మల్లాది రామకృష్ణశాస్త్రిగారి “కులాసా” కథ

వెనకటి టపాలో చెప్పిన రెండో సంకలనం మల్లాది రామకృష్ణశాస్త్రిగారి చిత్రశాల లో ఈ కథ ఒకటి.

ఆవ్యాసంలో చెప్పినట్టు ఈ సంకలనంలో కథలు నాకు అట్టే ప్రత్యేకంగా అనిపించలేదు కానీ ఈ కులాసా కథ మాత్రం చాలా ఆలోచించేలా చేసింది. నిజానిక నాలుగు రోజులతరవాత ఇవాళే నా ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చేయి.

మీరు నాఆలోచనలు చదివేముందు కథ చదివి మీఆలోచనలు తేల్చుకున్నతరవాత నాఅభిప్రాయాలు చదివితే చర్చకి ఎక్కువ అవకాశం ఉంటుందనుకుంటాను.

మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథలమీద ఇంతకుపూర్వం రాసిన వ్యాసంలో వారి శైలి, భాష, కథనశిల్పం నాచేతనయినంతవరకూ వివరించేను కనక మళ్లీ అదంతా ఇక్కడ రాయను.

ఈ కులాసా గురించి సూక్ష్మంగా నాలుగు మాటలు చెప్తాను.

రామకృష్ణశాస్త్రిగారు మన సంస్కృతి, సంప్రదాయాలలో ఉదాత్తమైన భావాలను ప్రతిభావంతంగా చిత్రించేరు. అంటే ఆధునికతకు వ్యతిరేకులు అని కారు. ఆధునికభావజాలంలో సమాజానికి శ్రేయస్కరము అనిపించే వాటిని కూడా అదే రీతిలో ఆహ్వానిస్తారు.

ఈ నేపథ్యంలో కులాసా అన్నకథ చూదాం. కథ ఎత్తుగడ శేఖరం భార్య లక్ష్మి కట్టుకున్న చీరని ఆక్షేపించడంతో మొదలవుతుంది. మామూలుగా భార్యాభర్తలు వాదించుకునే మాటలూ, ఎత్తుపొడుపులూ, వేళాకోళాలతో కొంచెంసేపయినతరవాత ఆయన చెప్పిన చీరే కట్టుకోడంతో ఆ సన్నివేశం ముగుస్తుంది. వారిమాటలలో మనకి తెలిసే ఇతర విషయాలు లక్ష్మి చదువుకోలేదు. ఆమెచెల్లెలు కమలం మెడిసన్ చదువుతోంది విశాఖపట్నంలో. శేఖరం కమలాన్ని చిన్నప్పుడు చూసేడు కానీ తరవాత చూడలేదు. చాలాకాలం అయేక అక్కనీ బావనీ చూడడానికి మద్రాసు వచ్చింది ఆఅమ్మాయి.

ఇక్కడ గమనించవలసిన ఒక విషయం పాత్రచిత్రణ. కమలాన్ని శేఖరం తొలిసారి చూసినప్పుడు 11 ఏళ్ళపిల్ల. “గుమ్మటంలా ఆకుపచ్చని ధక్షిణాదిపరికిణీ కట్టుకుని, జఫర్ షర్ట్ తొడుక్కుని, బావా, గుడ్ మార్నంగ్ అంటూ అల్లరి చేస్తూ ఇల్లంతా తిరిగేది. … తనకొచ్చిన ఇంగ్లీషంతా బావమీద ప్రయోగించేది.” ఇది రామకృష్ణశాస్త్రి గారి శైలి. అందుకు భిన్నంగా సెకండ్ క్లాసు బోగీలోంచి దిగిన కమలాన్ని వర్ణించరు. సూక్ష్ంగా ఒక్కవాక్యంలో “ఐడియల్ మడికల్ స్టూండెంట్ వేషంలో” దిగిందంటారు. ఈకథ 1930లో రాసేరు. విశాఖపట్నం మెడికల్ కాలేజీలో పిల్లల్ని నేను 1960లలో చూసేను. నాకేమీ ప్రత్యేకతలు కనిపించలేదు. మరి రామకృష్ణశాస్త్రి గారి అభిప్రాయం ఏమయిఉంటుంది?

కారుదగ్గర శేఖరం భార్యని వెనకసీటులో ఎక్కిస్తాడు. కమలం ముందుసీటులో శేఖరం పక్కన కమలం కూర్చుని సిగరెట్ వెలిగించి, అతనితో ఇంగ్లీషులో మాటాడుతూంటుంది. లక్ష్మి సిగరెట్‌ విషయంలో విసుగు ప్రదర్శిస్తే, “చదువుకున్నదాన్ని కదూ” అంటూ హాస్యంగానేమో తెలిక చేసేస్తుంది. అలాగే ఇంల్లో రేడియోలో ఇంగ్లీషుపాటకి శేఖరంతో డాన్సు చేయడం కూడాను. వీటన్నిటిలో మనకి కనిపించేది పాశ్చాత్యసంప్రదాయయాల ప్రభావం తొలిదశ అనిపించింది. 20, 30 దశకాలలోనే ఇది మొదలయింది అని నేను అనుకుంటున్నాను.

