దస్తూరీతిలకం

నుదుట కస్తూరీతిలకం తీర్చి దిద్దినట్టే, మఠం వేసుక్కూర్చుని ఎడంచేత్తో పలక ఒడిసి పట్టుకుని తల ఓరగా ఒంచి దస్తూరి తీరిచి దిద్దుకోడం చిన్నప్పుడు మన పిల్లలకి చేసిన అలవాటు. ఒకప్పటి మాటే. ఇప్పుడు కంప్యూటరులో సౌకర్యాలు వేరు. ఒత్తులు ఎక్కడ పడతాయో, దీర్ఘాలు ఎక్కడ పదతాయో, అసలు పడకుండా పారిపోతాయో తెలీదు. కీబోర్డుమీద అక్షరాలు వేళ్ళకి తెలిసినట్టు బుర్రకి తెలీవు. నాపేరు కంప్యూటరులో రాయడానికి ఏ కీలు కొడుతున్నానని మీరు అడిగితే తడుముకోకుండా చెప్పలేను.

కొందరి దస్తూరీ చూస్తుంటే కస్తూరిపరిమళాలు ఆఘ్రాణిస్తుంటే ఉంటుంది. ఆ అక్షరాలలో పొదిగినభావాలకి నానాసూనవితానసుగంధములతో నిండి, రాసినమనిషి ఎదురుగా కూర్చుని ఆప్యాయంగా ముచ్చట్లు చెప్తున్నట్టుంటాయి.

చేత్తో రాస్తున్నప్పుడు ఒకమాటు రాసినట్టు మరోమాటు రాదు. ఎంత అలవాటే అనుకున్నా చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి పట్టి చూస్తే. వ్రాతశాస్త్ర పండితులు చేతివ్రాత వేలిముద్రలాటిదే అనీ, ప్రతి ఒక్కరికీ వారి చేతివ్రాత కూడా తలరాతలాటిదే. ఎవరిది వారికే ప్రత్యేకం అనీ వక్కాణించేరు. నాకు మాత్రం సందేహమే.

నాచిన్నప్పుడు నా దస్తూరీ ముత్యాలకోవలా ఉంటుందని మాఅమ్మ మురిసిపోతూ అందరితో చెప్పేది. ఇప్పుడు ఆవిడే చూస్తే ఏఁవిటా రాత, కోడి కెలికినట్టు అని విసుక్కుంటుందని ఖచ్చితంగా చెప్పగలను.

ముత్యాలకోవ అవునో కాదో కానీ గుండ్రంగా ఉండే అక్షరాలమాటకొస్తే మా చిన్నన్నయ్యపేరే చప్పుకోవాలి. అక్షరాలా గుండు తరవాత గుండు పేరిచినట్టు మళయాళం అక్షరాల్లా ఉంటుంది తెలుగూ, ఇంగ్లీషూ కూడా. వాడిదగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందంటే ముందు ఏ భాషో  తేల్చుకుని తరవాత ఒకొక అక్షరం కళ్ళు పొడుచుకు చూస్తూ చదువుకునేదాన్ని. సంగతులని బట్టి భాష కనక, ఏ భాషో  తెలిస్తే, సంగతులేమిటో తెలుసుకోడం నాకు వెసులుబాటుగా ఉండేది.

కోడి కెలికినదస్తూరీల సంగతికొస్తే, డాక్టర్లరాతలు ప్రముఖం అయినంతగా మరెవరూ కాలేదు. ఆమధ్య ఎక్కడో చదివేను డాక్టర్లు దేనికో నిరసన ప్రదర్శనలిచ్చినప్పుడు వారు పట్టుకున్న అట్టముక్కలమీద పదాలు ఎవరికీ అర్థం కాక, వారెందుకు నిరసన తెలుపుతున్నారో, వారి కోరికలేమిటో ఎవరికీ తెలీలేదని.

ఆమధ్య ఒకావిడ దూరదేశం వెళ్ళినభర్తదగ్గరనుంచి వచ్చిన ఉత్తరం తమఇంటి వైద్యులసముఖానికి తీసుకెళ్ళిందిట. ఆ డాక్టరుగారు మొహమాటపడుతూ, “భార్యాభర్తలమధ్య రాసుకున్న ఉత్తరాలు తను చదవడం భావ్యం కాదు” అన్నారు.

