జగన్నాటకం 4 – శూన్యం

నేను నడిచేదారిలో

అటు చెత్తబండి

ఇటు రాలినఆకుల్తో దుమ్మెత్తి పోస్తున్న blower

ఎదురొస్తూ రెండు కుక్కపిల్లలు,

వాటితో  ఈచేత ఐఫోనుతో, ఆచేత ప్లాస్టిక్ సంచీతో

పరిసరాలు మరచిన ఆధునిక అబ్బాయో అమ్మాయో

ఇళ్లముందు గడ్డిపరకలమీద విరజిమ్మిన నీటిదారలు

రోడ్డువార అదాటుగా కట్టిన చెలమలు

ఆ చెలమల్లో ఈత కొడుతున్న చిరురేకులు

అడుగుతున్నట్టుంది మమ్మెవరు చూస్తారని.

“పర్నేదులే, మనకోసం వస్తాదాయమ్మ.

బొమ్మతీసి నేస్తులకు సూపుతాది” అంటూ

మరో పెద్దరేకు పలికింది చల్లనిమాటొకటి.

నేను చూడకుండా ఊరుకోలేను
మీతో పంచుకోక మానలేను.

000

మైత్రి

నాకతలప్పుడు సాహిత్యం

నీసంగతులప్పుడు ఆత్మీయం

పెరవారి ఘోషతో పరిసమాప్తం.

000

కనిపించేవి, కనిపించనవీ

వినిపించేవీ, వినిపించనివీ

వెతుక్కుంటూ తిరిగేను

చిరు హోరు వినిపించి అటు చూసి

చిన్నగుట్టఎక్కి పట్టి చూస్తే

కొమ్మలచాటున చిరు సవ్వడులతో

అడుగున్నర ఎత్తుకి ఎగసిపడుతూన్న జలయంత్రం

పసిపిల్లాడు కిలకిల్లాడుతూ చిందులు తొక్కినట్టు ఎదురయింది.

నేనే కనిపెట్టినంత ఆనందం.

 

(ఆగస్టు 31, 2018)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.