నార్ల వెంకటేశ్వరరావుగారు. మాటామంతీ, పిచ్చాపాటీ

నార్ల వెంకటేశ్వరరావుగారు (1 December 1908 – 13 March 1985) దేశవిదేశీ సాహిత్యాలతో విశేష పరిచయం గల తొలితరం పాత్రికేయులుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రభ సంపాదకులుగా, ఆ తరవాత ఆంధ్రజ్యోతి సంపాదకులుగా వెంకటేశ్వరరావుగారి పేరు చాలామందికి సుపరిచయం.

20వ శతాబ్దం తొలిదశలో ఆంగ్లసాహిత్యం ప్రభావం మనతెలుగు సాహిత్యంలో బలంగా పడి నిలదొక్కుకొనిపోవడం అందరికీ తెలిసినదే. అయితే చాలామంది రచయితలు  ఆంగ్లరచయతలభావాలను పుణికిపుచ్చుకుని, అవే ఘనంగా భావించి, రచనలు చేసేరు.

వెంకటేశ్వరరావుగారు ఆ ధోరణిలో కొనసాగించకుండా, ఆయా సాహిత్యాలను అవగాహన చేసుకుని, సమన్వయదృష్టితో తమ రచనలు సాగించారు. గంభీరమైన అంశాలను లోతుగా పరిశీలించి ఏర్పరుచుకున్న భావాలను అనేకగ్రంథాలలో వెలువరించేరు. ఇంతకంటె ఎక్కువగా వారిప్రతిభగురించి నేను రాయలేను. ఆయన సాహిత్యం తెలుగు, ఇంగ్లీషు మొత్తం 12 సంపుటాలుగా ప్రచురించేరుట. నిజంగా నార్లవారి భావజాలం తెలుసుకోదలచినవారు ఆయనపుస్తకాలు చదవాలి.

000

ఇక్కడ నేను పరిచయం చేసిన రెండు పుస్తకాలు, మాటా మంతీ, పిచ్చాపాటీ. వీటిలో చేర్చిన వ్యాసాలు ఆనాటి పత్రికలలో ధారావాహికంగా ప్రచురించినవి.

పేరుకు తగ్గట్టుగానే నలుగురు కూర్చుని సరదాగా నిత్యజీవితంలో మనకి తటస్థపడే సంఘటనలో, సమాచారమో మాటాడుకుంటున్నట్టు ఉంటాయి. అయితే ఈ వ్యాసాలలో ప్రత్యేకత ఏమిటంటే నార్లవారిశైలి. గెడ్డాలగురించి మాటాడినా, నిద్రగురించి మాటాడినా, మామిడిపండు గురించి మాటాడినా తెలుగు, ఇంగ్లీషు రెండు సాహిత్యాలలోంచి ఉదాహరణలు తీసుకుని, ఆయా రచయితల వాక్కులో అలవాటో ఒకటి, రెండు పేరాలలో ఉటంకిస్తూ తమఆలోచనలు పంచుకోడం నార్లవారివంటి సాహితీవేత్తలకే సాధ్యం.

గెడ్డాలమీద వ్యాసం చూసేవరకూ నాకు గెడ్డాలమీద ఇంత రాయొచ్చని తెలీదు. ఇలా రాయొచ్చని తెలీదు. దాదాపు పన్నెండు రకాలగెడ్డాలగురించి చెప్పి, ఏ ముఖానికి ఏది బాగుంటుందో, ఏది బాగుండదో చెప్పి, ఆ తరవాత గెడ్డాలుపెంచిన కవులు-తెలుగు, ఇంగ్లీషు కూడా- తమఅభిప్రాయాలు చెప్తారు. చదివి ఆనందించాల్సిందే కానీ సూక్ష్ణంగా వివరించగలది కాదు.

