అలవాటయిపోయింది!!

సంప్రదాయాలూ, పట్టుదలలూ, ఇష్టాయిష్టాలకంటె మనకి అలవాటయిపోయినవే ఎక్కువ. లేస్తూనే కాఫీ అలవాటు, ఫేస్బుక్కు కాకపోతే మరో మిత్రమండలి అలవాటు, తిండీ నిద్రాలాటివి అన్నీ అలవాటుప్రకారమే జరుగుతాయి, ఏదో ఒకటి రాసిపారేయకపోతే తోచదు నాకు. అది నాఅలవాటు.

అస్తమానం ఏదో ఒకటి చెబుతూ ఉండడం కొందరికలవాటయితే, ప్రాణంమీదకొస్తే తప్ప పెదవి విప్పనివారు కొందరు. అదమంటే ప్చ్, చిన్నప్పట్నుంచీ అలా అలవాటయిపోయింది అంటారు.

కాఫీ చాలామందికి అలవాటయిపోయింది కానీ అందులో రకాలున్నాయి. చిక్కని కాఫీ నాలిక కాలిపోయేంత వేడిగా, వేడి చల్లారకముందే, గబగబ తాగేయడం కొందరికలవాటు. కొందరు మాత్రం కప్పు పెదవులకంటితే అరిగిపోతుందేమోనన్నంత నాజూగ్గా చుక్క చుక్క చప్పరిస్తూ ముప్ఫై నిముషాలపాటు సాగదీస్తారు కప్పు కాఫీని.

ఒకసారి మాయింటికొక అమ్మాయి వచ్చింది. అదే మొదటిసారి కనక ఆవిడ అలవాట్లేమిటో నాకు తెలీవు. కాఫీ తాగుతారా అంటే సరేనన్నట్టు తలూపింది.

ఇప్పటికి చాలాసార్లే చెప్పిఉంటాను కానీ మళ్ళీ చెప్తాను. నాకాఫీని మెచ్చుకోనివారు లేరు. అంటే ఎక్కడో ఉండేఉంటారు కానీ వారు నాకాఫీ సేవించనివారై ఉంటారు. నేన పెట్టిన కాఫీ, “ఇదీ కాఫేయేనా?” అని ముఖం ముడుచుకున్నవారు మాత్రం లేరు.

నేను చక్కగా చిక్కటి డికాక్షను తీసి, అంతకంటే చిక్కని పాలు చక్కగా తగినపాళ్ళలో కలిపి, చుర చుర కాచి మళ్లీ మన అయ్యరుహోటళ్ళలో సర్వరులా రెండు గ్లాసులలో గజం పొడుగు నిలువుగా సాగదీసి, నురగలు గక్కుతున్న కాఫీకప్పు అందిస్తే, ఆహా అననివారు ఇంతవరకూ నాజీవితకాలంలో నాకు తగల్లేదు.

ఇంతకీ ఆవిడ, “ఇంత strong కాఫీ తాగలేనండి,” అని అలా చెప్పవలసివచ్చినందుకు బాధ పడి, “నేను కాశీలో చదువుకుంటున్నప్పుడు హాస్టల్లో ఉన్నాను. అక్కడ సేరుగ్లాసుతో నీళ్ళకాఫీ ఇచ్చేవారు. అదే అలవాటయిపోయింది” అంది.

కొన్ని అలవాట్లు మనం కోరీ వేడీ చేసుకుంటాం. కొన్ని అలవాట్లు ఇలా పరిస్థితులవల్ల అవుతాయి. అమెరికాలో కూడా పాలు లేనికాపీ సాధారణంగా అలాటి నీరసకాఫీయే. నేను మాత్రం దానికి అలవాటు పడలేదు. కాఫీ తాగడం మానడమైనా మానేస్తాను కానీ ఆ నీళ్ళు తాగను.

అసలు నాక్కూడా హాస్టల్లో ఉన్నప్పుడే చిక్కని కాఫీ అలవాటయింది. ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ పంజాబీ వంటలు తినలేక, కాంటీనులో దొరికే espresso తాగడం అలవాటు చేసుకున్నాను. అందులో పుష్కలంగా పాలుంటాయి కనక కడుపు నిండిపోయేది.

ఏదైనా అలవాటు కావడానికి కారణం ఉండొచ్చు ఉండకపోవచ్చు. పడుకునేముందు కొందరికి పుస్తకం చదవడం అలవాటు. మరికొందరు సంగీతం వింటారు. ఏదో స్తోత్రం మనం చేసుకుంటూ పడుకునేవారు కూడా ఉన్నారు. ఇవన్నీ ఆరోజు జరిగిన అనేకానేక గొడవలన్నీ మరిచి ప్రశాంతంగా నిద్రలోకి జారుకోడానికే కదా.

