రెండేసి …

మనిషికి రెండేసి ఇచ్చేడు.

ఒక చెయ్యి విరిగితే మరోచేత్తో పని చేసుకుంటాం

ఒక కన్ను హీనమయితే మరో కన్నుతో గడుపుకుంటాం

ఒక కాలు విరిగితే మరోకాలుతో, చేతికర్రతో తిరుగుతాం.

kidney సైతం ఒకటి చాలుట, దేవుడు రెండు అమర్చినా. 

గుండె మాత్రం ఒకటే ఇచ్చేడు.

అది చస్తే ఆ పుట్టించినవాడు సైతం ఆదుకో లేడు. 

దేవుడు రెండు గుండెలివ్వలేదు

ఉన్న ఒక్క గుండెనీ రెండు చేసుకుని లాభం లేదు.  

తస్మాత్ గుండెకాయ పదిలం, నాయనా!

౦౦౦

(మే 26, 2019)

అసంకల్పిత ప్రతీకారచర్య అనుకోనా?
కింద కూర్చుని తినడం ఆనందం అనుకుంటాను
కుర్చీలో కూర్చుని తింటాను
 
చేత ఒడుపుగా ముద్దలు కట్టుకు తినడం గొప్ప అనుభవం అనుకుంటాను.
స్టీలుచెంచాతో ముగిస్తాను.
 
చవులూరు జానుతెనుగు మాటాడాలనుకుంటాను
ఇంగ్లీషుపదాలే దొర్లుతాయి నోటంట గులకరాళ్ళలా.
 
ఉదయం లేస్తూనే నాలుగు శ్లోకాలు చెప్పుకుంటే ప్రశాంతత అనుకుంటాను.
ఫేస్బుక్కూ, ట్విటరూ శరవేగంతో ముందుకొచ్చేస్తాయి కొంపలంటుకుపోతున్నట్టు.
 
మనసా వాచా కోరీ వేడీ తెచ్చుకున్నవి కావు.
ఏటికి ఎదురీదుతున్నట్టు వాటికవే వచ్చి నన్ను చుట్టుముట్టేసేవి.
 
ప్రతిరోజూలాగే ఈరోజూ గడిచిపోతుంది నాఇష్టాయిష్టాలతో
ప్రమేయం లేకుండా.
అనుకున్నదొకటీ అయేది ఒకటీ అవుతూ.
 
(మే 12, 2019)
ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.