కమలం కాలేజీలో చేరేక ఉత్రరాలు రాయడం కూడా శేఖరానికే. లక్ష్మి నొచ్చుకుని, నేను కదా అక్కని, నాకెందుకు రాయదూ అంటే, శేఖరంద్వారానే కమలం ఇచ్చిన జవాబు కూడా అసంబద్ధంగానే ఉంది.

అత్తగారూ, ఆడబడుచులూ ఆరళ్ళు పెట్టే ఇళ్ళలో అలా జరిగేయేమో కానీ మద్రాసులో కాపురం ఉన్న లక్ష్మికి కమలం ఇలా రాయడం కమలం వెలిబుచ్చిన ఇతర అబిప్రాయాలకి పొందన లేదు.

అలాగే కమలంపాటలకి శేఖరం మంత్రముగ్ధుడు కావడం, అడిగి పాడించుకోడంవంటివి ఆధునిక సంప్రదాయలనుకోవాలి. తోబుట్టుకు ఉత్తరం రాయడం తప్పు అనుకున్న మరదలు బావగారితో చనువు ప్రదర్శించడం, అందుకు శేఖరం అభ్యంతరం చెప్పకపోవడం–పరస్పరవిరుద్దమైన బావాలు. బావాలు అనాలో తత్వాలు అనాలో నాకు తెలీదు కానీ అసంబద్ధంగానే అనిపించేయి.

చివరలో కమలం అక్కతో అన్నమాటలు కూడా ఈ అసంబద్దతనే ఎత్తి చూపుతాయి.

ఇద్దరినీ చూసి పోడానికి వచ్చేనంటుంది కానీ అక్కతో గడిపిన సన్నివేశాలు లేవు. అక్కని ఎలా ఉన్నావే అని ఒక్కమాటయినా అడిగిన పాపాన పోలేదు. అనుకూలదాంపత్యానికి కమలం లక్ష్మికి ఇచ్చిన సలహా చూడండి, నేను చెప్పేది అర్థం చేసుకో, సహధర్మచారిణి హితచర్య అంతా నీకు కంఢతా వచ్చును కదా అంటూ

బావకి ఏమి కావాలో అది చెయమంటుంది కానీ అక్కకి ఏమి కావాలి, అక్కకి అస్తిత్వం ఎలా వస్తుందన్నఆలోటన లేదు అంత చదువుకున్నపిల్లకి. పైవాక్యాలు చూస్తుంటే కమలానికి ఏ విషయంలోనూ సరైన అవగాహన, నిర్దుష్టమైన అభిప్రాయాలూ లేవేమో అనిపించింది. రచయిత సందేశం ఇదేనా, వేరే ఏదైనా ఉందా?

రామకృష్ణశాస్త్రిగారు అనేక విషయాలు పాఠకులమేధకే వదిలేస్తారు. ఎంతో వివరంగా రాసినట్టు ఉన్నా, ఇంకా మనకి మనం ఆలోచించుకోవలసింది చాలా ఉంటుంది. ఈ కత కూడ అలాటిదే అనిపిస్తోంది.

000

(జులై 15, 2018)

archive.orgలో  మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథల సంకలనానికి లింకు, వారికి ధన్యవాదములతో. నేను సంప్రదించిన చిత్రశాల సంకలనం 1960లో ప్రచురించినది. ఈ క్రింద ఇచ్చిన లింకు సంకలనంలో ఇంకా ఎక్కువ కథలున్నాయి. కులాసా కూడా ఉంది.

https://ia601900.us.archive.org/35/items/in.ernet.dli.2015.497446/2015.497446.mallaadi-ramakrxshhnd-a.pdf

——————————————————————————————————————–

నేను ఇంతకుముందు రాసిన వ్యాసం పూర్తిపాఠం ఇస్తున్నాను పాఠకుల సౌకర్యార్థం.

మలాది రామకృష్ణశాస్త్రిగారి కథలు

సరస సల్లాపోక్తులు, చురుకు భాషణలు – మల్లాదివారి కథనకుతూహలం. చలం చిత్రించిన విశృంఖలతకీ కొడవటి కుటుంబరావుకథల్లోని ఆర్థిక, సమాజిక అవగాహనకీ నడుమ మేరువులా నిలిచి కథలని కవితలలా మలిచిన కథకుడు మల్లాది రామకృష్ణశాస్త్రి.

స్త్రీ పురుషులమధ్య ఆకర్షణ ప్రకృతిసిద్ధం. అయితే ప్రతిజీవికీ సహజమైన ఆకర్షణమూలానా లేదా దానిపేరు మీదుగా ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో చలం, కొడవటిగంటి ఎత్తి చూపితే, రామకృష్ణశాస్త్రి అనూచానంగా వస్తున్న మరొకకోణాన్ని ఆవిష్కరించారు తమకథల్లో.

