ఏ మతము సమ్మతము?

ప్రపంచంలో మాటాడుకోడానికి నిత్యనూతనమైన విషయాలు రెండే – మతమూ, రాజకీయాలూ. మాటాడుకోడానికి ఏమీ లేకపోతే ఈరెంటిలో ఒకటి మొదలుపెడితే చాలు. తేలిగ్గా రోజు మొత్తం గడిచిపోతుంది. అలాగే రాయడానికేమీ లేకపోయినప్పుడు కూడా. ఇది ఆ రెండోవర్గంలో చేరుతుందనుకోండి.

మామూలుగా నేను మతవిషయంలో గోడమీద పిల్లివాటంగా ఉంటాను. అది వైయక్తికమనీ, ఎవరిష్టం వారిదీ అనే నాఅభిప్రాయం.

ఏదో చర్చ కనిపించినప్పుడల్లా ఏ మతం ఏమి చెప్తోందా చూదాం అనిపిస్తూ ఉంటుంది. అలాటప్పుడు నాకు దొరికిన పుస్తకం తీసి చూస్తాను.

అంటే ప్రముఖగ్రంథాలన్నీ క్షుణ్ణంగా చదివేసి, ఒక సిద్దాంతం చేయగలస్థాయికి వచ్చేసేనని కాదు కానీ ఇలా కొంతకాలం చదివేక, ఆలోచించేక నాకు అర్థమయింది ఇది.

నేను చూసిన పుస్తకాలు, భగవద్గీత, భాగవతం, విదురనీతి, పతంజలి యోగసూత్రాలు,  బౌద్దమతంగురించి రెండు పుస్తకాలు. ఆమీదట అంతో ఇంతో వినికిడిగా తెలుసుకున్న సంగతులు- మహమ్మదీయం, క్రైస్తవం, యూదులమతం. ఈవిషయంలో పుస్తకాలకన్నా పరిచయాలమూలంగా తెలుసుకున్నసంగతులే ఎక్కువ. ఈ పరిమితులలో ఏర్పడిన అభిప్రాయాలు ఇవి.

మతము అన్న పదం స్థూలంగా ఏదో ఒక సమూహానికి వర్తింపచేస్తారు. కానీ ఆ పదానికి అభిప్రాయము, ఇష్టము, కోరిక అన్న అర్థాలు కూడా ఉన్నాయి. ఇదే అసలు మతం అన్నపదానికి నాందియేమో అని నాకు అనిపించింది. అంటే ఒకే విధమైన ఇష్టమో అభిప్రాయమో గలవారందరూ ఒక మతము ఏర్పర్చుకున్నారేమో అని. ఇది ఒక కోణం.

మరోకోణం ఏమతానికైనా కేంద్రబిందువు మంచీ చెడూ విచక్షణ, యుక్తాయుక్తజ్ఞానం. ఏ కథా,పుస్తకం, సినిమా, సైన్సు ఫిక్షన్, ఏది తీసుకున్నా మంచిని సమర్థిస్తూనూ, చెడుని విమర్శిస్తూనూ ఆవిష్కరించడం జరుగుతోంది. ఎన్ని అద్బుతాలూ, సంభ్రమాలూ, పదగుంభనా, భావసౌందర్యం–ఏమేమి తొడుగులు తొడిగినా, వాటన్నిటిలోనూ కేంద్రబిందువై నిలిచిన, ముఖ్యమైన వస్తువు మంచీ-చెడూ విచక్షణే.

ఈ నేపథ్యంలో ఏమతం ఏమి చెప్తోంది అని స్థూలంగా అర్థం చేసుకోడనికి ప్రయత్నించేను. ఇది సమగ్రంగా అన్నిబృహద్గ్రంథాలు చదివి, సహేతుకంగా పరీక్షించి చూసి చేసుకున్న నిర్ణయం కాదని చెప్పేను కదా. ఇది కేవలం నాకు అప్పుడప్పుడూ కలుగుతూ వచ్చిన ఆలోచనలకి అక్షరరూపం మాత్రమే.

ఇప్పటికి నామనసులో నాటుకున్న కొన్ని అభిప్రాయాలు లేక ఆలోచనలు ఇలా ఉన్నాయి.

భగవద్గీత ఆత్మే ఆత్మని ఉద్ధరించుకోవాలి అని చెప్తుంది. బుద్ధులు ఆత్మ లేదన్నా, బుద్దగీతలో అదే పదాన్ని ఉపయోగించి అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది.

అలాగే, ప్రాణహింసని హైందవంలో కొన్ని సందర్భాలలో అంగీకరించేరు. బౌద్దమతం కూడా మొదట్లో హింసని గర్హించడం కనిపిస్తోంది. ఈక్రింది ధమ్మపదంలో “చంపింపక” అన్న పదం చూడండి.

