ముందొక టపా రాసేను సంకలించడం ఓ శ్రమ అని. దానికి ఇది అనుబంధం అనుకోవచ్చు. ప్రత్యేకంగా ఇప్పుడు మరి కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను. అక్కడ స్పష్టంగా లేనివి స్పష్టం చేయడం ఒకటి, అమెరికాకథలసంకలనం తయారీ అవుతోంది కనక. ఈ సందర్భంలో కొందరు మిత్రులు నన్ను అడిగేరు నాకథ పంపేనా, లేదా, పంపకపోతే ఎందుకు పంపలేదు అని. ఇక్కడ నాసమాధానం ఇస్తాను. ఇక్కడ నాఅనుభవాలు మీసానుభూతికోసం కాదు. ఇవి నా అనుభవాలే అయినా కొందరు ఇతరరచయితలకి కూడా వర్తిస్తాయని నానమ్మకం. నాఅనుభవాలు సత్యమేనని నాకు తెలుసు కనక అవి ఉదాహరణగా ఇచ్చేను. అంటే నేనేదో లేనివి ఊహించి, కల్పించి ఇవ్వడం లేదని చెప్పడానికి.
సంకలనం సమకూర్చడం శ్రమతో కూడిన పని. అందుకు సందేహం లేదు. సంకలనం ఏదో ఒక ధ్యేయంతో చేసినప్పుడే రాణకొస్తాయని వెనకటి టపాలో వివరించేను.
మామూలుగా, సంకలనకర్తలు తాము సంకలనం వేస్తున్నట్టు ఓ ప్రకటన ఇస్తారు. వారిదృష్టిలో కాస్త ప్రతిష్ఠగలవారు అనుకుంటే వారికి విడిగా మరో ఉత్తరం కూడా పంపుతారు. లేదా తెలిసినవారిద్వారా సందేశం అందజేస్తారు. అప్పటికీ రచయిత కథ పంపకపోతే ఏమి చేయాలి? నేనయితే, ఆరచయితకి సమ్మతం కాదు అని ఊరుకుంటాను.
కానీ ఇప్పుడు అలా కాదు. “మేం అడిగేం. రచయిత స్పష్టంగా ఇవ్వను అని చెప్పలేదు కనక సమ్మతమే అనుకుని వారికథ చేర్చకుంటున్నాం,” అంటున్నారు. ఇది డొంకతిరుగుడు వ్యవహారం.
మరో పద్ధతి రచయిత ఎక్కడున్నారో తెలీలేదు, అంచేత వేసుకున్నాం అని చెప్తారు. నిజానికి ఇది కొన్ని సందర్భాలలో మాత్రమే సమర్థనీయం. కీర్తిశేషులయిన రచయితలు, ఏమూలో అజ్ఞాతంగా కాలం గడుపుతున్నవారు దొరకకపోవచ్చు. నేను అనువాదాలు చేసినప్పడు ఇలా జరిగింది 2,3 రచయిత్రులవిషయంలో. కానీ తేలికగా దొరకగలరచయితలవిషయంలో ఇలా అనడం న్యాయం కాదు. “స్త్రీవాదకథలు” సంకలనంలో నాకథ నన్నడక్కుండా వేసుకున్నారని నేను నామరో టపాలో ప్రస్తావించినప్పుడు ఆ సంకలనకర్త పైన చెప్పినకారణమే చెప్పేరు. కానీ కె. రామలక్ష్మిగారు కూడా తనకథ కూడా ఆవిడని అడక్కుండానే వేసుకున్నారని నాతో అన్నారు. నేనూ, రామలక్ష్మిగారూ అంత అజ్ఞాతవాసంలో లేము కదా. అది కేవలమూ నిర్లక్ష్యంతో తమకి తాము చేసుకున్న నిర్ణయమే.
దీపతోరణాలు వందకథలు సంకలనంలో నాకథ కూడా నన్నడిగి వేసుకున్నది కాదు. ఆ సంకలనకర్తలకి నాతో బాగానే పరిచయం ఉంది. నన్ను సంప్రదించేమార్గం వారికి తెలుసు. మాఅన్నయ్యని ఎందుకు అడిగేరోనాకు తెలీదు. అంతకన్నా ఘోరం నాగురించిరాస్తూ “రాద్ధాంతం లాటి కథలు ఎన్నో రాసేరు” అని రాసేరు. రాద్ధాంతం తెలుగుస్వతంత్రలో అరపేజీ గల్పిక. ఈనాటి కార్డుకథలాటిది. నాకథలకి అది ఉదాహరణగా ఇవ్వడం ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఇది కూడా నన్ను సంప్రదించకపోవడంవల్ల కలిగిన అనర్థమే.
