కన్నడ కథానికలు సంకలనం. (సమీక్ష)

అనువాదాలంటే అట్టే ఆసక్తి లేకపోయినా ఈసంకలనం చదవాలనిపించడానికి మొదటికారణం అనువాదకురాలు శార్వాణిగారు. సుమారుగా నేను రచన ప్రారంభించేనాటికే పత్రికలలో ప్రముఖంగా కనిపించినవారు కావడం. రెండోకారణం పేస్బుక్కుద్వారా కొందరి మిత్రులపరిచయం, కన్నడసాహిత్యం గురించిన ప్రస్తావనలవల్ల కలిగిన కుతూహలం.

ఈ సంకలనంలో 25 కథలున్నాయి. సంకలనకర్త జి.హెచ్. నాయక్.  కన్నడ కథాసాహిత్యచరిత్రని సంక్షిప్తంగా ఆవిష్కరించే ప్రయత్నంగా ఈకథలఎంపిక చేసినట్టు తమ ప్రస్తావనలో చెప్పేరు.

ప్రస్తావనలో కూర్చిన విశేషాలు సమగ్రం. కన్నడంలో తొలికథారచయితతో మొదలుపెట్టి, ఈసంకనంలో చేర్చిన ఒకొక రచయితకృషిని సూక్ష్మంగా వివరించి ఆమీదట సంకలనంలో చేర్చినకథమీద వ్యాఖ్యానించేరు పండితస్థాయిలో. కన్నడకథగురించి బొత్తిగా తెలియని నాలాటివారికి చక్కని పరిచయం ఇది.  కొన్నిచోట్ల నాకు అర్థం చేసుకోడం కష్టం అయినమాట కూడా ఒప్పుకుతీరాలి.

కొందరు కథ చదివి తమదైన స్పందనలు ఏర్పరుచుకున్నాక కానీ సమీక్షలు చదవరు. నాకు మాత్రం సమీక్షలు చదవడం ఇష్టమే. వారేమంటున్నారో తెలుసుకుని, కథ చదువుతున్నప్పుడు నాఅనుభవం కూడా అదేనా, భిన్నమా అని తరిచి చూసుకుంటాను. ఈసంకలనంలో కొన్ని కథలవిషయంలో కథ చదివేక, మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రస్తావనలో అభిప్రాయాలు ఏమిటో చూసుకోవలసివచ్చింది. అందుకే ఆ ప్రస్తావన పండితస్థాయిలో ఉంది అన్నాను.

ఈకథల ఎంపికవిషయంలో నాయక్ నాలుగు ప్రమాణాలు నిర్ణయించుకున్నారు.

ఈనాలుగు అంశాలు సంకలనకర్తకి ముఖ్యమే అయినా పాఠకుడు ప్రదానంగా గుర్తు పెట్టుకోవలసింది రెండవ అంశం అంటే ప్రముఖకథ లేదా కథకులకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, అవి వైవిధ్యపూర్ణమైన ప్రయోగాలు, వైవిధ్యం కథావస్తువులో కన్నా సృజనాత్మకశక్తికి సంబంధించినది కావాలి అన్నవి.

ఇలా ఆలోచించినప్పుడు నాకు కలిగిన సందేహం – తప్పనిసరిగా ప్రశంసార్హమైన కథలు కొన్ని వదిలివేయడం జరుగుతుందా, అలా వదిలివేస్తే ఆ సాహిత్యచరిత్ర సంపూర్ణం కాగలదా అని. నిజానికి ఆ ప్రమాణం ఈనాడు వస్తున్న అనేక తెలుగు సంకలనాల్లో కూడా చూస్తున్నాం. సాంఘికస్పృహ లేక ప్రయోజనం పేరుతో కొన్ని మంచికథలను, కొందరు ఉత్తమకథకులను విస్మరించడం, నిజానికి నిర్లక్ష్యం చేయడం, జరుగుతోంది. ఇది సాహిత్యచరిత్రకి ఆరోగ్యకరం కాజాలదు.

