క్రొవ్విడి లక్ష్మన్నగారు. కొండవాడుకథ

నా హైస్కూలు రోజుల్లో భారతి మాసపత్రికలో శ్రీ క్రొవ్విడి లక్ష్మన్నగారి కథలు చదివేను. కథలన్నీ గుర్తు లేవు కానీ ఒక కథ “హిమగిరితనయే” మాత్రం మనసులో నిలిచిపోయింది. ఆకథకోసం కథానిలయం చూసేను. అది  ఇంకా పిడియఫ్ కాలేదు కానీ వేరే కథలు కొన్ని పిడియఫ్ రూపంలో ఉన్నాయి.

సరే, దొరికినంతవరకే చదువుదాం అని తీసుకుని, తెరుస్తుంటే నాకు నవ్వొచ్చింది. అవన్నీ ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురించినవి. ఆకాలంలో పత్రికలలో ఎన్ని “కాలాలు” ఉండేవో వరసగా తెలుస్తూ వచ్చింది. అందుకూ నాకు నవ్వొచ్చింది. అంటే చి్న్న పనికిమాలిన రిసెర్చ్ చేసేను, ఆంధ్రపత్రికలో ఒక పేజీలో ఎన్ని కాలాలు (columns) ఉన్నయి అని.

1944లో ఒకపేజీకి 7 కాలాలున్నాయి.

1948లో 4 కాలాలు

1952 వచ్చేసరికి 3 కాలాలయేయి.

5, 6 కాలాలు ఉండినవో లేదో తెలియలేదు.

అలాగే 2 కాలాలు ఎప్పుడు మొదలయేయో కూడా సరిగా తెలీదు, సుమారుగా 1952-53 ప్రాంతాల్లో జరిగినట్టుంది.

2 కంటె ఎక్కువ కాలాలుంటే, కంప్యూటరులో చదవడం కష్టం, కిందకీ మీదకీ, ఎడమకీ కుడికీ జరుపుకుంటూ. అంచేత ఇది గాదు, ఇది కాదు అని ఒకొకటే తీసి పక్కన పెట్టేసేక మిగిలిన కథ కొండవాడు. అది కూడా తొలిసారి ఆంధ్రపత్రికలో ప్రచురించినప్పుడు అంటే 17 మార్చి 1948 వారపత్రికలో 4 కాలాలలో ఉంది. అంటే నావల్ల కాదని అర్థం. ఇక్కడ “నాకు” అన్న పదం గమనించాలి. నాకు చదవడం పడలేదు అంటే అందరికీ అంతే అని కాదు. బహుశా మీలో చాలామంది చదవగలరేమో.

ఇంతకీ ఇదే కథ మళ్ళీ అక్టోబరు 1978లో అనామిక మాసపత్రికలో 2 కాలాలలో ఉంది. అది తీసుకుని చదివేను. ఇందులో చర్చించవలసిన లేదా ఆలోచించదగ్గ అంశాలు ఒకట్రెండు కనిపించేయి. అవి ప్రస్తావించడమే ఈసమీక్ష ధ్యేయం.

కథకుడు ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న సిబి (అడవిప్రాంతం) ఉద్యోగరీత్యా వెళ్తాడు. లాహోరుకీ క్వెట్టాకి మధ్య ప్రదేశం. అక్కడ 16, 18ఏళ్ళ వయసుగల కొండవాడిని చూస్తాడు. ఆయనకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఆ కొండవాడి చేతిలో గొఱ్ఱెలని అదిలించే చేపాటుకర్ర కాక తుపాకీ ఉండడం, ఆ తుపాకీ, వాడివైఖరీ కారణంగా ఆయనకి పట్టలేని కుతూహలం. దాంతో అతనిగురించి తెలుసుకోడానికి అతన్ని అనుసరిస్తాడు. కథకుడిని ఆ కొండవాడు తేలిగ్గానే కనుక్కుని తుపాకీ ఎక్కుపెడతాడు కానీ ఆయన “దుస్తులు మావలతు” చూసి, దించేస్తాడు. కథాంతంలో శత్రువులు బాంబులు పేల్చగా, అతను అద్భుతమైన ధైర్యసాహసాలతో శత్రువులను ప్రతిఘటించి ఒక్కడే పాతికమందిని పడగొట్టడం చూసి, కథకుడు దిమ్మయిపోతాడు. ఆ కొండవాడి యుద్ధకౌశాలన్ని రచయిత ఆవిష్కరించిన తీరు అద్భుతం. కేవలం ఆభాగంకోసమైనా ఈ కథ చదవాలి మీరు.

