ఈరోజు ఫేస్బుక్కులో రెండు వరసగా ఒక పోస్టూ, ఒక మెయిలూ- ఒకే అంశానికి సంబంధించినవి నాకు కనిపించడంతో సంకలనాలమీద నేను రాసిన టపా ఇది. ఇది నాకష్టాలుగా కాక సంకలనాలచరిత్రలో ఒకలోపంగా గుర్తించి, దానికి పరిష్కారం ఆలోచించాలని నాకోరిక. ముఖ్యంగా నాటపాదగ్గర వ్యాఖ్యలు చూసేక, నేనే కాదు ఇంకా కొందరి అనుభవాలు కూడా ఇలాగే ఉన్నాయని తెలిసింది.
నేను ఇంతకుముందు తెలుగుసాహిత్య చరిత్ర అన్న వ్యాసంలో సంకలనాలమీద వివరంగా చర్చించేను. లింకు ఇక్కడ.
సంకలనాలకి ఒక లక్ష్యం ఉండడం అవుసరమే. అయితే ఒకకాలంలో వచ్చే సంకలనాలన్నీ – స్త్రీవాదకథలు, దళితకథలు, రాజకీయకథలు అంటూ అవే అంశాలు గల మూసకథలతోనే నిండి ఉంటున్నాయి.
ముఖ్యంగా సామాజికస్పృహ అన్నది పరీక్షించి చూస్తే, ఈనాటి పండితులు చాలామంది లెక్కలోకి తీసుకోని కథలు చాలా కనిపిస్తాయి. వారిమూసలో పట్టని కథలని నిర్లక్ష్యం చేయడంవల్ల జరిగే ఒక నష్టం ఏమిటంటే, రానున్నతరాలకి ఈనాటిసమాజంగురించిన సమగ్రమైన అవగాహన ఏర్పడే అవకాశం లేకుండా పోతుంది.
నిజానికి ఇప్పుడు సాహిత్యం ఒక బజారుసరుకు అయిపోయింది కనక సాహిత్యసంస్కర్తలూ, పండితులే మహరాజపోషకులు. వారిఆదరణకోసం కవులు – మహరాజులను ఆశ్రయించినట్టు -వారిని ఆశ్రయించాలి.
అలా కాక, పుష్కరానికోమారు కొందరు కేవలం ఉత్తమకథలు, ముఖ్యంగా ఈ మహరాజపోషకుల దృష్టికి ఆననివి సంకలనంగా ప్రచురిస్తారు. నాకు తెలిసిన అలాటి ప్రచురణ 1995లో గుంటూరు జిల్లా రచయితలసంఘంవారు ప్రచురించిన విస్మృతకథ. నేను ఈసంకలనంలో చూసే, పి. సరళాదేవిగారి కథ ఎదురు చూసిన ముహూర్తం అనువాదం చేసి తూలిక.నెట్లో ప్రచురించేను.
విస్మృతకథ సంకలనం లాటి సంకలనాలు ఇతోధికంగా రావాలి.
శీలా సుభద్రాదేవిగారు నాకథలగురించి అడిగితే నాకు ఆవిషయం గుర్తొచ్చింది. సరళాదేవిగారి కథలు కూడా చాలామంది విమర్శకులదృష్టికి ఆనలేదు.
అందుచేత నేను కోరేది విజ్ఞత గల పాఠకులు, రచయితలు ఈవిషయంలో కూడా కొంచెం శ్రద్ధ చూపండి అని.
పైన ఉదహరించిన విస్మృతకథ వివరాలు ఈరోజు తెలియడంచేత ఇక్కడ అది కూడా పంచుకుంటే బాగుండనిపించింది.
విస్మృతకథ ఆవిష్కణ సభ కథానిలయంలో కనిపించింది. వారికి కృతజ్ఞతలతో
000
(మార్చి 2, 2019)