ఇందులో మరోవిశేషం ఎవరు బ్రాహ్మణుడు అన్న ప్రశ్నకి సమాధానం. బుద్దుడు వర్ణాశ్రమధర్మాలను అంగీకరించలేదు. అందరూ మనుషులే అన్నాడు. మరి బ్రాహ్మణులు, శూద్రులు అంటూ వేరువేరుగా లేరు అంటే, మరి ఎవరు బ్రాహ్మణుడు అని ఎందుకు నిర్వచించడం అని నా సందేహం. ఇంకా కొన్ని పుస్తకాలు చదివితే తెలుస్తుందేమో. కానీ ఆవివరణ సద్వర్తనగురించి కనక నాకు నచ్చింది.   బుద్ధగీత అన్న పుస్తకంలో 28 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం అంతా ఈ విషయంమీదే. ఉత్తమ మానవుడు అన్న అర్థంలో మనిషికి ఉండవలసిన గుణాలు వర్ణించేరు. బ్రాహ్మణుడు అన్న పదం వాడినా ప్రధానంగా కావలసింది ఉత్తమగుణాలు అవుసరం. ఆమేరకు నాకు నచ్చేయి ఈ పదాలు.

అదే అర్థం ఇచ్చే మరో పదం, బ్రాహ్మణుడు పుట్టుకచేత కాడు, నడవడిచేతనే బ్రాహ్మణుడు అనిపించుకోగలడు అని.

ఈ పదాలు అన్న పదంగురించి ఒకమాట చెప్పాలి. నేను ధమ్మపథం అనుకున్నాను. పథం అంటే మార్గం కనక సరిపోతుంది అని. చర్ల గణపతిశాస్త్రి గారు అనువదించిన ధమ్మపదం (బుద్ధగీత)లో పదం అని వాడేరు. పదం అంటే పాడుకోడానికి అనువైనది అని వివరించేరు. ఏది సరైన పదమో నాకు తెలీదు. నేను చర్ల గణపతిశాస్త్రిగారు ధమ్మపదం పుస్తకంలోనుండే ఉదాహరణలు తీసుకున్నాను కనక, పదం అన్న పదమే వాడుతున్నాను.

పోతే హింసమాట తీసుకుంటే, “చంపింపక” అని అప్పట్లో ఉన్నా, తరవాతికాలంలో మార్పు వచ్చింది. తాము చంపరు కానీ ఇతరులు చంపిన జంతువుమాంసం తినవచ్చు అన్నారు.

అలాటిదే మరో అంశం భ్రూణహత్య. హిందువులు అంగీకరించరు. క్రైస్తవులు కూడా అంతేనట.

నేను అమెరికా వచ్చేక, ఈవిషయంలో జరుగుతున్న చర్చలూ, మారణహోమాలవల్ల తెలిసింది. ఆకారణంగానే, సాంప్రదాయకులైన క్రైస్తవులు (conservatives) abortionవిషయంలో హోరాహోరీ పోరాడుతున్నారు.

గతంలో ఏమైందో నాకు తెలీదు కానీ ప్రస్తుతం, ఈ “సంప్రదాయం” పేరున డాక్టర్లనీ, ఆస్పత్రులనీ బాంబులేసి చంపడం మాత్రం సమర్థనీయంగా కనిపించలేదు నాకు. ఒకరిని చంపకూడదని మరొకరిని చంపడం ఎలా సమర్థంచగలం? అది మాత్రం హింస కాకుండా పోతుందా? పైగా వారివాదం, “ఆ తల్లికి బిడ్డని పోషించగల స్తోమతు లేకపోతే, లోకంలో ఎంతోమంది పెంచుకోడానికి సిద్ధంగా ఉన్నారు” అన్నది. ఇది కూడా అర్థరహితమే నాదృష్టిలో. ఇప్పటికే పుట్టేసి, తిండి లేక మలమల మాడుతున్న పిల్లలు లక్షలసంఖ్యలో ఉన్నారు. అంత ప్రేమగలవారు ఆ కూటికి అల్లల్లాడుతున్న పసివాళ్ళని పెంచుకోవచ్చు. లేదా మరొకరకమైన వసతి ఆ పిల్లలందరికీ ఏర్పాటు చేయవచ్చు. వాళ్ళందర్నీ ఉద్ధరించేక, పుట్టనిపిల్లలవిషయం ఆలోచించండి అని నాసలహా. సరేలెండి బండి దారి తప్పింది.