కథాకాలంగురించి ఒక మాట చెప్పాలి. ఈకథకి అనామిక సంపాదకులవాక్కులు (1978లో)- 

ఈకథ తొలిముధ్రణ ఆంధ్రపత్రిక వారపత్రికలో 17 మార్చి 1948లో జరిగింది. అప్పటికి మనకి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ కథలో రచయితవాక్యాలు చూస్తే స్వాతంత్య్యానికి ముందే రాయడం జరిగింది అనుకోవాలి. ఆ కొండవాడు తుపాకీతో ఒక రాయిని ఛిన్నాభిన్నం చేసినతీరు చూసి, కథకుడు అంటాడు,

“పరాధీనంలో ఉన్నంతకాలం” అన్నవాక్యం ఒకటి. రెండోది ప్రభుత్వం కొండజాతివారివిషయంలో ఎలా ప్రవర్తిస్తోంది అన్నది రెండోవాక్యంలో కనిపిస్తుంది, “క్రౌర్యంచేతో, కానుకలిచ్చో మోసం చేయ్యడం” అన్నది. ఇది నాకు సరిగా అర్థం కాలేదు. మోసం చేస్తున్నది భారతప్రభుత్వం అనుకుంటే, కథ స్వాతంత్ర్యం వచ్చినతరవాత అనుకోవాలి. అలా కాకపోతే, మోసం చేస్తున్నది బ్రిటిష్ ప్రభుత్వం అనుకోవాలి. ఇది తెలిసినవారు ఆలోచించి వివరించగలరేమోనని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. దేశప్రగతికి ఈ కొండజాతివారి శౌర్యం, సాహసం వినియోగించుకుంటున్నామా అన్న ప్రశ్న సమంజసమే. ఆనాటి మేధావులందరూ అదే కోరేరు. ఇప్పుడు, ఏడు దశాబ్దాలతరవాత ఆప్రశ్న మరొకవిధంగా మనం వేసుకోవాలేమో.

ఏ శిక్షణా లేకుండానే ఆకొండవాడు అసామాన్యమైన కౌశలాన్ని ప్రదర్శించేడు. మనవాళ్ళు ఇచ్చే శిక్షణ అంతకంటె గొప్పగా ఉంటుందా?  వారికి ఆధునికపద్ధతులలో విద్య నేర్పించి, వారిని “నాగరీకులు”గా మార్చేస్తే, వాళ్ళజీవితాలు ధన్యమయిపోతాయా అని నా సందేహం. ఈనాటి విద్యావిధానాలు కొండవాడినీతిని మెరుగుపరిచేవిగా ఉన్నాయా? ఈనాటి మన విద్యావిధానంలో మానవత్వం లేదు.  ఎవరికి వారు ఉన్నతపదవులు, సంపదలూ సంపాదించుకోడమే ఈవిద్య ధ్యేయం.

ఇది ప్రత్యేకంగా ఎత్తి చూపడానికి కారణం ఈ కథలోనే ఆ కొండవాడి సౌజన్యం, జంతువులపట్ల ప్రేమా కథకుడు ప్రస్తావించడం. “వాడిమాట కరుకే కాని మనసులో ఏ కల్మషం లేదు” అంటాడు కథకుడు. ఒక పోతుమేక ఒక చిన్న మేక పిల్లని కుమ్మేస్తుంటే ఆకొండవాడు ఒక్క ఉదుటున వెళ్ళి, పోతుమేకని డొక్కలో తన్ని, మేకపిల్లని ఆప్యాయంగా ఎత్తుకుని తల్లిదగ్గరికి చేర్చడం చూసి, “వెధవది ఎంత జాలిగుండె” అనుకుంటాడు సంతృప్తితో.

