ఆద్యంతాలుకథ  చర్చ

ఆద్యంతాలు కథమీద ఫేస్బుక్కులో వచ్చిన వ్యాఖ్యానాలు స్పూర్తిదాయకంగానూ ఆలోచనాత్మకంగానూ ఉన్నాయి. నిజానికి ఇలాటి స్పందన నాకథకి వచ్చి చాలా కాలమయింది. అందుచేత ఆ వ్యాఖ్యానాలు ప్రాతిపదికగా కొన్ని విశేషాలు చేరుస్తాను ఇక్కడ.

ఈకథ జనవరి 28, 2017నాడు మొదలు పెట్టేను. సగంలో ఆగిపోయింది. రెండురోజులక్రితం అది పూర్తి చేయాలనిపించింది. మొదలు పెట్టినప్పుడు ఏధ్యేయంతో మొదలు పెట్టేనో జ్ఞాపకం లేదు. బహుశా అందుకే ఆగిపోయిందేమో. ఇప్పుడు పాఠకుల స్పందనలు చూసేక, నేను అనుకోకుండానే ఒక సమకాలీనసమస్యని స్పృశించేనని అర్థమయింది.

000

గత 30 ఏళ్ళలో అమెరికాలో ఉన్న పిల్లలని చూడడానికి ఇండియానించి వచ్చిన  తల్లిదండ్రులని చాలామందిని చూసేను. నేను గమనించినంతవరక, 1970, 80 దశకాలలో  వచ్చినవారు వీసా అనుమతించిన ఆర్నెల్లూ గడిపి దేశం నలుమూలలా తిరిగిచూసి తృప్తిగా వెనక్కి వెళ్ళిపోయేరు. ఆ తరవాత వచ్చినవారిలో  కొందరు ఇక్కడే ఉండిపోయేరు. వీళ్ళని ప్రత్యక్షంగా చూసేను కానీ ఎవర్నీ “ఎందుకు ఉన్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు” వంటి ప్రశ్నలు అడగలేదు. అంటే వారికథలు నాకు తెలీవు. ఒక్కసారి మాత్రం  మాబంధువులలో ఒకావిడ సూచనప్రాయంగా అంది assisted living ఇంట్లో  ఉంటున్నట్టు. కొడుకుదగ్గర ఉండడానికి వచ్చినావిడే మరి. నేను వివరాలు అడగలేదు.

రెండోవిషయం – పిల్లల్ని మంచిభవిష్యత్తుకోసం అమెరికా పంపడానికి చిన్నప్పట్నుంచే తయారు చేస్తారు. సహజంగానే తల్లిదండ్రులకి పిల్లలకి మంచిభవిష్యత్తు  సమకూర్చేం అన్న ఆనందంతోపాటు దూరం అయిపోయేం అన్నబాధ కూడా.  అమెరికా వచ్చి కొత్తవాతావరణంలో ఇమడం కూడా కష్టమే.  ఆర్నెల్లు అక్కడా, ఆర్నెల్లు ఇక్కడా గడుపుతున్నారు చాలామంది.

నిజానికి అమెరికాయే కానక్కర్లేదు. చదువులు, ఉద్యోగాలమూలంగా పిల్లలు దూరమవడం దేశంలో కూడా కావచ్చు.  నేను తిరపతిలో ఉద్యోగం చేస్తున్నరోజులలో మాఅమ్మపరిస్థితీ అదే. నిన్ను చూడాలని ఉందని తిరుపతి వచ్చేది. నెలరోజులు కాగానే, ఇంటికెళ్ళిపోతాను అని విశాఖపట్నం వెళ్లిపోయేది.

వీటివెనక బలంగా పని చేసేది సమాజంలో వచ్చిన మార్పు. సమాజంలో ఉన్నతస్థాయి చేరడానికీ ఆర్థికవిజయానికీ అవినాభావసంబంధం. డబ్బుంటేకానీ పేరు రాదు. పేరు తెచ్చుకోడానికి డబ్బు సంపాదించాలి. దానికి ఉన్నతవిద్య కావాలి. విదేశీ ఉద్యోగాలు కావాలి. దానితోపాటు వస్తువ్యామోహం, అనేకానేక సౌఖ్యాలు.

