మరేఁనండీ మీరండి మరి, చెప్తాను అండీ

(మనలో మనమాట 2019)

మూడేళ్ళక్రితం మనలో మనమాట అన్న శీర్షకతో వరసగా కొన్ని పోచికోలు కబుర్లు మొదలెట్టేను. అంతకుముందు ఊసుపోక అంటూ ఊదర పెట్టేసేను కదా. ఇప్పుడు మళ్ళీ అదే దోరణిలో కొన్ని రాయాలనిపించింది. ఇది మూడో వరస అనుకోవచ్చు.

కారణాలు చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా చెప్పుకోవలసింంది నార్ల వెంకటేశ్వరరావుగారి మాటా మంతీ. మొన్న టపాలో ఆపుస్తకం నేను పరిచయం చేసేక, మిత్రులొకరు ఊసుపోక కతలు గుర్తుకొచ్చేయి అనడంతో నాకు ఉత్సాహం వచ్చింది.

నాహైస్కులు రోజుల్లో పత్రికలు చదవడం మొదలయినరోజుల్లోనే ఈ మాటామంతీ వ్యాసాలు వచ్చేయి. ఇంకా నేను అలా చదివిన గోరాశాస్త్రిగారి వినాయకుడివీణ, పురాణం సుబ్రహ్మణ్యశాస్త్రిగారి ఇల్లాలిముచ్చట్లు, లతగారి ఊహాగానం ఈకోవలోకే వస్తాయి. ఇంకా ఉన్నాయి కానీ నాకు గుర్తున్నవి ఇవి. వీటిలో బలంగా నామనసులో నాటుకున్నది ఊహాగానం. బహుశా ఆమెరచనలగురించి వ్యాసం రాయడెంకోసం అవి చదవడం కావచ్చు. అది చేతనావస్థలో.

కిందటివారు మాటామంతీ చదువుతున్నప్పుడు మాత్రం అవి అచేతావస్థలో నామనసులో నాటుకున్నాయని తెలుసుకున్నాను. సమీక్ష పూర్తి చేసి ప్రచురించిన వెంటనే, ఆ పుస్తకం మళ్ళీ చదివేను. ఇలా వెంటనే రెండోసారి చదివిన సందర్భం ఇదొక్కటే. ఇది నాంది.

ఇహనిప్పుడు అండీ దగ్గరికి వద్దామండి. మాటామంతీలో తెలుగు లెస్స అని ఒక వ్యాసం. (నార్ల వెంకటేశ్వరరావుగారు వీటిని వ్యాసాలు అన్నారు. పానుగంటివారి సాక్షి కూడా వ్యాసాలుగానే చెల్లుతున్నాయి. నేను కతలు అన్నాను, పోచికోలు కబుర్లు అన్న ఉద్దేశంతో. వీటికి వేరే ప్రత్యేకమైన పేరు ఒకటి ఉంటే బాగుంటుందని సాహిత్యకారులకు నాసూచన).

ఇంతకీ మాటా మంతీలో నార్లవారు తెలుగు లెస్స వ్యాసంలో అబ్బ, అమ్మ, ఇది పదాలు ఎంత బలమైనవో, ఎంత అర్థపూరితాలో చెప్పేరు.

అలాగే యొక్క, బడు పదాలు –

— యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు,

— ఎంత గొప్పవాడైనా వస్తాడేకాని విచ్చేయడు.

— సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి.

— బడు వాడేవాడు బడుద్ధాయి. (మూలం తెలుగు వికిపీడియా).

ఈవరసలోనే చేర్చాలి అండి అన్న పదం కూడాను. నిజానికి అండి విడిగా వాడితే అండా, గుండిగ అన్న అర్థంలోనే. నీళ్ళ అండీ అంటే నీళ్లు కాచుకునే లోహపాత్రవిశేషము. అండీమీద అండీ పెట్టి, సుభద్రమ్మను వండా బెట్టి … అని ఒక పాదం పూరిజగన్నాథంలో వాడుక అని నాచిన్నప్పుడు విన్నాను. అక్కడ అండీ అంటే లోహం అవునో కాదో నాకు తెలీదు, నేననుకోడం మట్టి కుండలని. పూరీ జగన్నాథం ఆలయంలో అండిలలో బియ్యం, నీళ్లు పోసి, అండీ మీద అండీ పేర్చి పెట్టి, కింద పొయ్యి రాజేస్తే, అన్ని అండీలలోనూ బియ్యం సమపాళంగా ఉడుకుతాయనీ, అది ఆ స్థలమహత్మ్యమనీ చెప్పుకునేవారు.