ఈ కన్నడసంకలనంలోని రచయితలందరూ నాకు కొత్తే, ఎ.కె. రామానుజన్, మాస్తి వెంకటేశయ్యంగార్, యు.ఆర్. అనంతమూర్తి (సంస్కార వల్ల) పేర్లు మాత్రం విన్నాను. ప్రస్తావనలో వెంకటేశయ్యంగారిగురించి చెప్పిన వాక్యాలు గమనార్హం. ఆకథ చదివేక నాకు అదే భావన కలిగింది. ముఖ్యంగా నమ్మకాలని ప్రశ్నించే సందర్భంలో కూడా సాంప్రదాయకమైన విలువపరిధిలోనే పరిష్కారాలు ఎంచుకుంటారన్న వ్యాఖ్యానం.

రామానుజన్ మేధావి. SouthAsian Scholarగా సుప్రసిద్ధులు. ఆకారణంగానే వారికథ అణ్ణయ్య మానవశాస్త్రం ఈసంకలనంలో చేర్చేరేమో అనిపించింది. కొడవటిగంటి కుటుంబరావుకథలలాగే, ఇద్దరు మేధావులమధ్య చర్చలా ఉంది రామానుజన్ గారి కథ.

నాకు చాలా నచ్చినకథలు పెరుగు మంగమ్మ (మాస్తి వెంకటేశయ్యంగార్), క్లిప్ జాయింట్ (యు.ఆర్. అనంతమూర్తి), రాముడిసవారి సంతకెళ్లింది (కే. సదాశివ). అంటే మిగతా కథలు బాగులేవని కాదు. ఒకొకకథకి ఒకొక ప్రత్యేకలక్షణం ఉంది. పాఠకుల అభిరుచులనిబట్టి ఏకథ ఎవరికి నచ్చుతుంది అన్నది కదా.

కథాంశంలో అట్టే పట్టు లేని కథ 0-0=0. ఇది కొంతవరకూ జీవితాన్నిగురించిన ఆత్మవిచారం అనుకోవచ్చు. చేతన్యశ్రవంతి బాణీలో సాగుతుంది.

ఇలా జీవితం అంటే ఏమిటి, జీవితాన్ని అనుభవించడం అంటే ఏమిటి అన్న ప్రశ్నలు కేంద్రంగా సాగిన కథలు అణ్ణయ్య మానవశాస్త్రం (ఎ.కె. రామానుజన్), హ్యాంగోవర్ (జి.యన్. సదాశివ). రెంటిలోనూ చదివించేగుణం నాకంతగా బోధపడలేదు.

క్లిప్ జాయింట్ (యు.ఆర్. అనంతమూ్ర్తి) కథలో కూడా ఈకోణం అంతర్గతంగా ఉన్నా, ఎక్కువగా మనని ఆకట్టుకునే అంశం – విదేశం చేరగానే, స్వదేశంగురించి అంతకుపూర్వం లేని ఆలోచనలు ఎలా మొదలై, కొనసాగుతాయన్నది. రెండు దేశాలలో సంస్కృతిని పోల్చి చూసుకుంటూ, అక్కడ అలా కాదు, ఇక్కడ ఇలా కాదు అంటూ తర్కించుకోడం సర్వసాధారణం. ఒక మంచి ఉదాహరణ – ఇక్కడ అమ్మాయిలు పెళ్లివిషయంలో నా చెల్లెళ్లలా కాదు అంటూనే, తనచెల్లెళ్ళు తమకి తాము వరులని ఎంచుకుంటే మొదట అభ్యంతరం చెప్పేది తనే అని గ్రహించడం (పు. 192). అలా కేశవ పాత్ర ఆ రెండు కోణాలలో బలాబలాలు లోతుగా పరిశీలించి చూచుకోడంవల్ల ఈకథకి పుష్టి వచ్చింది. నిజానికి ఆ ఒక్క కథమీద ఒక వ్యాసం రాయెచ్చు.

