కాకిబంగారం, ముచ్చికిరీటాలు

ఇచట నకీలీసరుకులు అమ్మబడును అని బోర్డు ఎక్కడా ఉండకపోవచ్చు కానీ సుమారు అదే అర్థం వచ్చే పదాలు వాడడం ఉంది. నకిలీ బంగారం, ముచ్చికిరీటాలూ, కాఫీ కాని కాఫీ (decaf

), నీళ్ళపాలు లేక పాలరంగులో నీళ్లు, ఇలా చాలా ఉన్నాయి. నైలాన్ చీరెలు వచ్చినకొత్తలో మాఅమ్మ వాటిని నారచీరెలనేది. ఇప్పుడు నగలు విరివిగానే వస్తున్నాయి. వాటిని అమెరికాలో costume jewelry అంటారు. ఇండియాలో మనవాళ్లు ఏంవంటారో తెలుసు కానీ మరిచిపోయేను.

మామూలుగా మనకి ఈ నకిలీసరుకు అంటే ఇష్టం ఉన్నా లేకున్నా కంపెనీలవాళ్ళు ఇచ్చినపేర్లే వాడతాం.

ఒకసారి చూసుకోకుండా cheese కొంటే, ఇంటికొచ్చి తినబోతే ఎండుగడ్డి నమిలినట్టనిపించింది. దానిమీద reconstituted అని రాసేరో లేదో నాకిప్పుడు జ్ఞాపకం లేదు. బాగులేదని పారేసేనే కానీ దాన్ని దేంతో చేసేరో చూడలేదు.

ఒకమారు సీకాయసబ్బు అని ఒక దుకాణంలో కనిపించింది. ఆహా ఓహో అని మురిసిపోయేను. షాంపూలపేరుమీద వారు అమ్ముకునే అనేక చెత్త నెత్తిన రుద్దుకునేకన్నా ఇది ఎంతో మేలు కదా మురిసిపోతూ కొనబోయేను. విస్కాన్సిన్‌లో మనదేశంగురించి తెలిసినవారు ఎక్కువ. మనమొహాలు చూసి కొంచెం ఎక్కువ గౌరవం చూపడం కూడా కద్దు కొన్ని దుకాణాల్లో. ఇంతకీ నాసీకాయసబ్బుమీద సరదా ఎంతోసేపు నిలవలేదు. నిలవకుండా చేసేడు సహృదయుడయినా ఆ అమ్మకాల అబ్బాయి. దానిలో నిజంగా సీకాయ లేదుట, అది కంపెనీవాళ్ళు పెట్టుకున్నపేరు మాత్రమేనట, యోగాచెప్పులూ, కర్మాఅప్పులూలాగే.

ఇంతకీ ఇదంతా ఎలా మొదలయిందంటే, వారంరోజులక్రితం సోయాపాలు ఇంట్లో చేసుకోడానికి vanilla కొందాం అని వెళ్తే తెలిసింది వెనిల్లా చాలా ఖరీదు అనీ, imitation vanilla అందులో నాలుగోవంతు ధరకి వస్తుందనీ. imitation ఆసీసామీద మాత్రం  స్పష్టంగా రాసిఉంది. ఆ రెంటికీ తేడా ఏమిటో కనుక్కోడానికి ఇంటికొచ్చేసేను ఏదీ కొనకుండా.

నారిసెర్చిమేళం అంతా ఇక్కడ పెట్టను కానీ ఒకమాట మాత్రం మీరంతా తెలుసుకోవలసిఉంది. ఏ సందేహం వచ్చినా జాలం చూడమంటారు. కానీ అది నూటికి నూరుపాళ్లూ నిజం కాదు. మనం అనుకున్నంత త్వరగా సందేహం సర్వవేళలా తీరదు. లేదా, అది కేవలం నాజాతకం అయిఉండాలి.. అవునూ, కాదూ అంటూ అన్నిరకాల సలహాలూ వస్తాయి. ఏది నమ్మడం, ఎవరు ఏ సందర్బాలలో ఏవికారాలో సతమవుతూ కొరగాని అభిప్రాయాలు గిలికిపారేసేరు అన్నది తెలుసుకోడం నాకయితే అంత తేలిగ్గా వీలవడంలేదు.

ఇంతకీ వెనిల్లామాట. ఒకసైటులో మేం పదిమంది అనన్యసామాన్య ప్రతిభ గల Chefsని సంప్రదించేం, ఇదుగో వారి అభిప్రాయాలు అని ప్రకటించేరు. పదిమంది ప్రవీణుల అభిప్రాయాలంటే అమ్మో అనుకును, గుమ్మయిపోయి, ఆ సైటు తెరిచేను. కొంతసేపు పట్టింది గుర్తిండానికి, వాళ్ళందరూ నకిలీసరుకు వాడకూడదు కాక వాడకూడదని గట్టిగా నొక్కి వక్కాణించేరు. అప్పుడే నాతెలివి తెల్లారింది. అవును మరి. వాళ్ళంతా ప్రపంచ విఖ్యాతి పొందిన ఉత్తమోత్తమ పాకశాస్త్రప్రవీణులు. “ఫరవాలేదు, నకిలీ సరుకు వాడొచ్చు” అని చెప్తారా? పరువు తక్కువ కాదూ? ఒకవేళ కాలం ఖర్మం కాలో మరేదో ఆపత్సమయం వచ్చో ఒకవేళ నకిలీసరుకు వాడినా, అలా వాడినట్టు చెప్పరు.

అదీ కథ. చెప్పొచ్చేదేమిటంటే, శాస్త్రజ్ఞులు తమ ప్రతిభావిశేషాలు చూపించి ఖ్యాతి గడించుకోడానికి నకిలీ సరుకులు తయారు చేస్తారు, శాస్త్రవిజ్ఞానం పెంపొందిస్తున్నం అన్న మిషతో. అది వారిఘనతని గుర్తించడానికి పనికొస్తుంది. మనలాటి సామాన్యులకి మాత్రం ఎంతమాత్రమూ ఆనందదాయకం కాదు. ఆ శాస్త్రజ్ఞులని మెచ్చుకోవాలని నాకు అనిపించదు.

అన్నట్టు కాకిబంగారం అంటే అభ్రకం. కాకిబంగారం అన్నపేరు ఎలా వచ్చిందో నాకు తెలీదు. కాకి బంగారంరంగులో ఉండదని మాత్రం తెలుసు. అభ్రకానికి కొంచెం బంగారంఛాయ ఉంది.

000

(ఆగస్ట్ 15, 2018)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “కాకిబంగారం, ముచ్చికిరీటాలు”

  1. తెలుగులో కాకు అంటే వ్యర్థము అన్న అర్థం ఉంది. కాకుబంగారం అంటే ‘బంగారంలా కనిపించినా వ్యర్థం ఐన పదార్థం’ అని తిరస్కారసూచకంగా పచ్చని అభ్రకానికి కాకుబంగారం అన్నపేరు వచ్చి ఉండవచ్చును. కాలక్రమేణా ఆ కాకుబంగారం అన్నమాట కాకిబంగారం అని స్థిరపడి ఉండవచ్చును.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.