పొడుపు కథలు

గోడమీద బొమ్మ,

గొలుసులబొమ్మ,

వచ్చేపోయేవారికి వడ్డించుబొమ్మ – తేలు

తండ్రి గరగర,

తల్లి పీచు పీచు

బిడ్డలు రత్నమాణిక్యాలు,

మనుమలు బొమ్మరాళ్ళు – – పనసపండు

నాకు తెలిసిన రెండు పొడుపుకథలు ఇవి. పొడుపుకథకి ఒక లక్షణం పొదుపు. పొడి పొడి  మాటలలో ఒక వస్తువునో జీవినో వర్ణించడం, ఎదుటివారిని అదేమిటో కనుక్కోమనడం. సాధారణంగా జవాబులు ఒకటో రెండో పదాలలో ఉంటాయి. మొదట్లో చెప్పిన తేలు, పనసపండులా.

ఈ పొడుపుకథలు ఇప్పుడు చెప్పుకోడం దాదాపు మాయమయిపోయింది. ఈసందర్భంలో ఆధునికకాలంలో కొత్త సామెతలూ, పొడుపుకథలు వస్తున్నాయి రైలు, సైకిలువంటి వాటీమీద. దాంతోపాటే సందేహం కూడా ఈ కొత్తగా పుట్టిన సామెతలూ, పొడుపుకథలూ రోజూవారీ కబుర్లలో వాడుతున్నారా అని. బహుశా కంప్యూటరు, ఐఫోనుకి సంబంధించినవి తయారయితే వాడుతారేమో.

నేను ఈమధ్య కసిరెడ్డిగారి సిద్ధాంతవ్యాసం “తెలుగు పొడుపుకథలు” చూసేను. ఆగ్రంథంలోని కొన్ని విషయాలు సమయానుకూలంగా ఈపోస్టులో ఉదహరించేను.

ఒకొకప్పుడు పొడుపుకథలు చిన్నమార్పుతో ఏ సినిమాపాటలోనే కనిపిస్తే ప్రచారంలోకి రావచ్చు.

సంపాదన ఒకరిదీ

అనుభవం మరొకరిదీ (పు. 358) అని ఒక పొడుపుకథ. దానికి విడుపు చేతులు, కడుపు అని.

ఇది పొడుపుకతగా మొదలైనా ఇది చూడగానే నాకు గుర్తొచ్చింది సినిమా పాట

చాకిరొకరిదీ సౌఖ్యమొకరిదీ అన్న చరణం. ఆ సినీ రచయిత (పేరు నాకు గుర్తు లేదు) ఈ పొడుపుకథని మనసులో పెట్టుకు రాసేరో లేదో నాకు తెలీదు. బహుశా అధునిక భావజాలం, సాంఘికన్యాయం, దృష్టితో రాసి ఉండొచ్చు.  కొన్ని బావాలు  ఏకాలంలోనూ ఒక్కలాగే ఉండే అవకాశం ఉందని తెలుసుకోడానికి ఉపయోగపడతాయి ఇవి.

కొన్ని పొడుపకథలకు 3, 4 జవాబులు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవలసింది విడి విడి పదాలే

నిత్యవ్యవహారంలో సరదాగా పిల్లలు చెప్పుకునే పొడుపుకథల్లో.

అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు

కొమ్మకు కోటి పువ్వులూ

పువ్వుల్లో రెండే కాయలు (ఆకాశం, చుక్కలు, సూర్యచంద్రులు, పు. 473)

మరొక రకం పొడుపుకథ –

వంకర టింకర సొ

వానితమ్ముడు అ

నల్లగుడ్ల మి

నాలుగుకాళ్ళ మే.

వీటికి వరసగా సొంఠి, అల్లం, మిరియాలు, మేక అని చెప్పుకునేవాళ్లం విడుపు.

నేను ఈ పొడుపుకథ ఫేస్బుక్కులో పెడితే, మిత్రులు ఇచ్చిన కొన్ని పాఠాంతరాలు –

ఒంకర టింకర ఓ
వాని తమ్ముడు సో
నల్ల గుడ్ల మే
నాలుక్కాళ్ళ బే. (కన్నెగంటి అనసూయ)

 

వంకరటింకర వా –వాము
వానీ తమ్ముడు సొ–సొంఠి
నల్లగుడ్ల మి— మిరియాలు
నాలుక్కాళ్ల అ…..

