ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కథలు

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారి కథలు చదివేక, అవి మొదట నాకు  నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో చెప్పడానికే మొదలు పెట్టేను. తీరా మొదలుపెట్టేక, అది సరి కాదేమో అని అనిపించింది. కనీసం నచ్చకపోవడానికి కొన్ని కారణాలు వివరించవలసిన అవుసరం కనిపించింది. అంచేత కొంచెం చుట్టు తిరుగుడే అయినా ఆవిషయం సాకల్యంగా ప్రస్తావిస్తాను.

మామూలుగా నేను ఏ రచయితయొక్క రచనలూ అన్నీ చదవలేదు. రచయితమీద కన్నా రచనమీదే నాకు ఎక్కువ దృష్టి. ఏ కథకి ఆ కథే అయినా కొంతకాలం అయేక కొన్ని అబిప్రాయాలు పునరావృతం అవుతాయి. మరోకారణం, కొంతకాలం అయేక, రచయిత భావజాలంలో మార్పు రావచ్చు. నాఅభిరుచులలో మార్పు కావచ్చు.  కాలగతివల్ల మనలో సహజంగా వచ్చే మార్పులు కావచ్చు. మూడో కారణం, అనేకమంది రచయితలు అదే పనిగా రాస్తుంటే అవే విషయాలు మళ్లీ మళ్లీ కనిపిస్తాయి. ఆరున్నర దశాబ్దాలలో నేను చదివినవి అట్టే లేకపోయినా అవే అంశాలు గలకథలు చాలానే చూసేను. అందరివిషయంలో ఇలాగే జరుగుతుందని కాదు కానీ అలా జరిగే అవకాశం ఉందనే నాకనిపిస్తుంది. నేను ఏ ఒక్కరివీ అన్నీ చదవలేదు కనక ఈ అబిప్రాయం కేవలం నాఊహగానే తీసుకోవాలి.  మీకు నప్పితే సరే. లేకున్నా సరే. ఒక్క ఉదాహరణ మాత్రం ఇవ్వగలను. రావిశాస్త్రిగారి కథలు 60లకి ముందు రాసినవి నాకు చాలా ఇష్టం. ఆ తరవాతికాలంలో ఆయన మార్క్సిస్ట్ భావజాలంతో నిండిన సీరియలులు రాయడం మొదలు పెట్టేక నేను చదవడం మానేసేను. రత్తాలు రాంబాబు అనుకుంటాను మొదలు పెట్టి ఆదిలోనే వదిలేసేను.

000

అసలు స్థూలంగా కథాంశాలు ఎన్ని ఉంటాయో చూదాం. నేను కాలేజీలో చదువుకున్నరోజుల్లో ప్రపంచంలోని కథాంంశాలన్నిటినీ మూడో నాలుగుకో కుదించవచ్చని చదివినట్టు గుర్తు. నిర్ధారణ చేసుకోడానికి అంతర్జాలంలో చూస్త,6. 8, 36 … ఇలా ఉన్నాయి.

నామటుకు నేను ఆలోచించి, 6 అనుకున్నాను. మొదట రెండే అనుకున్నాను అయితే ఆడపిల్లా లేకుంటే ధనలక్ష్మీ అని. కానీ మళ్లీ ఆలోచిస్తే, ఈ రెండు వర్గాలలో ఇముడనివి ఉన్నట్టు తోచింది. అఁచేత 6కి పెంచేను.  ఆ ఆరూ అరిషడ్వర్గాలూను. అంటే క్రోధం, ద్వేషంవంటివి స్త్రీ కారణంగానో ధనంకారణంగానో ఏర్పడవచ్చు కానీ కథ కేవలం ద్వేషం, క్రోధంమీదే నడపొచ్చు.

ఈ ఆరింటిలోనూ పాఠకులకు అత్యంత ప్రీతిదాయకమైనది మోహం. దానికే ప్రేమ అని కూడా పేరు. ప్రపంచసాహిత్యంలో అత్యంత ప్రఖ్యాతి పొందిన కథలు తీసుకుంటే ఈ ప్రేమే మూలాధారంగా కనిపిస్తుంది.

