వంటింటి సంబరాలు – శనగపిండిలడ్ఢూ, తేలిగ్గా

పండుగలొస్తున్నాయి. తేలిగ్గా అయిపోయే శనగపిండి లడ్డూ విధానం చెప్తాను.

నేను ఈమధ్య toaster-oven చాలా ఎక్కువగా వాడుతున్నాను. ఈవిధంలో నెయ్యి, నూనె ఖర్చు తక్కువ, విడిగా బూందీ కొట్టంకనక.

లడ్డూ పద్ధతి

2 కప్పులు శనగపిండి

1/2 కప్పు నెయ్యి

3/4 కప్పు మెత్తని పంచదార

యాలకపొడి, జీడిపప్పు, పిస్తా పప్పు. నేను చిన్నముక్కలుగా చితక్కొట్టి పెట్టుకుంటాను. కొరికిన ప్రతిమారూ పంటికింద పప్పు పడితే నాకు ఇష్టం.

శనగపిండిలో 2, 4 టీస్పూనులు నెయ్యి వేసి చక్కగా కలిపి, ట్రేలో పరిచి, అవెనులో పెట్టాలి. 375 డిగ్రీలు. సుమారుగా 15-20 ని. అవెనునిబట్టి, మధ్యలో ఒకసారి చెంచాతో కలియబెట్టొచ్చు వేడి సమపాళంలో తగలడానికి.

పిండి గోధుమరంగు తిరిగి చక్కగా వేగి, కమ్మని వాసన వచ్చేక, బయటికి తీసి, కొంచెం చల్లారేక, పంచదార, మిగిలిన నెయ్యి, యాలకపొడి, పిస్తా పప్పు, జీడిపప్పు

కలిపి, ఉండలు కట్టేసుకోడమే. వేరే పాకాలూ, శోకాలూ లేవు.

బొమ్మలో లడ్డూలు అంతా శనగపిండి కాదు. ఒకటిన్నర కప్పు శనగపిండిలో అరకప్పు బాదంపిండి కలిపేను. నాకు బాదంపొడి కూడా ఇష్టం కనక.

మరోసంగతి.  మాకు శనగపిండి రెండు రకాలుగా దొరుకుతుంది. లడ్డూ బేసన్ అని కొంచెం బరకగా ఉండేది  ఒకటి. రెండోది superfine. దీంతో చేస్తే లడ్డూ నోట్లో కరిగిపోతూ ఎంతో బావుంటుంది తినడానికి.

అలాగే మైసూరుపాకుకి కూడా శనగపిండి మొదట అవనులో వేయించేసుకుని, పాకం పట్టి, మైసూరుపాకు చేసుకోడం తేలిక

అలాగే ఉప్మాకి గోధుమరవ కూడా ముందు అవెనులో వేగనించి పోపేస్తే అయిపోతుంది.

మరో ఉపయోగం వడలు, పకోడీలు, బజ్జీలలాటివి ఫ్రీజరులో పెట్టుకుని, కావలసినప్పుడు అవెనులో వేడిచేసుకు తినొచ్చు. కరకరలాడుతూ అప్పటికప్పుడు వేయించినరుచి.

ప్రధానంగా మనం పొయ్యిదగ్గర నిలబడి కంచి గరుడసేవ చేయక్కర్లేదు.

000

(నవంబరు 6, 2018)

 

 

(నవంబరు 6, 2018)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.