ఇంటిపేరు వంశచిహ్నం

ఇంటిపేర్లగురించి విస్తృతంగా పరిశోధనలు జరిగేయి. జరుగుతున్నాయి. ఇది ఆపరిశోధనలగురించి కాదు. నిత్యజీవితంలో నాకు తోచిన నాలుగు మాటలు రాస్తున్నానంతే. 

గత అరవై ఏళ్ళలోనూ ఇంటిపేర్లలో చాలా మార్పులు వచ్చేయి. ముందు ఇంటిపేరూ, తరవాత బారసాలనాడు పెట్టినపేరూ చెప్పుకోడం మనసంప్రదాయం కొంతకాలం ఆ రెండూ తిరగేసి నిజ నామధేయం ముందూ ఇంటిపేరూ వెనకా చెప్పుకోడం మొదలయింది. ఇది కొంతవరకూ విదేశాలకి కావలసిన వీసా సమస్య కొంతవరకూ కారణం. తరవాత విదేశప్రయాణాలు లేకపోయినా ఇలా మార్చుకున్నారు కొందరు. ఇంకా కొన్ని విపరీతపు కూర్పులు కూడా వచ్చేయి కానీ అవన్నీ నేను ఇక్కడ చర్చకి పెట్టదలుచుకోలేదు.

మరో మార్పు ఇంటిపేరు వదిలేసి, తండ్రిపేరు, పెళ్లయిన ఆడపిల్లలు భర్తపేరు వాడడం ప్రారంభమయింది. ఈ పద్ధతిమూలంగా కుటుంబాలు కుంచించుకుపోతున్నాయి అని నా అభిప్రాయం. ఎలా అంటే తండ్రిపేరో, భర్తపేరో వాడుకోడంతో ఆ పేరు ఆ నలుగురికే పరిమితం. . వారి పిల్లలు పెళ్ళిళ్లయేక, మళ్లీ ఆ తండ్రిపేరు ఇంటిపేరవుతుంది. వెనకటితరంవారితో ఇంటిపేరుతో వచ్చే సంబంధం ఇక్కడ మాయమయిపోతుంది. నిజానికి ఇది ఇంగ్లీషుచదువులవల్ల అనడానికి లేదు. పాశ్చాత్యదేశాల్లో పెళ్లయిన ఆడవారు  భర్త ఇంటిపేరే వాడుకుంటారు కానీ భర్త నిజనామధేయం కాదు..

దీనికి సామాజికపరమైన మరొక సంప్రదాయం దోహదం చేస్తోంది. ఉద్యోగాలో మరొకటో కారణంగా కొడుకులూ, కోడళ్ళూ వేరు కాపురాలు పెట్టడం ఒకే ఊళ్లో ఉన్నా. వారానికో నెలకో ఆర్నెల్లోకో ఒకమారు కలుసుకుంటే మాటలు అట్టే ఉండవు. పైగా ఇప్పుడు సినిమాలు, బజార్లూ, గుళ్ళూ గోపురాలు తిరగడంతో కూడా ఇంటిసంగతులు, వంశంసంగతులు అట్టే తెలుసుకునే అవకాశం ఉండడంలేదు. ఈవిషయానికి మళ్ళీ వస్తాను.

మనసంస్కృతిలో ఇంటిపేరుకి ప్రత్యేకగౌరవం ఉంది. అవసరాలవారి ఆడబడుచు, కర్నాలవారి చిన్నవాడు అంటూ గుర్తించడం సర్వసాధారణం ఆరోజుల్లో. ప్రయోజకుడైతే “ఆవంశలక్షణం” అని మొత్తం వంశానికి ఆపాదిస్తాం ఆ ఘనత. ఇంటిపేరు ఆవంశంవారి DNA అనొచ్చు.

