నాస్నేహాలు నిలవని కారణం

గుమ్మానికి అటో కాలూ ఇటో కాలూ నాస్నేహాలు. అదేం స్నేహం అలా ఉండకూడదు. అవును, నాకు తెలుసు. కానీ నేను ప్లాను వేసుకు చేసేది కాదిది. ఎలా మొదలయినా అలా తేల్తోంది.

ఇదుగో ఎలా సాగుతున్నాయో, సాగకుండా ఆగిపోతున్నాయో చెప్తాను.

బంధువులు భగవద్దత్తం, మిత్రులు స్వయంవరం అంటాడు ఇంగ్లీషువాడు. చాలామందికి ఇంటిమనుషులకన్నా బయటిజనాలతో స్నేహమే ఎక్కువ ఆనందంగా, ఉల్లాసంగా ఉంటుంది. బహుశా మీకందరికీ అనుభవమే. అసలు మీరే నాకు బోధించగల నిష్ణాతులు. అంచేత అది వదిలేసి, స్నేహాలు ఎందుకు నిలవవో చెప్తాను.

కొంతవరకూ ఇవి కూడా మీకు తెలిసే ఉంటాయి.

మొదటికారణం స్నేహంలో కష్టసుఖాలు కలబోసుకు చెప్పుకోడం ఒక తంతు. ఏదో ఒక కష్టం, ఎవరికో ఒకరికి రావడం రెండోవారు సానుభూతి చూపడం, వీలయితే సాయం చేయడం సర్వసాదారణం. కొంతకాలానికి ఆఇద్దరిలో ఒకరే చెప్పుకునేవారూ, రెండోవారు వినేవారూ అయితే, ఏదో ఒకసమయంలో ఆ రెండోవ్యక్తికి విసుగేయవచ్చు. ఆ ప్రాణమిత్రురాలు ఫోను చేసిందంటేనూ, వస్తున్నానంటేనూ రెండోవ్యక్తికి అంతకుపూర్వం ఉన్న ఉత్సాహం లేకుండా పోవచ్చు. ఇప్పుడు కాదు, మళ్ళీ మాటాడదాం నేనే పిలుస్తాను .. అంటూ నెమ్మదిగా పసివాళ్ళకి తల్లిపాలు మాన్పించడంలా ఆ స్నేహం చల్లారిపోతుంది.

అలాగే సాయమూను. మనకసలు సాయం ఇచ్చిపుచ్చుకోడం కాదు. ఎవరికి అనువైనప్పుడు వారు అవుసరం అయినవారికి సాయం చేయడమే మనసంస్కృతి. నేను నీకు ఈ పని చేసిపెట్టేను కనక  నువ్వు ఆపని చేసి అప్పు తీర్చేయి అనం. అనుకోలేం. వ్యక్తిని బట్టి కాక వీలుని బట్టి మన సాయాలు. వైక్తిగతస్థాయిలో కాక అంతకంటె విస్తృతమైన సామాజికపరిధిలో అన్నమాట.

ఈసాయంలో మరో కోణం కష్టాలలాగే సాయాలు కూడా ఏకోన్ముఖంగా సాగేవి. ఒకరు మరొకరిని అదే పనిగా సాయాలు కోరడం, రెండోవారికి అది ఇబ్బందేమో అన్న ఆలోచనా పాలోచనా లేకుండా జరుగుతుంది ఒకొకప్పుడు. అలాటి స్నేహం కూడా ఏదో సమయంలో పుటుక్కున తెగకతప్పదు.

అంతకంటే వింత అదే పనిగా సాయం చేయడానికే స్నేహం ప్రదర్శించడం. ఇది మీలో ఎంతమందికి అనుభవమో నాకు తెలీదు కానీ నాకు మాత్రం ఒకరు అలాటివారు దొరికేరు. సాయం చేయడమే ఆమె ధ్యేయం. ఇది నాకు అర్థం కావడానికి కొంతకాలం పట్టింది. వద్దు మొర్రో అని ఎంత గోల పెట్టినా లాభం ఉండదు. నాకసలు ఇష్టం లేదన్నా సరే, ఏదో ఒక రూపంలో ఆ పుణ్యాత్ములు ఏదో ఒకపని చేస్తూనే ఉంటారు. అలాటప్పుడు కూడా స్నేహం బెడిసికొట్టకతప్పదు. అవతలిమనిషి వినకపోతే నేనే తప్పుకుంటాను.