– అల్లంవంకరటింకర వా –వాము (శశికళ వోలేటి)

 

నాలుక్కాళ్ళ బె (బెల్లము.  అనంతలక్ష్మి)

 

వంకర టింకర ఒ

వానీ తమ్ముడు సొ  (వారణాసి రామబ్రహ్మం)

 

వైద్యపరంగా ఈ పొడుపుకథకి గిరిజ పీసపాటి ఇలా వివరించేరు

మేక పాలల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి మాలతి గారు. ముఖ్యంగా ఎముకలకు చాలా పటుత్వాన్ని ఇస్తాయి. మేక పాలతో రోజూ మర్దన చేస్తే ఎలాంటి నొప్పులైనా తగ్గుతాయట. విరిగిన ఎముకలను కూడా అతికించ గల సత్తా మేక పాలకు ఉందని అంటారు. అందుకేనేమో గాంధీజీ రోజూ మేక పాలను తాగేవారు.

అంటే మే అన్న అక్షరానికి మేక అని కాక మేకపాలు అని చెప్పుకోవాలన్నమాట.

ఉమారవి నీలాంరంభం మరొక ఉపయోగం చెప్పేరు. “మిగతా మూడూ కూడా ఎముకల పటుత్వం కోసం ఇప్పుడూ వాడతారు.. టీలో, కషాయంగా …. బాలెంతల “కాయం”లోకూడా అవే” అని.

టీలో శొంఠిపొడి,పాలలో మిరియాలపొడి వాడుతుంటాను తరుచుగా.వాతం తగ్గిస్తుంది,జలుబు కిబాగా పనిచేస్తుంది అన్నారు విశాల అప్పిడి.

 

ఇలాగే మరో పొడుపుకథ లేదా పద్యం వైద్యానికి సంబంధించినదే

‘ కొండ మీద కొక్కి రాయి కాలు జారి కూలిపోయి!
దానికేం మందు
దానిమ్మ నూనె!
నూనెమ్మ బొట్టు
నూటొక్క ధార! (మంగు కృష్ణకుమారి)

000

 

జానపదవాఙ్మమయంలో ప్రత్యేకత అది. ఈ పొడుపుకథలకీ సామెతలకీ కర్తృత్వం లేదు. ఎవరు ఎప్పుడు మొదలుపెట్టేరో ఏసందర్భంలో ఏమన్నారో తెలీదు. సాధారణంగా ఆ చెప్పినమాట అర్థవంతమైతే మనకి నచ్చుతుంది. పదాలకూర్పులో లయ, ప్రాస, చమత్కారం, హాస్యం వంటి విశేషాలవల్ల మనసులో నాటుకుపోతుంది.  మరొకచోట సమయానుకూలంగా ఆమాట వాడుకుంటారు.  అలా జనుల నోళ్ళలో నానుతూ ప్రచారం అవుతుంది. క్రమంగా రూపాలు మారుతాయి. వారివారి అనుభవాలనుబట్టి సందర్భాలనుబట్టిై.  ఒకొకచోట ఇష్టాయిష్టాలు కూడా చోటు చేసుకుంటాయేమో.

పొడుపుకథలు క్లుప్తంగా, చమత్కారంగా, ఎదటివారి మెదడుకి పరీక్ష పెట్టేవిగా ఉంటాయి కానీ

ఈరోజుల్లో పొడుపుకథలు చెప్పుకోడం అట్టే కనిపించడంలేదు. “దీనిభావమేమి తిరుమలేశ” అన్న మకుటం సంభాషణలలో వాడుతున్నారు కానీ  ఆపాదం మకుటంగా రచయిత బూరెల  సత్యనారాయణమూర్తిగారు పద్యరూపంలో పొడుపుకథలు రాసేరని ఎంతమందికి తెలుసో  నాకు తెలీదు. నిజానికి నాక్కూడా తెలీలేదు కసిరెడ్డిగారి సిద్ధాంతగ్రంథం చూసేవరకూ.

