భమిడిపాటి కామేశ్వరరావుగారు. మన తెలుగు సంకలనం

1938లో భమిడిపాటి కామేశ్వరరావుగారు మన తెలుగు గురించి ఒక వ్యాసం రాసేరు. మూడేళ్ళతరవాత 1941లో రెండోభాష అని మరో వ్యాసం రాసేరు.

తొమ్మిది వ్యాసాలున్నాయి ఈసంకలనంలో. తెలుగుభాష పాఠశాలలోనూ, నిత్యవ్యవహారాలలోనూ కూడా ఎలా ఖూనీ అయిపోతోందో హాస్యరసం తొణికిస్తూ చిత్రించిన వాస్తవాలు. శాస్త్రం, కళ అన్న వ్యాసంలో ప్రధానాంశం శాస్త్రమూ కళా అయినా రచయిత ప్రస్తావించింది ఈరెండు అంశాలు నిర్వచనంగురించే. శాస్త్రం ఎప్పటికప్పుడు అసంపూర్ణమే, కళ సమగ్రమే అంటారు. నిజమే కదా. శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు సిద్ధాంతాలు చేసేస్తారు కానీ ఆ తరవాత ఇంకా ప్రయోగాలు కొనసాగిస్తూనే ఉంటారు. ఇవాళ నిజమయినది మరో దశాబ్దంతరవాత అబద్ధం కావచ్చు. కనీసం కొంత మార్పు ఉండొచ్చు.

మనం ఈ శాస్త్ర, కళలగురించి వివరించేటప్పుడు వాడే పదాలు ఎంత నేర్పుగా ప్రయోగిస్తామో వివరించడం చూస్తే రచయిత ప్రతిభ కనిపిస్తుంది. అందరికీ తెలిసినవిషయాలే అయినా చెప్పినప్పుడు ఎంతనేర్పుగా చెప్తాం అన్నది కామేశ్వరరావుగారిని చూసి నేర్చుకోవచ్చు.

కామేశ్వరరావుగారి వ్యాసాలు చదువుతున్నప్పుడు మనం. కేవలం ఆకాలంలోని కతలివి అని తెలుసుకోడానికే కాదు. అప్పట్నుంచి ఇప్పటికి మనం ఎంత దూరం వచ్చేం, మన సాధించిన ప్రగతి ఎంత అని తరిచి చూసుకోడానికి కూడా ఉపయోగపడుతుంది. సిగ్గు పడడానికి అని కూడా చేర్చవచ్చు కానీ అలా అంటే కొందరికి కోపాలు వస్తాయి కనక అనను.

అయితే ఈ వ్యాసాలకి మరో ప్రయోజనం – అతి సాధారణమైన విషయాలు ఎంతో హాస్యంగా చెప్పొచ్చు అని తెలుసుకోడానికి. చదువుతూ నవ్వుకోడానికి కూడా పనికొస్తాయి. నవ్వడం అయిపోయినతరవాత, ఆలోచించుకోడానికి ఉపయోగపడతాయి. హాస్యకతలు ఎలా రాయాలో తెలుసుకుంటాం కూడా.

మరో విషయం – మనదేశంలో ఈఇంగ్లీషు బోధనలు ఎలా ప్రారంభం అయేయన్నది. మన పెద్దలు మనకి స్వతంత్రం కావాలని ఘోరతపస్సులు చేసేక, బ్రిటిషువారు, “సరే, ఇస్తాం, మీరు మా పాలనాపద్ధతులు తెలుసుకోండి,” అని ఆంక్ష పెట్టేరు. అప్పుడే మనవాళ్ళు లండను వెళ్ళి ICS పరీక్షలు పాసయి, ఇండియాకి తిరిగొచ్చి అచ్చంగా బ్రిటిషుపద్దతిలో రాజ్యాంగం ఏర్పాట్లు చేసుకున్నారు కదా. ఆఊపులోనే మనవాళ్లే ఈ ఇంగ్లీషుబడులు మొదలు పెట్టేరు. ఇది 8 దశాబ్దాలక్రితం మాట. ఇది నాఅభిప్రాయం.

ఇప్పటికీ మన ఇంగ్లీషుబడులలో పరిస్థితులు ఏమైనా మారేయా?

నేను Bilingual Kid (తెలుగులో ఉభయభాషాప్రవీణ) కథ ప్రచురించేక, నాకు కొందరు ఉత్తరాలు రాసేరు, ఇంగ్లీషుబడులలో తెలుగు మాటాడితే పడే శిక్షలగురించి. ఇంతకంటే హేయం, అవమానం మరొకటి లేదు అనిపించింది నాకైతే. కామేశ్వరరావుగారు తమవ్యాసాలలో తెలిపిన అభిప్రాయం వేరు.

000

అది తెలుగుదేశంలో ఒక బడి. తెలుగువారు ప్రారంభించిన బడి.

తెలుగువారు ప్రారంభించిన ఇంగ్లీషుమీడియం బడి.

తెలుగుదేశంలో తెలుగువారు ప్రారంభించిన ఇంగ్లీషుమీడియం బడి.

ఆబడిలో తెలుగు రెండోభాష.

తెలుగుదేశంలో తెలుగువారు ప్రారంభించిన ఇంగ్లీషుమీడియంబడిలో తెలుగు రెండోభాషగా బోధించే తెలుగుపండితుడు ఆయన.

