ఆద్యంతాలు (కథ)

“ఏమంటావు?” అన్నాడు పొయ్యిమీద పెనంమీద దోసెలు పోస్తున్న తల్లినుద్దేశించి గోపీ కాఫీ చప్పరిస్తూ.

అతడికళ్ళు సెల్ఫోను మీదున్నాయి.

తల్లికళ్ళు పెనమ్మీద దోసెలమీదున్నాయి.

ఎవరి పనులు వారివి. లేదా ఎవరిగొడవ వారిది.

ఆవిడకి కొడుకు మాటలు వినిపించేయి కానీ తిరిగి చూడలేదు.

ఇద్దరూ మొహమొహాలు చూసుకుంటూ మాటాడ్డం ఎప్పుడు మానేసేరో కూడా జ్ఞాపకం రావడం లేదు.

కోపతాపాలు కావు కారణం.

అబ్బాయికి తీరిక తక్కువ.

పనులెక్కువ.

ఆవిడకి పనులు ఎక్కువ లేవు.

తీరిక బోలెడుంది.

దాంతో ఏం చేయాలో తెలీక సతమతమవుతూంటుందావిడ.

ఆవిడకి తెలుసు కొడుక్కి పనులన్నీ సక్రమంగా కళ్లొకటీ, చెయ్యొకటీ, నోరు రెండూ – తినడం, మాటాడడం – ఇన్నీ ఏకకాలంలో చేస్తే కానీ అవవని,  రోజు గడవదని.

కొన్ని చేస్తే గానీ బతుకు సాగదు.

అన్యములు చేస్తే గానీ మనసులో తిక్క వదలదు.

ఈపనిలో ఒత్తిడి, ఆ పనిలో చిత్తడి, ఊరట.

వీటన్నిటిమధ్య అమ్మ పులుసులో ముక్కలా.

మరి అలాటప్పుడు మొహాలు చూసుకున్నా ఒకటే, గోడలూ కిటికీలూ చూసినా ఒకటే.

కొడుకుమాటకి రెండు నిముషాలాగి అలవాటయిన సమాధానమే ఇచ్చింది, “నీయిష్టం.”

“అలా అంటేనే నాకు చిరాకు. నీకు ఏది బాగుంటుందో చెప్పు. అదే చేదాం. నాయిష్టం ఏమిటి? నీబతుకు నీది. నువ్వు సంతోషంగా ఉండాలనే నాకోరిక,” అన్నాడతను.

ఇంగ్లీషు మాటలు అచ్చతెలుగులో.  ఆవిడెప్పుడూ తనతల్లిని నీబతుకు నీది అనలేదు. అనగల అవకాశం లేదు.

“నువ్వూ …” తల్లి వాక్యం పూర్తి చేసేలోపున ఫోనుపిలుపు మళ్ళీ.

ఠపీమని అందుకున్నాడు బల్లమీద పెట్టిన ఫోను.  చెంపకి చేయి చేర్చి మాటల్లో పడిపోయేడు అందుకోసమే ఎదురుచూస్తున్నవాడిలా.

తల్లి తలొంచుకుని తనపనిలో పడిపోయింది.

కొడుకు రెండు దోసెలు తినేసి చాలంటూ లేచిపోయేడు.

“నాకు నీదగ్గర ఉండడమే సంతోషం అని నీకూ తెలుసు కదా. అందుకే కదా వచ్చేను. జీవితంలో చరమదశ పిల్లలదగ్గర గడపాలని ఏ తల్లికీ తండ్రీకీ ఉండదు?” – తల్లి ఈమాటలు అనలేదు. అనగలిగితే బాగుండు. కానీ అనడం ఆవిడవల్ల గాదు.

“నువ్వే అంటున్నావు కదా నీసలహాయే ఉచితమని,” అంది, అతికష్టంమీద నోరు పెగుల్చుకుని.

ప్చ్ అంటూ తల్లివేపు చురచుర చూసేడు. “సరే, మళ్ళీ ఆలోచించుకో. రేపు సాయంత్రంలోపున ఆ అర్జీ పంపుకోవాలి. లేకపోతే, నేను చైనా వెళ్లి తిరిగొచ్చేవరకూ ఆగాలి. అక్కడసలు వాటా దొరకడమే కష్టం. నానాగడ్డీ కరిచి నీకు వేగిరం వచ్చేలా చూస్తున్నాను,” అని గబగబా చెప్పదలుచుకున్న నాలుగుమాటలూ చెప్పేసి, చేతిలో కప్పు ఠక్కున బల్లమీద పెట్టేసి లేచిపోయేడు గోపీ.