రచయిత ఆకాలంలో పరిస్థితులనుబట్టి అలా ఆలోచించిఉండవచ్చు. ఇప్పుడు, ఏడు దశాబ్దాలు గడిచేక, మన సంస్కృతి, నాగరీకత ఏ దిక్కుగా సాగుతున్నాయో చూస్తే, ఆ కొండజాతివాడిని మనం ఉద్ధరించేలా లేవనే అనుకుంటాను నేను.

000

గత వారం పదిరోజుల్లో నాకు క్రొవ్విడి లక్ష్మన్నగారు మనసులో మెదలడానికి కారణం యూట్యూబులో హిమగిరితనయే కృతి కనిపించడం. ఇంతకుపూర్వం మహరాజపురం సంతానంగారి స్వరంలో విన్నాను. ఇప్పుడు మళ్ళీ నందినీ గుజర్ గొంతులో విన్నాను. ఇద్దరిగానమూ నాకు చాలా నచ్చింది.

లక్ష్మన్నగారు హిమగిరితనయే అన్న శీర్షికతో ఒక కథ రాసేరు 1952లో. ప్రేమకథ. అసామాన్యమైన కంఠమాధుర్యము గల సంగీతవిద్వాంసురాలయిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయిగానానికి ముగ్ధుడైన ఒక అబ్బాయి. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోడానికి పెద్దలు అంగీకరించరు. నాకు కథ పూర్తిగా జ్ఞాపకం లేదు, బహుశా కులాంతరమో, పేదరికమో అనుకుంటాను వారి అభ్యంతరానికి కారణం. రెండు మూడు సంఘటనలయేక, పెళ్ళి జరుగుతుంది.

ఈకథలో నాకు చాలా నచ్చిన, ఇప్పటికీ స్థిరంగా మనసులో నాటి నిలిచిపోయిన అంశం ముగింపు. కథాంతంలో కథకుడు అంటాడు, “ఆ ఇంటి వసారాలో కూర్చుని ఓ తాతగారు ఎప్పుడూ కల్వంలో మందులు నూరుతూంటారు. వాటిలో చాలామటుకు కంఠస్వరం చక్కగా ఉంచడానికేన్ట” అని. అంటే,  దానితలరాత అలా ఉంది అంటూ సరిపుచ్చుకోడం కాక మనఃస్ఫూర్తిగా ఆ వివాహానికి అంగీకరించడం అన్నమాట.

కథానిలయంవారికీ, అనామిక పత్రికాధిపతులకూ కృతజ్ఞతలతో, కథ లింక్ కొండవాడు

000

ఆపాట మీరు వినదలుచుకుంటే ఇదుగో —

https://www.youtube.com/watch?v=xbmfEvoAvGs

000

నా అలవాటుప్రకారం కొండవాడుకథలో నాకు నచ్చిన మాటలు కూడా చెప్తాను

ఒకటి వ్యాసఘట్టం. క్లిష్టపరిస్థితి అన్న అర్థంలో.

ఇంకా

“నాగరికతా, నాజూకూ పెరిగిపోయి ఒట్టి జపాను సరుకైపోయేను. రండికీ మొండికీ ఓర్చి పని చెయ్యాలంటే నా వశమా”? ఇది ఇంగ్లీషు నాగరీకత అలవాటు పడుతున్నరోజులలో మాట.

“దుస్తుల మావలతు చూసి  …” మావలతు అన్నపదానికి నిఘంటువు అర్థం “ఫలితం లేని కాలక్షేపం” అని ఉంది కానీ ఇక్కడ పద్ధతి అనిపిస్తోంది, ముఖ్యంగా కథలో కథకుడి దుస్తులు చూసి కొండవాడు గౌరవం చూపిస్తాడు. అంటే ఆ దుస్తులకి ఓ ప్రయోజనం ఉన్నట్టే కదా.