ఇంచుమించు ఇలాటిదే నాలుగు దశాబ్దాలుగా తెలిసిన ఒకావిడతో. ఈమధ్య అంటే 4, 5 ఏళ్ళగా పిలవడం తగ్గిపోయింది. అన్నట్టు చెప్పలేదనుకుంటా. నాకు నేనై ఎవరినీ పిలవను. వాళ్ళందరూ అనేక వ్యాపకాలు ఉన్నవాళ్ళే, అంచేత వాళ్ళపనులకి అంతరాయం చేస్తానేమోనని పిలవను. పైన చెప్పినావిడ తగ్గించేక నేనేమీ అనుకోలేదు కానీ ఆవిడే పిలిచి, చెప్పే కారణాలు–అదే తరుచూ పిలవనందుకు–ఇంచుమించు టేప్ రికార్డరు పెట్టినట్టే. ప్రతిసారీ, “పిలుద్దాం అనుకుంటూనే అలా అయిపోతోందండి. పొద్దున్న లేచేరో లేదో అని అనుమానం, పొద్దెక్కేక బయటికి వెళ్ళిఉంటారేమనని, మధ్యాహ్నం లంచివేళ, ఆ తరవాత పడుకుంటారేమోనని …”

ప్రతివాక్యానికీ నేను ఫరవాలేదు అంటూనే ఉంటాను తను అలా కొనసాగిస్తూనే ఉంటుంది. అఖరికి విసుగేసి, “ఎందుకులే పిలవడం, ఏమున్నాయి అంత రాచకార్యాలు, పిలవొద్దులే …” అంటూ వచ్చేను. నాలుగు చుట్లు అలా అయేక ఆ పిలుపులు అంతమయేయి.

నేననేది ఎఁతకాలం స్నేహం అని కాదు ప్రదానం. ఎప్పటికప్పుడు అది కొనసాగించేలా ఉందా లేదా అన్నదే ముఖ్యం. పెళ్లి. ఉద్యోగం, సాంఘికస్థాయివంటివి ఒకరివిషయంలో చెప్పుకోదగ్గ మార్పు తెస్తే, రెండోవారు ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్టు ఉండుపోతే, వారిమధ్య సంభాషణలు సరిగా సాగవు. ఎప్పుడయినా ఇద్దరిమద్య సయోధ్య కొనసాగాలంటే సంభాషణలు సాగడానికి అనుకూలపరిస్థితులు కావాలి.

మొదట్లో మాటాడుకునేవిషయాలు మారుతూ కొత్తవి చేర్చడానికి అనుకూలంగా ఉంటే స్నేహం కూడా అలా సాగుతూనే ఉంటుంది. మద్యలో నాలుగైదేళ్లు మాటాడడం మానేసినా అభిరుచులకి తగ్గట్టు మాట సాగితేనే స్నేహం సాగుతుంది.

000

అంతర్దాలం వచ్చేక, జాలమిత్రులతో ఇతరరకాల ఇబ్బందులు మరోవిధంగా ఉంటున్నాయి.  బ్లాగుకంటె గుంపుల్లో చనువెక్కువ తీసుకుంటున్నట్టుంది. తమగురించి చెప్పే సమాచారం పూర్తిగా నిజం కాదు. ప్రొఫైలు బొమ్మలు తమవి కావచ్చు, కాకపోవచ్చు. ఫేస్బుక్కులో చేరిన కొత్తలో అభిరుచులని అనుసరించి గుంపులేర్పడతాయనీ, విషయంమీద చర్చలే ఉంటాయనీ నమ్మేను కానీ అది సత్యదూరమని అనతికాలంలోనే గ్రహించేను. అంటే సాహత్యం, కథ, పద్యంలాటి గ్రూపులమాట కాదు నేను చెప్పేదు. బహుశా గ్రూపులలో కొంత కట్టుబాటు ఉండొచ్చు. కానీ ఎవరికి వారు నడుపుకుంటున్న పేజీలో మాత్రం పట్టశక్యం కాకుండా పోతోంది. నాకు పరిచయమైనది ఫేస్బుక్కు ఒక్కటే కనక నా ఆలోచనలన్నీ ఫేస్బుక్కు కేంద్రంగానే చెప్తాను. ఇతర సైటులలో కూడా ఇలాగే ఉంటుందేమోనని నా సంశయం. ఎందుకంటే ఎక్కడైనా ప్లాట్‌ఫారం ఒకటే.

మొదట friend request పంపుతారు. కొన్నాళ్లు నేను వారి పేజీ చూసి ఒప్పుకుందాం అనుకున్నాను కానీ అది పనికిరాలేదు. వారిపేజీలో ఉన్నవేవీ నాఅభిరుచులకి తగినట్టు ఉండవు. అయినా వారికి నారాతలంటే ఇష్టం కాబోలనుకుని సరే అంటాను.

ఆ వెంటనే భోజనం చేసేరా, కూరేం చేసారు, బాగున్నారా అంటూ మెయిలులు కుప్పించేస్తారు.