నిడదవోలు అనగానే ఆహా పండితులవంశం అంటూ ఆనందించేవారు పూర్వం. ఆతరవాత ఆ పేరు ఎలా వచ్చిందన్న చిన్న చర్చ జరిగేది. నిడుదవోలు వెంకటరావుగారి అబ్బాయి తమ ఇంటిపేరుగురించి పరిశోధన చేసి, నాలుగు తరాలముందు ఎక్కడినుండో వచ్చి నిడదవోలులో స్థిరపడ్డారనీ, అలా ఆ ఇంటిపేరు వచ్చిందనీ అన్నారుట. మరి అంతుకముందు మరో పేరు ఉండాలి కదా. అంతే కాదు. అసలు ఆఊళ్లో ఉండగా అవదు. ఆఊరినించి మరోఊరు వెళ్ళినప్పుడు, ఆ రెండోఊళ్ళో మొదటిఊరిపేరు ఇంటిపేరుగా స్థిరపడుతుంది. అది కూడా ఊరిపేరు అయితేనే. మామాతామహులు బొంబాయిలో చాలాకాలం పని చేసేరు. రిటైరయేక విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డారు. విశాఖపట్నంలో మెయిన్ రోడ్డుమీద మాతాతగారికి ఇల్లు ఉండేది. అందులో ఆరోజుల్లో రంగాబైండింగ్ వర్క్స్ ఉండేది. అప్పట్లో మాతాతగారిని బొంబాయివారు అనేవారుట. ఏకారణంచేతో అది స్థిరపడలేదు. కొచ్చెర్లకోట ఇంటిపేరే స్థిరమయింది.

ఊరిపేర్లు కాని ఇంటిపేర్లు ముక్కు, పప్పు, తోటకూరవంటి పేర్లు కూడా ఉన్నాయి కదా. ఈఇంటిపేర్లమీద పరిశోదనలు జరిగేయి కానీ అదంతా నేను చర్చించబోవడంలేదు. ప్రస్తుతం అలా ఇంటిపేరు వంశంపేరు నిలబెట్టేసంగతి మాత్రమే చెప్తున్నాను. ఆ సంప్రదాయంలో ఒకింత ఆనందం, కించిత్ గర్వం ఉంటుందనుకుంటాను నేను. పైన చెప్పినట్టు వాటిని వదిలేయడంతో  సంస్కృతిలో ఒక ముఖ్యభాగం మాయమయిపోయింది.

మామూలుగా పూర్వపద్ధతిలో వంశపారంపర్యంగా వస్తున్న ఇంటిపేర్లు కనిపించినప్పుడల్లా నాకు వెనకటిరోజుల్లో ఆఇంటిపేరుగల రచయితలు గుర్తుకొస్తారు. వేదుల అంటే వేదుల మీనాక్షీదేవిగారు, సోమంచి అంటే సోమంచి యజ్ఞన్నశాస్త్రిగారు. (వీరిగురించి వివరాలు నోట్సులో చూడండి). న్యాయపతి  అంటే న్యాయపతి రాఘవరావుగారు రేడియో అన్నయ్య, న్యాయపతి కామేశ్వరిగారు రేడియో అక్కయ్య. (రాఘవరావుగారి అన్నగారి మనుమరాలు అరుణ నామిత్రులజాబితాలో ఉన్నారని ఇలాగే తెలిసింది

కొంతకాలం క్రితం digital libraryలో ఏదో వెతుకుతుంటే, ఆంధ్ర మహాబారతనిఘంటువు కనిపించింది. గ్రంథకర్తపేరు అబ్బరాజు సూర్యనారాయణగారు అని చూడగానే, నాకు అబ్బరాజు మైథిలిగారు గుర్తుకొచ్చేరు. ఆమెని నాకు ఇంతకు పూర్వం తెలీదు. ఫేస్బుక్కుద్వారానే పరిచయం. ఆమెకి వెంటనే మెయిలిచ్చేను ఆపుస్తకం కావలిస్తే ఇక్కడుందని. ఆయన తమతాతగారనీ, ఆ గ్రంథం వారింట్లో ఉందనీ జవాబిచ్చేరు. నాకు సాహిత్యం పరిచయం కనక సాహిత్యం అన్నాను కానీ ఏరంగంలోనైనా ఇంటిపేర్లకి ఇలాటిగౌరవం ఉంది కదా. అక్కినేని, మిక్కిలినేని, వేదాంతం, … పేర్లు తెలీనివారు లేరు కదా.