ఈమధ్య వస్తున్న తెలుగుకథలు నేను చదవలేదు కానీ, విమర్శలు చూస్తుంటే  ఈకోణం ఆవిష్కరించడం జరగలేదనే అనిపిస్తోంది. అదేపనిగా ఈదేశాన్నో ఆదేశాన్నో పొగడడమో తెగడడమో తప్ప, ఒక అడుగు వెనక్కి వేసి, వస్తుపరంగా ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా, ఆత్మసాక్షిగా పరిశీలించి చూచుకోగలదృష్టి తక్కువే అనిపిస్తోంది.

రాముడిసవారి సంతకెళ్ళింది (కె. సదాశివ), అంబచూరు పోస్టాఫీసు (కె.పి. పూర్ణచంద్ర తేజస్వి)లాటి కథల్లో పల్లెవాతావరణం, అమాయికప్రజల ప్రవృత్తులు మనసుకు హత్తుకునేలా చిత్రితం అయేయి. నుడికారంలో తేడా కూడా కొంతవరకూ కనిపిస్తుంది.

నిరాశ్రయులు (రాఘవేంద్ర ఖాసనీస)లో కూడా భాష ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈకథలో బాంధవ్యానికి సంబంధించిన పదాలు వాడుకున్న తీరు ప్రత్యేకంగా కనిపిచింది నాకు. ఈ కథ చదవడం మొదలుపెట్టేక, కొంంత సమయం పట్టింది నాకు చెల్లి ఎవరికి చెల్లి, తమ్ముడు ఎవరికి తమ్ముడు లాటివి అర్థం చేసుకోడానికి. బహుశా నేను ఈపదాలు విని చాలాకాలం అవడంచేత కావచ్చు. ఈ బంధుత్వపదాలు సంజ్ఞావాచకాలుగా వాడడం మనభాషలకే పరిమితం. ఈకథలో

అలాటిదే మరొక ప్రయోగం – స్త్రీపరంగా ఉపయోగించే పదాలు. వృద్ధవిధవ, ముత్తైదువులాటి పదాలతో కథంతా వ్యక్తులను వివాహస్థాయినిబట్టి గుర్తించడం జరిగింది. బహుశా తెలుగుదేశంలో కూడా రచయితలు కొన్ని దశాబ్దాలక్రితం ఇలాగే రాసేరేమో. ఇప్పుడు మనకథల్లో చూడలేదు నేను ఈ ప్రయోగం. ఆకారణంగా ఈకథ ఏకాలంనాటిదో చెప్పిఉంటే బాగుండేదనిపించింది.

ఇందులో కొన్ని కథలు తెలుగుకథలని గుర్తు చేసేయి. ఉదాహరణకి ఆఖరిగిరాకీ చెప్పుకోవచ్చు. ఆకలికి తట్టుకోలేక ఒళ్లు తాకట్టు పెట్టుకోడం. వారిని వీరో వీరిని వారో కాపీ చేసేరు అనడం లేదు. ఒకే వస్తువు వేరు వేరు రచయితలకి స్ఫూర్తి కావడం సాధారణమే. అయితే ఈకథ ఎందుకు అంటే, మనకే కాదు ఇతరులు కూడా ఈవిషయమై మథనపడుతున్నారు అని తెలుసుకోడానికే. ఇలాటి అవస్థ దేశవ్యాప్తమే కాదు ప్రపంచవ్యాప్తం.

స్త్రీలరచనలు –  సంకనలకర్త ప్రస్తావనలో రచయిత్రుల రచనలలో “మహత్వపూర్ణమయిన” రచనలు కనిపించలేదన్నారు. నాకు కన్నడసాహిత్యంతో పరిచయం లేదు కనక వారిమాట అంగీకరించాలి. నాకు మాత్రం శార్వా ణి అంటే త్రివేణి గుర్తొస్తారు. సంకలనకర్త త్రివేణిని పేర్కొన్నారు కానీ “యువతరానికి చెందిన” రచయిత్రిగా వీణా గారికథని ఎంచుకున్నారు. ఆయనే మొదట్లో చెప్పినట్టు ఇది చారిత్ర్యకకోణం తొలితరంనించి ప్రస్తుతతరంవరకూ- అని కావచ్చు.

