కుక్క పారిపోయింది

అదొక చిన్న పల్లె. ఇది ఏదేశంలోనైనా కావచ్చు. పట్టుమని వంద ఇళ్ళు కూడా లేవు.

ఊరి శివార్ల అడవి. వెయ్యిమైళ్లు అనేక రకాల చెట్లు, పొదలూ, రాళ్లూ ముళ్లతో సన్నని కాలిబాటలూ ఉంటాయి. లేళ్ళూ, నెమళ్ళూ విచ్చలవిడిగా తిరుగుతూంటాయి.

ఊళ్ళోవాళ్ళు వినోదార్థం ఆ అడవిలో తిరుగుతూంటారు. అంతా శాంతియుతసహజీవనం.

ఒక ఇంట్లో ఒక స్త్రీ. సుమారు 30, 40 మధ్య వయసు. ఏదో పేరు పెట్టాలి కనక జేమీ అనుకుందాం.

జేమీ ఒకరోజు వినోదార్థం అడవిలో తిరుగుతుండగా ఒక కుక్కపిల్ల కనిపించింది. తెల్లగా, బొద్దుగా, ముద్దుగా ఉంది. జేమీ చేతిలో రొట్టెముక్కని గుచ్చి గుచ్చి చూస్తున్నట్టనిపించి, ఓ ముక్క చిదిపి దానినోటికి అందించింది.

కుక్కపిల్ల ఆత్రంగా ఆముక్క అందుకుని గబుక్కున మింగేసి మళ్లీ అలా చూస్తూ నిల్చుంది.

మూడునిముషాలలో ఇద్దరూ ప్రాణమిత్రులయిపోయేరు.

మరో అరగంటయేక, జేమీ ఆ కుక్కపిల్లకి హనీ అని పేరు కూడా పెట్టేసి, ఇంటికి తెచ్చేసుకుంది.

ఆపైన వరసగా డాక్టరుదగ్గరకి తీసుకెళ్ళి పరీక్షలన్నీ చేయించడం, కుక్కతిళ్ళూ, తోలుపటకాలూ, డిజైనరు కుర్తాలూ వగైరాలన్నీ కొనడం జరిగిపోయేయి.

ప్రతిరోజూ సాయంత్రం హనీని షికారు తీసుకెళ్తోంది. జేమీకి ఇప్పుడు బోలెడంత పని. పనంటే పని కాదు. ఆనందం, ఆహ్లాదం, వినోదం, హర్షాతిరేకం. ఉక్కిరిబిక్కిరి.

ఎవరెదురైనా, ఎవరు ఫోనులో పిలిచినా అవే కబుర్లు.

ఎవరైనా ఇంటికొస్తే, హనీ విలాసాలే సంభాషణంతా.

హనీ ఎంతో తెలివైనది. కూర్చోమంటే కూర్చుంటుంది. పరుగుపరుగున రమ్మంటే పరుగెత్తుతూ వచ్చేస్తుంది. గుమ్మంలో పడిఉన్న పేపరు తీసుకొస్తుంది.

ఇంకా ఆశ్చర్యం. రెండుకాళ్లమీద నడుస్తుంది.

అవన్నీ జేమీయే నేర్పింది. అలా నేర్పడానికి జేమీ ఎంతో శ్రమ పడింది.

చెప్పక్కర్లేదు కదా. కొందరితో మాటలు తగ్గిపోయేయి. రాకపోకలు అంతంత మాత్రమే అయిపోయేయి. ఎవరైనా ఎక్కడైనా కనిపించి పలకరిస్తే మొక్కుబడిగా ఓ రెండు నిముషాలు మాటాడినా, ఇంట్లో పనుందంటూ తప్పుకుపోవడం కూడా జరుగుతోంది.

కొత్త కేటలాగులే జేమీ చదువు. అంతర్జాలంలో కుక్కలకి సంబంధించిన వస్తువులు, విశేషాలు సేకరించడమే ఉద్యోగం. కుక్కరిసార్టులు, కుక్కపందేలు ఎక్కడెక్కడున్నాయో చూసుకోడమే కాలక్షేపం, పందేలలో హనీని పెట్టకపోయినా. నిజానికి కుక్కలను అలా పందేలలో పెట్టడం బాగులేదని కూడా అనుకుంది. ఆ పరుగుపందేలశిక్షణకోసం వాటిని హింసిస్తారు. ఆభాగం జేమీకి సమ్మతం కాదు. కానీ హనీకి సరదాగా ఉంటుందని దాన్ని తీసుకెళ్తుంది.

