అజంతాగుహలు కేంద్రంగా సాగిన చిన్న నవల ఇది. 130 పుటలు. అజంతాగుహలగురించి చాలామందే విని ఉన్నా ఆగుహలు ఒకప్పుడు బిక్షువులకు తపోనిలయములై సజీవంగా కలకల్లాడుతూ ఉండేవని చాలామందికి తెలీదు. అలాగే అక్కడి శిల్పనైపుణ్యము, మందిరనిర్మాణవైభవము కూడా చాలామందికి తెలీదంటారు నోరి నరసింహశాస్త్రిగారు ఈనవలకి పరిచయంలో.
దీనిని చారిత్ర్యకనవలగా ఉద్దేశించకపోయినా, కొన్ని పాత్రలు– పులకేశి, కుబ్జవిష్ణువర్థనుడు, శ్రీహర్ణవర్ధనుడు, ఆతని దూత మేఖలకుడు– చారిత్ర్యకపురుషులు. పులకేశి, హర్షవర్ధనుల యుద్ధం యథార్థగాథ. తక్కిన పాత్రలు కల్పితములు.
వాఘిరానది పేరు కథానాయికకి పెట్టి నవలకి మరింత పుష్టి కూర్చేరు నరసింహశాస్త్రిగారు.
వాఘిరానది వర్ణన ప్రత్యేకంగా గమనించాలి.
కథానాయకి జీవితానికీ వాఘిరానదికీ సామ్యం ఉంది.
వాఘిరా రూపం
సూక్ష్మంగా కథ –
వృద్ధ భిక్షువు, సంఘారామ అధ్యక్షుడు అయిన కుమారశ్రీనాథుడికి వాఘిరానదీతీరంలో దొరికిన పసిపాప వాఘిరా. కుమారశ్రీనాథుడు ఆపాపని బుద్ధప్రసాదంగా స్వీకరించి గారాబంగా పెంచుతాడు. అజంతాగుహలలో చిత్రరచన చే్స్తున్న అశోకుని కుమారుడు కొండప్పకి అప్పటికి అయిదేళ్ళు. ఆపసిపాప అంటే అమిత ఆపేక్ష.
ఆరామం దర్శించడానకి వచ్చిన ఆ దేశపురాజు పులకేశి, మహారాణి వాఘిరాని తమ అంతఃపురానికి తీసుకువెళ్తారు. వాఘిరాకి ఆరామంలో ఎంత స్వేచ్ఛో రాణివాసంలో అంత కట్టడి. అంతవరకూ యథేచ్ఛగా విశృంఖలంగా పెరిగిన వాఘిరా అంతఃపురంలో నియమాలను పాటిస్తుంది. ఆ తరవాత కొండపని పిలిపిస్తారు రాణిమందిరంలో చిత్రరచనకోసం.
కథ ఆవరణము అజంతాగుహలనుండి రాణిగారి అంతఃపురానికి మారినతరవాత కథలోనూ పాత్రలలోనూ చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తుంది.
ప్రధానపాత్ర వాఘిరా ఆరామంలో ఉన్నప్పుడు బుద్ధప్రసాదం. సామాన్యమానవులకి అతీతురాలు. రాజప్రాసాదంలో ఉన్నప్పుడు, కొండప ఈర్ష్య ప్రకటించినప్పుడు, వాఘిరా, “బుద్ధప్రసాదము ఈలోకములో నెవ్వరినీ వివాహమాడ పాల్పడదని గ్రహింపనేఱకపోయితివా” అంటుంది వాఘిరా.
రాజమందిరంనుండి ఆరామానికి తిరిగివచ్చిన కొండప్ప వాఘిరా తనని సేవకునిలా చూచిందని కుమారశ్రీనాథుడికి చెప్పినప్పుడు, ఆయన కూడా “.. అది పవిత్రమైన బిడ్డ. దానికి లోకసంబంధమైన మాలిన్యములంటునా? దానిసంగతి యీ పసివానికేమి యెఱుక” అని జాలి పడతాడు.
కానీ పూజ చేయించడానికి రోజూ వచ్చే బ్రహ్మచారిని ఆమె అంటిపెట్టుకు తిరగడం, కొండప్పమీద చిరాకు ప్రదర్శించడం చూస్తే, సాధారణస్త్రీ ప్రవర్తించినట్టుగానే ఉంది కానీ లోకసంబంధమైన మాలిన్యములంటని బుద్ధప్రసాదం అనిపించలేదు నాకు.