నేననేది ఎవరో ఒకరు ఇలాటి వాదాలు మొదలుపెట్టి, మూలసిద్దాంతాలకు విపరీత వ్యాఖ్యానాలు కల్పించి, అనేకమంది ప్రజలని తప్పు దారులు తొక్కిస్తున్నారని.

అసత్యమాడరాదు అని హరిశ్చంద్రుడికథ చెప్పుకుని, తరవాత ఆపద్ధర్మం పేరున అవుసరాన్నిబట్టి అసత్యాలు, అర్థసత్యాలు పలకడంలో తప్పులేదని సమర్థించుకోడం జరుగుతోంది. నిజానికి ఏదో ఒక సమయంలో ఈ చిన్నచిన్న అసత్యాలు పలకనివారు ఈభువిలో లేరనే నానమ్మకం.

బౌద్దంలో విజ్ఞానం అన్నపదానికి ఇచ్చిన నిర్వచనం నిజానికి పునర్జన్మగురించి. తాత్వికపరమైన వివరణ. ఇది కూడా హిందూ తత్వానికి చేరువగానే ఉంది. పతంజలియోగసూత్రాలలో దీనికి సరి పోలగల సూత్రాలు కనిపిస్తాయి.

ఆ యోగసూత్రాలలోనే మరొక సూత్రం దృక్ దర్శనశక్త్యోరేకాత్మతేవా అస్మితా అన. దృష్టి వేరు దృశ్యము వేరు అని గ్రహించకపోవడమే అస్మిత (అజ్ఞానం) అంటారు. ఇంచుమించు అదే భావం ఈక్రింది ధమ్మపదంలో వ్యక్తమయింది.

ఇతరులసొమ్ము కోరరాదు, ఆర్తులకీ, ఆపదలో ఉన్నవారికీ చేయగల సహాయం చేయాలి లాటి సూక్తులు కూడా చాలా మతాల్లో కనిపిస్తున్నాయి.

ఈనాడు కులధర్మాలు ఆచరించడం చాలా తక్కువే. ఆచరించేవారు కూడా తాము ఉన్న ప్రదేశాలకీ, పరిస్థితులకీ, సమాజానికీ అనువైనవిధంగా మార్చుకోవలసివస్తోంది.

ఒకే ఇంట్లొ ఒకరికి ఒకరు ఇష్టదైవం అయితే మరొకరికి మరొకదేవరో దేవతో ఇష్టదైవం కావచ్చు. అధికంగా ఇప్పుడు స్వామి, బాబా, అమ్మ, టీవీగురువులవంటి కలియుగ దేవుళ్ళు కూడా హెచ్చుసంఖ్యలోనే ఉన్నారు.

ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, మతం అన్నది అనాదినించి ఒక్కలాగే లేదు. కాలగతిలో ఆయా కాలాల్లోని  పరిస్థితులనుబట్టీ, ఆచారవ్యవహారాలనుబట్టీ మతానికి సంబంధించిన నమ్మకాలు కూడా మార్పు చెందుతూ వస్తున్నాయి అని చెప్పడానికి.

మొదట్లో చెప్పుకున్నట్టు ఈ మతం అన్నది వైయక్తికం. ఎవరు ఏపద్ధతిలో అవలంబిస్తారు అన్నది కూడా వ్యక్తిగతమే. ఎవరి ఇష్టాయిష్టాలు వారివి. ఏ ఒక్కమతం తీసుకున్నా స్పష్టంగా కనిపిస్తున్నది ఒక్కొక్కరు వారి ఇష్టాయిష్టాలూ, సౌకర్యాలనుబట్టి వారికి తోచినట్టు నడుచుకుంటున్నారే గానీ సామూహికంగా ఒకమతానికి చెందినవారందరూ ఒక్కలాగే నడుచుకోడం లేదు.

ఈసరికి మీరు గ్రహించే ఉంటారు. ఏదో ఒకమతం అని కాక, నేను చదివినపుస్తకాలలోనూ, చూసిన మనుషులలోనూ కనిపిస్తున్న ఒకరకమైన నీతిని తీసుకుంటున్నాను. ఇతరులని బాధ పెట్టకుండా నామటుకు నాకు నచ్చినరీతిలో జీవనం సాగించడమే ఉత్తమము. అదే నామతము.

ఇదంతా చూసి, నన్ను మానవతావాది అనొచ్చు. కానీ నాకు అది సమ్మతం కాదు. ఎందుకంటే మానవతావాదులు దైవం ఉందని నమ్మరు. నేను నమ్ముతాను. ఏ పేరైనా పెట్టొచ్చు కానీ మానవాతీతశక్తి ఒకటి ఉంది, అది మనని నడిపిస్తోంది అనే నానమ్మకం.