నాలుగురోజులక్రితం నేను ఈ ఇంటిపేర్లమాట ఫేస్బుక్కులో పోస్టు చేస్తే చాలామంది స్పందించేరు ఎంతో ఉత్సాహంగా. కొందరు తమపూర్వులగురించి వివరాలిచ్చేరు. ఇద్దరు–శివరామకృష్ణారావు వంకాయలగారూ, మైథిలి అబ్బరాజుగారూ ఇచ్చిన విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఈవ్యాసం చివర వారిఅనుమతితో చేర్చేను.

అలాగే మిగతావారిలో చాలామందికి అంత రెండు మూడు తరాలు తెలీవు. కొందరినిషయంలో ఇంటిపేరు ఒకటే అయినా బంధుత్వ లేదు. అంటే నాకు తెలిసిన వ్యక్తులకీ అదే ఇంటిపేరు గల నా ఫేస్బుక్కు మిత్రులకీ సంబంధం లేదు. అసలు సంబంధం ఉండి తీరాలని నియమం ఏమీ లేదు కూడాను. కొన్ని ఇంటిపేర్లు వేరు వేరు కులాలవారిలో ఉండడం కూడా కద్దు.

ఇంతకీ ఈ ఇంటిపేర్లు వదిలేయడం వచ్చేక మనపూర్వులు ఎవరు అన్న చింతన కూడా అప్రయత్నంగానే తగ్గిపోతుందేమో. నేను వేరే ఎవర్నీ ఎత్తి చూపక్కర్లేదు. నాకే అందర్నీ తెలీదు. మాఅమ్మ నాన్నగారు సూర్యారావు. మాతమ్ముడికి ఆపేరు పెట్టేరు కనక తెలుసు.. అమ్మమ్మపేరు సన్యాసమ్మ. మామామయ్య కూతురికి ఆపేరు ఆధునీకం చేసి సన్నజాజి అని పెట్టేడని మాఅమ్మ అంటూండేది. అంచేత అది తెలుసు. అలాగా మానాన్నవైపు తాతగారిపేరు నారాయణమూర్తి. అది తెలియడానికి కారణం మాపెద్దన్నయ్యపేరు అదే నరనారాయణరావు, చిన్నమార్పుతో అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ పేర్లు పెట్టుకోడం కూడా ఒకవిధంగా వంశమర్యాదే. వాటివల్ల కూడా సంబందాలు తెలుస్తాయి. ఈపెద్దలపేర్లు పెట్టడం అన్నమాట వస్తే ముళ్లపూడి వెంకటరమణగారి బుడుగు గుర్తు రాకమానడు కదా.

ఈ సంబందాలు తవ్వి తీసుకోడం మానవనైజం. మాఊరువాడు, మాపొరుగువాడు, నాతో చదువుకున్నవాడు …ఇలా ఏదో వంక కలుపుకుంటూనే ఉంటాం మరొకరిని మనతో. ఈ “మంద”బుద్ధిగురించి వేరే రాస్తాను.

ఇంతకీ ఈ సొదంతా ఏ ఒక్కరినీ తప్పు పట్టే ఉద్దేశంతో రాయడంలేదు. నిజానికి నాపేరు కూడా అనేక రూపాంతరాలు పొందింది గత 60ఏళ్ళలోనూ. నేను కూడా మాఅమ్మాయికి మాపూర్వులపేరు పెట్టలేదు. కేవలం సమాజంలో సామూహికంగా వచ్చినమార్పుగురించి నాకు కలిగిన ఆలోచనలు, అది కూడా ఇంతకాలం అయేక, ఎందుకో తోచేయి అలా రాసేసేను. మీరు ఇది చదివి తత్క్షణం పేర్లు మార్చేసుకోవాలని కాదు. ఆమార్పుకి ఎవరికారణాలు వారికుంటాయి.