టీవీ వచ్చేక, టీవీ చూసినంతసేపు చూసి మంచం ఎక్కేవారు ఎక్కువయేరనే నా నమ్మకం.

టీవీ కాలక్షేపంగా మొదలయి దురలవాటు స్థాయికి చేరింది.

అలాగే ఐఫోను కూడా. ఇదివరకు ఎవరైనా ఇంటికొస్తే, వాళ్లని మాటలతో అలరించడానికి చాలా తికమక పడేదాన్ని. నేను మాటాడగలవిషయాలు అట్టే లేవు కనక నాకు కష్టం.

ఇప్పుడు ఆబాధ లేదు. ఎవరి సెల్ ఫోనులోకి వారు చూసుకుంటూ కూచుంటారు. నాకు సంబంధించినంతవరకూ అది సుఖమే కానీ నిజానికి మర్యాద కాదేమో. ప్రతిచిన్న విషయానికి తప్పూ ఒప్పూ నిర్ణయాలు చేసేవారు ఈ విషయంలో మాత్రం పట్టించుకున్నట్టు లేదు.

భాష కూడా అంతే. మనకి ఏ భాష చిన్నప్పట్నుంచీ అలవాటయితే అదే భాషలో ఆలోచిస్తుంది మన మెదడు. మరోభాషలో మాటాడుతున్నప్పుడు, మన ప్రయత్నమేమీ లేకుండానే మనకి అలవాటయిన భాషలోకి మెదడు అనువదించేస్తుంది. మళ్ళీ మనం మాటాడుతున్న భాషలోకి మార్చి జవాబు ఇస్తుంది.

ఇది నిజంగా నిజం. ప్రస్తుతం నాకే తలీకుండా నేను ఇంగ్లీషులోకి మార్చుకుంటున్నాను నేను విన్నమాటలు. ఇంగ్లీషులో ఆలోచించుకుని జవాబు తెలుగులోకి మార్చుకుని చెప్తున్నాను. దీనికి కారణం ముఖ్యంగా మనం ఏవిషయాలు మాటాడుతున్నాం అన్నదాన్నిబట్టి.  మాటాడే అంశం భాషని నిర్ణయిస్తుంది. అదే మనకి “అలవాటు” అయిపోయింది.

నేను తెలుగులో మాటాడమని, రాయమని అందర్నీ ప్రోత్సహిస్తున్నాను. అంటే పైన చెప్పిన అంశాలు కాక అన్నమాట. కంప్యూటరు, కీబోర్డులాటివి అలాగే వాడితే సరే, కానీ హాపీ, లైటు, ఓకే, సండే, మండే లాటివి ఎందుకు అని నాప్రశ్న. నేనలా అడిగినప్పుడల్లా అదే సమాధానం, “అలవాటయిపోయింది.”

అలవాట్లలో దురలవాట్లున్నాయి, మంచి అలవాట్లున్నాయి. కొన్నిటివల్ల ఎవరికీ బాధ లేదు. నాలుగ్గంటలకి లేచి ఎనిమిదిగంటలకి పడుకోడం కొందరిఅలవాటయితే, తొమ్మిదిగంటలకి లేచి పదకొండుగంటలకి పడకెక్కుతారు కొందరు. బహుశా ఇది ఎవరినీ బాధించకపోవచ్చు.

అలవాటయిపోయిందంటూ నలుగురిమధ్య సిగరెట్ తాగితే అభ్యంతరం చెప్పేవారు చాలామందే ఉన్నారు కదా.

అంతకంటె మరో దురలవాటు మందులు. మద్యపానాలమాట సరే. అది కాక, చిన్న చిన్న నొప్పులకీ, నొప్పి రాకుండానూ వేసుకున మందులు టైలనాల్ లాటివి. ఇవి మితిమీరి వాడితే, వాటికి శరీరం అలవాటు పడిపోయి, మందులు పని చేయవు. దాంతో మరింత పెద్ద మోతాదులో తీసుకుంటారు. ఆఖరికి వాటికి దాసులయిపోయి ప్రాణలమీదికి తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. అలా చిన్నా చితకా నొప్పులు తట్టుకోడం అలవాటు చేసుకోడం మంచిది. నేను భరించలేనం నొప్పి అయితే తప్ప ఏ మందులూ వాడను. నాకది అలవాటు. అలవాటు చేసుకున్నాను, కొన్ని వ్యాసాలు చూసేక.

అన్నట్టు ఇదంతా ఎందుకు రాయడం అంటే, ప్చ్. ఏం చెప్పను? అలవాటయిపోయింది.

000

(సెప్టెంబరు 17, 2018)

 

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.