25కథల్లో ఒకటి మాత్రమే స్త్రీ రాసినది. ఈ ఆచారం – 20, 30 కథలు ఉన్న సంకలనంలో నామమాత్రంగా ఒకరో ఇద్దరో రచయిత్రులపేర్లు చేర్చడం – తెలుగు సంకలనాల్లో కూడా ఉంది. అందుకు ప్రత్యామ్నాయంగా కేవలం రచయిత్రులే రాసిన కథలసంకలనాలు వస్తున్నాయి. వాటిలో ఒకటో రెండో రచయితల కథలు చేరిస్తే ఎలా ఉంటుందో? అట్టే ఆలోచించక్కర్లేదు. చలందో కొడవటిగంటిదో చేరిస్తే చాలు. (ఇది హాస్యము). నాఅభిప్రాయం ఈ లింగబేధాలు పాటించడం మాని, రచయిత ఎంత పేరుగలవాడు అన్న కొలతలు పక్కన పెట్టి, కథ మాత్రమే వస్తువు, శైలి, శిల్పం కొలమానాలుగా గ్రహించిన సంకలనాలు కావాలి. వస్తువైవిద్యం అంటే కేవలం పేర్లు మార్చడమే కాక జీవితంలో వైవిధ్యం ప్రతిబింబించాలి. అప్పుడే నకి సమగ్రమైన సాహిత్యచరిత్ర రాగలదు.

తెలుగుదేశంలో 70వ దశకంనాటికి స్త్రీలు ఏనాడూ లేనంత ప్రాచుర్యం పొందేక, రచయిత్రులను హేళన చేయడం, వారి స్వంత రచనలు కావని వాదించడం, కార్టూనులు విరివిగా వచ్చేయి. ఆసందర్భంలో పురాణం సుబ్రహ్మణ్యశర్మగారివంటి ప్రసిద్ధ సాహితీవేత్తలు కూడా హేళన చేసేరు. సులోచనారాణి తొలికథ ప్రచురణ అయినప్పుడు ఇంట్లో వాళ్లే నమ్మలేదని ఆవిడే చెప్పేరు. అన్నయ్య రాయలేదనీ,  తానే రాసేనని ఏడవలసినంత దూరం వెళ్లిందనీ అని నాతో అన్నారు. నాలుగు మూరలభూమి(చదురంగ) చదువుతుంటే నాకు ఆ సంఘటన జ్ఞాపకం వచ్చింది.

భార్య రాసిన కథకి బహుమతి వచ్చిందని తెలుసుకున్న భర్త అలాటి సందేహంలో పడడం ప్రధానాంశం కాదు కానీ నాకు పై సంఘటన మూలంగా తోచిన ఒక అంశం. కథలో ప్రధానపాత్ర అయిన లాయరుగారి బాధ తనభార్య రాసినకథలో అభ్యుదయభావాలు లేవని. ఈకథారచయితగురించి ప్రస్తావన లో నాయక్ మాటలు ఇలా ఉన్నాయి.

ప్రజాదరణ పొందిన అభ్యుదయరచయితగా ప్రసిద్ధులు. వాస్తవ పరిస్థుతులను తెలుసుకుని మంచిజీవితంకోసం పోరాడుతున్న ప్రజలకు స్ఫూర్తినిచ్చే రచనలు చేయడమే అభ్యుదయవాదం అన్నారు ప్రస్తావనలో. (పు. 12).

నాబాధ ఆకథలో అభ్యుదయవాది అయిన లాయరు భార్య రాసింది కాదేమో అన్న అనుమానంతో మొదలయి, నిశ్చయంగా ఆవిడ రాసింది కాదనే అభిప్రాయానికి రావడం. కాయితాలమీద చేతివ్రాత కూడ ఆవిడది కాదనుకోడానికి కారణం అది “మగవాళ్ళ చేతివ్రాతలా ఉంది” అని (పు. 116). అలాటి ఆలోచనలు అభ్యుదయవాదికి తగునా అని నాప్రశ్న.ఈ లాయరుపాత్రని వ్యంగ్యాత్మకంగా చిత్రించేరు అనుకోగలం. కానీ ఇక్కడ ఆ అన్వయం నప్పదు, రచయిత అభ్యుదయరచయితగా ప్రసిద్ధులు కనక.