చివరిసీనులో రకరకాల వాద్యాలలాగ శబ్దాలు. ఆ శబ్దాలన్నీ– కాఫీకప్పు, చెంచాలూ బల్లమీద పడేసిన శబ్దాలు, జోళ్ళు టకటక శబ్దాలు, గరాజి తలుపు తెరుచుకున్న శబ్దం, కారు బయల్దేరిన శబ్దం, గరాజుతలుపు మూసుకున్న శబ్దం … ఆ తరవాత ఎడతెగని నిశ్శబ్దం …  ఇందులో కొత్తేమీ లేదు.

ఆవిడ దోసెపిండి, బంగాళదుంపలకూర ఫ్రిజిలో పెట్టేసి, తనగదిలోకి వెళ్లి, మంచంమీద తలగడాలు సర్దుకుని వెనక్కి వాలింది పుస్తకమొకటి హస్తమున ధరించి.  పుస్తకంమీద కళ్ళు. మనసు మరెక్కడో విహారం.

ఇందాకా కొడుకు ఫోనులో మాటాడుతున్నధోరణి చూస్తే అదేమంత కొంపలంటుపోయే వ్యవహారంలా అనిపించలేదు. ఎంతోమంది పిల్లల్ని, ముఖ్యంగా అమెరికన్ పిల్లలని, చూసింది “మాఅమ్మతో మాటాడుతున్నాను తరవాత పిలుస్తాను” అనడం.

ఆవిడకుమారుడు మాత్రం అలా ఎప్పుడూ చెప్పడు.

“అమ్మకేముంది, అమ్మెక్కడికి పోతుంది, ఎప్పుడు కావలిస్తే అప్పుడే మాటాడుకోవచ్చు” అని అతడిఅభిప్రాయం. ఆమాటే చాలాసార్లే చెప్పేడు కూడాను ఆవిడకి. “నీకు ఎప్పుడు మాటాడాలనుందో చెప్పు. ఎక్కడున్నా సరే ఆఘమేఘాలమీద వచ్చి వాల్తాను.”

ఆకావలసిన సమయం రావడం మాత్రం కనాకష్టం.

అవిడ చిన్నగా నవ్వుకుంది.

“ఆమాత్రం మాట అయినా అనని సుపుత్రులు కూడా ఈలోకంలో ఏమూలో ఉండే ఉంటారు” అంటూ వినిపిస్తుంది అంతరాంతరాల అడుగుపొరల్లోంచి ఓ చిరుస్వరం, ఓ సుందరసురుచిరగళం వీనులవిందు చేస్తూ.

000

గోపీ చిన్నతనంలో తాము ఎంత ఆత్రపడ్డారు వాడికి మంచి చదువు కావాలని, మంచి స్కూల్లో చేర్పించి గొప్ప చదువులు చదివించాలని. తరవాత అన్నీ వరుసక్రమంలో యథావిధిగా జరిగేయి –

ఆ చదువులకోసం సంపాదన,

ఉన్న ఊళ్ళో మంచి స్కూలు లేదని, పట్నానికి మారడం.

దాంతో మరింత ఖర్చు,

తను బాంకులో చేస్తున్న పనితోపాటు, ట్యూషన్లు,

– వీటన్నటిమూలంగా పిల్లవాడిని చూడ్డానికీ వంటకీ మరో మనిషీ, దాంతో అధికంగా మరింత ఖర్చు

– దానికోసం మరో ఉద్యోగం బట్టలకొట్లో ఖాతాలు సరి చూడ్డం – ఇదంతా ఇద్దరూ ఎందుకు చేసేరంటే ఆ కుర్రవాడికి అత్యుత్తమచదువు చెప్పించి, అమెరికాలో అత్యుత్తమ ఉద్యోగం తెప్పించి, అత్యుత్తమసౌకర్యాలు కలిగించడంకోసం.

“నీకోసం ఇంత చేసేం” అని ఎప్పుడూ అన్లేదు. “నిన్నింతవాణ్ణి చెయ్యడానికి మేం ఎంత పాటు పడ్డామో తెలుసా?” అని రొక్కించి అడగలేదు.

