జగన్నాటకం – 3

  1. ట్టు ట్టు ట్టు

అసలు సిసలు ఆంద్రా పంచెకట్టు

మూతిమీద ప్రెంచ్ మీసకట్టు

చేత విదేశీ సిగరెట్టు

ఆ ఇంటి కడగొ్ట్టు

పరమోత్కృష్టం అతడికి పెసరట్టు

పెదాలపై తాత్కాలిక తెలుగు నుడికట్టు

మాటలతో సేయు కనికట్టు

ఒట్టు

ఆతడేనమ్మ నానా సభల సమావేశాల తెలుగుభాషనొక పట్టు పట్టు

000

  1. పురోభివృద్ధి.

నగర పురోభివృద్ధి మహోత్సాహంతో సాగిపోతోంది.

రెండిళ్ళు కూలదోసి మూడంతస్తుల మేడ

కట్టబోతున్నాం, మీకభ్యంతరమైతే చెప్పగలరు

అంటూ చాటుతోంది ఇంటిముందు నోటీసు.

అటు రెండు కూర్చీలు బోసిగా,

నోళ్ళు వెళ్ళబెట్టి కూర్చున్న దిక్కుమాలిన దంపతులను తలపుకు తెస్తున్నాయి.

నాకు అభ్యంతరమే అని ఎవరితో చెప్పను? ఎలా చెప్పను?

చెప్పి ఏంలాభం?

పేదవానికోపం పెదవికి చేటు.

నాదికాని ఇంటిమీద మమకారం నాకే తలమాటు.

000

  1. ప్రకృతము

పోజియ్యమంటే పూవు వినదు

ఇటు చూడంటే ఉడుత ఒప్పదు.

నేనిచ్చినట్టు పుచ్చుకో, లేదా పొమ్మంటాయవి

కాకున్న మళ్లీ రమ్మంటాయి.

అందుకే అవి ఇచ్చిన పోజులు “అర్థం చేసుకుని” బుద్ధిగా స్వికరిస్తాను

000

ప్రకృతము అంటే చక్కగా చేయబడినది అని అర్థంట. ఈ ప్రకృతి అంతా తనకు తానే తీరిచి దిద్దుకునే అందగత్తె అయి భాసిస్తున్నదని నా తాత్పర్యం

000

(ఆగస్ట్ 26, 2018)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.