రాద్ధాంతం (గల్పిక)

సంకలనాలసరదా హతం టపాలో ఉదహరించిన రాద్దాంతం గల్పిక ఇదుగో ఇక్కడ పౌఠకుసౌకర్యార్థం ఇస్తున్నాను.

000

రాద్ధాంతం!

“అమ్మగారు నెయ్యిమ్మన్నారండీ,” అంటూ ఓ చిన్నగిన్నె చేత్తో పుచ్చుకుని వచ్చేడు ఓ కుర్రాడు.

“ఎవరూ?” అన్నాన్నేను ఎవరో అర్థం కాక.

“చుక్కమ్మగారు.”

“ఎవరూ?”

“ఆయింట్లో ఉన్నవారూ ..” అంటూ మాయింటి పక్కింటికి ఎదురింటికి ఎడంపక్కిల్లు చూపించేడు సాధారణంగా.

“మిస్ రైనాసిరెస్” అనడమే కానీ పేరు ఇన్నాళ్లూ తెలీదు కానీ ఆ యింట్లో ఉన్నారని తెలుసు.

“వెనకనించి ఏకంగా స్వయంపాకం పంపిస్తాంలే వెళ్ళు,” అన్నాను విసుగ్గా.

వాడు వెళ్ళిపోయేడు.

అమ్మ వచ్చింది “ఎవరే?” అంటూ.

“ఏముంది. మేడమ్ ఫులిస్టాపుగారికి నెయ్యి బదులు కావాలిట.”

“మేడమ్ ఫులిస్టాపెవరూ?”

“ఆవిడ లేదమా …” అంటూ ఆ ఉన్నావిడ గుర్తులు చెప్పినా అమ్మకి అర్థం కాలేదు. ఆఖరికి “రోజు చేబదులుకొచ్చే ఆవిడ,” అన్నాను.

కూర మాడిపోతోందంటూ అమ్మ వెళ్ళిపోబట్టి సరిపోయింది.

అసలు నాకు ఇలాటివంటే ఒళ్ళు మంట. అవసరాలైతే రాకుండా ఉండవు కానీ రోజుకి పదిమాట్లు ఏదో ఒకటి కావాలని వస్తుంటే ఎవరు భరించగలరూ?

000

“నీదగ్గర విడి రూపాయలు నాలుగున్నాయా?” అంది అమ్మ పదిరూపాయలనోటు చేత్తో పుచ్చుకుని,

“విడి నాలుగు రూపాయలూ లేవు, నాలుగు రూపాయలనోటూ లేదు. ఎందుకు?” అన్నాను.

“పప్పులు వీధిలోకొస్తే కొన్నానులే. చుక్కమ్మగారు నెల్లాళ్ళకిందట ఐదు రూపాయలు పట్టుకెళ్ళేరు. అడిగితే?”

గుమ్మంలోకెళ్ళేసరికి ఎదురుగుండా ఈజీఛైరులో చుక్కమ్మ కనిపించింది.

“ఏవమ్మా?” అంది. ఎందుకొచ్చేవ్ అన్నట్టుంది ఆమాట.

“మాఅమ్మ ఏవో పప్పులు కొందిట” అన్నాను మాట కలపడానికి.

“ఏం పప్పులు?”

బండి పట్టాలు తప్పేట్టుంది. “ఏమోనండీ,” అన్నా.

ఆవిడ వదిలిపెట్టకుండా, “ఎలా కొన్నారో? అంది.

“ఏమోనండీ. మీరేమో ఎప్పుడో అయిదు రూపాయలు పట్టుకెళ్ళేరుట. అడిగి తెమ్మంది,” అన్నాను అక్కడికి కట్ చేసే ఉద్దేశంతో.

“ఏమిటీ? మేం … మీకు … ఐదు రూపాయలు ఇవ్వాలా? అంది ఆవిడ దీర్ఘాలు తీస్తూ.

నేను కొంచెం భయపడ్డాను ఒకవేళ అమ్మ గానీ మర్చిపోయిందేమోనని. నేను మాటాడలేదు.

“తెస్తే వెంటనే ఇచ్చేసేవాళ్ళం. అసలు మాకేం అవసరం? ఒకవేళ ఆ దొంగవెధవ తెచ్చేడు కాబోలు,” అంటూ, నేనేం సమాధానం చెప్పకముందే, “రాముడూ!” అంటూ ఆవిడ కేక వేయడం, సదరు రాముడు హాజరు కావడం కూడా జరిగింది.

“వీళ్ళింట్లో అడిగి అయిదురూపాయలు తెచ్చేవా?” అంది ఆవిడ కఠినస్వరంతో.

వాడు నావేపు ఓమాటు, ఆవిడవేపు ఓమాటు వంతులప్రకారం చూడడం మొదలుపెట్టేడు.

“అలా చూస్తావేం? నిజం చెప్పు,” అంటూ ఆవిడ ఒక్క లెంపకాయ కొట్టింది.

దాంతో వాడు, “నాకేం తెలీదు బాబోయ్,” అంటూ పంచమస్థాయిలో ఆరున్నొక్క రాగం కర్ణకఠోరంగా ఆలపించడం ప్రారంభించేడు.

నేనలా నిల్చుండిపోయేను తెల్లబోతూ.

ఇంతలోచుక్కమ్మగారి తమ్ముడొచ్చేడు. అతనికి సాబినయంగా సకలం వర్ణించేసరికి అతను కళ్ళెర్ర జేసి, “ఏరా,” అన్నాడు.

వాడు ఏడుస్తూనే, “నాకేం తెలీదండీ,” అన్నాడు.

అతను నిజం చెప్పమంటూ వాణ్ణి చావగొట్టేడు, వాడు ఎంత తెలీదని మొత్తుకున్నా వినక.

మధ్యమధ్యలో చుక్కమ్మగారు “దెబ్బలు తినకు, అబద్ధం ఆడకు. అసలు నాకు అప్పు తీసుకోడమంటే పొడుచుకు చచ్చినట్టుంటుంది,” అంటూ ఎవరితో మాటాడుతోందో తెలీకుండా వాగుతోంది.

నేనలా చూస్తూ నిల్చున్నాను.

ఆఖరికి వాడిచేత తీసుకున్నాను అనిపించేరు.

నేను మాటాడకుండా ఇంటికొచ్చి అమ్మతో అంతా చెప్పేను.

అంతా విని అమ్మ, “అదేమిటి, చుక్కమ్మగారే నాదగ్గిర తీసుకుందావేళ,” అంది.

నేను నిర్ఘాంతపోయేను.

“ఐతే మరి వాడెందుకు తెచ్చి స్వంతానికి వాడుకున్నాను అని ఒప్పుకున్నాడు?” అన్నా అప్రయత్నంగా.

000

(తెలుగు స్వతంత్ర, ఆగస్టు 6, 1954)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.