అమెరికాలో ఇచ్చిపుచ్చుకోడానికీ మనసంస్కృతిలో ఇచ్చిపుచ్చుకోడానికీ తేడా అదే. అమెరికాలో ఎక్కడిక్కడ లెక్క తేల్చేసుకుంటారు. నువ్వు నాకు సాయం చేస్తే నేను నీకు మరేదో ఇచ్చి తత్క్షణమే అప్పు తీర్చేసుకునే పద్దతి. అదొక పద్ధతి.

మనకీ అప్పులు కొన్ని తరాలకి, సమాజానికీ కూడా పాకిపోతాయి. ఎప్పుడు ఎవరికి సాయం చేస్తామో, ఎవరు మనకి సాయం చేస్తారో చెప్పలేం. తల్లీకొడుకు ఋణం కూడా అంతే.

000

రెండో రోజూ, మూడో రోజూ, ఆరో రోజూ, తొమ్మిదో రోజూ కూడా ఆ ఇద్దరిమధ్యా అదే సంభాషణ సాగినతరవాత, తల్లి, “ఇక్కడ బాగానే ఉంది కదా. ఎందుకిప్పుడు …” అంటూ సగంలో వాక్యం అసంపూర్ణంగా వదిలేసింది.

“ఏం బాగు. నేనేమో నాపన్లమీద తిరుగుతుంటాను. నీకు ఏ అవసరం వచ్చినా చూడ్డానికి, హఠాత్తుగా ప్రాణంమీదికి వస్తే ఆదుకోడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. నువ్వే అంటున్నావు ఇక్కడ మనిషిమొహం కనిపించదనీ, అడవిలో ఉన్నట్టుందనీ. అక్కడయితే నీకు ఏదైనా అయితే, వెంటనే ఆదుకునే సంరక్షకులుంటారు. కనీసం నన్ను పిలిచి చెప్పడానికైనా ఒకరు ఉంటారు. పైగా అక్కడ నీకేం తక్కువ కాదు కదా. నీ వంటా నీ పొయ్యి అన్నీ నీకు ప్రత్యేకంగా ఉంటాయి. సాటి మనుషులుంటారు రకరకాల వ్యాపకాలూ, నీకెలా సమయం గడుపుకోవాలంటే అలా గడుపుకోవచ్చు.”

తల్లి సందేహిస్తూనే నెమ్మదిగా అంది, “ఏమోమరి. నేనిక్కడికి వచ్చింది నీదగ్గరుండడానికి.  మనవాళ్లంటూ ఉన్నప్పుడు అలా దిక్కు మాలినవాళ్లలా ఏదో సత్రంలో ఉండడమేమిటి?”

“అది సత్రం కాదు. అద్దెఇల్లు. అక్కడేమీ ఉచితం కాదు. నీకు ఇక్కడ మనింట్లో ఏఏ సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ అక్కడా ఉంటాయి. అధికంగా మనుషులు కనిపిస్తూంటారు. నువ్వే అన్నావు కదా ఎక్కడా మనిషిమొహం కనిపించదని. మరి అక్కడ కనిపిస్తారు. నీకు కావలసినవారితో కావలిసిన కాలక్షేపాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పాటలు, డాన్సులూ, బ్రిడ్జి …” అంటూ ఆగిపోయేడు గోపీ. అవన్నీ అమ్మకి అక్కర్లేదని గుర్తొచ్చింది.

ఆవిడపెదవులమీద ఛాయామాత్రంగా మందహాసం క్షణకాలం వెలిగి మాయమయింది. కొడుకుమీద రవంత జాలి కూడా కలిగింది.

“దానికేముందిలే. నాకాలక్షేపాలు నేనే చూసుకుంటాను. అదసలు సమస్యే కాదు.”

000

ఆవిడ అసలు మొదట దేశం వదలడానికి ఇష్టపడలేదు. అప్పుడు మరోరకం వాదన అయింది కొడుకుతో.

“నాబాధల్లా నువ్విక్కడ ఒక్కదానివీ ఉంటే, నాకక్కడ నువ్వెలా ఉన్నావో అని మనసు పీకుతూనే ఉంటుంది. అక్కడయితే, నిన్ను చూసేవాళ్ళున్నారు కదా అని ధీమా ఉంటుంది కదా నాకు.”