ఏడాది తిరిగేసరికి కుక్కపిల్ల పిల్లతనం వదిలేసి, శునకరాజము అయిపోయింది. చూపరులకు రవంత బెదురు కలిగించేలా కూడా ఉందనొచ్చు.

000

రోజులు అన్నీ ఎప్పుడూ ఒక్కలాగే సాగవు. ఏదో ఒక అవాంతరం లేకుండా ఏ జీవీ బతకలేదు.

మామూలుగా రోజూ ఇచ్చినట్టే హనీకి చిన్నగిన్నెలో తిండి పెట్టి, తను ఒక పళ్ళెంలో రెండు రొట్టెముక్కలు పెట్టుకుని మరో కుర్చీలో కూర్చుంది.

ఆక్షణంలో ఏమి జరిగిందో చెప్పలేం కానీ హనీ ఒక్క ఉదుటున జేమీమీదకి దూకి, ఆమెముఖం రక్కేసి, ముక్కు కొరికేసి, ఒళ్ళంతా గీరేయసాగింది శివాలెత్తిపోతూ.

జేమీ ఓహ్, నో నో, హనీ హనీ, అంటూ హృదయవిదారకంగా అరుస్తూ హనీ పట్టునుంచి తప్పించుకోడానికి గింజుకుంటోంది.

ఆ అరుపులు విని దారిని పోతున్న ఒకాయన తొంగి చూసేడు ఇంట్లోకి, ఏమైందేమైంది అంటూ.

హనీ మూడో వ్యక్తి కంటబడగానే జేమీని వదిలేసి, ఒక్క గెంతు గెంతి, అతనిపక్కనించి దూసుకుని బయటికి పారిపోయింది.

ఆ వచ్చినవాడు చటుక్కున తప్పుకుని కుక్కగారికి దారిచ్చేసి, అది వెళ్ళిపోయేక, లోపలికొచ్చి జేమీముఖం చూసి గజగజ వణికిపోయేడు. ఒక్క క్షణం కాళ్ళూ చేతులూ ఆడలేదు.

ఆమె పట్టలేని బాధతో గోలపెడుతోంది రెండుచేతులతో ముఖం కప్పుకుని. చేతిమీంచి రక్తం ధారలుగా చారికలు కట్టింది. ఆంబులెన్సు, ఆంబులెన్సు …

అంతవరకూ కొయ్యబారి నిలబడిపోయిన ఆగంతకుడు తెలివి తెచ్చుకుని 911కి ఫోను చేసేడు. మెడికల్ సిబ్బంది వచ్చి, జేమీకి తాత్కాలిక చికిత్స చేసి, ఆంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్ళేరు.

పోలీసులు వచ్చి వివరాలు కనుక్కున్నారు.

చెప్పడానికేమీ లేదు. రోజూలాగే హనీకి తిండి పెట్టింది. ఆ తిండిలో తకరారు లేదు. రోజూ పెడుతున్న కుక్కతిండే. పోలీసులు ఆ తిండి పరీక్షించడానికి లాబొరేటరీకి తీసుకెళ్ళేరు.

స్థానికరేడియో, “హనీ అను పేరుగల ఒక శునకము తప్పిపోయింది, ఎవరైనా చూస్తే వెంటనే పోలీసులకు తెలియజేయవలసినది. ఆ శునకము ప్రమాదకరమని గుర్తించవలెను,”అని ప్రకటన చేసింది.

ఆ ప్రమాదకరమైన కుక్క కనిపిస్తే, కాల్చివేయవచ్చునని కూడా అనుమతిచ్చేరు.

జేమీకి ఆవార్త అందింది. తన హనీ ప్రమాదకరము కాదని మొత్తుకుందావిడ. తనమీదకి “ఎందుకు దాడి చేసిందో చెప్పలేను కానీ ప్రమాదకరము కాదు. అంతటి మంచి కుక్క ఈ భూప్రపంచంలో మరెక్కడా ఉండద”ని నొక్కి చెప్పింది.