తెలుగుదేశపు ఇంగ్లీషుబర్లో తెలుగుమేష్టరుగా ఉన్న జీవుడిఅవస్థ ఎలా ఉంటుంది?

… పానకంలో పుడకకంటె అడ్డు …అని ప్రారంభించి పాతిక ఉపమానాలు ఇవ్వడం ఆనాటి రచయితలకే చెల్లు. లోకరీతిగురించి వారికి గల సూక్ష్మదృష్టికి తార్కాణం. ఇన్ని ఉపమానాలు ఇవ్వడంలో మరొక కిటుకుంది. పానకంలో పుడకవల్ల కష్టం పానకం తాగినవాడికి తెలుస్తుంది. మనువర్తిలోని విధవఆడబడుచు ఎంత హీనమో స్త్రీలకి తెలుస్తుంది. నిజం వాదించే ప్లీడరుపరిస్థితి ప్లీడర్లకి తెలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వేరు వేరు ఉపమానాలు వేరు వేరు పాఠకులకు బలంగా తగుల్తాయి. మొత్తంమీద ఎక్కువమంది పాఠకులను ఆకట్టుకుంటాయి. ఇది కూడా నాఅభిప్రాయం మాత్రమే. ఈవ్యాసాలు చదువుతూంటే తోచినమాట రాసేను.

నాకు ఇలాటి అనుభవం, తెలుగు రెండోభాషగా బోధించేవిషయంలో కొంత ఉంది. అంటే తెలుగుదేశం కాదు, తెలుగువారు ప్రారంభించిన ఇంగ్లీషుబడి కాదు కానీ తెలుగు రెండవభాషగా బోధించవలసినప్పుడు నాఅనుభవాలకీ కామేశ్వరరావుగారి అనుభవాలకీ కొంత సామ్యం ఉంది.

నేను తెలుగు రెండోభాషగా బోధించిన రోజులలో, లేదా బోధించడానికి ప్రయత్నించిన రోజులలో, ఒక విషయం గమనించేను. అమెరికన్ విద్యార్ధులు తమకేమీ తెలీదన్న స్పృహతో మొదలు పెడతారు. అంచేత వాళ్ళలో శ్రద్ధ ఎక్కువ. మనవాళ్ళ పిల్లలు తమకంతా తెలుసు అన్న గర్వంతో, కేవలం రెండోభాష చదివితీరాలన్న నిబంధన కడతేర్చుకోడానికి ఈక్లాసులో చేర్తారు కనక, శ్రద్ధ తక్కువ. షరా మామూలే. అందరూ ఇలాగే అనడం లేదు.

ప్రధానంగా స్వతస్సిద్దంగా ఎవరికి గానీ తనభాషమీద ఇష్టం ఉండాలి. మనభాష మనం వాడుకుంటేనే నిలుస్తుంది కానీ పైవారెవరో నెత్తిన రుద్దితే వచ్చేది కాదు. ఈసందర్భంలోనే కామేశ్వరరావుగారు వెలిబుచ్చిన మరో అభిప్రాయం చెప్తాను. గొప్ప తెలుగువాడు తెలుగు మాటాడడు అని చెప్పి, ఇంగ్లీషు కూడా సరిగా రాదు, “ఎంగిలీషు” మాటాడతారు అని వ్యాఖ్యానించేరు. అంతర్జాలంలో చాలాచోట్ల చూసేను తప్పులతడక ఇంగ్లీషులో రాతలు. ఇప్పుడు రాయబడుతున్న తెలుగు నాకెంత బాధ కలిగిస్తోందో ఇంగ్లీషువాడికి ఈ ఎంగిలీషు అంత బాద కలిగించవచ్చు అనిపించింది నాకు.

దశరూపకం అన్నవ్యాసంలో ఒకరు ఒక రచనమీద అభిప్రాయంకోసం మరొకరికి పంపినప్పుడు ఎలాటి వ్యాఖ్యానాలు వస్తోయో బహుసుందరంగా చిత్రించిన కథ. వారిద్దరిమధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు ఈనాటి కొన్ని వ్యాఖ్యాతలకి ఒరవడి అనుకోవచ్చు. చదివి తీరాలే కానీ చెప్పడానికి వీలులేదు.

ఈసంకనలంలో తొమ్మిది వ్యాసాలు, ఒకొకవ్యాసానికి ఏపేరు పెట్టినా, “మన” తెలుగు గురించే ఎందుకయేయంటే, స్థూలంగా భాష అంటే పదాలు, కొన్ని అక్షరాలసముదాయం కాదు. విషయం ఏదైనా మరొకరికి చెప్పాలంటే భాష కావాలి. పదాలు లేక మనిషికీ మనిషికీ మధ్య సంబంధం లేదు. సమాచారం అందదు.

రచయిత భమిడిపాటి కామేశ్వరరావుగారు ఈ చిన్ని పుస్తకంలో చెప్పినవిశేషాలు మనం మరోసారి తలుచుకుని దాదాపు 8 దశకాల తరవాత మానవసంబందాలలో ఎంత పురోభివద్ధి సాధించేమో చూసుకోవాలి.

000

భమిడిపాటి కామేశ్వరరావుగారి సంకలనానికి లింకు Mana-Telugu-bh-kemeswararao

(మార్చి 23, 2019)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.