రామకృష్ణశాస్త్రిగారి కథల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది కథకుడు. అందులో మొదటిది – పాఠకుడిని సంభోధిస్తూ మధ్యమపురుషలో కథ చెప్పడం. రెండోది ఆకథకుడిలో రెండురకాల వ్యక్తిత్వాలు. ఒక కథకుడు పురాణాలూ, ఇతిహాసాలూ చదివి ఆకళించుకున్న పండితుడు. రెండోవారు సమకాలీనసమాజాన్ని నిశితదృష్టితో పరిశీలించి వ్యాఖ్యానిస్తున్న నిత్యయౌవనుడు. కొన్ని కథలు చదువుతుంటే, షడ్రోసోపేతాన్నాలు ఆరగించి, తాంబూలం సేవిస్తూ నిదానంగా కథనం సాగించే పౌరాణికుడు దర్శనమిస్తాడు. అటువంటి ఇతివృత్తాలుగల కథలు చెప్పేటప్పుడు తదనుగుణంగానే కొట్టొచ్చేట్టు కనిపించేవి – సరసభాషణలు, కులకాంతలకి దీటు రాగల వారకాంతలు, వారిచుట్టూ భ్రమరములవలె సంచరించే ఆబాలగోపాలం. ఇవి “వనమాల”, “స్వరమేళ”, “రంగవల్లి”, “డు, ము, వు, లు” వంటి కథల్లో చూస్తాం. రెండోరకంకథల్లో ఏ స్టేషనులోనో, రోడ్డుమీదో నిలబడో, పార్కుబెంచీమీద కూర్చునో కనిపించి, “ఉండు, చెప్తా, నీకర్థం కాదేమోనని … ” అంటూ అనునయంగా పలకరిస్తూ సాధారణదుస్తుల్లో ఆధునికయువకుడు గోచరిస్తాడు. ఉదాహరణకి “పీఠిక”, “జోను టికెట్టు” చెప్పుకోవచ్చు.

కథకి సాంఘికప్రయోజనం ఉండాలనీ, అంటే సంఘంలో కుళ్లుని ఎత్తి చూపి, ప్రక్షాళన చేయగలకథలే మంచికథలనీ అలాటికథలు రాసినవారే మంచి కథకులనీ ఈనాటి సమీక్షలూ విమర్శలూ చెప్తున్నాయి. అంచేత, మల్లాదివారికథలని ఆదృష్టితో పరిశీలించి చూద్దాం.

శాస్త్రిగారికథలకి ప్రాతిపదిక చాలామటుకు స్త్రీ, పురుషసంబంధాలే. స్తీ, పురుషులు ఒకరికొకరు ఆలంబన. ఎవరికి ఎవరు ఆలంబన, ఎవరు ఎవరికి ఆకట్టుకుని ఆడిస్తున్నారు అన్నది పెద్ద చిక్కుప్రశ్న. రామకృష్ణశాస్త్రిగారికథల్లో ఈ సమస్య అనేకకోణాలనుండీ ఆవిష్కరించడం జరిగింది. మగవారిలో స్త్రీలచుట్టూ భ్రమరములవలె తిరిగేవారున్నారు. ఆ ప్రవృత్తిని ఆమోదించిన ఆడవారున్నారు. భోగంపడుచులకు కన్నెరికం పెట్టడం తమకొక గౌరవంగా భావించే ప్రభువులున్నారు. వారికి నివాళులు పట్టే అర్థాంగులున్నారు. “ఎవరూ పలకరించకుండా ఉంటే, పాపం సానిపిల్లలు ఏమయిపోవాలి చెప్పూ” అంటూ నిగ్గదీసి అడిగే మహానుభావులున్నారు (గురుప్రసాదం). అటువంటి మగధీరుల్ని, “నేనెందుకు మీతో లేచిపోవాలీ? కావలిస్తే మీరే రండి నాదగ్గరికి” అంటూ సవాల్ చేయగల వీరవనితలున్నారు (కనక జానకి). మగవారిని తమకొంగున కట్టుకుని, ఆడించి. లాలించి, బెల్లించి, జాలిపడి కనికరించిన జాణలున్నారు. అదే అసలైన నీతి అని సాటి ఆడపడుచులకి బోధ చేసిన ముద్దరాళ్లున్నారు.

కొన్నికథల్లో స్త్రీ భోగవస్తువు అయితే మరికొన్నికథల్లో విశిష్టమయిన విలక్షణమయిన స్త్రీపాత్రలు గోచరమవుతాయి పాఠకుడికి. సాధారణంగా ఒక సిద్ధాంతానికో వాదానికో కట్టుబడి రచనలు చేసినప్పుడు, ఆరచనలన్నీ ఏకోన్ముఖంగా సాగే ప్రమాదం ఉంది. తద్భిన్నంగా రామకృష్ణశాస్త్రిగారికథల్లో అసామాన్యమయిన వైవిధ్యం చోటు చేసుకుని సమ్యక్ దృష్టిని సాధించింది. అందుకే కొన్నికథల్లో వారకాంతలని అన్నమాటలు మనని కలవరపరిచినా, ఒక చారిత్ర్యకసత్యాన్ని కూడా ప్రస్ఫుటం చేస్తాయి. వారకాంతలనీ, వారి వ్యాపకాలనీ చిత్రించినప్పుడు కూడా శృంగారకథనాలలో సర్వసాధారణమయిన అంగాంగవర్ణనలు కనిపించకపోవడం (కావ్యాలనుండో ప్రబంధాలనుండో ఉదాహరణలు ఎత్తి చూపినప్పుడు తప్పిస్తే) కథకుడి స్ఫూర్తికీ, సమ్యక్ దృష్టికీ తార్కాణం.