“ఇక్కడా ఉన్నారు నాకు చూసేవాళ్ళు. పెద్దక్కయ్య నేనంటే ప్రాణం పెడుతుంది. సిరి, అరవిందా, సంద్రాలు కూడా …”

“హాహా, వాళ్లల్లో ఎవరు నువ్వు పిలవగానే పరిగెట్టుకొచ్చేసి, ఏ ఆస్పత్రికో తీసికెళ్లగలవాళ్ళు?”

“అలా అంటావేమిటి? సిరీ, అరవిందా, పక్కింటి రామానుజంగారూ – ఇంకా చాలామందే ఉన్నారు కార్లు ఉన్నవాళ్లు.”

“కారు లేనివాళ్ళనలేదు నేను. ఎవరు అలా నిల్చున్నపాటున రా అంటే వచ్చేయగలవాళ్ళు అంటున్నా.”

తల్లి మాటాడలేదు. అదీ నిజమే. ఎవర్ని చూసినా రోజుకి 36 గంటలుంటే బాగుండుననేవాళ్ళే.

ఏం చెప్పగలదావిడ? నిజమే, ఎదుట ఉన్నప్పుడు ఎప్పుడేం కావలసినా సందేహించకుండా పిలు అంటారు కానీ తీరా పిలిస్తే, ఒక్కరికీ తీరికుండదు. ఏం చేస్తాం, ఈనాటి జీవనసరళి అదీ.

ఆవిడ సరేననగానే ఏనుగెక్కినంత సంతోషిచేడతను.

000

ఆఖరికి మనసు మార్చుకుంది ఆవిడ ఎందుకూ అంటే

– తనవంశంలో ఎవరూ 80 దాటి బతకలేదు. అంటే మరో మూడేళ్ళన్నమా ఆట. అంటే మూడేళ్ళూ  బతుకుతాననేం లేదు కదా. ఆ చివరిఘడియల్లో ఊరివాళ్లెవరో ఆదుకోవలసివస్తుంది. ఊళ్ళోవాళ్ళంతా వాడినే అంటారు ఉన్న ఒక్క కొడుకూ పట్టించుకోలేదని. తన తదనంతరం, కనీసం మిగిలిన ఆస్తి ఈ డబ్బా డవాలీ – లక్షలూ కోట్లూ కాకపోయినా – నాలుగు పరకలే అనుకో తీసుకోడానికో పారేయడానికో ఆ సుపుత్రుడే రావలసి వస్తుంది. అంచేత వాడిదగ్గరికి వెళ్ళి ఉండడమే సుఖం. అదీ నిర్ణయం.

000

ఈలోపున గోపీజీవితంలో కొన్ని మార్పులొచ్చేయి. అందులో ప్రధానం ఒకఅమ్మాయితో జత కలపడం. ఆసంగతి తల్లికి చెప్పలేదు.

ఆవిడ అమెరికాలో దిగి వారం రోజులయింది. అప్పుడు చెప్పేడు ఆవిడకి వేరే వసతిగృహంలో ఏర్పాటు చేస్తున్నట్టు.

ఆవిడమనసు చివుక్కుమంది. అయినవాళ్ళనీ, అచ్చొచ్చిన ఇంటినీ వదలుకు అంతదూరం పదివేల మైళ్లు  రావడం కొడుకుతో చివరిరోజులు గడపాలని కానీ దూరంగా మరో ఇంట్లో ముక్కూ మొహం తెలీనివారిమధ్య కడతేరాలనా?

“అట్టే దూరం లేదమ్మా. యాభైమైళ్లంటే నీకు ఏదో దూరంలా అనిపిస్తుంది కానీ ఇక్కడ పొరుగింటికిందే లెఖ్ఖ. రోజూ ఉద్యోగానికి వందమైళ్ళు ప్రయాణం చేసేవాళ్లు  కోకొల్లలు,” అంటూ నచ్చచెప్పడానికి ప్రయత్నించేడు గోపీ.

“పోనీ వచ్చి చూడు అక్కడ వసతులూ అవీ. నీకు నచ్చితే ఉండు లేకపోతే మరేదో మార్గం చూదాం,” అని కూడా హామీ ఇచ్చేడు.

ఆవిడ తలూపింది.

