నండూరి రామమోహనరావు. వ్యాఖ్యావళి సంకనం. (సమీక్ష)

నండూరి రామమోహనరావుగారు 1962-1994 మధ్య ఆంధ్రజ్యోతిలో రాసిన నూరు సంపాదకీయాలసంకలనం ఈ వ్యాఖ్యావళి. గ్రంథకర్తే రాసినట్టు, సాధారణంగా సంపాదకీయాలూ వెలువడిన రోజులలోనే అట్టేమంది చదవరు. ఇలా విడిగా సంకలనంగా ప్రచురంచడంవలన ఏమి లాభము అన్న సందేహం కలగొచ్చు. దాన్ని నేను ఇలా మళ్లీ పరిచయం చేయడం ఎందుకు అని కూడా అడగొచ్చు.

సంపాదకీయం ఎప్పటికప్పుడు ఆరోజు, ఆవారం ప్రాముఖ్యం పొందిన వార్తమీద ఆనాటి పాత్రికేయులవ్యాఖ్యానం. ఆ తరవాతికాలంలో అంటే మనకి ఇప్పుడు అవి కొత్తగా ధ్వనించవచ్చు. కొన్ని అభిప్రాయాలు మారవచ్చు. కొన్ని పరిస్థితులు మారవచ్చు. మారేయా లేదా అని మరొకమారు తరిచి చూసుకోడానికి పనికొస్తాయి ఇవి. మారకపోతే, మారవలసిన అవుసరం ఉంటే, వాటిని మార్చడానికి ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని ఆలోచించుకోడానికి కూడా ఉపయోగపడతాయి.

ఈ సంకలనంలో వ్యాఖ్యానించబడిన అంశాలు – రాజకీయాలు, న్యాయస్థానాలూ, సాంఘికపరమైన ఆచారాలూ, మతపరమైన హింసాకాండలు, విదేశీవ్యవహారాలే కాక, సాహిత్యంలో సంగీతంలో ప్రముఖులకృషిగురించి కూడా ఉన్నాయి.

మొదట్లో చెప్పినట్టు ఇప్పటికీ ఆలోచించవలసినవి నాకు రెండు అంశాలు కనిపిస్తున్నాయి. 1. మనదేశంలో పరిపాలనావిధానంలో వస్తున్న మార్పులు. పై సంపాదకీయాలు 1962నించి అన్నారు కనక సుమారుగా గత 5, 6 దశాబ్దాలలో ఏమి జరిగింది, జరుగుతోంది, ఏ పరిణామాలకి దారి తీస్తుంది అన్నవి మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఈనాటి పాఠకులకి బహుశా కొన్ని తెలిసి ఉండవచ్చు. కొన్ని మరిచిపోయి ఉండవచ్చు. అంచేత ఇవి ఒకసారి చూస్తే సూచనప్రాయంగానైనా తెలుసుకోవచ్చనుకుంటున్నాను.

 1. స్త్రీలస్థానం, కుటుంబంలోనూ సమాజంలోనూ వారిపరిస్థితులు, స్త్రీవిద్య, బాల్యవివాహాలు, సహగమనాలు, దేవదాసీలు, వరకట్నాలు, అత్యాచారాలు– వీటిలో మార్పు ఏమైనా వచ్చిందా, ఎంతమేరకువంటివి ఆలోచించుకోవాలి. ఉదాహరణకి వరకట్నాలపోరు తగ్గలేదంటున్నారు గ్రంథకర్త. కట్నం అనకుండా పెళ్ళి ఘనంగా చేయాలన్న పేరుతో చలామణి అవుతున్నాయి. కలవారు జరుపుకుంటారు. మరి అలా చేయలేనివారి పరిస్థితి ఏమిటి, దానికి తగిన మార్పులు చేయడానికి ఎవరు ఏమి చేస్తున్నారు అన్నది ప్రస్తుతం ఆలోచించాలి మనం.

