జగన్నాటకం 1

ఇకమీదట నాకొచ్చిన ఆలోచనలు జగన్నాటకం అన్న శీర్షికతో వరసగా ప్రచురించాలనుకుంటున్నాను. ముందు ముందు ఏం చేస్తానో చెప్పలేను కానీ ఈ కింది మూడూ మాత్రం ఫేస్బుక్కులో ప్రచురించినవి.

000

  1. సమాచారసంత ఒక అడవిమేళం

ముగింపు ఊహించుకుని,మరో కథ మొదలెట్టి పూర్తి చేసినరోజులు పోయేయి
.టీవీ, రేడియో, ఐఫోనూ, మెసెంజరు, పాడ్‌కాస్టూ
కుంభవృష్టిగా కుమ్మరిస్తున్న విశేషాలతో
తల దిమ్మెక్కిపోతోంది.
తల వాచిపోతోంది.

నిండుగా గాలిపోసుకున్న బెలూనులా
పేలిపోడానికి సిద్ధంగా ఉంది.

అందిపుచ్చుకున్న సమాచారం మొత్తం
కుప్పపోసి, చిక్కు విడతీసి,, వడబోసి
ఒక్కొక్కముక్కా అందంగా అమర్చి
అసలు విషయం ఏమిటో తెలుసుకోడం మాత్రం
ఎలాగో తెలియడం లేదు.

మతి పోయి అడవిమేళమయి, మనసు గందరగోళం అయిపోయింది.

000

(జూన్ 16, 2018)

000

  1. జగన్నాటకం

నటులు నాయకులవుతారు
నాయకులు నటులవుతారు.
జనులు విసిగి వేసారిపోతారు
ఆపైన సన్నాసులవుతారు

000

(జూన్ 13, 2018)

  1. మనోవికారాలు

ఆనందం అనుభవిస్తాను

బాధ భరిస్తాను

ప్రేమ పంచుకుంటాను

తాపం తట్టుకుంటాను

అక్కసు వెలిగ్రక్కుతాను

అసూయ దాచుకుంటాను

వ్యామోహాలు వదిలించుకుంటాను.

 

అహో! మనోవికారాలనంటి పెట్టుకు

వచ్చిన క్రియావిశేషాలు

నిర్వచిస్తున్నాయి నన్ను.

000

(జూన్ 27, 2018)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.