మొదట్లో చెప్పినట్టు ఇది నాఅభిప్రాయం. ఇష్టం, కోరిక …

000

చర్ల గణపతి శాస్త్రి గారి ధమ్మపదము (బుద్ధగీత)లో గ్రంథకర్త బుద్ధగీతకీ హైందవధర్మానికీ సారూప్యం చక్కగా వివరించేరు. ఇది పాలీభాషనుండి అనువదించబడింది.

పిడియఫ్ పైలు  ధమ్మపథము చర్ల గణపతిశాస్త్రి

archive.org కి ధన్యవాదాలతో,

 

(మార్చి 3, 2019)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఏ మతము సమ్మతము?”

 1. లక్ష్మీ దేవిగారూ, చర్ల గణపతిశాస్త్రిగారి పుస్తకం upload చేసేను. వీలయితే చూడగలరు. ఇది పాలీభాషనుండి అనువదించేరు కనక పదం అన్నదే సరయినదని అనుకుంటున్నాను.

  మెచ్చుకోండి

 2. ధన్యవాదాలు లక్ష్మీదేవిగారూ. మీరు చెప్పినవి నిజమే. నేను ఇంకొంచెం స్పష్టంగా వివరంగా రాసి ఉండవచ్చు. మీరు ఆ కొరత తీర్చేరు. బౌద్ధమతంగురించి గణపతిశాస్త్రిగారు ఛేదించడం కాక, కాలానుగుణంగా మీరన్నట్టు సరళం చేసి, తిరుగరాసేరని వ్యాఖ్యానించేరు. రేపు ఆపుస్తకం చూసి వారిమాటలు ఇవ్వగలను.

  మెచ్చుకోండి

 3. మంచి వ్యాసమే. నాకు తోచినవి చెప్తాను.
  సంప్రదాయాలన్నీ మొదట సదుద్దేశ్యంతో మొదలయినా కాలక్రమేణా దాన్ని అర్థం చేసుకొని గుడ్డిగా పాటించడానికి అలవాటు పడతారు జనాలు. కొండొకచో అసలు ఆ సంప్రదాయం మూల లక్ష్యాన్నే దెబ్బతీస్తున్నామనీ, దానికి వ్యతిరేకంగా నడచుకుంటున్నామనీ గమనించరు, గమనించి చెప్పినవారిని అర్థమూ చేసుకోరు. ఇవి ఇక్కడి సమాజంలోనూ చాలా ఉన్నాయని చెప్పక తప్పదు. ఏమీ చేయలేము. మీరు సరైన అంశం చెప్పారు.
  ఇక ఆదర్శపాత్రలన్నీ కూడా ఎవరో ఒకరు అలా ఉండగలరనీ, అసాధ్యం కాదనీ చూపడానికే తప్ప అలా అందరూ ఉండితీరాలని, ఉండగలరని చెప్పడం ఆ యా కథల ఉద్దేశ్యం కాదని నా అనుకోలు. దీనికి ఆధారం ఏమిటంటే ఆయా కథలలోనే తద్విరుద్ధమైన స్వభావం గల పాత్రలూ ఉండడం, వాటికీ సమాన ప్రతిపత్తీ, ప్రసిద్ధీ కూడా ఉండడమే.
  మతమన్నది సమూహాలుగా గుర్తించబడుతున్నా ఎవరి శక్త్యానుసారమే వారు నడుచుకోగలరు. అదే మంచిదనే నా అభిప్రాయమూ.
  బౌద్ధ జైనాలు అప్పట్లో ఉన్న వైదిక మరియు పురాణ ప్రాచుర్యాన్ని లేదా ఒక పటిష్ఠమైన చట్రాన్ని ఛేదించడానికి పెద్ద ప్రయత్నం చేసి కొంతవరకూ సఫలమైనాయి. దీనికి వీరు ఎంచుకున్న మార్గం సరళమైన భాషలో చాలా గ్రంథాలు తమ భావజాలంతో తిరగవ్రాయడం. నేను బౌద్ధ గ్రంథాలు చదవలేదు. ఒక ఊహగా ఏం చెప్పగలనంటే పథం అనే సంస్కృత పదం వారు వాడి ఉండరని వ్యాఖ్యాతల ఉద్దేశ్యం కావచ్చును. ఏదేమైనా ధర్మపథం(ధర్మమార్గం) అనే అర్థమే దానికున్నా, దమ్మపదం (ధర్మపదానికి సరళీకృత ఉచ్చారణ, పదం-పలుకు/పాట) అనే అర్థమే ఉన్నా ఔచిత్యం చెడడం లేదు అన్నది ఇందులో విశేషం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.