అంచేత మీకు తోచిన ఆలోచనలు మీరు చేసుకోండి.

000

నోట్స్

  1. శివరామకృష్ణారావు వంకాయలగారి నోట్

మా నాన్నగారిది విజయనగరం దగ్గర వెంకట భైరిపురం. మా పూర్వీకులు ఆ వూరికి యజమానులు. కళాపోషకులు. ఆదిభట్ల నారాయణదాసు గారు మా ముత్తాతలవద్ద విద్య నేర్చుకోడానికి వెళ్ళారట. తన ఆత్మకథలో ఆయనే ఈ సంగతి రాశారు. మా నాయనమ్మ నాగూరు నడిమింటి వారి సంతతి. మా వరకు ఈ విషయాలు తెలుసు. మా పిల్లలకు మా నాన్నగారే తెలుసు. మా అమ్మ నేమాని వారి అమ్మాయి. మా మాతామహులు కవి పండిత వంశస్థులు. నేమాని/నేమాన అనేది ఒక గ్రామ నామమట. ఎక్కడుందో నాకు తెలియదు.

తెలుగువారి ఇండ్ల పేర్లు (కొన్ని దశాబ్దాల క్రితం ” పేళ్ళు” అని కూడా రాసేవారు 🙂 ) చాలామట్టుకు గ్రామనామాలే! మరికొన్ని పౌరుష నామాలు. ఉదా. గ్రంథవారణం వారు. మీసాల వారు మొ. కొన్ని ఇళ్ళపేర్లు విచిత్రంగా మారిపోతూ ఉంటాయి కూడా. మా ఇంటిపేరునే తీసుకుంటే ‘ మంత్రవాది ‘ అనే ఇంటిపేరు ‘ వంకాయల ‘ గా మారిపోయింది. కాశీ విశ్వనాథుని సన్నిధి నించి వచ్చి తెలుగునేల మీద స్థిరపడినవారు విశ్వనాథ వారయ్యారు. అలాగే ఉత్తరాదినించే వచ్చి కడప ప్రాంతాల్లోని నందవరం వద్ద స్థిరపడిన వారు నందవరీకులయ్యారు (ప్రస్తుతం ఇది నియోగి బ్రాహ్మణుల్లో ఒక శాఖగా మారింది) ఊరిపేరు ఇంటిపేరుగా ఉండడం అనేది అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నది. తమిళనాడు, కేరళల్లో ఊరిపేరుతోబాటు తండ్రి పేరు కూడా ఉంటుంది. ఉదా. మహారాజపురం వి. సంతానం, సీర్కాళ్ యెస్. గోవిందరాజన్‌ మొ. మహరాజపురం, సీర్కాళ్ అనేవి వారి గ్రామనామాలు, విశ్వనాథ అయ్యర్ కుమారుడు (వి) సంతానం. సుబ్రహ్మణ్యం కుమారుడు గోవిందరాజన్‌. మరాఠీ వాళ్ళకీ ఇలాగే ఉంటాయి. ఊరిపేరు ఇంటిపారుగా, ఆయా వ్యక్తుల పేరు తరువాత ఉంటాయి. మంగేష్ గ్రామస్తులు మంగేష్కర్లు. ఇప్పటికీ ముంబై నగర వాసులని ముంబైకర్లు అని వ్యవహరిస్తూంటారు. సచిన్‌ ఆర్. తెందుల్కర్ పేరులోని ఆర్ అంటే అతడి తంద్రి రమేష్ గారి పేరు అది. అలాగే సచిన్‌ కుమారుడు అర్జున్‌ పేరు అర్జున్‌ యెస్. తెందుల్కర్ (అర్జున్‌ సచిన్‌ తెందుల్కర్). పంజాబీల్లో కూడా వారి గ్రామ నామం వ్యక్తుల పేరు చివర తగిలంచబిిఒ ఉంటుంది. ఉదా. హరిచంద్ సింగ్ లోంగోవాల్ (లోంగోవాల్ గ్రామనామం), సుర్జిత్ సింగ్ బర్నాలా, నవజోత్ సింగ్ సిద్ధూ వగైరాలు. మోహన్‌ దాస్ కరంచంద్ గాంధీ మనకి తెలుసు కదా! కరం చంద్ గారి కుమారుడు మోహన్‌ దాస్. గాంధీ అనేది గ్రామనామమేమో, నాకు తెలియదు. ఏది యేమైనా, ఇంటిపేరు అనేది వ్యక్తులను గుర్తించడానికి ఏర్పడ్డవే (means of identifying a person). ఇదంతా రాయించిన నిడదవోలు మాలతి గారికి నమస్కారాలు! నిడదవోలు (నిడుదవోలు అని రాసుకునేవారు ప్రముఖ సాహితీవేత్త ని. వేంకటరావు గారు) అంటే నిడుద ఐన -అనగా పొడవైన- ఊరు. అప్పట్లో ఆ ప్రాంతములో అదే పెద్ద ఊరన్నమాట!

