ఏమీ చెయ్యాలని లేదివాళ
అనుకున్న రోజునే ఎన్నో కర్మములు ఎదుట నిలచి
వీరవిహారం చేస్తాయి, మాయాబజార్ో సినిమాలో సావిత్రిలా.
ఏళ్ళూ పూళ్ళూ వాయిదాలు వేస్తున్న
బొత్తాయిలు కుట్టాలి ఈరోజైనా.
అన్నట్టు సుచిత్రతో మాటాడి చాలా రోజులయింది
ఫోనెత్తి ఓమారు పలకరిస్తే ఓపని అయిపోతుంది.
రామానుజాన్ని చూసి చాలాకాలం అయింది.
“నువ్వున్నావని దేశం కాని దేశం పంపించేను
ఓమారు కనుక్కుందూ, నేను పిలిస్తే వేళ కాని వేళ
పిలిచేనని విసుక్కుంటాడు, కాపోతే అసలు ఫోనే తియ్యడం”టూ
నెలరోజులుగా పోరు పెడుతోంది చిట్టి చెల్లెమ్మ.
దానికి తెలీదు ఈదేశంలో పిల్లలు మనకోసం
బెంగ పెట్టేసుకోరని, వాళ్ళ”సోషల్”జీవితానికే ఎన్ని గంటలూ చాలవని.
ఓమారు పిలవాలి పూరీలో పకోడీలో చేసేను
ఓమారు కనిపించి పొమ్మంటే సరి.
“అట్టేసేపు ఉండలేనంటూ వస్తాడు.
బెంగాలీదుకాణంవాడు మామిడికాయలొచ్చేయని
పోస్టు పెట్టేడు.
చలికాలం వచ్చేస్తోంది, బహుశా ఇదే ఆఖరేమో
రెండు కాయలు తెచ్చి ఆవకాయ పెడితే
రామానుజానిక్కూడా ఇవ్వొచ్చు చిన్నసీసా.
సులేఖబ్లాగు చూడాలి ఏమి రాసిందో.
ఒకటో రెండో పోస్టులు చూసి ఓముక్క రాస్తే
కొండకొమ్మునందుకున్నట్టు పొంగిపోతుంది.
పాపం, నేనంటే పిచ్చిప్రేమే తప్ప నాకేం తెలుసని?
నాది నక్కలోకం, ఆవిడది నాగలోకం
ఆవిడ హస్తి, నేను మశకాన్ని.
మరెలా కుదిరింది మైత్రి?
అంటే చెప్పడానికేమీ లేదు.
… … …
అయ్యో, అనుకుంటుండగానే మూడు దాటింది.
ఈలెక్కన ప్రతిరోజూ “ఏమీ చెయ్యాలని లేద”అని జపించాలేమో.
పోనీ, గోడమీద రాసుకోనా?
ఏ ఒప్పందాలూ లేని, ఎందునా పొందని ఈ కర్మములచిట్టా?
000
(అక్టోబరు 1, 2018)