000

క్షమించాలి ఆలస్యం ఆయినందుకు. ఇప్పుడొస్తాను నాకు నచ్చని కథలగురించి చెప్పడానికి. ఆమద్య ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి కథలు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారి చిత్రశాల తీసుకున్నాను. రెండు సంకలనాల్లోనూ దాదాపు అన్నీ ప్రేమకథలే. సుమారుగా విద్యార్థిదశలో అమ్మాయిలవెంట బడే అబ్బాయిలు, అబ్బాయిలను వల వేసి పట్టుకోజూచే అమ్మాయిలూ, ఇద్దరికీ కలేజా లేకపోతే వారి అవస్థ చూసి ఓ పన్నాగమో కుట్రో పన్ని వారిద్దరినీ ఓ దరికి చేర్చే తాతగారూ … ఇలా సాగిపోతాయి. ఇలాటి కథాంశాలతో కథలు కోకొల్లలుగానే వస్తునే ఉన్నాయి కనక అనుకుంటాను చదవడం మొదలు పెట్టగానే నాకు చప్పగా తోచేయి.

మళ్ళీ ఇప్పుడు వ్యాసం రాయడానికి కూర్చుని, ఆ కథలు చూస్తుంటే, ఫరవాలేదనే అనిపించేయి. అంచేత నాకు నచ్చలేదు అనడం వేరు, పాఠకులకు నచ్చే అంశాలు ఏమి ఉంటాయి అని చూడడం వేరు అన్న ప్రాతిపదికమీద మళ్లీ మొదటికొచ్చేను.

000

హనుమచ్చాస్త్రిగారు ప్రస్తావికలో కథానిక స్వరూపంగురించి సుదీర్ఘంగా చర్చించి, తాను ఆవిష్కరించిన అంశాలు సూక్ష్మంగా ఇలా వివరించేరు,

పుస్తకం 1945లో ప్రచురించబడింది కనక అంతకుముందు 7,8 సం. లలో రాసిన కథలు. తొలిసారి చదివినప్పుడు శాస్త్రిగారు చెప్పినంత దృఢంగా నాకు తోచలేదు. ఎక్కువ వైచిత్రికోసం రాసినట్టే తోచేయి. శాస్త్రిగారివంటి లబ్ధప్రతిష్ఠులను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. కాలగతిలో సమాజంలో వచ్చినమార్పులూ, నాదృక్పథంలో వచ్చినమార్పులే కాక నాపఠనాకాలం కూడా సుదీర్ఘం కనక, నాకు అలా తోచిందమో. నేనే ఈకథలు 40, 50 దశకాల్లో చదివితే బహుశా మరోవిధంగా స్పందించి ఉండేదాన్నేమో.

వివాహమంగళంకథలో ఆరోజుల్లో పెళ్ళిపందిట్లో ఎంత సందడి, సువాసనలు, పట్టుచీరెల ఫళఫళలూ, పూలచెండ్లు, ఎంతో వివరంగా రాసేరు. ఇక్కడ మనం గమనించవలసిందేమిటంటే ఇవన్నీ శాస్త్రిగారి చిన్నతనంలోవిట. ఈకథాకాలంనాటికే అంటే సుమారుగా 1940కి అటూఇటూగా ఈవివాహం తంతు మారిపోయిందంటారు. సరి. ఇప్పుడు అంటే 2000 దాటేసరికి ఈ పెళ్లిళ్ళతంతు ఎంత మారిపోయిందో ఇక్కడ నేను ప్రత్యేకించి రాయక్కర్లేదు. మనసంస్కృతిలో ఎలాటి మార్పులు వచ్చేయో తెలుసుకోవాలంటే ఈ కథ తప్పక చదవాలి. మిగతా కథలు చాలామటుకు పడుచుపిల్లల ప్రేమచుట్టూ సాగుతాయి.