  1. మైథిలి అబ్బరాజుగారి నోట్

నిజం. ప్రతి మనిషీ కనీసం రెండు ఇంటిపేర్ల సమ్మిశ్రితం , ఆకాశం నుంచి ఊడిపడరు. నేనైతే నాలుగు లెక్కేసుకుంటాను – పితామహుడు, పితామహి, మాతామహుడు, మాతామహి. నాలో ఒక్కొకటీ పాతికశాతపు గర్వంఇంటిపేర్లు

ప్రకాశం జిల్లాలో పరుచూరు దగ్గర ఆదిపూడి మా పితామహ స్థానం. అంతకుముందేమో తెలియదు , సంపన్నుడూ దాతా అయిన ఒక పూర్వులు ” అబ్బా , రాజు రా ! ” అనిపించుకున్నారని ఒక గాథ. అదే ఊరి వారైన ఆదిపూడి వారితో వారికి ఇచ్చిపుచ్చుకోవటాలు తరాల తరబడి కొనసాగాయి. మా బామ్మ వెంకట రాఘవమ్మ ఆదిపూడి వారి ఆడబడుచు. ఆదిపూడి సోదరకవులు గా అన్నగారు అబ్బరాజు వీరరాఘవయ్య గారు, తమ్ముడు మా పితామహులు సూర్యనారాయణ గారు అవధానాలు చేశారు, కవిత్వం చెప్పారు – ఆంధ్రమహాభారత నిఘంటువు ను ఇద్దరూ కలిసే ప్రారంభించారు. మా పితామహులు సంస్కృతాంధ్రాలలో పండితులు, భిషగ్వరులు కూడా. మాతామహులు పూండ్ల రామమూర్తి రావు గారు అముద్రిత గ్రంథ చింతామణి నడిపిన పూండ్లరామకృష్ణయ్య గారి మనవడు. నెల్లూరు స్వస్థలం. గిండీ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివారు , గుంటూరు జిల్లా పరిషత్ లో ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేశారు. మాతామహి రాజ్యలక్ష్మి తండ్రి మతుకుమల్లి వెంకటనరసింహసుబ్బారావుగారు. తెనాలి సొంత ఊరు. పచ్చయప్ప కళాశాల ఆంగ్లశాఖాధిపతి. అనంతరం మిసెస్ ఎవిఎన్ కళాశాల, విశాఖపట్నం ప్రిన్సిపాల్.ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, అది ఏర్పడుతూ ఉన్నదశలో మొదటి ఉపసంచాలకులు. తొలితరం బ్రహ్మో లలో ఒకరు. కృష్ణ శాస్త్రి గారికీ చలం గారికీ సన్నిహితులు. గొప్ప చదువరి, భావుకులు. గ్రంథకర్త. కథా రచయిత హితశ్రీ గారు ఆయన తమ్ముడి కొడుకు. ఇట్లా గుంటూరు, ఒంగోలు‌, నెల్లూరు – మూడు జిల్లాలూ నావే. వాటిలో ఏ యాస విన్నా ప్రాణం లేచి వస్తుంది.