“మధ్యాక్కర” “ఆతిధ్యం” కథలు పక్కపక్కన పెట్టి చదివితే, రెండుతరాల మానసిక ప్రవృత్తులలో గల అంతరం, ఆంతర్యం స్పష్టమవుతుంది. మొదటికథలో తాతగారు అమ్మమ్మకీ, మనవడికీ కూడా సానిపాపలయందు తమకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. కథాంతంలో బీబీనాంచారమ్మని స్పరించుకోడంలో గతంలో రసహృదయులు సర్వసాధారణంగా ఉదహరిస్తూ వచ్చిన ధర్మసూక్ష్మం. రెండోకథలో మనవడిని అదే దోవన అంపడానికి ప్రయత్నిస్తారు. భరతుడినుండీ బిల్వమంగళుడివరకూ గ్రంథప్రామాణ్యాలు పునరుద్ఘాటించి, అతిథిసేవలో “అది” విధిగా అమర్చాలనీ, టీ, సిగరెట్లలాగ స్త్రీ కూడా సర్వసాధారణం అని ప్రవచించి, అత్తరుపూతలతో కొత్తపెళ్లకూతురిని శోభనంగదిలోకి తోలినట్టు సానివాడకి తోలితే ఆ యువకుడు చేసిన పని ఈనాడు మనకి న్యాయసమ్మతం కానీ ఆ తాతగారికీ, వారిలాటి సనాతునులకీ హాస్యాస్పదం. తాను (మనవడు) ఇంటికి తిరిగివచ్చేలోపున ఎన్నిసార్లు నవ్వుకున్నారో తాతగారు అంటాడు కథకుడు. ఆసంగతి ఆ యువకుడికీ తెలుసు. ఇది కూడా మల్లాదివారికథల్లో ప్రత్యేకతే. ఏసందర్భంలోనూ ఏపాత్రకీ కోపం రాదు. వచ్చినా, హద్దు మీరి ఆగడాలకి దిగరు. వారికథల్లో అందరూ మంచివారే. కట్టుకథలు చెప్పిన తనదగ్గర డబ్బులు వడికినవాడు కూడా ఆప్తువాడే. కంగు తిన్నవాడు కూడా సుప్రసన్నుడే. (మీమాంస).

వెనకటితరాల మగవారిదృష్టిలో కళావంతులు సంఘంలో ఆదరించదగ్గ భాగం అయితే, తరవాతితరం యువకులదృష్టిలో వారు సంఘదూరులు. పూర్వం స్త్రీలని భోగవస్తువుగా పరిగణిస్తే, ఆతరవాతివారు అంటే చారిత్ర్యకంగా ఇరవయో శతాబ్దం తొలిదశనాటికి అది తప్పుగా భావించడం మొదలు పెట్టేరు. కాలానుగతంగా వచ్చిన ఈ మార్పు రామకృష్ణశాస్త్రిగారి కథల్లో ప్రస్ఫుటంగా చిత్రించడం చూస్తాం. “ద్రౌమపదీవస్త్రాపహరణం”, “ఆతిధ్యం” లాటి కథల్లో అమ్మాయిలలో తిరుగుబాటుతనం, అబ్బాయిలలో ఒకరకం అయోమయం చోటు చేసుకున్నట్టు కనిపిస్తాయి. అబ్బాయిలు తెగించి బోగంఇళ్లకి వెళ్లలేరు. అలాగని వారిని సాటిమనుషులుగా గుర్తించనూ లేరు.

“ద్రౌపదీ వస్త్రాపహరణం”లో చంద్రంతల్లికి లోకం తమకి వారకాంతలు, దేవదాసీలు అంటూ ఎన్ని పేర్లు పెట్టినా, తాము వేశ్యలము అన్నది స్పష్టంగా తెలుసు. అందుకే, ఆవిడ తనని తానే వెలి వేసుకుంది. ఈచర్యలో సంఘంలో గూడు కట్టుకుని ఉన్న కుహనావిలువల ఎత్తిపొడుపు ఉంది. నోటితో మాటాడుతూ, నొసలుతో వెక్కిరించడంవంటిది ఈ పేర్లు పెట్టడం. ఆత్మగౌరవం ఉన్న ఏ వ్యక్తికీ సాంత్వన కలిగించదు ఈ ప్రవృత్తి.