000

శుక్రవారం మధ్యాహ్నం కొడుకు తల్లిని తీసుకెళ్ళేడు ఆ వయసు మళ్లినవారి నివాసానికి.  మేనేజరు వాళ్ళిద్గరికీ అక్కడున్న వసతులన్నీ చూపించింది. మోడల్ వాటా చూపించింది.  కొత్తగా వేసిన రంగులతో గోడలు మెరిసిపడుతున్నాయి. వంటింట్లో అల్మారాలన్నీ అందుకోడానికి వీలుగా, విశాలంగా ఉన్నాయి. ఆ వాటాలోనే లాండ్రీ సదుపాయాలున్నాయి. హాలునానుకుని చిన్న వరండా ఉంది. ఆ పక్కనే swimming pool ఉంది. ఇద్దరు స్త్రీలు ఆ పూలుపక్కన పుస్తకాలు పట్టుక్కూర్చున్నారు. షూటింగుకి సిద్ధంగా ఉన్న సినిమాసెట్ లా ఉంది.

మేనేజరు పూల్ రూల్సు వివరించబోతే, గోపీ అడ్డుపడి, ధన్యవాదాలు చెప్పి, ఆ వివరాలు తరవాత మాటాడుకుందాం అన్నాడు.

అమ్మకి నచ్చలేదు అనుకున్నాడు మనసులోనే. ఆవిడ విడిగా చెప్పనవసరం లేకపోయింది.

దారిపొడుగునా ఎవరి ఆలోచనల్లో వాళ్లు.

– నచ్చలేదని చెప్పనా, నచ్చింది, అక్కడుంటాలే అని చెప్పనా అన్నది ఆవిడసమస్య

– నచ్చలేదంటే ఏమిటి చెయ్యడం? నా ఇంట్లో నువ్వుండడానికి వీలవదమ్మా, నా girl friend లీసా ఒప్పుకోదు అని ఎలా చెప్పడం? అవిడకి చెప్పకపోతే లీసాకి ఎలా వివరించడం?-ఇది అతడిసమస్య.

000

మూడోరోజు తల్లి ఆ వృద్ధాశ్రమానికి వెళ్లడానికి నిశ్చయించుకుని కొడుక్కి చెప్పింది, “అక్కడ బాగానే ఉండేటట్టే అనిపిస్తోంది. నీక్కూడా మనశ్శాంతి కదా. వారంరోజుల్లో మళ్ళీ చైనాప్రయాణం అంటున్నావు. ఈలోపున నేనక్కడికి మారిపోగలనేమో చూడు.”

ఆమాట వినగానే కొడుకుమొహంలో వెలిగిన మతాబాలు చూసి, తృప్తిగా నిట్టూర్చిందావిడ.

000

కొత్తింట్లో ఆవిడని దింపి, వారం వారం తప్పకుండా వచ్చి చూసి పోతుంటానని పన్నెండుమార్లు నొక్కి నొక్కి చెప్పి, గోపీ వెళ్లిపోయేడు.

కొడుకు వెళ్లినదిశ చాలాసేపు చూస్తూ కూర్చుండిపోయిందావిడ.

“మీఅబ్బాయా?”

ఉలిక్కిపడి చూసిందటు. అవునన్నట్టు తలూపింది.

“డాలీ.”

ఆవిడకి అర్థం కాలేదు. అయోమయంగా చూసింది. ఆ రెండో ఆవిడ నవ్వి, “నాపేరు డాలీ. మీపేరు?”

“కమల,” అంది గోపీతల్లి.

సరేనన్నట్టు తలూపి వెళ్ళిపోయింది డాలీ.

అప్పుడప్పుడు కామన్ హాల్లో కనిపించేది. ఒకరోజు బ్రిడ్జి ఆడదాం వస్తావా అనడిగింది.

తానే నేర్పుతానంది.

మరో ఇద్దర్ని పిలిచింది.