వీటికి భిన్నంగా కొన్ని ఉన్నాయి. స్వర్ణయోగం కథ దొంగసన్యాసుల కథ. ఇటివలికాలంలో ఈ మోసాలు ఎక్కువయిపోయేయి.. “దౌర్జన్యం”లో వితంతువైన చెల్లెలు యాదృచ్ఛికంగా కలిసిన క్రైస్తవ మిత్రునితో మాటాడినందుకే చిందులు తొక్కిన అన్నగారిని ఎదిరించి, ఇల్లు విడిచిపోవడం. అభ్యుదయంవేపు సాగిన కథ. శాస్త్రిగారు చెప్పిన సంఘంలో కుళ్ళు కదపడం “ఆకలి మంటలు” కథలో ఉంది. ఆకలికి తట్టుకోలేని స్త్రీ మరోగతి లేక శరీరం పణం పెట్టడం.

నాకు ప్రత్యోకంగా కనిపించిన కథ “యతిప్రాసల మహాసభ”. భాషకి సంబంధించిన చర్చలు నిరంతరంగా సాగుతూనే ఉన్నాయి. ఈ కథలో 30, 40 దశకాల్లో గ్రాంధికవాదులు,  వ్యావహారికభాషావాదుల మద్య జరిగిన సంఘర్షణలు. అయితే ఇక్కడ రచయిత ప్రతిభ ఈకథ నిర్వహణలో చూస్తాం. ఛందస్సు వ్యాకరణం పూర్వలమార్గంలో కొనసాగించాలన్న నినాదంతో ఎర్పాటు చేసిన అఖిలాంధ్రయతిప్రాస సభకి ఆధునికకవులు ముగ్గురు హాజరవడంతో మొదలవుతుంది. ఆ సభ నిర్వాహకులు ఆధునిక కవులని (వారిమాటలో కొత్తిమీరకవులు) హేళన చేస్తూ ఉపన్యాసాలు ఇవ్వడం ఒక ఎత్తు. వారిని హేళన చేస్తూ కథని రచయిత వ్యంగ్యాత్మకంగా కథ నడపడం మరో ఎత్తు. శాస్త్రిగారి శైలికి మచ్చు

ఈ వివిధ పొరలను గమనించడానికి మనం కొంచెం శ్రద్ధ పెట్టి చదవాలి. అందుకే నాకు ఇది నచ్చింది. ఇందులో రచయి ప్రస్తావించిన ముగ్గురు నవకవులు సీతాపతి, సూర్యనారాయణశాస్త్రి, కథకుడు (హనుమచ్ఛాస్త్రిగారు అనుకుంటా) వాస్తవం అనిపించింది నాకు. సుమారుగా ఇదే ధోరణిలో ఇప్పుడు కూడా భాషవిషయంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి కదా. అది మరో కోణం. అంచేత కూడా ఈకథ ప్రత్యేకత గలది.

కళాభాయి అని మరోకథ. ఇందులో కూడా సాహిత్యసేవ చేస్తున్నామంటూ హడావుడి చేసే కృత్రిమ సాహిత్యాభిమానులను హాస్యరసస్ఫోరకంగా ఆవిష్కరించడం జరిగింది.

చివరిమాటగా, ఈప్రేమకథల్లో కొత్తదనం లేకపోయినా, ఈనాటి కథల్లో పుష్కలంగా ఉండే ఇంగ్లీషు వాతావరణం, ఇంగ్లీషుపదాలు, జీవనసరళీ- వీటికి భిన్నంగా ఆనాటి బాషా నుడికారం ఉన్నాయి కనక వాటికోసం చదవొచ్చు. ఇంగ్లీషు భాషా, జీవనసరళీతాలూకు ఛాయలు ఎలా మొదలయేయో కూడా ఈ కథలు చెప్తాయి.

చదివి చూడండి. ఈపుస్తకం archive.orgలోనుండే తీసుకున్నట్టు గుర్తు. ఏమైనా ఇక్కడ కూడా జత చేసేను, archive.org వారికి ధన్యవాదాలతో, hanumachchhaastrikathalu

 

(జులై 12, 2018)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.