రాహుల్ వెళ్ళల్ గానం, సంస్కారం.

గత రెండేళ్ళలో రాహుల్ వెళ్ళల్ గానం లక్షలమంది అభిమానులని సంపాదించుకుంది.

ఈయేడు తిరపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంలో నిర్వహించిన విన్నపాలు వినవలె కార్యక్రమంలో రాహుల్ కచేరీ నాకు చాలా నచ్చడమే కాక, మరిన్ని ఆలోచనలు కలిగించింది. సంగీతంగురించి నాకు అట్టే తెలీదని ఇప్పటికి అనేకసార్లు చెప్పేను. అంచేత ఈ కచేరీలో గాయకుడివైదుష్యంగురించి నేనట్టే ప్రస్తావించలేను.

స్థూలంగా, ఈకచేరీలో పాడిన కీర్తనలన్నీ యం.యస్. సుబ్బలక్ష్మిగారు అనర్వచనీయమైన భక్తిప్రపత్తులతో పాడి ప్రచారంలోకి తెచ్చినవే. గత 30 ఏళ్లలో నేను అవి అనేకసార్లు విని ఉండడంచేత ఎవరు పాడినా, నేపథ్యంలో నాకు సుబ్బలక్ష్మిగారి గాత్రం మెదులుతూ ఉంటుంది. ఈ కచేరీ విన్నప్పుడు కూడా అదే జరిగింది. బహుశా సుబ్బలక్ష్మిగారి స్థాయి కాకపోవచ్చు కానీ, ఈ చిన్నవాడివయసు లెక్కలోకి తీసుకుంటే, ఆస్థాయికి తగినట్టుందనే అనిపించింది.

ఈకచేరీలో పాడినకీర్తనలు ఇవి – శ్రీ వేంకటేశం, మనుజడై పుట్టి, శిశువితడు చేరి యశోదకు, పరమపురుష నిరుపమాన, నిగమనిగమాంతవర్ణిత, అలరులు గురియగ, నారాయణ తే నమోనమో, డోలాయాంచల డోలాయాం.

భక్తి, వేదాంతంతోపాటు అలౌకికమైన సుందరభావాలు కూడా ఆవిష్కరించిన కీర్తనలివి. ఈ గాయకుడికంఠస్వరంలో కూడా ఆ భావాలు తొణిసలాడుతాయి.

ఈ కచేరీతరవాత, అతనితల్లిదండ్రులతో ఇంటర్వూ కూడా విన్నాను. ఆ ఇంటర్వ్యూలో విశేషాలమూలంగానే నాకు కొన్ని సంగతులు ప్రస్తావించాలనిపించింది.

  1. వయసుకి మించిన అంకితభావంతో గానం చేయడం ఎలా సాధ్యం అన్నప్రశ్నకి, తనగురువునుండి అర్థాలు తెలుసుకున్నాడు. కీర్తనలలో భావాలవిషయంలో మంచి అవగాహన పెంచుకుని పాడుతున్నాడు. ఇదీ నాకు చాలా ఆనందం కలిగించినవిషయం. అలాగే ఉచ్చారణ కూడా చాలా బాగుంది. తెలుగు తల్లిభాష కాకపోయినా, ఎంతో చక్కగా పలికేడు.

ఇది విన్నప్పుడు నాకనిపించింది పిల్లలకి తెలుగు చక్కగా రావాలనుకునే తల్లిదండ్రులు పిల్లలకి కర్ణాటకసంగీతం నేర్పించాలి, కచేరీలు చెయ్యకపోయినా, భాష పట్టుబడుతుంది.

  1. టివీలోనూ, ఇతరత్రా పిల్లలకి పోటీలు జరుగుతున్నాయి. అందులో రాహుల్ పాల్గొనకపోవడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నకి తండ్రి జవాబు బాగుంది. ఆపోటీలవల్ల మంచే జరుగుతోంది, పిల్లలు తమ ప్రతిభ చూపడానికి అవకాశాలు కలుగుతున్నాయి అని చెప్పి, రాహుల్ పాల్గొనకపోవడానికి కారణం అతనికి ఆసక్తి లేదని చెప్పడం అన్నారు. ఇక్కడ రెండు విషయాలు గమనార్హం.

ఒకటి ఆ పోటీలను తక్కువ చేయకపోవడం. రెండోది రాహుల్ నిర్ణయాన్ని గౌరవించడం. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలమీద తమకోరికలు, ఆశయాలు రుద్దుతారు. అది ఇక్కడ జరగనందుకు సంతోషించేను.

  1. అలాగే ఈఅబ్బాయి చిన్నతనంలోనే సంగీతంలో ఆసక్తి చూపడం గమనించి, ప్రోత్సహించడం కూడా. మామూలుగా గాయకులఇళ్ళలో పిల్లలకి కూడా ఆవిద్యలో ఆసక్తి కలగడం, విద్య త్వరగా పట్టుబడడం జరుగుతుంది. ఈతల్లిదండ్రులిద్దరికీ సంగీతం రాకపోయినా, ఆ అబ్బాయికి సంగీతంలో ఆసక్తి కలగడం విశేషమే. అది గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించడం, సంగీతం నేర్చుకోడానికి అవుసరమైన ఏర్పాట్లు చేయడం అంతకన్నా గొప్పవిషయం.
  2. యూట్యూబులో ఆ కచేరీదగ్గర ఒక వ్యాఖ్యగురించి చెప్పాలిక్కడ. ఇంగ్లీషులో రాసేరు. “Atrocious” అని మొదలుపెట్టి, తనమనుమరాలికి ఆసంగీతం చాలా ఇష్టం అని చెప్పేరు. అంటే ఆమొదటి పదం అర్థం తెలీకో పొరపాటున మరేదో చెప్పబోయో అయిఉండాలి.

రాహుల్ ప్రతివ్యాఖ్యకీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈవ్యాఖ్యకి కూడా ధన్యవాదాలు చెప్పి, ఆమనుమరాలికి శుభాకాంక్షలు కూడా చెప్పేడు, atrocious అన్నపదం వదిలేసి. అది సంస్కారం.

అతనికే తట్టిందో, పెద్దలు చెప్పేరో. ఒకవేళ పెద్దలే చెప్పినా, పెద్దలు మంచి సంస్కారం అలవాటు చె్సేరనే చెప్పుకోవాలి. ఇది నేను ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఇటీవలికాలంలో ప్రతి చిన్నవిషయానికీ తప్పు పట్టి రచ్చ చేయడం సాధారణం అయిపోతోంది. అందుచేత, నాకు ఇది ఘనంగా అనిపించింది.

000

కచేరీకి లింకు – https://www.youtube.com/watch?v=UPPeJnl0I8k

000

(అక్టోబరు 30, 2018)

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.