కవిత, పాండితి అన్న వ్యాసంలో పూర్వకవులు కూర్చిన కొండవీడు చాంతాడుతో పోటీ పడగల సమాసాలతో ఎఁదుకు మన ప్రాణాలు తీయడం అని ప్రశ్నించి, “అక్కడొక పంక్తిలోనూ ఇక్కడొక పద్యంలోనూ పెల్లుబికే కవిత్వం కన్నా నాకు జానపదసాహిత్యంలోని ప్రత్యక్షరంలోనూ దివ్యదర్శమిస్తుంది” అంటారు, “ఏరువాకొచ్చిందమ్మ ఏరువాకొచ్చింది” వంటీ గేయలు ఉటంకిస్తూ. జోలపాటలలోనూ, రోకంటిపాటలలోనూ, ఇతర జానపదగేయాల్లోనూ కనబడే కవిత్వంలో నూరోవంతైనా ప్రబంధాలలో తనకి పొడగట్టదంటారు.

కొన్ని వ్యాసాలు చదివి ఆనందించడానికయితే, కొన్ని ఆలోచించవలసినవిగా ఉన్నాయి.

ఉదాహరణకి స్మారకచిహ్లాలు అన్నవ్యాసం. స్మారకచిహ్నాలపేరున ఊరూరా వాడవాడలా ప్రతిష్ఠిస్తున్న చౌకబారు “సిమెంటు విగ్రహాలు దిష్టిపిడతల్లా పరమవికారంగా ఉన్నాయి”, వాటిని చూస్తే ఏహ్యభావమే కలుగుతుంది కానీ గౌరవం కలగదు, ఈ సిమెంటుబొమ్మలతో మనకి పూజనీయులయినవారిని వెక్కిరించడం భావ్యమా అని ప్రశ్నిస్తారు (పిచ్చాపాటి. స్మారకచిహ్మాలు). ఈ పరిస్థితి ఇప్పుడు మారిందేమో నాకు తెలీదు. ఆవీధులలో తిరిగేవారే చెప్పాలి పరిస్థితి ఏమైనా మెరుగు పడిందేమో.

అలాగే తెలుగుపదాలు మనోహరం. అమ్మ, అబ్బ, ఇది లాటి పదాలముందు సంస్కృతపదాలతో కూర్చిన సమాసాలన్నీ ది్ష్టిపిడతలే అంటారు. (మాటామంతీ. తెలుగు లెస్స.).

ఈనాడు మనం ఒక వ్యక్తికో వస్తువుకో ఇచ్చేవిలువ స్వతస్సిద్ధంగా వాటివి లేకవారివి కాక, మన అనుబంధాలతోనూ, అనుభవాలతోనూ ముడిబడిఉంటాయంటారు, వాటికి (మాటామంతీ. అనుబంధాలు.).

సూక్ష్మంగా వారి శైలి మచ్చుకి చూడండి.

చూసేరా. ఇలాటివాటిగురించి సంక్షిప్తంగా ఏం చెప్పగలం? చెప్పలేం. అందుకే నామాట విని, హాయిగా అసలు పుస్తకాలే చదువుకోండి. లింకులు ఇచ్చేను చివరలో.

రెండూ చిన్నపుస్తకాలే. గంటలో చదివేయవచ్చు. ఆతరవాత పిచ్చాపాటీ, మాటమంతీ, ఊసుపోక, కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు వీటిలోంచి తెలుసుకున్న కబుర్లు కతలుకతలుగా చెప్పుకు ఆనందించవచ్చు.

వీటిలో హాస్యకతలు, చమత్కారవచనాలూ కొన్ని నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఎక్కడ చదివేనా అని అప్పుడప్పుడు ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు  ఈపుస్తకాలు మళ్ళీ చదువుతుంటే, ఎక్కడ చదివేనో తెలిసింది. అందుకే చెప్తున్నాను ఈ పుస్తకాలు చదివడం గంటలో అయిపోతుంది. చదివింది మనసులో ఉండిపోతుంది అని.

ఆర్కైవ్.ఆర్గ్ సౌజన్యంతో

Mata-Manthi Narla

Picchapathi Narla

000

(జూన్ 4, 2019)

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.