వెనకటిరోజుల్లో పల్లెల్లో “శ్రీ”, “చుక్క” పదాలకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉండేది. నాకు కొంచెం తెలుసు కానీ శతావధాని వేలూరి శివరామకృష్యమశాస్త్రిగారి ఊరిబడి కథ చదువుతుంటే మరి కొంత ఎక్కువ తెలిసింది.
క్లాసుకి మొట్టమొదట వచ్చిన అబ్బాయినో అమ్మాయినో శ్రీ అనీ, రెండొవారికి చుక్క అనీ పంతులుగారు గౌరవిస్తారు. ఆ బిరుదులు పొందినపిల్లలకి ఆపూట ఒరిగేదేమిటో ఈకథ చదివితే తెలుస్తుంది.
ఈవిషయంలో పాఠకులకు నా హెచ్చరిక ఒకటుంది. ఇది 1935నాటి కథ. ఈనాటి భావజాలం దృష్టిలో పెట్టుకుని ఈకథ చదవవద్దు. ఆనాడు అలా ఉండేది అని తెలుసుకోడానికి మాత్రమే. అది కూడా కథ అన్న దృష్టితోనే. అంటే కథనానికి సహజమైన అతిశయోక్తులు ఉంటాయి. అది శైలి.
ఈకథలో ఒక అంశం హాస్యం. హాస్యరసపోషణలో ఒక అంశం ఉత్ప్రేక్ష లేక అతిశయోక్తి. అది మనం గుర్తు పెట్టుకోవాలి. మామూలుగా హాస్యం అంటే మనసులో ఆనందించడమే కానీ హాహాహా అంటూ గలగల నవ్వడం నాకు అలవాటు లేదు. ఈకథ చదువుతుంటే నాకు చాలా నవ్వొచ్చింది.
అలాగే వ్యంగ్యము కూడా శైలిలో భాగం. క్లాసుప్రారంభంలో సరస్వతీప్రార్థనకి కారణం వివరించడంలో సొగసు చూడండి. రాజభక్తికీర్తన కొంతకాలం ప్రాచుర్యంలో ఉన్న వందేమాతరం అనుకుంటాను. గురుభక్తి కీర్తనలు గ్రంథములలోనూ, బెత్తములలోనూ మాత్రమే కలవుట. అంచేత సరస్వతిని ధ్యానించేరుట. అలాగే చుట్ట కాల్చడంలో మడిచుట్ట, మైలచుట్ట, పంతులుగారు కళ్లజోడు ధరించేవిధానం చదివి ఆనందించాలే గానీ ఇంతకంటె చెప్పడం బాగుండదు “నిఘంటువులో లేనిపదాలు” వాడకంతీరు ముచ్చటగా ఉంది.
ఇవన్నీ శైలి–కథ చెప్పేవిదానం-కి సంబందించినవి. “ముక్కద్దములు తీసి కనులకు కళ్ళెము” తగుల్చుకొనుట, “పొయ్యిలోని విలువలేని పదార్థముతో ముఖమునకు సత్కారము చేసుకొనుట”. విలువలేని పదార్థము కచిక అని తోచడానికి రెండ క్షణాలు పడుతుంది. ఇలాటి చమత్కారాలు పుష్కలంగా ఉన్న కథ ఇది.
ఒకటి రెండు చో్ట్ల కనిపించినో సంస్కృత వాక్యాలు చూస్తే ఆనాటి పాఠకులవిద్య స్థాయి తెలుస్తుంది. ఆవాక్యాలకి నాకు అర్థం తెలీదు. కానీ ఆరోజుల్లో పాఠకులకి తెలిసే ఉండాలి కనకనే వాటికి మళ్ళీ విడిగా అర్థాలు ఇవ్వలేదు.
సంస్కృత సమాసాలు వదిలేసినా, ఏవిషయం ఎలా చెప్పేరేు అన్న అంశంమీద దృష్టి పెట్టి చదివితే, ఒక కథ పాఠకులని ఎలా ఆకట్టుకుంటుందో తెలుస్తుంది. కథలెలా రాస్తారు అన్న ప్రశ్నకి ఇది సమాధానం. వాడిని బూతులు తిట్టేడనో, ఆబూతులన్నీ ఉన్నవున్నట్టు రాయడమో చేయడానికీ, అదే షయాన్ని “నిఘంటువులో లేని పదాలు” అని అన్యాపదేశంగా చెప్పడంలోనూ తేడా అది. ఉన్నదున్నట్టు, విన్నది విన్నట్టు రాయడానికి మేధ అక్కర్లేదు. ఫొటోగ్రాఫీలాటిది అంటారు కానీ నిజానికి ఫొటోగ్రాఫికీ కొన్ని మళుకువలు తెలియాలి.
శివరామశాస్త్రిగారిశైలి పాఠకులమెదడుకి పని పెడుతుంది. పాఠకుడిని రచనలో భాగస్వామిని చేయడం అది.
ఈకథకి వేసిన బొమ్మలు బాగున్నాయి. కనీసం వాటిని చూడడానికైనా ఈ కథ తెరిచి చూడండి.
ఊరిబడి కథ కథానిలయంలో చూడగలరు. లింకు http://kathanilayam.com/story/pdf/7
ఆర్కైవ్.ఆర్గ్ లో కథాషట్కము సంకలనంలో కూడా ఉంది.
000
(జనవరి 7, 2019)