ఆవిడ దీర్ఘంగా నిట్టూర్చి, “సరేలెండి. అసలు మీకంటె ముందు ఫార్మసిస్టుదగ్గరకి వెళ్ళేను. అతను, మందులపేర్లు తప్ప మరేమీ గుర్తు పట్టలేను, అన్నాడు. అంచేత ఇక్కడికి రాకతప్పింది కాదు,” అన్చెప్పి, తిరిగి వెళ్ళిపోయింది గొణుక్కుంటూ. ఏమని అంటే, అతనే వచ్చేవరకూ ఆగి, అతను వచ్చేక, అతనిచేతే చదివించుకోవాలి అని.

ప్రముఖులరాతలు ప్రత్యేకంగా ఉంటాయి కనకనే సంతకాలసేకరణ ఒక ఉద్యమం అయింది. చేతిరాతలకీ తలరాతలకీ చుట్టరికం ఉంది కనకనే రాతలమీద ఇన్నిన్ని గ్రంథాలు వెలువడ్డాయి. ఇంకా వెలువడుతూనే ఉన్నాయి.

వారంరోజులక్రితం మాఅమ్మ రాసుకున్న నోట్ పుస్తకం కనిపించింది. అది నాదగ్గర చాలాఏళ్ళగా ఉంది కానీ ఎప్పుడూ తెరిచి చూడలేదు. అన్నీ స్తోత్రాలూ, ఉపనిషత్ వాక్యాలూను, మొదట్లో విషయసూచికతో సహా ఎంతో ఓపిగ్గా కుదురుగా రాసుకుంది

1955నాటి ఆ పుస్తకంలో ఉన్న దస్తూరీయే ఆమెచివరిరోజులలో నాకు రాసిన ఉత్తరాలలో కూడా. ఇంతపిసరు కూడా తేడా లేదు. చాలామంది తల్లులలాగే మాఅమ్మ కూడా తనజీవనం నందనవనం కాకపోయినా, మాకు నందనవనమే అనిపించేట్టే పెంచింది మమ్మల్ని.

ఆపుస్తకంలో ఈ వాక్యాలు మామిత్రులతో పంచుకున్నాను.

——–

మాటలాడుటకన్న మాటలాడకుండుట మేలు. రెండవది మాటాడిన సత్యమైనదిగా నుండవలెను. మూడవది ప్రియమైనదిగా నుండవలెను.

——-

ఆప్తులు ఒకరితో ఈమాట చెప్తే, “నీవిషయంలో మొదటి రెండు నిజం. మూడోది కాదు,” అన్నారు.

కొంత ఆలోచించుకుంటే నాకు తోచిన సమాధానం, చాలాకాలం నేను మూడవది కూడా ఆచరిస్తూనే వచ్చేను. కాలక్రమంలో సమాజంలో మనుషులలో వచ్చినమార్పులతో నేను కూడా అది మార్చుకోవలసివచ్చింది.

ఇప్పుడు అప్రియమైనా సత్యం పలకడమే శ్రేయస్కరం అనిపిస్తోంది. మరో కారణం రచయితలందరూ చేసేదే. రాతలలోనే కాక బంధుమిత్రులతో మాటాడుతున్నప్పుడు కూడా హాస్యం, వ్యంగ్యం, అతిశయోక్తులూ, నానార్థాలు, శ్లేషలలాటి రసాలూ, అలంకారాలూ గుప్పించేస్తారు కదా. అనగా మనం పలికే పలుకులన్నీ ఎల్లవేళలా ప్రియవాక్కులే కావడం సాధ్యం కాదు.

చేతిరాతకీ తలరాతకీ సంబంధం ఉంది. దస్తూరికీ నోటిమాటకీ సంబంధం ఉంది. నోరుంటే తల కాస్తుందన్న మాట వినే ఉంటారు కదా. నాకెలా తెలుసా? లేదు నాదగ్గర ఋజువులూ సాక్ష్యాలూ లేవు. ఇది నా అభిప్రాయము. అంతే.

000

(జూన్ 12, 2019)

 

 

 

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.