కాలేజీలో యువకులు మహోత్సాహంతో ద్రౌపదీవస్త్రాపహరణం నాటకం వేయడానికి నిశ్చయించుకున్నతరవాత చంద్రాన్ని ద్రౌపదివేషం వెయ్యమని అడగాలి. అసలు ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకునే ఆ నాటకం ఎంచుకున్నారన్నది కథకుడు చెప్పడు కానీ, పాఠకుడికి సుస్పష్టమే. మరి చంద్రాన్ని ఎవరు అడుగుతారు. అది పిల్లి మెళ్లో గంట కట్టడంలాటిదే. ప్రిన్సిపాలుగారిచేత చంద్రాన్ని అడిగించడంలో తెలుస్తాయి వాళ్ల ఓటుగుండెలు. తనని సాటివిద్యార్థులు బోగందానిగానే చూశారు, తను ఏనాటికి వారిచెల్లెలితో సమం కాదు అని చంద్రంకి అర్థమవుతుంది. వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఆమె పథకం మాత్రం అంత మెచ్చదగ్గదిగా అనిపించలేదు నాకు. తనపరువు నిలబెట్టుకోడానికి మరొక స్త్రీని ఎరవేయడం న్యాయమేనా అన్నప్రశ్న పాఠకుడిలో ఉదయించకమానదు. ఇదంతా కుర్రకారు ఆకతాయినతనం అని సరిపెట్టుకోవాలేమో.

మంత్రపుష్పం” కథలో ప్రధానపాత్ర, సీతాయ్ “అదో పెద్దబాలశిక్ష” అంటాడు కథకుడు. “కడుపెరిగి ఉంగ బట్టకపోతే, జాతి జాతంతా ఆకటితో అలమటించిపోతుంది,” అంటుంది సీతాయ్. ఆమె తనకు తానుగా యుద్ధశిబిరానికి వెళ్లి, సైనికులని సుఖపెట్టి, జాతిని ఉద్ధరించిన పుణ్యాత్మురాలు. సీతాయి‌లాగే మరో విలక్షణమయినపాత్ర “చైత్రరథం”లో నాగరత్నం.

నాగరత్నం “చైత్రరథం”లో ప్రధానపాత్రే అయినా, ఆనాటి రాజకీయాలూ, రాజకీయనాయకుల నీచప్రవృత్తులూను విస్తృతంగానే చర్చించారు రచయిత.. అయినవారందరినీ ఎదిరించి, చిత్తశుద్ధితో దేశసేవకి తనని తాను అంకితం చేసుకున్న వేశ్య నాగరత్నం. చివరకి విసిగి వేసారి “ఎందుకిలా ముత్యాలు వెదజల్లడం” అనుకుని, వెనకటి వైభవంలోకి ఒత్తిగిలింది. కథంతా వ్యంగ్యాత్మకంగా నడుస్తుంది. రామకృష్ణశాస్త్రిగారు ఈసంకలనానికి రాసిన ముందుమాటలో (నేనూ, నాకతలూ), “మీకథలో నీతి ఏమిటి?” అని అడిగేవాళ్లకి, తనజవాబు “దానికున్నది జాతి” అన్నారు. పై కథల్లో జాతిపై పదునైన విసుర్లు చాలానే ఉన్నాయి.

“సినీవాలీ”లో మంజరి, “సర్వమంగళ”లో అక్క తమకి తాము పెద్దరికం వహించి కథలకి సారథ్యం చేస్తారు. ఈరెండుకథల్లోనూ సందేశం ఒకటే. ఆడవాళ్లు అవసరమయినప్పుడు కళ్లేలు తమచేతుల్లోకి తీసుకుని బండి నడిపించగలరనే. అయితే “సినీవాలీ”లో మంజరికున్న ఆత్మస్థైర్యం “సర్వమంగళ”లో అక్కకి లేదు. “సినీవాలీ”లో తుదివిజయం మంజరిదే. “సర్వమంగళ”లో అక్క తనని తాను బలి ఇచ్చుకున్నాననడం ఆపాత్రకి ఏమాత్రమూ బలం ఇచ్చేదిగా లేదు. ఆవిడ చేసిన త్యాగం అర్థరహితం, ఆవిడబతుకు గంగపాలు. రచయిత ముందుమాటలో ఈ శీర్షికకి ఇచ్చిన వ్యాఖ్యానం చదివినతరవాత కూడా నాకు ఔచిత్యం బోధపడలేదు. .

“గృహిణీపదం”లో ఇంటింటా ఉండే భాగవతమే అయినా, రామకృష్ణశాస్త్రిగారి కథల్లో మహోధృతమయిన సంఘర్షణలు చూడం. ఈకథ వ్యంగ్యంతో, హాస్యంతో కూడిన సంభాషణలతో, తగుమాత్రం ఎత్తిపొడుపులతో సాఫీగా సాగిపోతుంది. “మానుషమున్న ఏ ఆడది మొగవాణ్ణి పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుంటుందీ” అన్నది ఆమెవాదన. “నిజమే. నేనూ మా మేనత్తకొడుకుని చేసుకుని ఉంటే బాగుండేది అనుకుని ఉంటే బాగుండేది” అని అతనిజవాబు. “గీతగోవిందం పెండ్లాం రాసినకావ్యాన్ని తగుదునమ్మా అని తనపేర పెట్టించుకున్నాడు జయదేవుడు” అంటుంది ఆమె. అతను నవ్వుతాడు.