000

ఇప్పుడు కథకి సంబందించిన అంశాలు తీసుకుందాం. వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకు కొన్ని అంశాలు వివరించడానికి ప్రయత్నిస్తాను.

  1. టైమ్ లైన్. ఏ ధ్యేయంతో మొదలుపెట్టేనో గుర్తు లేదు కనక ఏకాలపుకథ అని కూడా మొదట స్పష్టమైన ఆలోచన లేదు అప్పట్లో.

కథలో కమల ఇంటరువరకు చదివిందని రాసేను. ఆవిడకి ఇంగ్లీషుభాషమీద ఉన్న పట్టు నిర్ణయించడానికి అవుసరమయింది అది. అదెందుకంటే ఆ కొత్తవాటాలో ఆవిడకి ఇబ్బంది ఒకటి సృష్టించడానికి. దానికి మరో ఆలోచన తోడయింది. మనతెలుగుకథలలో ఇంగ్లీషు మరీ ఎక్కువగా ఉంటోందని నాకు చిరాకు. దాన్ని హేళన చేయడానికి “తెలుగుకథలు చదివి ఇంగ్లీషు మెరుగు పరుచుకుంది” అని రాసేను. కథ రాస్తున్నప్పుడు ఇంత విశదంగా ఆలోచించలేదు కానీ ఈరెండు వాక్యాలూ కథాకాలం నిర్ణయించేయి. ఎలాగంటే –

ప్రస్తుతం అమెరికాలో ఉన్న పిల్లలు 25-35 వయసువాళ్ళనుకుందాం. తల్లులవయసు 50,60 ప్రాంతాల్లో ఉంటుంది. ఈరోజుల్లో వీళ్లందరూ బాగా పెద్ద చదువులు చదివినవారే. డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు. ఇంటరుదగ్గర ఆగిపోవడం అన్నది రెండుతరాలకి ముందుమాట. అలా లెక్కలు వేసుకుంటే ఈకథ వెనకటితరం కథ అని కాలనిర్ణయం జరిగిపోయింది నాప్రమేయం లేకుండానే!

తరవాత సామాజిక చరిత్ర చూస్తే , తల్లిదండ్రులఆలోచనలలో వస్తున్న మార్పులు దీనికి అనువుగానే ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు ఈపరిస్థితులగురించిన అవగాహన గలవారే. “నిన్ను అమెరికా పంపుదాం అనుకున్నాం గానీ నీకు దూరంగా ఉండవలసివస్తుందని అనుకోలేదు” అనేటంత అమాయకులు ఎవరూ లేరిప్పుడు. అందరూ తరుచూ రాకపోకలకి కూడా సిద్దంగా ఉన్నారు.

ఈ టైంలైనుకి సంబంధించినదే మరో అంశం.  తల్లిదండ్రుల ఆర్థికప్రతిపత్తి. ఈరోజుల్లో  మధ్యతరగతి కుటుంబాల్లో  పిల్లలచదువులకోసం డబ్బుకి తడుముకోవలసిన అవుసరం లేనట్టే ఉంది నేను చూసినంతవరకూ. ఒక్కసారి మాత్రం విస్కాన్సినులో ఒకబ్బాయి గొడ్లు కాసుకుంటూ చదువుకుని ఇంతదూరం వచ్చేను అన్నాడు కానీ అదిప్పుడు సర్వసాధారణం కాదు. ఇప్పుడున్న ఆర్థికవసతులు వెనకటితరంలో తక్కువే.

అసలు ఆప్రశ్న ఎందుకు అంటే సామాజికమైన మార్పు ఎత్తి చూపడానికి. ఆరోజుల్లో “నిన్ను ఇంతవాణ్ణి చెయ్యడానికి మీనాన్న ఎంత కష్టపడ్డారో తెలుసా?” అని పిల్లలని సతాయించడం ఉంది. ఇప్పుడు అలా అనరు.