000

(అక్టోబరు 14, 2018)

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “క్రొవ్విడి లక్ష్మన్నగారు. కొండవాడుకథ”

 1. జపాను సరుకైపోయేను అంటే అర్ధం ఏమిటండీ.జపాన్ వాళ్ళు బాగా కష్టపడతారంటారు కదా ?
  హిమగిరితనయే కధ లింక్ దొరుకుతుందా ?

  మెచ్చుకోండి

 2. నారాయణస్వామి, మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. మనకి స్వాతంత్ర్యం వచ్చిందన్నమాటే కానీ ఆ సంప్రదాయాలూ, పరిపాలనావిదానం, భావజాలం – వీటిని మనం వదిలించుకోలేదు. స్వాతంత్ర్యం వచ్చేక మనదంటూ ఏమి పునరుద్ధరించుకున్నామో తెలీడం లేదు

  మెచ్చుకోండి

 3. కొండవాడు కథలో ప్రభ్యత్వం ఎవరు అన్న విషయం. అనేక అంశాలలో స్వతంత్ర భారతం ముందుటి బ్రిటిషు ప్రభుత్వ వైఖరినే కొనసాగించింది. కొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అందులో కొండ జాతులు, వెనుకబడిన తరగతుల వారి పట్ల వైఖరి కూడా. కొన్ని కొన్ని జాతుల వారు, తెగల వారు మొత్తంగా క్రిమినలైజ్ చెయ్యబడ్డారు. నేను కొంత చెంచు వారితో పనిచేశాను. అప్పుడు కొద్దిగా తెలుసుకున్నాను. అదలా ఉండగా 1947 ఆగస్టు 15 న జరిగింది నామమాత్రక అధికార మార్పిడి. అనేక విధాలుగా అప్పటికి 20-30 ఏళ్ళ ముందు నించీ ప్రెసిడెన్సీలలో దేశవాళీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నుకోబడి రాజ్యం చేస్తూ వచ్చాయి. ప్రకాశం పంతులు, రాజాజీ, ప్రభృతులు ఆ ప్రభుత్వాలలో పదవులు నెరపిన వారే. అంచేత ఇక్కడ కథలో ఆ కొండబ్బాయిని నొక్కి పెట్టిన ప్రభుత్వం తెల్లవారిదా దేశవాళీదా అని విచారణ అక్కర్లేదని నా అభిప్రాయం.
  1970 లలో మృగయా (వేట) అనే అవార్డు సినిమా వచ్చింది. అందులో ఇంచుమించుగా ఇదే నేపథ్యం. కథాకాలం బ్రిటీషు రాజ్య పాలన సమయం. మంచి గురికాడైన ఆటవిక యువకుణ్ణి ఒక తెల్లదొర ముందు మచ్చిక చేసుకుని తరవాత అతని అవసరం తీరాక రాజద్రోహ నేరం కింద ఉరి తీయిస్తాడు. హిందీ తార మిథున్ చక్రబొర్తి కి బాగా పేరు తెచ్చిన సినెమా.
  ముచ్చట గా మూడో మాట. ధూర్జటి శ్రీకాళహస్తి మాహా త్మ్యం ప్రబంధంలో కన్నప్ప కథ లో వారికి వేటలో ఎన్ని రకాల విద్యలు తెలుసో చాలా వివరంగా రాశారు. నేను తానా పత్రిక సంపాదకుడిగా ఉన్నప్పుడు ఈ భాగాన్ని వచన వ్యాఖ్యానంతో ధారావాహికగా ప్రచురించాను.

  మెచ్చుకున్నవారు 2 జనాలు

 4. అనేకవిషయాల్లో స్వతఃసిద్ధమైన సుగుణాలూ, లక్షణాలూ నాగరితకపేరున ధ్వంసమయిపోతున్నాయి అనిపిస్తుంది. మీ అభిప్రాయాలకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. కొండవాడి మరణం కలత పెట్టింది. వాడి సాహసం శత్రువుని ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయం. అవును .. అధునాతన శిక్షణల కన్నా సహజసిద్ధమైన పోరాటగుణం తీసివేయదగినది కాదు. మంచి కథని పరిచయం చేశారు. ధన్యవాదాలు. కొన్ని కొత్త పదాలు తెలుసుకున్నాను.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.