కమలకి ఆటయితే తేలిగ్గానే పట్టుబడింది కానీ ఆ ముగ్గురితో కలవడమే కుదరలేదు. ఆ ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతుంటే తనపని రేగుచెట్టుకింద గుడ్డివాడివతు అయింది.  ఆవిడ ఇంటరువరకూ చదివింది ఆపైన తెలుగు కథలు చదవడం మొదలు పెట్టేక ఆవిడఇంగ్లీషు మెరుగు పడిందనే అనుకుంది. అయినా వీళ్ళ ఇంగ్లీషు మాత్రం అర్థం కావడం లేదు

డాలీ ఒకట్రెండుసార్లు ఆ హాస్యాలు వివరించడానికి ప్రయత్నించింది కానీ ఆవిడకి హాస్యం కనిపించలేదు. దాంతో బ్రిడ్జి సరదా తీరిపోయింది.

000

నెలరోజులయింది. గోపీ చైనానించి తిరిగొచ్చేడు. ఆ ఆదివారం తల్లిని చూడడానికి వచ్చేడు. లీసాని కూడా తీసుకొచ్చి పరిచయం చేసేడు.

ఇదన్నమాట కథ అని ఆవిడకి అప్పుడు అర్థమయింది.

“నేను మనఊరికి వెళ్లిపోతాను.”

మెరుపులేని ఉరుము!!!

గోపీకి రెండు నిముషాలు పట్టింది తేరుకోడానికి.

“ఆఁ? ఏంటన్నావూ?” అడిగేడు, సరిగ్గా విన్నాడో లేదో తేల్చుకోడానికి.

“నాకిక్కడ ఊపిరాడ్డం లేదు. దేశం విశాలం, వీధులు విశాలం. ఇళ్లు విశాలం. నాకు మాత్రం ఊపిరాడ్డం లేదు. ఇరుకు. నేనిక్కడ ఉండలేను.”

“అదేమిటి? నాదగ్గర ఉండాలని కదా వచ్చేవు. ఇప్పుడు అక్కడికి మళ్ళీ ఎందుకు? మనం ఇవన్నీ మాటాడుకున్నాం కదా. నీకక్కడ అవసరసమయంలో ఆదుకునేవాళ్లుండరని.”

“అప్పుడలా అనుకున్నాను. కానీ ఇక్కడ చూసేక, అక్కడే నయం అనిపిస్తోంది.”

“ఇంకో నాలుగు నెలలు చూడకూడదా? అలవాటవడానికి కొంత కాలం పడుతుంది.”

“లేదులే. అవదు. మొలకయితే ఒకచోటినించి పీకి మరోచోట పాతితే బతుకుతుంది. మహావృక్షం అలా మరోచోట నాటితే బతకదు. అక్కడ పుట్టేను. అక్కడే పోవాలి.”

“అవేం మాటలమ్మా? నేను మాత్రం ఇక్కడ పుట్టేనేమిటి? నీవయసువాళ్ళు ఎంతమంది ఇక్కడ లేరు–యాజలుగారూ, వనజాక్షిగారూ, …”

“ఉన్నారు. ఉండలేక వెళ్లిపోయినవాళ్లు మాత్రం లేరా? వీరభద్రస్వామిగారూ, ఆషా అయ్యరూ …  నువ్వు ఇక్కడ ఇమిడిపోయేవంటే నిన్ను మేం అలా పెంచేం. నాపెంపకం తీరు వేరు. నేను అమెరికా రావాలనుకుంటూ నా జీవనసరళి దిద్దుకోలేదు.”

గోపీకి చిరాకేసింది, “కానీయ్. రెండురోజులు పోయేక మళ్లీ వస్తాను. అప్పటికి నువ్వు ఏమూడ్ లో ఉంటావో,” అన్నాడు సగం హాస్యంగానూ సగం సీరియస్‌గానూ.

కమల కూడా నవ్వింది. “రెండు రోజూలూ, పన్నెండు రోజూలూ అయేక కూడా ఇదే అంటాను. ఇక్కడికి రాకముందు నాకు తెలీదు. ఇప్పుడు రెండువంకలా చూసేను కనక ఇదే నానిశ్చయం.”

గోపీ తలొంచుకుని రెండు నిముషాలూరుకుని, “అక్కడ ఏం చేస్తావు ఏమయినా అయితే?” అన్నాడు నెమ్మదిగా.

“తెలీదు. అప్పటికి ఎలా తోస్తే అదే చేస్తాను. ఫరవాలేదు గోపీ, మనపద్దతులు వేరు. నీకు అన్నీ ప్లాను ప్రకారం చేసుకోడం అలవాటు. నాకు ఎప్పటికి ఎలా జరిగితే అలా చేసుకోడం అలవాటు,” అంది కమల  శాంతంగా.