  1. గుమ్మా రామలింగేశ్వరస్వామిగారి నోట్.

మా ఇంటిపేరు గుమ్మా ౩ వందలఎల్ల క్రిందట వచ్చింది అంతకు మునుపు నృశింహదేవర నరశిమ్వో పాసకులు.

నియోగ బ్రాహ్మణులలో గ్రామనాలు ఇంటి పేరు కావడం సామాన్యం. ఆగ్రామానికి అధికారిగాను వ్యావహార కర్త గానో పూర్వం రాజు నియోగించినప్పుడు అలా ఆ గ్రామనామం ఇంటిపెరైంది

లుకలాం వారు కనక లుకలాపు అంటారు.

4. అనితా రామ్ గారి నోట్.

మాఇంటి పేరు సోమంచి వారు నరసాపురం ఇంతకంటే ఏమీ తెలియదు, మిగిలిన సోమంచితో తరాలు విడిపోయాయి అంటారు, అమ్మది ప్రభల. కృష్ణా బంటుమిల్లి, రేపల్లె నుంచి వచ్చారుట, నాది తమిళ సాంప్రదాయం, పుదుక్కోటై నుంచి కలకత్తా దాకా:) ఆయన పేరే ఇంటిపేరుట.

000

సోమంచి యజ్ఞన్నశాస్త్రిగారిగురించి వంకాయల శివరామకృష్ణారావుగారి నోట్ –

సోమంచి యజ్ఞన్న శాస్త్రిగారిని స్మరించి మంచిపని చేశారు. నేను బొంబాయిలో ఉన్న కాలంలో వారిని తరచు వారింట కలిసేవాడిని. చాలా ఆదరంగా మాట్లాడేవారు. ఆయన బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ కమీషనర్ గా అప్పటికే రిటైరయారు. జుహూ విలేపార్లే ప్రాంతంలో ఉండేవారు. తన పుస్తకాలు రెండో మూడో నాకు ఇచ్చారు… With blessings అని రాసి సంతకం చేసి! వాటిలో ఒకటి ఇంగ్లీషుది.
ఆయన పూర్తి పేరు సోమంచి మహేశ్వర యాజ్ఞ్యవల్క్య శాస్త్రి..SMY Sastry అని సంతకం చేసేవారు. బోంబే జింఖానాలో ఆయన నాటకాలు వేసేవారు.

తా.క (ఆగస్ట్ 19, 2018) మరి కొన్ని విశేషాలు –

ముంబైలోని తెలుగు ప్రముఖుల్లో ఆయనొకరు (1960 నుంచి సుమారు నలభయ్యేళ్ళు) ఆయన కృషి వల్లనే ముంబై ఆంధ్ర మహాసభ వారికి దాదర్ లో స్వంత భవనం ఏర్పడింది. ఆయన తెలుగు నాటకాలు, నవలలు కొన్ని, కథలు రచించారు. అంతే కాక ఆర్ధిక శాస్త్రం లో కొన్ని పుస్తకాలు, మునిసిపల్ పరిపాలన మీదా పుస్తకాలు రాశారు.
ముంబై ఆంధ్ర మహాసభ వారి సావనీరులో శాస్త్రిగారి ప్రస్తావన ఇలా ఉంది:
One of he major landmarks in the annals of Mahasabha was the allocation of a plot of land by the Bombay Municipal Corporation through the efforts of late Shri S.M.Y.Sastry. Today, it stands majestic in its own premises, thanks to the dedicated efforts of many people at various stages of its growth.

000

(ఆగస్టు 9, 2018)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “ఇంటిపేరు వంశచిహ్నం”

  1. మా ఇంట్లో రోజూ ఆకులు రాలుతుంటాయి. వాటిని ఎప్పటికపుడు తీయకపోతే చిరాకు. మన ఇంటిపేరు(ఆకుల) ఇలా సార్ధకం చేసుకుంటున్నాం అని మా అబ్బాయి అంటూ ఉంటాడు.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.