జగన్నాటకం – ఛిన్నాభిన్నం

భిన్నాభిప్రాయాలు ప్రోత్సహించాలని

ఏకాగ్రీవంగా నిర్ణయం చేసేసేరు మ.ఘ.వ. మేధావులు.

ఒకొక అభిప్రాయమూ ఒకొక ద్వీపమయి వెలసింది.

మొత్తం మానవులంతా ఒక అఖండసత్వం

అన్నభావానికి జీవం లేకుండా పోయింది.

000

ప్రజాస్వామ్యం ఒక సర్కస్!

నీతీ, నిజాయితీ, స్వలాభాలూ,

ఒకొకరి ఔన్నత్యాలూ, త్యాగాలూ

కుప్పగా కూలిపోయి ఏది ఏదో తెలీక

మనసు మొద్దు బారిపోయినప్పుడు

రాయిరప్పల్లో లేని రూపాలు వెతుక్కుంటూ

ఒక్కొక్క క్షణమే ఖర్చు పెడుతున్నానీపూట.

000

వాడేరా దైవము!

ఒక మహా నాయకుడిని

ఒక మహా నటుడిని

ఒక మహా ప్రవక్తని

వాడేరా దైవము

అని ఆరాధించడంలో ఒక ప్రమాదం

ఆమనిషిలో లోపాలను క్షమించి

అతడివల్ల జరుగుతున్న మంచిని మాత్రమే

చూడమని చెప్తారు.

వాస్తవంలో ఆవ్యక్తిలోపాలను

అనుసరించేవారు ఎక్కువ కనిపిస్తున్నారు.

ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాను.

ఇదే బాధ వాడేరా దైవము అని

ఒక అమ్మనో అయ్యనో ఆరాధించడంలో.

(అక్టోబరు 8, 2019)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.