కొండప్ప ఆరామంలో ఉన్నంతకాలం పసిబాలునివంటి అమాయకుడు. వాఘిరా అంటే చెప్పలేని ఆపేక్ష అతనికి. ఆ ఆపేక్షమూలంగానే వాఘిరాని ఆదర్శంగా నిలబెట్టి ఆమె ప్రతిరూపాన్ని మేఘదూతంలో యక్షిణిగా అద్భుతమైన చిత్రం రచించి రాణి ప్రశంసకి పాత్రుడవుతాడు. రాణి మందిరంలో అనేక పౌరాణికగాథలు ఎంతో నైపుణ్యంతో చిత్రిస్తాడు.
అలాటి చిత్రకారుడికి బ్రహ్మచారియందు వాఘిరా చూపుతున్న శ్రద్ధ భరింపరానిదైంది. ఆ ఈర్ష్య అతను గీసిన బ్రహ్మరక్ష రూపంలో ద్యోతకమవుతుంది. తేళ్ళు, పాములు, ఛాతిమీద కణుతి వంటివి చిత్రిస్తాడు అప్రయత్నంగానే. అవి చేతబడి చేసినట్టు బహ్మచారి శరీరంమీద చేరి రోగగ్రస్తుడిని చేస్తాయి.
మరోలా చెప్పాలంటే, కొండప్ప కళానైపుణ్యం రెండు కోణాలలో చూస్తాం. ప్రసన్నంగా ఉన్నప్పుడు అద్భుతమైన కళారూపాలు, విచారగ్రస్తుడైనప్పుడు వికారరూపాలుగా మారిపోయేయ.
ప్రతిభావంతులైన కళాకారులు తాము సృష్టించే కళారూపాలలో మమైక్యమయిపోతారు. వారి అనుభూతులూ, ఆవేదనలూ ఆ కళారూపాలలో ప్రతిఫలిస్తాయి. బహుశా రచయిత అటువంటి తత్వాన్నే ఇక్కడ ఆవిష్కరించేరేమో. ఇది నా అభిప్రాయం మాత్రమే.
కథనంలో ప్రత్యేకించి ఆకట్టుకోగల అంశాలు– అజంతాగుహలు, గుహలనిర్మాణం తీరుతెన్నెలు, గుహలలో శిల్పాలు, చిత్రాలు, ఆ చి్త్రరచనకోసేం గోడలు సిద్ధపరిచేవిధానం వంటివి. ఇవన్నీ ఎంతో విపులంగా వివరించేరు రచయిత.
శిల్పకళ, చిత్రకళలలో, అజంతా గుహలచరిత్రలో ఆసక్తి గలవారికి ఈచిన్ని నవల తొలిమెట్టు కాగలదు.
కథనవిధానంగురించి కూడా ఒకమాట చేరుస్తాను. సాధారణంగా ప్రథమపురుష కథనం రెండు విధాలుగా ఉంటుంది. ఒక విధానంలో కథకుడు ప్రేక్షకుడుగా ఉండి తాను చూసింది చూసినట్టు చెప్పుకుంటూ పోతాడు. రెండో పద్ధతిలో కథకుడు సర్వాంతర్యామి. అంటే ప్రతిపాత్ర మనోగత భావాలు కూడా చెప్తాడు. మామూలుగా నాకు తోచదు కానీ ఈనవల చదువుతున్నప్పుడు, ముఖ్యంగా రెండవ సగంలో సర్వాంతర్యమి కథకుడు ఎక్కవగా కనిపించేడు.
ఈ పుస్తకం Archive.org కి కృజ్ఞతలతో, పిడియఫ్ .Wageera
నోరి నరసింహశాస్త్రిగారి సాహిత్యవ్యాసాలు – నా సమగ్రవ్యాసం ఇక్కడ
000
(సెప్టంబరు 26, 2018)
అవునండి. ఏకబిగిన చదివించేస్తుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
నేనూ వాఘిరా నవల చదివాను. ఏకబిగిన చదివించిన నవల.
మెచ్చుకోండిమెచ్చుకోండి