“నీకు ఆవాటా తెప్పించడానికి నానా గడ్డీ కరిచేను” అని కొడుకు అంటే, “మరి మేం మాత్రం.. ” అని తల్లి అనదు. ఇక్కడ ఆ తల్లివ్యక్తిత్వంలో పరిణామం, పరిణతగా చిత్రించడం జరిగింది. ఆకోణం స్పష్టం చేయడానికి తల్లి కష్టపడినట్టు , అదే 2,3 ఉద్యోగాలప్రసక్తి అవుసరమయింది. ఉద్యోగాలు కాకపోతే మరోరకం త్యాగం చేసినట్టు చూపితేనే కదా, ఆమాట చెప్పలేదు అని చెప్పడం సాధ్యం.

అలాటిదే మనసమాజంలో తాతమూకుడు తరతరాలా అన్న సామెత వాడుకలో ఉంది. ప్రస్తుసమాజంలో ఇది పనికిరాదు. ఈనాటి తల్లికి ఆమెతల్లితో ఉన్న అనుబందం వేరు. ఇప్పుడు తనకూతురితో ఉండగల అనుబందం వేరు. పూర్వం గురుశిష్యసంబందం. తల్లిదగ్గర్నుంచి నేర్చుకోడమే కానీ తల్లికి నేర్పడం లేదు. ఇప్పుడు మైత్రి, పరస్పరగౌరవంగా మారిపోయింది. ఈకోణం కథలో ఆవిష్కరించడానికి ప్రయత్నించేను. ఆకారణంకానే తల్లీ కొడుకులు ఒకరిమీద ఒకరు గట్టిగా అరుచుకోడం, తిట్టుకోడం లేదు.

కథలో ప్రధానాంశాలు – తల్లీకొడకులు ఒకే కప్పుకింద ఉండడం. ఇద్దరికి వేరు వేరు సమయాల్లో వేరు వేరు అభిప్రాయాలు. తమ ఇష్టాయిష్టాలు జరుపుకోడానికీ జరుపుకోలేకపోవడానికీ, తదనుగుణంగా తమ అభిప్రాయలు సరిదిద్దుకోడానికీ సంసిద్ధులు కావడం. కథంతా వీటికి తగినట్టు సన్నివేశాలూ, వాతావరణమూ సమకూర్చాలి.

ప్రతి సన్నివేశం రెండో సన్నివేశానికి తగిన వాతావరణం కల్పించాలి. అలా అప్పటికప్పుడు సృష్టించుకుంటూ పోవడం ఒక్కపూటలో జరిగింది కనక కొన్ని అసందర్భంగా అనిపించేయేమో మరి.

000

వైయక్తికమైన ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలూ – ఇవన్నీ కూడా సిద్ధాన్నంలా పాశ్చాత్యులభావజాలాన్నించి  తీసుకున్నాం. గత శతాబ్దంలో ఉన్న కుటుంబవిలువలు ఇప్పుడు లేవు. మరొకరకంగా రూపు దిద్దుకున్నాయి. వ్యక్తివిజయానికి ప్రాధాన్యం హెచ్చింది. తల్లిదండ్రులు అది అంగీకరించడంచేతే పిల్లల్ని ఆపద్ధితిలో పెంచేరు.

  1. సంఘర్షణ – విజాతి అమ్మాయి, పెళ్లిచేసుకోకుండా సహజీవనం, తల్లి ఎక్కడ ఉండాలన్నవిషయంలో అభిప్రాయబేధాలు. తల్లి తనమాట వినలేదని కొడుక్కి చిరాకు, కొడుకు తనని అర్థం చేసుకోలేదని తల్లికి విసుగు.

ఒకొక సంఘటనా తీసుకుని హోరాహోరీ పోరాటాలూ, మనసులో ఆరాటాలూ ఎంతో విపులంగా రాసిఉండవచ్చు. అలాగే assisted living housingలో అకృత్యాలూ, హింసా వివరంగా రాసిఉండవచ్చు. అప్పుడిది గొప్ప సామాజికస్పృహ గల కథగా గుర్తింపబడేదేమో కూడా.