మొత్తమ్మీద ఈకథలఎంపికలో కావలసినంత వైవిధ్యం ఉంది. మతం, రాజకీయం, తాత్వికం, ఆధునికం, విదేశీజీవనం, పల్లెపట్టు బతుకులు–ఎవరు చదవడం మొదలు పెట్టినా, వారికి హత్తుకోగల కథ ఒక్కటైనా ఉంటుందనే నానమ్మకం.

అనువాదం –

ఈ 25 కథలూ ఒక్కచేతిమీద శార్వాణి చేసేరు కనక అనువాదకులగురించి ఒక మాట చెప్పుకోడం భావ్యం.

నాఅభిప్రాయంలో అనువాదకుడు కూడా రచయితే. రెండు ప్రక్రియలూ సృజనాత్మకమే. మూలరచయిత ఒకభాషలో తన ప్రతిభావిశేషాలు ప్రదర్శిస్తే, అనువాదకుడు రెండోభాషలో తన ప్రతిబావిశేషాలు ప్రదర్శిస్తాడు. ప్రదర్శించగలగాలి. అప్పుడే అనువాదం రాణిస్తుంది. అందులోనూ 25మంది రచయితల కంఠస్వరాలు గుర్తించి, అనువాదం ఆయా కంఠస్వరాలకి తగినట్టు అనువదించడం సామాన్యం కాదు కదా.

నేను మామూలుగా అనువాదాలు చదవడానికి ఇష్టపడను. నాకు సరిగా జ్ఞాపకం లేదు కానీ ఇదే నేను చదివిన మొదటి అనువాదం కావచ్చు. మొదట్లో చెప్పినట్టు నాకు శార్వాణిగారి పేరు పరిచయం కనకనూ, బహుధా తెలుగుపాఠకులు మెచ్చుకునే కన్నడసాహిత్యంగురించి కొంచెమైనా తెలుస్తుందేమోనన్న ఆశతోనూ చదివేను.

శార్వాణిగారు అనువాదం ప్రతిభావంతంగా నిర్వహించేరు. ఉదాహరణకి నాకళ్ళబడ్డ కొన్ని వాక్యాలు

మూడు పొద్దులవేళ కమ్ముకున్న చీకటి. పు. 149

రాయులవారి మఠం సాంబారులాగ అనే నానుడి మావేపు ప్రసిద్ది. పొద్దున్న భోంచేస్తే సాయంత్రందాకా మసాలా ఘాటు పోయేది కాదు. పు. 242

కేశవ్ కు కోపపు దీపావళి, యక్షగానపు రావణుని రంగు వేషాలొక్కటే తక్కువ పు. 194.

కథలో వర్ణనలు భావస్ఫోరకమై పాఠకుడిమనసులో ఆ దృశ్యాలను ఉద్భవింపచేస్తాయి. ఒక ఉదాహరణ ఇస్తానిక్కడ.

000

చివర్లో కథకులసంక్షిప్త పరిచయాలు ఇవ్వడం బాగుంది. కానీ  ఆఖరి ఐదుగురి పరిచయాలు లేవు. .  జీరాక్స్ చేయడంలో పొరపాటు కావచ్చు.

అనువాదకురాలి పరిచయం కూడా లేదు ప్రస్తావనలో. చివర్లో చేర్చేరో లేదో తెలీదు. ఏమైనా అది సంకలనకర్త ఇష్టం. నాకు మాత్రం అది లోపంగానే కనిపించడంచేత నాదగ్గర ఉన్నవివరాలు ఇక్కడ ఇస్తున్నాను.

ఈ పుట ఆంధ్రరచయిత్రులు సమాచారసూచిక నించి సేకరించినది.

సంకలనకర్త – కె. రామలక్ష్మి.

ప్రచురణ – National Book Trust. India. 1968.

000

Arichive.org సౌజన్యంతో, .Kannada-Kathanikalu 

(మే 20, 2019)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “కన్నడ కథానికలు సంకలనం. (సమీక్ష)”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.