రామకృష్ణశాస్త్రిగారికథల్లో గొప్ప వైవిధ్యం ఉంది. మరోలా చెప్పాలంటే, ఈపాత్రలన్నిటినీ ఒకచోట పేర్చి చూస్తే, మనసాంఘిక పరిణామం ఛాయామాత్రంగా గమనించగలం. స్త్రీ, పురుషసంబంధాలగురించి, స్త్రీలలో, పురుషులలో ఈతరంవారికీ, ముందుతరాలవారికీ మధ్య వచ్చినమార్పులకీ, అభిప్రాయబేధాలకీ అద్దం పడతాయి ఈకథలు.

“ఆతిథ్యం”లో తండ్రిని తిరస్కరించినకుమారుడికి ఉత్తమగతులుండవని శాస్త్రాలు ఘోషిస్తున్నాయిట గదా” అంటే, “తప్పుదారి పట్టిన తండ్రికి విధేయుడై, ఆలిని ఉసురుపెట్టేవాడి గతీ అంతేనంటున్నాయి నాయనా” అని సమాధానం.

అలాగే, “ఏష ధర్మ­ సనాతనః”లో కూడా దుర్మార్గుడయిన తండ్రిని కంటకించుకుని, తల్లి పతివ్రత కాకపోతేనూ, తాను ఆతండ్రికి పుట్టిఉండకపోతే తనకి హర్షదాయకమేనంటూ కొడుకు తండ్రిని ఎద్దేవా చేయడమే ఇతివృత్తం. కారణం ఆ తండ్రి తల్లిని హింస పెట్టడం, దానికి తల్లి తల ఒగ్గడం. ఉత్తమపురుషలో సాగిన ఈకథ ఒక చిన్న స్వగతంలా సాగుతుందే తప్ప తుదీ మొదలూ కనిపించవు. కథకుడికి కావలిసినదల్లా ఆ తండ్రి “శుద్ధవెధవ” అని పాఠకుడిని నమ్మించడమే అనిపిస్తుంది. ఈరెండు కథల్లోనూ స్త్రీలపట్ల పురుషుల అమానుషచర్యలని గర్హించడం చూస్తాం. అయితే, ఈరెండుకథలకీ కథాకాలం ఒకటే కాకపోవడంవల్ల, ఈరెండు కథలూ ఉమ్మడిగా ఒక చారిత్ర్యకసత్యాన్ని ఎత్తిచూపుతాయి.

స్త్రీలని హింసించే మూర్ఖులు ఏకాలంలోనూ ఉంటూనే ఉన్నారు. మొదటికథలో ఈ హింస ప్రధానాంశమయితే, రెండోకథలో కేవలం సందర్భానుసారం చేసినవ్యాఖ్యానంగా కథలో చోటు చేసుకుంది.

పాత్రలన్నిటినీ, అన్ని తరగతుల్లోనూ పరిశీలించి చూసినప్పుడు  మనిషికి తనలో తనకి ఉన్న నమ్మకం, అభిజాత్యం ప్రధానాంశంగా కనిపిస్తాయి. కళావంతులు, దేవదాసీలు – సంఘం ప్రసాదించిన నామధేయాలన్నిటినీ తృణీకరించి, చంద్రంతల్లి తనని తాను వెలి వేసుకుంది. ఆవిడపెంపకంలో తాను పెంచుకున్నచంద్రానికి కూడా అదే తత్త్వం అలవడింది. “ధర్మపన్నం”, “ఆతిధ్యం” కథల్లో గృహస్థు భార్యని అతిథులసేవలో నియమించడం న్యాయం అంటూ తాతగారిచేత చెప్పించడం, స్త్రీలు ఆ ధర్మాన్ని ప్రశ్నించకపోవడం ఈనాటివిలువలదృష్ట్యా హేయంగా కనిపిస్తుంది. ఈవిషయం ఎత్తిచూపడమే రచయిత ఆశయమా ఈకథలు రాయడంలో? మరి ఈనాడు స్వేచ్ఛపేరున, నవనాగరీకంపేరున ఇదే జరగడం (wife swapping, swinging లాటివి) గమనిస్తే, ఈకథలు వక్రోక్తి అనొచ్చు. అన్యాపదేశంగా  వర్తమానంలో కూడా ఈ ఆచారం కొనసాగుతూనే ఉందన్న హెచ్చరిక కావచ్చు. వర్తమానాన్ని తీర్చిదిద్దుకోడానికి గతాన్ని గూర్చిన అవగాహన అవుసరం. ఇదే రచయిత ఆశయం కావచ్చు. బహుశా విజ్ఞులయిన పాఠకులే నిర్ణయించుకోవాలి.