పొడుపుకథల్లో గోప్యత మరొక ముఖ్యగుణం. నేరుగా చెప్పడం ఉండదు. సామెతలలో సాధారణంగా అర్థం తెలుస్తూనే ఉంటుంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట శని. బజారులో అన్నీ దొరుకుతున్నా, ఇంటివారు అవి తెచ్చి అల్లుడికి వండి పెట్టకపోవడంచేత అతడికి తినే అదృష్టం లేదు. ఇది ఇప్పుడు ఎవరూ చెప్పుకోడం లేదు. అర్థరహితం కూడాను. ఇప్పుడు అందరూ అల్లుడితో సహా హోటలుకి పోతారు.

000

డా. కసిరెడ్డిగారి సిద్ధాంతవ్యాసం, తెలుగు పొడుపు కథలు.

ఆ గ్రంథం 800 పుటలకి మించి ఉంది. ఇందులో ఎన్నో విషయాలు విపులంగా చర్చించేరు. పొడుపుకథ పుట్టుపూర్వోత్తరాలు, వివిధ భాషలలో, వివిధ దేశాలలో వాటి రూపాలు, పొడుపు సామెతలు, సామెతలు, జానపదసాహిత్యంలో, ప్రాచీనసాహిత్యంలో, ఆధునికసాహిత్యంలో వాటి సంగతి సందర్భాలు, లయ, ప్రాస, ఛందస్సు–ఆయన స్పశించని శాఖ లేదేమో అనిపించింది. అవన్నీ చూస్తుంటే పుస్తకం ఆమూలాగ్రం చదవకపోయినా, రిఫెరెన్సు గ్రంథంగా కూడా ఉపయోగించుకోవచ్చు అనిపించింది. కసిరెడ్డిగారి కృషి మెచ్చుకోవాలి. ఈ పుస్తకం archive.orgలో దొరుకుతుంది.

సిరెడ్డిగారు ఇది గృహవైద్యానికి సంబంధించినదనీ, పాఠాంతరాలున్నాయనీ ఎన్నో వివరాలు ఇచ్చేరు. నేను ఇక్కడ ఇచ్చిన పొడుపుకథకీ ఆయన ఇచ్చిన పాఠాంతరాలకీ తేడా ఉంది. (పు. 479).

కొత్తసామెతలు, పొడుపుకథలు కూడా పుడుతూంటాయి. సైకిలు, రైలువంటివాటి మీద పొడుపుకథలు వచ్చేయని కసిరెడ్డిగారు తమగ్రంథంలో రాసేరు.

తుపాకీమీద ఒక పొడుపుకథ

మొదలున మ్రానై యుండను

తదుపరి నిలువెల్ల లోహధరుడై యుడున్

హృదయము కర్కశనిలయము

కదలికచో హంకుడను కనుగొనగలరా?

 

గేయంలో అర్థం ఉన్నా లేకున్నా ఫరవాలేదు. పొడుపుకథలో లయ, అర్థం కూడా ఉండాలి. అది గేయ ప్రహేళిక. (పు.144). గ్రంథకర్త సామెతలకీ పొడుపుకథలకీ, పొడుపుసామెతలకీ సామ్యాలు ఎంతో చక్కగా వివరించేరు. పురాణాలూ, కావ్యాలూ, ప్రబంధాలలో ఉన్న పద్యాలు కూడా పొడుపుకథలే అన్నారు. అది నాకు ఆశ్చర్యంగానే ఉంది. అలా అనుకుంటే, మనం నిత్యజీవితంలో చెప్పుకునే చిన్న చిన్న సంభాషణలనుండీ మహాకావ్యాలవరకూ అన్నీ పొడుపుకథలే. అసలు భాషకి ఉన్న పరిమితి గమనిస్తే ఏ ఒక్కవాక్యం తీసుకున్నా ఒకటి కంటే ఎక్కువ అర్థాలు స్ఫురిస్తాయి. ఈనాడు పాఠకులవ్యాఖ్యానాలే సాక్ష్యం ఒక వాక్యానికి ఎన్ని అర్థాలు తీయవచ్చో తెలుసుకోడానికి. అలా చూస్తే. పొడుపు కథ అని వేరే ఒక ప్రక్రియగా చెప్పుకోవలసిన అవుసరం లేదేమో అనిపించింది నాకు. అపార్థం చేసుకోకండి. నేను రచయిత కృషిని గానీ, సిద్ధాంతాలని గానీ సందేహించడంలేదు. నేను పండితురాలిని కాను. పండితులదృష్ట్యా వారి సిద్ధాంతాలు ఆమోదంచేవే అనుకుంటాను. నేను సామాన్యజనులకోణంలో మాత్రమే ప్రస్తావిస్తున్నాను.