బాల్యవివాహాలు, వధూదహనాలు ఇప్పుడు కూడా అక్కడక్కడ జరగడంగురించి రెండు సంపాదకీయాలలో ప్రస్తావించేరు. కన్యాశుల్కంమీద వ్యాఖ్యానిస్తూ, ఇప్పుడు సమకాలికత చరిత్ర గర్భంలో కలిసిపోయింది అన్నారు. ఇండియాలో ప్రస్తుతం ఎలా ఉందో నాకు తెలీదు. ఎక్కడైనా జరిగితే మీరు పూనుకుని ఏమైనా చేయగలరా? ఇవి పుస్తకాలూ వ్యాసాలూ చదివి కాదు. తమ చుట్టూ ఉన్న సమాజం పరికించి చూసి, ఇవి జరుగుతున్నాయా, జరగకుండా ఆపడానికి మనం ఏమి చెయ్యాలి అని ఎవరికి వారు ఆలోచించుకోవాలనుకుంటాను.

నాకు తెలుగుసాహిత్యంతో చీమతలకాయంత పరిచయం ఉంది కనక, ఈ సంపాదకీయాలలో మన సాహిత్యకారులగురించి రాసిన వ్యాసాలు నన్ను ఎక్కువగా ఆకర్షించేయి. ఆ యా కవులు, రచయితలూ చేసిన విశేషకృషి గురించి 1,2 పేజీలలో చదువుకోడంలో నాకు సంతృప్తిగా ఉంటుంది. కొందరు కవులగురించి నాకు కొన్ని కొత్త సంగతులు తెలిసాయి. వారిలో ప్రధానంగా చెప్పుకోవలసింది తుమ్మల సీతారామమూర్తిగారు, పుట్టపర్తి నారాయణాచార్యులుగారూ, రాయప్రోలు సుబ్బారావుగారూ.

సరస్వతీపుత్రులు శ్రీ నారాయణాచార్యులవారిగురించి ఈమధ్యకాలంలో వారి కుమార్తె ఫేస్బుక్కులో ప్రచురిస్తున్న టపాలమూలంగా కొంత తెలుసుకున్నాను. శ్ర్రీ నారాయణాచార్యులుగారి తొలి ఖండకావ్యంగురించి ఇలా రాసేరు.

1928-29ప్రాంతాలలో ఒక 14 ఏళ్ళ బాలుడు ఒక ప్రౌఢకావ్యం, పెనుకొండ లక్ష్మి, రాసేరు. ఆ కావ్యాన్ని మద్రాసు విశ్వవిద్యాలయం విద్వాన్ పరీక్షకి పాఠ్యగ్రంథంగా నిర్ణయించేరు. విద్యాన్ పరీక్షాపత్రంలో ఒక ప్రశ్న ఆ పాఠ్యగ్రంథంలోనుండి ఇచ్చేరు.

విద్వాన్ పరీక్ష రాస్తున్న ఆ బాలుడు 40 పేజీల సమాధానం రాసేరుట ఆ ప్రశ్నకి.

సరస్వతీపుత్రులుగా సుప్రసిద్దులయిన పుట్టపర్తి నారాయణాచార్యులుగారి సాహిత్యసేవ అపారం. ఆయన శివైక్యం చెందిన సందర్భంలో రాసిన నివాళి ఈవ్యాసం (బ్రాహ్మీమయమూర్తి పుట్టపర్తి. సెప్టెంబరు 2, 1990). దానిని కుదించి చెప్పడం న్యాయం కాదు. మీరే చదువుకుంటే బాగుంటుంది. లింకు ఇచ్చేను చివరలో.

పిల్లలమర్రి పినవీరభద్రుడు వాణి నారాణి అన్నట్టుగా నాయుడుగారు నాదాన్ని నా దాన్ని చేసుకున్నాను అని చమత్కరించేరుట. (ఫిడేలు నాయుడుగారు, 1964).