నాకవి సమ్మతం కాదనీ, నేనలాటి స్నేహంకోసం కాదు ఇక్కడికొచ్చిందనీ చాలా చాలా నచ్చచెప్పవలసి వచ్చేది.

లేదా,

“నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. నా ఉద్యోగం .. మాఆవిడపేరు” … అంటూ తమ సంపూర్ణ జీవితచరిత్ర ఒక్కగుక్కలో ఎకరువు పెట్టేసి, “ఇప్పుడు మీసంగతి చెప్పండి” అంటారు. అది నిజానికి నాకే కాదు చాలామందికి సమ్మతం అనుకోను.

ఆ తరవాత “తిన్నారా, ఉన్నారా” అంటూ ప్రశ్నలు, “శుభరాత్రీ, శుభపగలూ” అంటూ బొమ్మలూ పంపడం, ఆవెంటనే అక్కా, అన్నా అంటూ చుట్టరికాలు కలపడం– ఇవన్నీ కూడా మితి మీరరాదు. ఇలా పంపేవాళ్లు ఉన్నారంటే అవి నచ్చినవారు ఉన్నారన్నమాటే. కాన అది ఎవరికి సమ్మతమో, ఎవరికి సమ్మతం కాదో కూడా గమనించాలి. ఫేస్బుక్కు  ఈవసతి కల్పించలేదు. నామటుకు నేను “కూడదు” అన్నదే default అనుకుంటాను. కాలగతిలో ఇతర పరిస్తితులలో కలుసుకుని, స్నేహం చేసుకుని దాన్ని దృఢపరుచుకుంటే అది వేరే దారి. LCDతెరమీదో సెల్ లోనో కనిపించినవారందరూ మిత్రులే అనుకుంటే మిత్రుడు అన్న పదాన్ని దుర్వినియోగపరచడమే.

ఇలాటివన్నీ చూసినప్పుడు నాకు మరో సందేహం కూడా కలుగుతుంది. జనాభాసంగతి.ఇండియాలో ఇంటా బయటా కూడా జనం కిటకిటలాడుతూ ఉంటారు కదా. మనిషిజాడ లేని స్థలం ఓ గజమైనా ఉండదు. మరి మనిషిముఖమే చూడనట్టు ఈ అంతర్జాలంలో మనుషులతో అంత ఆత్రంగా సావాసాలు ఎందుకు కోరతారు అని.

నీలితెర బురఖాలా పనిచేయడంవల్లనేమో. ఈ మాయాజాలంలో ఎవరు ఎలాటివారు అన్నది నిజంగా తెలీదు, వారు రాసినవాక్యాలద్వారా ఏర్పడే రూపం తప్పిస్తే, నిజంగా వారి ఆలోచనలు, అభిప్రాయాలూ, ఆసక్తీ ఏమిటో తెలీవు. అందుకే అంటున్నాను నాలుగురోజులు ఒక పేరు చూసీ, నాలుగు పోస్టులు చదివీ ఆహా, అచ్చం నాలాటివారే అనుకుని ప్రాణస్నేహితులు అని నిర్ణయించేసుకోడం తగదు.

నేను అందుకే అధిక జాగ్రత్తలు తసుకుంటాను. పదే పదే చెప్తాను అంతర్జాలంలో కనిపించేనేను నేను కాను అని. అదే నాతత్త్వం అని నిర్ణయించేసుకుని, ఎవరైనా నాకు మెయిలిస్తే కూడా అదే చెప్తాను. అంతర్జాలంలో ఏ విషయం ప్రస్తావిస్తున్నానో నాతో మాటలు ఆవిషయానికే పరిమితం.

నాధ్యేయం ఒకటే. నేను రాసినవి ఆసక్తిగలవారు చదివి ఆ పోస్టులో విషయంమీద మాత్రమే స్పందించాలని. నాపోస్టులలో ఆసక్తి లేనివారు అసలు చూడరని నానమ్మకం. నాకు ఆసక్తిలేని పోస్టులు నేను చూడను. అందరూ అంతే అనుకుంటాను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నాస్నేహాలన్నిటికీ కేంద్రం వస్తువే కానీ నా సొంతవిషయాలు కాదు. వాళ్ళిలాగా, వీళ్ళలాగా అంటూ ఇతరులవిషయాలు చెప్పేవారు కూడా నాతో స్నేహానికి సరిపడరు. ో

చివరిమాటగా, మన పూర్వులు తరుచూ వాడే సామెత గుర్తు పెట్టుకోండి. ఏ పుట్టలో ఏపాముందో .. అని. జాలంలో ఇది మరింత అవశ్యంగా గుర్తు పెట్టుకోవాలి.

000

(జులై 20, 2018)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.