పోతే, తప్పులమాట. తప్పులు సర్వసాధారణమే. ఈరోజుల్లో చాలాపుస్తకాల్లో అక్షరదోషాలు ఉంటూనే ఉన్నాయి. సమీక్షకులు అక్షరదోషాలు చూసుకుంటే బాగుండు అని ఓముక్క రాయడం కూడా సాధారణం అయిపోయింది. నేను ఎంత చూసుకున్నా తప్పులు వస్తూనే ఉన్నాయి కనక మరొకరిని తప్పు పట్టడం తప్పే. అయినా చెప్పక తప్పదు. కథపేరూ, నాపేరూ కూడా తప్పులే అయితే నాకు కష్టంగానే ఉంటుంది. వంగూరి వారి సంపుటాలలో “డాలరుకో గుప్పెడు రూకలు” పేరు డాలరుకో గుప్పెడు నూకలు అని మార్చేసేరు. ఆకథలో నూకల ప్రసక్తి లేదు. ఆ మార్పుకి అర్థం లేదు. పొరపాటు జరిగిందంతే. మరో సంపుటంలో నాకథ శీర్షికకింద నాపేరు నిడదవోలు మాధవి అని ఉంది! సంకలనం వేసేయాలన్న తహతహే తప్ప శ్రద్ధ లేదనే అనుకోవాలి ఇలాటివి చూసినప్పుడు.
జాలపత్రికలలో పొరపాటు దిద్దడానికి ఆస్కారం ఉంది కానీ అచ్చయినపుస్తకాలకి ఆ వసతిలేదు. అంచేత అచ్చుపుస్తకాలలో ఇలాటివి మరింత శ్రద్ధగా చూసుకోవాలి కదా. అలాగే నాకథలసంకలనంలో ఒకకథ సగమే అచ్చవడం కూడాను. ఇలాటివాటివల్ల రచయితకి నష్టమే కదా. ఎందుకీ సంకలనాలకి ఇవ్వడం అనవసరం అనిపించదా ఎవరికైనా? ఏమో మరి. కొందరికి ఫరవాలేదేమో. నాకు మాత్రం ఇష్టం లేదు.
ఆఖరిమాటగా, నేను అమెరికాకథలసంకలనానికి ఎందుకు ఇవ్వదలుచుకోలేదో చెప్తాను. ఈఅంశం మాత్రం నాకు మాత్రమే పరిమితం. మిగతారచయితలు పట్టించుకోనవసరం లేదు. నాకథ లేనంత మాత్రాన ఆసంకలనానికి ఏమీ తక్కువ కాదనే నేను దృఢంగా నమ్ముతున్నాను. ఇలా ఎందుకనుకుంటున్నానంటే, ఈసాహిత్యవేత్తలు, సాహిత్యాభిమానులు, సాహిత్యసేవా దురంధరులు నాకథలగురించి తమ సభల్లోనూ, ఉపన్యాసాల్లోనూ, వ్యాసాల్లోనూ ప్రస్తావించిన జాడల్లేవు ఎక్కడా. ఒకరిద్దరికి సంకలనాలు వేసినప్పుడు మాత్రం నేను గుర్తొస్తాను. ఒక్కమాటలో చెప్పాలంటే చెప్పుకోదగ్గ కథలయితే అలాటి చర్చలో ప్రస్తావనలో తప్పక జరిగిఉండేవి. నాకథలకి అంత ప్రాశస్త్యం లేనప్పుడు ఓ సంకలనంలో చేరిస్తే ఎంత, చేర్చకపోతే ఎంత అని నేను అనుకుంటున్నాను. అసలు ఈసంకలనకర్తలు నాకథలు చదివేరని కూడా అనుకోను.
