచితంగా ఇచ్చే ఓ స్టోరు కార్డు తీసుకుంటారు చాలామంది ఇష్టం ఉన్నా లేకున్నా, అక్కర ఉన్నా లేకున్నా. అసలదే అక్కర. ఒక కార్డు కావాలి. అదే అక్కర.

అప్యేశ్వరులూ, అప్పినాయుళ్లు, మిస్టర్ అప్స్, మిసెస్ అప్స్, ఋణనాథులూ ఈ భూమ్మీద కోకొల్లలు. అందుచేత ఏం జరుగుతోందంటే, అప్పుచ్చుకున్నవారు ఎవరిదగ్గర పుచ్చుకున్నారో వారికి అప్పు తీర్చరు. మరో అప్… గారికి అప్పుగానే ఇస్తారు. అలా ద్రవ్యము ఋణరూపంలో ఋణప్రముఖులమధ్య  ఋణగుణధ్వనులుతో ప్రవహిస్తూంటుంది అనేక ఛానెలులద్వారా. గ్రంథస్థం చేయలేదు కానీ చతుష్షష్టి కళలలో దీన్ని కూడా చేర్చి పంచషష్ఠి కళలు అని ప్రచారం అవుతోంది.

000

ఇతి ఋణాఢ్యోపాఖ్యానము సమాప్తము.

సర్వేజనాః ఋణగ్రస్తో భవంతు. సర్వజనాయయై విశేష ఋణప్రాప్తిరస్తు.

000

(మే 7, 2018)

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.