ఆవిడమొహంలో ప్రశాంతత చూసి, “అమ్మకేం ఫరవాలేదు” ఎక్కడున్నా అనుకున్నాడు తృప్తిగా.

000

(ఆగస్ట్ 21, 2018, మార్పు ఆగస్ట్ 23, 2018)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

16 thoughts on “ఆద్యంతాలు (కథ)”

 1. మీరు సరిగానే అర్థం చేసుకున్నారండి. ఆమెని తిరిగి ఇంటికి పంపుతాడు ఆమెకి అక్కడే సుఖం, సౌకర్యం అని గమనించి. మీవ్యాఖ్యకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. ఆవిడమొహంలో ప్రశాంతత చూసి, “అమ్మకేం ఫరవాలేదు” ఎక్కడున్నా అనుకున్నాడు తృప్తిగా.

  పై వాక్యానికి అర్ధం ఏమిటి రచయిత గారు….
  అంటే ఇప్పుడు అబ్బాయి కమల ని తిరిగి ఇంటికి పంపించి వేస్తాడా? లేక కమల సర్దుకుపోతుందా ఆ వృద్ధాశ్రమం లో?
  నాకైతే మొదటిది అని అనిపిస్తుంది.
  నాకు సరిగ్గానే అర్ధమయ్యిందా? లేదా మీరు ఏమి చెప్పాదలచారు?

  మెచ్చుకోండి

 3. విపులంగా పరిశీలనాత్మకంగా ఉంది మీ వ్యాఖ్యనం. చాలా సంతోషం నారాయణస్వామిగారూ. మీరు పరామర్శించిన కొన్ని ఆంశాలను నా తరవాతిటపాలో వివరించేను.
  మీ ఈ వ్యాఖ్య స్పామ్ లో ఉంది. ఇప్పుడే చూసేను. ఎలా జరిగిందో నాకు తెలీదు. మన్నించగలరు.

  మెచ్చుకోండి

 4. మీ విపులవ్యాఖ్యకి ధన్యవాదాలు. మీరు చెప్పినది చాలావరకు నిజమే.

  స్వాగతించడం అంటే నాకు అర్థం కాలేదు. కమల ఏమి చేస్తే స్వాగతించినట్టు?

  మెచ్చుకోండి

 5. మూస మాధానం లేదు అంటూనే వేరు,వేరు కోణాలు ఆవిష్కరించడమే ధ్యేయం అన్నారు.
  కొంత అసంతృప్తి ఉంది. జీవితం మీద. కొంత అసహనం కూడా ఉందనిపిస్తుంది తల్లి కమలకి. వ్యంగం కూడా ఉంది.

  బాంకులో చేస్తున్న పనితోపాటు, ట్యూషన్లు చెప్పుకున్న లాంటి వారికి చెందిన తరం అది. ఆ తరం విలువలు అవి. అందుకనే నీబతుకు నీది అనే కొడుకు తరం విలువలని అర్ధం చేసుకోగలిగింది, కాని స్వాగతించినట్టులేదు. ఈ కధ తరాల అంతరాలు, జీవన విధానం మీద మరొక దృష్టి కోణం.