ఒక్కమాటలో సంకలనకర్తల ఇలాటి ఆచారాలను నిరసనగా నేను సంకలనాలకు నాకథలు ఇవ్వడం మానుకున్నాను. నాతో చెప్పకుండా ఎవరైనా నాకథలు ప్రచురించుకుంటే ఆదోషం వారిిదే.
000
ప్రస్తుతం, నేను సభలూ, సంకలనాలమాట వదిలేసి, హాయిగా చదువుకుని ఆనందిస్తున్న పాఠకులకి మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈవ్యాసం ముగిస్తున్నాను.
అభిమానులందరికీ నమోనమః
000
(డిసెంబరు 22, 2018)
ఈ సంకలనాలకి అమ్మకాలు ఉంటాయనుకోను. అచ్చు వేసేక, ఆవిష్కరణసభలూ, అట్టహాసం, పత్రికలలో ప్రచారం, వాటిమీద మెచ్చుకుంటూ సమీక్షలూ, -అదొక షో. భవిష్యత్తులో ఈ యుగాన్ని సాహిత్యచరిత్రలో ఎలా వర్ణిస్తారో …
మెచ్చుకోండిమెచ్చుకున్నవారు 1 వ్యక్తి
సంకలనానికి రచయిత్రి అనుమతి తీసుకోలేదంటే రాయల్టీ కూడా ఇవ్వనట్లే కదా ? ఇది మరీ అన్యాయం !
మెచ్చుకోండిమెచ్చుకోండి
మీరు కూడా నిర్మొహమాటంగా మీఅభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు, అవును పాఠకులఅభిప్రాయాలు పేరుకి అడుగుతారు కానీ నిర్ణయాలన్నీ ఆ సాహిత్యోపాసకుల ఇష్టాయిష్టాలమీదే సాగుతాయి. ప్రత్యేకంగా ఒకరు నన్ను అడగడంతో పబ్లిగ్గా చెప్తే మిగతావారికి కూడా తెలుస్తుందని ఇక్కడ పోస్టు చేసేను. నిజానికి జరిగేదేమీ లేదు. ఇదంతా అరణ్యరోదనమే. కులతత్వాలని విమర్శించే ఘనులు కూడా ఈ సాహితీసంఘాలలోని గుంపుతత్వాన్ని ప్రతిఘటించినట్టు కనపడడంలేదు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
సంకలనాల్లో జరుగుతున్న విషయాలను అందులోని అవకతవకలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అసలు ఈ లోకం మొత్తం పైపై మొహమాటాలతో కూడిన మాటలతో నిండి ఉండి అసలు లోపాలేమిటో చెప్పేవాళ్ళే లేరు. అదీ ఈ తథాకథిత అభ్యుదయవాదులున్న సంఘాలనైతే ఎవరూ సద్విమర్శ చేయడానికి కూడా భయపడుతుండడం (లేదా నాకలా అనిపించడం) విడ్డూరంగా ఉంటుంది. మీరు కుండబద్దలు కొట్టినట్టు చెప్పినందుకు అభినందిస్తున్నాను. ఈ సంకలనాలకు ఎన్నుకొనే విషయం (పేరు) కు సంబంధించి నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. కానీ ఇక్కడ(రచనాలోకంలో) పుస్తకాలు ముద్రణ పొందిన రచయితల, ముద్రించేవారి మాటలకు తప్ప పాఠకులుగా మా అభిప్రాయాలు పట్టించుకొనే వారెక్కడున్నారు? పోపోవమ్మా అన్నట్టే ఉంటుంది వీరి ధోరణి. ఏం చేస్తాం?
మెచ్చుకోండిమెచ్చుకున్నవారు 1 వ్యక్తి
మీ అభిప్రాయాలను, మీకు కల్గిన అనుభవాలను చక్కగా తెలియజేసారు. నిజమే మిమ్మలను సంప్రదించడం సులువే కదా ! సగం కథలు , రచయిత పేరు తప్పుగా వేయడం యివన్నీ నిర్లక్ష్యానికి వుదాహరణాలు. ఒకసారి నా కథ తీసుకుని రచయిత పేరు తప్పుగా వేసారు. సంకలనాలలో రచనలు రానంత మాత్రాన రచనలు కాకుండా పోవు. మీ నిర్ణయం మీది. గౌరవిస్తున్నాను మాలతి గారూ .
మెచ్చుకోండిమెచ్చుకోండి