000

నాలుగు వారాలయింది. హనీజాడ లేదు. జేమీ హనీకోసం బెంగపడి చిక్కిపోతోంది. మిత్రులు మరో కుక్కని పెంచుకోమని సలహా ఇచ్చేరు కానీ జేమీకి మనసొప్పలేదు.

ఊళ్లో జనం వెయ్యికళ్ళు పెట్టుకు వెతుకుతున్నారు.

అక్కడ చూసేం.

ఇక్కడ చూసేం.

చూసేం కానీ హనీలా లేదు. మరెందుకు చెప్పడం అని అడక్కు. అదంతే. కొందరంతే.

చూసేం, పట్టుకోబోతే పారిపోయింది.

నాలుగు వీధులకవతల ఒక 15ఏళ్ల అబ్బాయి, పొరుగింటి పెంపుడుకుక్కని తుపాకీతో కాల్చేసేడు.

కుక్కయజమాని కోర్టులో దావా వేసేడు ఇది అన్యాయం అంటూ.

కాల్చినవాడితండ్రి, “తన కుమారుడికి 15 ఏళ్ళు, ముక్కుపచ్చలారని పసివాడు, ఆకుక్క హనీయే అనుకుని, భయపడి, తనని తాను రక్షించుకోడానికి తుపాకీతో కాల్చీసేడు, అంచేత వాడితప్పు కాదు” అని వాదించేడు.

జడ్జీగారు అవును పాపం, పసివాడు అని కేసు కొట్టిపారేసేరు.

అంత పసివాడిచేతికి తుపాకీ ఎందుకిచ్చేరు అని అడిగే నాథుడు లేడు. అమెరికాలో ఆత్మరక్షణ అలాటిది మరి.

000

మరో రెండువారాలు గడిచేయి. జేమీ కేసుసంగతి విని మరింత బాధ పడింది. తన హనీ పేరుమీద మరో కుక్క హతమయిపోవడం మరింత కష్టంగా ఉంది.

హనీని తాను మొదటిసారిగా కలుకున్నస్థలం దర్శించడానికి వెళ్ళింది జేమీ ఒకరోజు.

అక్కడ కూర్చుని చుట్టూ చూస్తుంటే వంద గజాలదూరంలో ఓ కుక్క ఒక్క క్షణం కనిపించి మాయమయింది.

తను ఉలిక్కిపడింది. లేచి అటు వెళ్ళాలనిపించింది కానీ కాళ్ళాడలేదు. శరీరంలో అణుమాత్రంగానైనా చలనం లేదు.

అదసలు హనీయేనా? లేక, తనకి మతి భ్రమించి అలా అనిపించిందా? హనీయే అయిఉండి, తనకి ఇక్కడే బాగుందని చెప్పడమా అది? తాను దానికి చేసిన సేవలన్నీ ఈ అడవిబతుకుముందు దిగతుడుపే అని చెప్తోందా?

000

{రచయిత అభిప్రాయం –

సృష్టిలో ఏ ప్రాణి గానీ ఎలాటి నిర్బంధాలూ ఇష్టపడదు. కోరుకోదు. ఆ నిర్బందాలు ప్రేమతో కూడుకున్నవైనా సరే, తిరుగుబాటు తప్పదు. స్వేచ్ఛ అంటే ఏ నిర్బంధాలూ లేకపోవడమే కదా. మనుషుల్ని ప్రేమతోనూ, జంతువుల్ని తాళ్లతోనూ, పక్షులని పంజరాలలోనూ బంధించేస్తాం కానీ వాటికి ఆ ప్రేమ సమ్మతమవునా కాదా అన్న ఆలోచన చేయం.

తల్లిప్రేమతో పిల్లలికి స్వేచ్ఛ ఇస్తే త్యాగం అని పేరు పెడతాం. జంతువులని ప్రేమతో పెంచడం జీవకారుణ్యం అంటాం. వాటికి అనేక రకాల తర్ఫీదులివ్వడం వినోదమే కాదు మనవిలువలు వాటికి అంటగట్టడం కూడా. కానీ సహజసిద్ధంగా ఆరుబయళ్లలోనూ, అడవిలోనూ తిరిగే జంతువులు మనం ఇచ్చే “సౌకర్యాలూ, సేవలూ, ఆభరణాలూ, తర్ఫీదులు” కోరుతున్నాయా, మురిపోతున్నాయా అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించేరా?