  మెచ్చుకున్నవారు 2 జనాలు

 6. కథ శీర్షిక నించీ, సినిమా దృశ్యం లాగా మొదలైన ఎత్తుగడ నించీ చివరిదాకా ఆసక్తిగా చదివించారు.
  సాధారణంగా ఎదురవుతున్న సమస్యే. చాలా తెలుగు కథల్లోనూ ప్రస్తావించిన వస్తువే. తల్లీ కొడుకూ ఇద్దరే పాత్రల ద్వారా నడిపించడంతో ఒక బిగువు సాధించారు కథనంలో. శిల్పం కూడా చాలా మట్టుకు ఒక సినిమా స్క్రిప్టులాగా దృశ్య ప్రధానంగా ఉంది. అక్కడక్కడా కొన్ని క్లిషేలు దొర్లాయి – అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ పాశ్చాత్యురాలై ఉండడం, అతని తల్లి తమతో ఉండడం ఆ పిల్లకి ఇష్టం ఉండక పోవడం, అతని చిన్నత్నంలో అదనపు సంపాదన కోసం తలిదండ్రులు బట్టల కొట్లో పద్దులు రాయడం .. ఇలాంటివి. నిజానికి ఇవి లేకపోయినా కథకొచ్చిన నష్టమేం లేదు. ఆవిడని ఎసిస్టెడ్ లివింగ్ లో ఉంచాలనేది అతని నిర్ణయమే అనేది స్పష్టం. కథలో గొప్పతనం ఎక్కడ అంటే, సమాజాన్ని, మానవ సంబంధాలనీ పదునైన దృష్టితో గమనించిన మీరు ఆ అబ్సర్వేషన్లని సందర్భానికి తగినట్టు – అదో ప్రత్యేకమైన విషయం కానట్టు – యథాలాపంగా చెప్పుకుంటూ పోవడం. ఉదాహరణకి – టిఫిన్ తింటూ అమ్మతో మాట్లాడుతూ ఉండగా అతనికి ఫోన్ వస్తే అతను కాల్ రెసీవ్ చేసుకోడం, అది చూసి ఆవిడ అమెరికనుల ప్రవర్తనతో పోల్చుకుని నిర్వేదంగా ఉండిపోవడం; అలాగే ఎసిస్టెడ్ లివింగ్ లో తోటి వాళ్ళు ఆమెకి అమెరికను జోకులు వివరించ ప్రయత్నించడం – ఇవి కథకి సంపూఋనత్వాన్ని ఇచ్చాయి. ఒకట్రెండు చోట్ల కొంచెం అసహజమైన భాష వాడారు, వ్యంగ్యమేమో అనుకున్నా కానీ నాకు అర్ధం కాలేదు. ఉదా: “తనగదిలోకి వెళ్లి, మంచంమీద తలగడాలు సర్దుకుని వనక్కి వాలింది పుస్తకమొకటి హస్తమున ధరించి.” అదేం పెద్ద విషయం కాదనుకోండి. మంచి కథకి ఉండే మిగతా అన్ని లక్షణాలతో పాటు అది మన పరిధిని విస్తరింప చెయ్యాలి అని కోరుకుంటాను. ఆవిడ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే నిర్ణయం తీసుకోవడం నాకు చాలా నచ్చింది.

  మెచ్చుకోండి

 7. కథ బావుంది. మారుతోన్న కాలంలో ఎవరు ఎంత సర్దుకుపోగలరో అంతే సర్దుకొంటారు. అమ్మ ఐనా కొడుకైనా. కొడుకుని కష్టపెట్టడంకన్నా అతను సూచించిన మార్గం ఒప్పుకొన్న తల్లికి తన మార్గం తెలియడం బావుంది. బాధ ఇద్దరికీ తప్పదు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 8. అమ్మ అన్న రెండక్షరాలలో ఏదోతెలియని టేకెన్ ఫర్ గ్రాన్టెడ్ అనే భావన మీ ఈకథలొ నిరూపించారు. చాలా సింపుల్ నెరేషన్ తో ఎంతో కాంప్లెక్స్ తల్లి పిల్లల సంబంధం, తరాల అంతరాలు చిన్న కాన్వాస్ మీద విశాలంగా పరిచారు._()_👏👏

  మెచ్చుకోండి

 9. మీరు వెంటనే చదివి, స్పందన వివరంగా చెప్పినందుకు చాలా సంతోషం వసుధా రాణిగారూ. ఒకొకప్పుడు చిన్నమాట చాలు రాయడానికి. ఫేస్పుక్కులో మీవ్యాఖ్య బాగా పని చేసింది. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 10. మెరుపున్న బంగారం మరింత మెరిసినట్లు చిన్న కథ మానవీయత ఆద్యంతాలని చూపించింది…అంతం లేని అంతులేని కథని ఎంత చిన్నగా ఎలా రాసారో…చదివి కొంచెంసేపు అలా ఉండి పోయాను….మీకధలు చదివేటప్పుడు ఏదో ఒకపాత్ర లోకి పాఠకుడు పరకాయ ప్రవేశం చేసి అది అంతా తన కథే అన్నంత గా లీనం ఐపోయేలాగా ఉంటాయి..గుండెని తాకుతాయి ఒక్కోసారి తగులుతాయి కూడా…ఈకధ కోసం మీరు పడిన కష్టం ఊరికే పోలేదు అద్భుతమైన కధ పండించారు..అభినందనలు

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.