కానీ నాకు ఆపద్దతి నచ్చదు. పాఠకులఆలోచనకి వదిలివేయడమే నాకు సమ్మతం. రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి కథ జరీఅంచు తెల్లచీర చూడండి. ఒకమ్మాయిమీద జరిపిన అత్యాచారం ఆకథలో ప్రధానంశం. కథకుడు ఎక్కడా రేప్ అన్నపదం వాడడు. ఎలా జరిగిందన్న సంగతి సుదీర్ఘంగా వర్ణించడు. ఎక్కడా క్లిష్టసమాసాలు లేవు.  ఇది శైలికి సంబంధించిన విషయంగా నేను గుర్తిస్తాను. నాకు అలాటి కథలు నచ్చుతాయి.

ఇదంతా రాస్తుంటే మరో ఆలోచన కూడా వచ్చింది. ఆధునికజీవితాలలో ప్లాను ఒక తప్పనిసరి భాగం అయిపోయింది. దానివల్ల దినచర్య ఒకరకంగా యాంత్రికం అయిపోయింది.

కథ మొదట్లో గోపీ కారు తీసుకు వెళ్ళిపోయేక, కమల తనగదిలో మంచంమీద “పుస్తకం చేత ధరించి …” అని రాసేను. అది కూడా వ్యంగ్యమే. పుస్తకం హస్తభూషణం అన్నమాట గుర్తొచ్చి. ఆవిడకి జీవితం యాంత్రికం అయిపోయిందని, పుస్తకం హస్తభూషణంగా ధరించినట్టు. నిజంగా చదివే మనసు లేదు. అంచేత అది చివర్లో ఇప్పుడు చేర్చేను.

చేర్చినవాక్యాలు ఇవి –

గోపీ తలొంచుకుని రెండు నిముషాలూరుకుని, “అక్కడ ఏం చేస్తావు ఏమయినా అయితే?” అన్నాడు నెమ్మదిగా.

“తెలీదు. అప్పటికి ఎలా తోస్తే అదే చేస్తాను. ఫరవాలేదు గోపీ, మనపద్దతులు వేరు. నీకు అన్నీ ప్లాను ప్రకారం చేసుకోడం అలవాటు. నాకు ఎప్పటికి ఎలా జరిగితే అలా చేసుకోడం అలవాటు,” అంది కమల  శాంతంగా.

ఆవిడమొహంలో ప్రశాంతత చూసి, “అమ్మకేం ఫరవాలేదు” ఎక్కడున్నా అనుకున్నాడు తృప్తిగా.

000

ఈకథమీద తమ అభిప్రాయాలు తెలిపి ఈపోస్టుకి కారకులైన మిత్రులు

సర్వశ్రీ  వసుధా రాణి, పద్మశ్రీ దయాన, లక్ష్మీదేవి బుసిరాజు దేశాయి, అనితా రామచంద్రన్, అరుణ న్యాయపతి, ఆర్. దమయంతి, విశాల అప్పిడి, సత్యవతి, సురేష్ వెంకట్, సునీత పొత్తూరి, విశాల పేరి, సుమన్ లత రుద్రావఝ్ఝల, రావు యస్. ఉమ్మెత్తల, శ్రీనిధి వెంకట్, చంద్ర రెంటచింతల, మన్నెం శారద, నారాయణస్వామి, సుజాత వస్ యస్వి,  లలిత గూడ, కృష్ణ వాసంతిక, సావిత్రి సావి, పద్మజ సూరపరాజు, సునీత రత్నాకరం, ప్రసాద్ ఇంద్రగంటి.

– నాకథ ఫేస్బుక్కులో తమగోడలమీద పంచుకున్న మిత్రులు కల్యాణి నీలారంభం, చర్ల రాజరాజేశ్వరి, విశాల అప్పిడి,

– చదివి ఆనందించిన పాఠకులందరికీ.

పేరుపేరునా మరొకసారి ధన్యవాదాలు.

(ఆగస్ట్ 24, 2018)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.