ఇప్పుడు ముఖ్యంగా ఫేస్బుక్కులో చూస్తున్నాను ఈ అండి విడిగా అదొక పదంలా వాడడం. మనకొచ్చిన బాధ ఏమిటంటే చూసేను, చెప్పేను అని వదిలేస్తే వాటిలో అట్టే మర్యాద కనిపించదు. చూసేనండి, చెప్పేనండి అంటేనే మర్యాద. చూసేను అండి, అంటే దాన్ని ఏమనాలో నాకు తెలీదు కానీ కొత్తలో నాకు వింతగానే ఉండేది. అండి మరొక క్రియకో నామవాచకానికో, సర్వనామానికో చేర్చవలసిన ప్రత్యయమే కానీ పై అర్థంలో స్వయంప్రతిపత్తి లేదని మాత్రం తెలుసు. కానీ ఇంతకాలం అయేక, అంటే నేను ఫేస్బుక్కులో ప్రవేశించిన 3 ఏళ్ళవెనక, నాక్కూడా అలవాటయిపోయింది. మామూలుగా వాడను కానీ ఏదో ఒక సమయంలో పడిపోతోంది నాప్రమేయం లేకుండానే.

రాజులలో (రాజ్యాలు లేకపోయినా, ఆ వంశజులలో) వాక్యంలో ప్రతిపదానికీ అండి చేరుస్తారు. మరేనండి, నేనండీ ఆయనకి చెప్పేనండి అంటూ బండి లాగించేస్తారు. గోదావరి జిల్లాలో కూడా ఈ వాడకం ఉందని విన్నాను.

అందుకు పూర్తిగా విరుద్ధం చిత్తూరువారు. ఒకసారి ఒకాయన నాతో మాటాడుతూ అన్నారు, మేం చిత్తూరోల్లం. మాకు ఈ అండీ గిండీ అలవాట్లేదు. మీరేం అనుకోమాకండి అని. నిజానికి నాకు ఈసంగతి తెలుసు. నేను తిరుపతిలో ఉన్నప్పుడు చూసేను, ఈ అండీలు తక్కువే. అందులో తప్పు పట్టడానికేమీ లేదనే నా అభిప్రాయము.

ఇంతకీచెప్పొచ్చేదేమిటంటే, యుక్క, బడు అన్నీ ఇంగ్లీషు వ్యాకరణసూత్రాలలోంచి వచ్చినవి. వచ్చినవి అంటే మనకి తెలీకుండా చొచ్చుకొచ్చేశాయని కాదు. మనకి మనమే మన నెత్తికెత్తుకున్నాం. ఇంగ్లీషువాడు పోతూ, పోతూ తమ రాజ్యాంగతంత్రం నేర్చుకోమన్నాడు కానీ ఈ భాషావైభవం మీరు అంకించుకుతీరాలని షరతులు వెట్టలేదు. ఇంగ్లీషు మాటాడ్డం అలవాటయపోయిందని, ఇంగ్లీషులో మాటాడుతున్నాం కనక ఇంగ్లీషులోనే ఆలోచించడం అలవాటయిపోయిందని, దరిమిలా తెలుగుపలుకులు ఓమారు తలుచుకుని, నెమరేసుకుని యథాతథంగా అనువదించేస్తున్నాం అనీ ఎంతమంది ఒప్పుకుంటారో నాకు తెలీదు. కానీ ఒక్కమాట మాత్రం చెప్పగలను మనకి ఈ యొక్క, మరియు, లేక వంటి ప్రత్యయాలు వ్యవహారంలో లేవు. బడు ప్రత్యయం ఉంది కానీ పరిమితం.

పంచలోహాలతో చేయబడిన విగ్రహం అనం. వంచలోహాలతో చేసిన విగ్రహం అనడం మామూలు. అది మన భాషలో సమ్మతమే.

గోపీ పుస్తకం అంటే గోపీయొక్క పుస్తకం అనక్కర్లేదు. గోపీపుస్తకం అంటే చాలు. గోపీగారి పుస్తకం అంటే అక్కడ పేరు తరవాత ఇ-కారం యొక్క లాటిదే.

సీతా, కమలా, గోపాలమూ వచ్చేరు. అంటే చాలు, పేరువెనక దీర్ఘం మరియు చేయవలిసిన పని చేస్తుంది. మళ్ళీ కమలా మరియు గోపాలమూ అంటూ, కమల తరవాత మరియు అని చేర్చనక్కర్లేదు.

యూట్యూబులో వంటలవిధానాలు ప్రదర్శించేవారు Capsicum curry in Telugu అనో Beerakaya chutney in Telugu అనో ప్రకటిస్తారు, పైన చెప్పిన బడు, యొక్క లాగే మరియు, లేక, వంటి పదాలు కూర్చి. నాకు బారిష్టరు పార్వతీశం గుర్తుకొస్తాడు. అదండి కథండి. ఉండనా మరి అండీ.

000

(జూన్. 8, 2019)

 

 

 

 

 

 

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.