బాలలసాహిత్యం రాసి ప్రచురించవలసినగురించి ప్రస్తావించడం బాగుంది. (బాలలసాహిత్యం, 1976). అయితే ఇప్పుడు కావలసింది రాజకుమారులు, రాక్షసులు, నీతికథలు కాదు, బాలలమనోవికాసానికి తగినట్టుగా సాంకేతిక, వైజ్ఞానికవిషయాలగురించిన సాహిత్యం కావాలిప్పుడు అన్నారు. నేను అనుకోడం ఈ రెండూ ప్రక్రియలూ వయసునిబట్టి వరుసక్రమంలో పరిచయం చేయవచ్చుపిల్లలకి అని.    ఈవిషయం మీకే వదిలివేస్తున్నాను. వ్యాసం చదివి మీఆలోచనలు మీరు ఏర్పరుచుకోవచ్చు.

నాదృష్టికి వచ్చిన మరో అంశం అవార్డులు, బిరుదులుమీద వ్యాసం, (భారతరత్న, 1992). భారతరత్న ప్రదానంగురించి చర్చిస్తూ, ఆ ప్రదానంవిషయం వివాదాస్పదమయి, అర్థం లేకుండా పోతోందేమోనన్న భావం వెలిబుచ్చేరు. ఈవిషయం కూడా ఇప్పుడు పునః పరిశీలించుకోవలసిన అవుసరం ఉందనుకుంటాను. ముఖ్యంగా సాహత్య ఎకాడమీవంటి సంస్థల ఎవార్డులు చూస్తే నాకు అనిపించింది ఇది.

గ్రంథకర్త రాజకీయభాషగురించి చెప్పేరు కానీ పత్రికలలో భాషగురించి చెప్పలేదు. అట్టే లేవు కానీ ఈవ్యాసాలలో హింసా రిరంస, హింసనచణ ధ్వంసన, దస్విదానియా లాటి పదాలు నాకు గందరగోళంగానే తోచేయి.

వంద సంపాదకీయాలను ఇంతకంటె సూక్ష్మంగా పరిచయం చేయడం సాధ్యం కాదు. ఇంతకంటె విస్తృతంగా చెప్పడం తగదు. మీరంతా స్పీడు రీడరులు కనకనూ, చాలావిషయాలు మీకు తెలిసినవే అయిఉండవచ్చు కనకనూ, మీరే చదువుకోగలరని, ఇక్కడితో ముగిస్తున్నాను.

000

archive.org సౌజన్యంతో, Vyakyavali Nanduri Ramamohan Rao

000

(మే 29, 2019)

 

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “నండూరి రామమోహనరావు. వ్యాఖ్యావళి సంకనం. (సమీక్ష)”

 1. మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరీ చిన్నపిల్లలకి ఆసక్తికరంగానూ, మనసంస్కృతిని పాదుకునేవుగానూ ఉంటేనే బాగుంటుందని. 8 ఏళ్లు దాటేక విజ్ఞానదాయకం అయితే బాగుంటుంది కదా.

  మెచ్చుకోండి

 2. మా అక్కలలో ఒకరు ప్రభుత్వ స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ఉద్యోగం చేస్తూ, బాల్య వివాహాలు తెలిస్తే చెప్పవలసి రావడం, ఆపడం వంటివి చెయ్యవలసి వస్తుంటుంది విధి నిర్వహణలో భాగంగా. అలాంటి కొన్ని సంఘటనలను ప్రస్తావించింది ఒకప్పుడు మాటల సందర్భంలో. మన సమాజంలో అభివృద్ధి, ఆలోచనల్లో మార్పు ఎన్నో అంతరాలతో ఉంది. ఆధునికత కొన్ని రంగాలను అన్ని చోట్లా స్పృశించినా, కొన్ని చోట్ల ఏమీ పెద్ద మార్పు తేలేకపోతోంది.
  బాల సాహిత్యం గురించి – వినోదం, విజ్ఞానం రెండు అవసరమే.
  మీరు ప్రస్తావించిన అంశాల గురించి ఈ మాత్రం ఆలోచన పంచుకోవాలనిపించింది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.