పొడుపుకథలే కాలక్రమంలో సామెతలు కాగలవన్నారు. బహుశా, పండితుల పొడుపుకథ వేరు, సామాన్యడనులుదృష్టిలో పొడుపుకథ వేరు అనుకోవచ్చేమో.

పొడుపుకథల ప్రధానగుణాలు క్లుప్తత, గోప్యత, చమత్కారము – ఇవి వినేవారి మెదడుకి పని పెడతాయి. నాకు ప్రత్యేకంగా కనిపింంచినవిషయం. దైనందినజీవితంలో మన సంభాషణలలో అంత విస్తృత చర్చలకి ఆస్కారం ఉండదు కదా అని.

అలాగే పల్లెపదాలు సుదీర్ఘమైనవి. 5,6 చరణాలు గల పాట పాడి ఇందులో ఏ చరణానికి ఏ అర్థం చెప్తావు అని అడిగితే పొడుపుకథ అందం మనకి కలగదు.

అప్రస్తుత ప్రసంగమే కానీ నాదృష్టిని ఆకట్టుకున్న మరో చిన్న అంశం – కృష్ణదేవరాయలు కూతురు మోహనాంగి. నేను మరొక వ్యాసంలో మోహనాంగి పద్యంగురించి చిన్న ప్రస్తావన చేసేను. అప్పట్లో కొందరు కృష్ణదేవరాయలుకి కూతురు ఉన్నట్టు ఆధారాలు లేవన్నారని నాతో అన్నారని కూడా రాసేను. కానీ ఈగ్రంథంలో మళ్ళీ మోహనాంగి ప్రస్తావన ఉంది. ఈ మోహనాంగి ఉన్నా లేకున్నా ఆపేరుమీద కొన్ని రచనలు ఉన్నాయి, వాటిని తదితర పండితులు ఉదహరిస్తున్నారు అన్నది గమనార్హం అనుకుంటున్నాను.

డా. కసిరెడ్డిగారి సిద్ధాంతగ్రంథం తెలుగు పొడుపుకథలు archive.org లో దొరుకుతుంది. పొడుపుకథలు, సామెతలలో ఆసక్తి గలవారు తప్పక చూడవలసిన మంచి పుస్తకం.

డా. కసిరెడ్డిగారికీ, ఆర్కైవ్.ఆర్గ్ వారికి కృతజ్ఞతలు.

000

ఇంత చదివేక, నాకు ఓ చిన్న పొడుపుకథ రాయాలనిపించింది.

అరచేత నుండు ఆమలకము కాదు

 సకల సందేహముల తీర్చు,  దండి పండితుడు కాదు 

చెప్పుకో అన్నాను.

ఉండు చెప్తాను అని, ఆవాక్యాలు స్మార్టుఫోనులోకి ఎక్కించి ఠక్కున చెప్పేడు,

స్మార్టుఫోను.

000

 (నవంబరు, 21, 2018)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “పొడుపు కథలు”

 1. ఇక్కడ ఎక్కువమంది చూస్తారు. చాలామందిక తెలీనివిషయం అని ఇకక్డ కూడా పెట్టేనండి. వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. ఇలాటివి తెలిసినవాళ్ళు చెప్పకపోతే రానున్న తరాలకి తెలీదు.

  మెచ్చుకోండి

 2. నా పేరును ప్రస్తావించడమే కాకుండా నేను రాసిన వివరణను యధాతథంగా చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాలతి గారు. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. మీరు చూపిన కన్నెగంటి అనసూయ గారి వెర్షన్ పొడుపుకథను, 1958లో కాబోలు నేను నా రెండవతరగతి తెలుగువాచకంలో చదువుకున్నాను.

  మెచ్చుకోండి

 4. మీ నవీన పొడుపుకద చాలా బాగుంది. అలాంటి దే ఇంకొకటి చూడండి.
  తాళముండు కాని కప్ప వేరు
  వేసిన వారు మాత్రమే తీయతగును.

  పాస్వర్డ్.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.