కుక్కకేమి తెలుసు కనకసింహాసనపువిలువ అంటాం. పంది పన్నీరు మెచ్చునా అంటాం. సాటిమనిషినే తీసుకో. వారంరోజులుగా తిండిలేనివాడికి, ఆకలితో మలమల మాడుతున్నవాడికి నవరత్నఖచితస్వర్ణకంకణం ఇస్తే ఏం చేస్తాడు? ఆహా, ఓహో, స్వరణకంకణం అంటూ చేతికి తగిలించుకు మురిసిపోతాడా? అది అమ్ముకు తిండి కొనుక్కోడా? ఏ వస్తువుకైనా విలువ ఆయా ప్రాణి పరిస్థితులనిబట్టి, అవుసరాలనిబట్టే, జీవనవిధానాన్ని బట్టే నిర్ణయమవుతుంది. స్వతస్సిద్ధంగా ఏ వస్తువుకీ విలువ లేదు.}

000

ఈ కథలోని ప్రధానసంఘటన – ముద్దుగా పెంచుకున్న కుక్క యజమానురాలిముఖం కొరికేయడం – వార్తల్లో చూసేను. ఛిన్నాభిన్నం అయిపోయిన ఆముఖం చూసేను. ఇది నిజంగా జరిగిన సంఘటన.

ఆతరవాత, National Geographic channelలో ఇలాటివి మరి కొన్ని సంఘటనలు చూపి, ఎందుకిలా జరుగుతుందన్న ప్రశ్నకి సమాధానం ఇంకా దొరకలేదనీ, పరిశోధనలు జరుగుతున్నాయనీ చెప్పేరు.

నామటుకు నేను అనుకోడం పైన చెప్పినమాటే – ఏ ప్రాణికైనా స్వేచ్ఛ ప్రాణపదం. మానవుడు ఎండా, వానా, చలీ, క్రూరమృగాలనుండి రక్షణకోసం గూడు కట్టుకున్నా, ఆనాలుగ్గోడలమధ్యే సదా ఉండలేడు. ఆరుబయట తిరిగినప్పుడే మనసుకి ఉపశమనం.

మరి అలాటప్పుడు, ఏ గోడలూ, కంచెలూ, ఉక్కుగొలుసులు లేకుండా హాయిగా విచ్చలవిడిగా బయట తిరిగే జంతువులకి ఇల్లు ఆనందదాయకం కాగలదా? కాదనే నేననుకుంటాను. ఏ కట్టడీ లేని అడివే వాటికి ఆనందం. హనీ అందుకే అక్కడికే వెళ్ళిపోయింది. వెళ్ళిపోడానికి అవుసరమైన మార్గం తీసుకుంది.

000

(మార్చి 13, 2019)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “కుక్క పారిపోయింది”

 1. స్వేచ్ఛ ప్రాముఖ్యత గురించి అనుభవించే వారికి తెలియదు దాని విలువ

  కధ మాత్రం ఏక బిగిన చదివాను అంత బావుంది

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. కొత్త కోణం కనపడింది ఈ కథలో. నిజమే, ఏ ప్రాణికైనా స్వేచ్ఛ చాలా ముఖ్యం. మనం మన ముచ్చట కోసం, తిండి ఎర వేసి, అదుపులో పెట్టడం అసహజం.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. ఉన్నాయి. తరుచూ జరగదు కనక కథ రాయకూడదని నేను అనుకోను. నిజానిక రచయితలు భిన్నపార్శ్వాలు చూపించాలనే అనుకుంటాను. Facebookలో జి, సుబ్బలక్ష్మిగారు అదే అభిప్రాయం వెలిబుచ్చేరు ఈకకథకి లింకు దగ్గర.
  NG కారణాలు ఇంకా తెలీవని చెప్పేరు కానీ అలాటి సంఘటనలు జరగలేదని చెప్పలేదు కదా.

  మెచ్చుకోండి

 4. హనీది విపరీతమైన ప్రవర్తన. ఏ నూటికో కోటికో ఒకటై ఉండవచ్చు. NatGEo కూడా ఇదమిద్దమైన కారణం ఇదని తేల్చి చెప్పలేకపోయింది. తనని పెంచుతున్నవారి పట్ల వాటికి విపరీతమైన ప్రేమ ఉండి, అపాయంలో ఉన్నప్పుడు, యజమాని కోసం ప్రాణాలు అర్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.