ధర్మంపేరుతో బిచ్చగాళ్లవిషయంలోనూ, సాంఘికన్యాయంపేరుతో భోగంవారి విషయంలోనూ పైతరగతివారు చేస్తున్న ఆర్భాటాలకీ, ఆ ఆర్భాటాలలోని కృత్రిమతకీ రూపకల్పన “ద్రౌపదీవస్త్రాపహరణం.” “పల్లవి” కథలో “కడుపు మాడ్చడం కన్నా నింపడం మహాపాతకం” అంటాడు బిచ్చగాడు. ఇంతమంది ఇంత చేస్తుంటే మరి బిచ్చగాళ్లసంఖ్య తగ్గదేం? అంటే సమాధానం ఏదీ?

ఇది మద్రాసు మహానగరంలో కాలానికి కొలమానంగా సృష్టించబడిన గడియారం కథ.  “మీకు టైం చెప్పడమే మాపనా?” అని ఎద్దేవా మనుషుల్ని ప్రశ్నిస్తుంది గడియారం. ఈప్రశ్నతో పాఠకుడికి నవ్వు రాకమానదు. అయితే కథ కడకంటా చదివినతరవాత కథకుడి ఆంతర్యం బోధపడుతుంది. టైము లేదూ, టైము లేదూ అంటూ కిరకిరలాడేవాళ్లందరూ గమనంలో ఉంచుకోవలసింది ఆ కొలమానాలనీ, తద్వారా అనేకానేక పరిథులనీ నిర్మించుకున్నది మానవులేనని. గడియారానికేముంది, కీ యిచ్చి, ముళ్లని ఎక్కడ అమరిస్తే, అక్కడినుంచే తిరుగుతూ పోతుంది. మనుషులే నిర్ణయించుకోవాలి తమ జీవనసరళి.

ఈకథలన్నీ ఒక ఎత్తయితే, ప్రాచీనగాథలలోని పాత్రలతో తనదైన శైలిలో కథని మలచడం మరో ఎత్తు. “వనమాలి”, “రంగవల్లి,” “రవిచంద్రిక” ఈకోవలోనివి. ఈకథలో విశేషం రామకృష్ణశాస్త్రిగారి కథనరీతి. వీటిలో నిజం ఎంత, కల్పన ఎంత, సందేశం ఏమిటి లాటి చర్చలకి ఆస్కారం లేదు. ఒక సుందర సురుచిరకావ్యం చదివిన తృప్తి కలుగుతుంది ఇవి చదివినప్పుడు. అంతే.

మల్లాదివారి కథల్లో కొట్టొచ్చినట్టు కనిపించేది వారి భాషాపాటవం. ఇప్పుడు తెలుగులో ఇంగ్లీషు ఎంత ఉందో ఆ రోజుల్లో సంస్కృతం అంతా ఉండేది. మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథల్లో జానుతెనుగూ, క్లిష్టసంస్కృతసమాసాలూ కూడా కలగాపులగంగా చోటు చేసుకున్నాయి. విశేషం ఏమిటంటే ఈరెండు పాయలనీ ఒకగాటకి కట్టి కథని నడిపించిన ఆయన రచనాకౌశలం.

ఒకప్రక్కన అసలుసిసలైన తెనుగు జాతీయాలు “మంచిమాట చేసుకురానా?” (భోజనంఏర్పాట్లు చేసుకురానా అన్న అర్థంలో), “పిల్లది లోజెడ్డది” (పిల్లకి జ్వరం వచ్చింది) వంటి వాక్యాలు తెలుగుభాషమీద మమకారం ఉన్నవారిమనసులని అలరిస్తాయి. “కాకినాడ పరగణావాళ్లు తిడుతున్నప్పుడు వారినోటివెంట యెంత చక్కని జానుతెనుగు రేగుతుందనీ …” అంటారు రచయిత “పల్లవి” కథలో. అలాటి జానుతెనుగు విని, ఆకళించుకుని, హక్కుభుక్తం చేసుకుని, ప్రతిభావంతంగా తనకథల్లో వినియోగించుకున్నారాయన.

కడుపు మండినప్పుడు నోటివెంట వచ్చేది అచ్చతెలుగేననడానికి నిదర్శనంగా “ఖామోష్”, ‌“సర్వమంగళ” కథల్లో భాష చెపుతుంది. “ఖామోష్” కథంతా అద్భుతమయిన మాండలీకంలో ప్రధానపాత్రద్వారా వింటాం. తల్లి తనని ఒక తలమాసినవాడికి అంటగట్టబోతే కాదని, తండ్రిని ఎదిరించి, తనని ఆదరించిన మారాజుదగ్గర చేరి, ఆయన మట్టి అయిపోగా, తెలుసుకున్న జీవితసత్యం “ఆడకూతురికి ఓకంట యెన్నెలుండాలి, ఓకంట కత్తులుండాలి – గొంతులో కోయిలుండాలి. కొరడా ఉండాలి … గుబుల్ తప్పితే నరమానవుడు మనకి గులామే.. .. మాలిక్ కాడే? ఫికర్ నయ్. – ఇది యాదుంచుకు బదుకు,” అంటుంది కథానాయిక.

మంచికథకి ఒక ముఖ్యలక్షణం పాఠకుడిలో ఉత్సుకత నిలపగలగడం. శాస్త్రిగారికథల్లో ఉత్సుకతతోపాటు వాక్చాతుర్యం కూడా సరిసమానంగా తులతూగుతూ పాఠకుడికి ఉల్లాసం కలిగిస్తుంది. అంచేత పాఠకుడిదృష్టి ఒక్కకథమీదే కాక – అంటే ముందేం జరుగుతుందన్న కౌతుకం ఒక్కటే కాక – ఆ పదరమ్యతకి పరవశిస్తుంది కూడా.

సాహిత్యం ప్రతీకాత్మకం. కథనంలో ధ్వని ఒక ముఖ్యమయిన అంశం. వాచ్యం చేయడానికి మనసొప్పని ఆలోచనలకీ, పాఠకులమేథని సాన పెట్టడానికీ పనికొచ్చే సాధనం ధ్వని. రామకృష్ణశాస్త్రిగారి కథల్లో ఈ ధ్వని అపారం. కదాచితుగా పాఠకుడిని తికమక పెడుతుంది కూడా. ఒక సన్నివేశంలో గానీ, సంఘటనలో గానీ ఏంజరిగింది అన్న వివరణ కంటే ఆయా సమయాల్లో పాత్రలఅనుభూతికి – పాత్రలు ఎలా స్పందించేయి అన్నవిషయానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారాయన. రచయిత కూడా పాత్రలతో తాదాత్మ్యం పొంది రాస్తున్నారేమో అనిపిస్తుంది. ఆప్రవాహంలో ఒకొకప్పుడు ఏ మాటలు ఎవరు అంటున్నారో కూడా స్పష్టం కాక పాఠకుడిని తికమక పెడతాయి. సోహం అలాటి కథ. ఈసంవిధానానికి కారణం మనకి అనూచానంగా వస్తున్న జానపదసాహిత్య కథనరీతి ప్రభావం కావచ్చు.

కొన్ని కథల్లో కొటేషన్ మార్కులు అసందర్భం అయి కథని గందరగోళం చేస్తాయి. మరి వెనకటిరోజుల్లో ఇలాటివిషయాలు పాఠకులని బాధించలేదేమో కానీ ఈరోజుల్లో మాత్రం పాఠకుడిని చిరాకు పెట్టడం తథ్యం. ఉదాహరణకి “గృహిణీపదం” చూడండి. ఇవి పునర్ముద్రణలో సవరించి ఉంటే బాగుండేది.

చివరిమాటగా, భాషవిషయంలో ఒకమాట చెప్పకతప్పదు. భాషాభిమానులకి మృష్టాన్నంవలె పరమానందం కలిగించే ఈకథల్లో నాబోటి సామాన్యపాఠకులకి అర్థంకాని నుడికారాలు ఉన్నాయి. కొన్ని సందర్భాన్నిబట్టి గ్రహించుకున్నా, కొన్ని సందర్భాల్లో ఈయనేమటి అంటున్నారు అనిపించక మానదు. “అధికచక్కంది”, “రాళ్లు చేస్తూ” వంటి పదబంధాలు తమాషాగా తోస్తాయి. కొన్నిచోట్ల అచ్చుతప్పులేమో అనిపించింది.

నిజానికి ఈనాటి తెలుగులో వాడుకలో లేని, లేదా చాలామందికి తెలీని నుడికారాలు రామకృష్ణశాస్త్రిగారికథల్లో చాలా కనిపిస్తాయి. తెలుగుభాషలో ఇలాటి జానుతెలుగు నుడికారాన్నీ, జాతీయాలనీ నిలబెట్టుకోడానికి, వాటిని సేకరించి ఒక నిఘంటువు తయారు చేస్తే బాగుండుననిపిస్తోంది. ఈమాట నేను రామకృష్ణశాస్త్రిగారి కథలు మాత్రమే దృష్టిలో పెట్టుకుని చెప్పడంలేదు.

శిల్పంవిషయంలో రామకృష్ణశాస్త్రిగారి అభిప్రాయం – కథకి తలా, తోకా ఉండాలా అంటే అది పాత్రలయిష్టం. కథని మొదలు పెట్టడంవరకే రచయిత బాధ్యత. ఆతరవాత పాత్రలే కథని నడిపిస్తాయి (రచయిత. నేనూ, నాకతలు) అని.

కథాసాహిత్యం జాతిచరిత్ర చెబుతుంది. మల్లాది రామకృష్ణశాస్త్రిగారికథలు అందులో హృద్యంగమమయిన భాగం అని ఒప్పుకోక తప్పదు.

(avkf.org లో డిసెంబరు 2005లో ప్రచురించినవ్యాసం కొలదిమార్పులతో తిరిగి ఇక్కడ పెడుతున్నాను. అజోవిభో ఫౌండేషన్‌వారికి కృతజ్ఞతలు.)

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.