కార్పణ్యము

దొరగారి ఏడంతస్తులభవనంముందు సరదాగా తిరుగుతున్న తెల్లపిల్లి గేటుకవతల తచ్చాడుతున్న మచ్చలపిల్లిని చూసింది.

నీలిరంగు పిల్లికళ్ళు చిట్లించి చూసింది.

నిక్కి చూసింది.

అనుమానంగా చూసింది.

ఆతరవాత చిరాగ్గా చూసింది.

ఎవరీ మచ్చలపిల్లి? ఎందుకిక్కడికొచ్చింది? దోచుకోడానికి కాదు కదా? పలకరించొచ్చా? పలకరించకూడదా? పలకరిస్తే ముప్పా? పలకరించకున్న గొప్పా?

మచ్చలపిల్లికి కూడా అదే అనుకుంటోంది– పలకరించితే మంచిదా? కొంతకాలం ఆగి పలకరించితే మంచిదా?

“ఏంటలా చూస్తున్నావు?” ఆఖరికి తెల్లపిల్లి అడిగింది. తెల్లనుదురు చిట్లించింది కానీ బొచ్చుమూలాన మచ్చలపిల్లికి ఆనుదుట చిట్లు కనిపించలేదు.

“ఏంలేదు. ఊరికే.” అంది మచ్చలపిల్లి తేలిగ్గా.

“హుం. ఊరికే ఇక్కడే ఎందుకు తిరగడం? అసలు ఇక్కడికెందుకొచ్చేవూ?”

“చెప్పేను కదా ఊరికే అని.”

“ఊరికే తిరగడానికి ఊళ్లోకే రావాలేంటి? ఊరవతల అడవి లేదూ? అక్కడ తిరుగు నీఇష్టం వచ్చినట్టు. ఫో, ఫో.”

“అక్కడ పులులు, సింహాలూ చంపుకు తినేస్తున్నాయి. ఇక్కడ జనులు ఏదో నాగరీకులంటున్నారు కదా. ఆనాగరీకం ఏంటో చూదాం అని వచ్చేను. నీకిక్కడ బాగుందా?”

“ఆహా. నాకిక్కడ రాజభోగాలు. మాదొరగారు చాలా నాగరీకులు. దొరసానమ్మ చాలా నాగరీకులు. ఇంకా వారింట దాసదాసీజనం చాలా చాలా నాగరీకులు.”

“సరే ఆనాగరీకం ఏమిటో చూస్తాను చెప్పు, చెప్పు.”

తెల్లపిల్లికి ఎక్కడలేని హుషారూ వచ్చేసింది. దొరలనాగరీకం ఎంత గొప్పదో చెప్తుంటే తనదే ఆ గౌరవం అన్నంత గర్వపడిపోతూ పావుగంటసేపు దొరభజన చేసింది. ఆఇంట తను కాలు పెట్టడంతో తనజన్మ ధన్యమయింది అంది. ఏడు పిల్లిజన్మలు ఈ దొరఇంటే పుట్టాలని కోరుకుంటూ తపస్సు చేస్తున్నానని చెప్పింది. ఆతరవాత అలిసిపోయింది. అప్పుడు తెలపిల్లికి తెలివొచ్చింది. తన తెలివితక్కువతనం కాకపోతే మచ్చలపిల్లితో తాను మాటాడడమేమిటి అని తనమీద తనకే చిరాకేసింది. తరవాత కోపం వచ్చింది.

“ఛీ, ఛీ. నీలాటిపిల్లులతో మాటాడడం నాకే గౌరవలోపం. ఫో. ఫో. నువ్విక్కడ ఉండడానికి తగవు. అసలు మాదొరగారిమందిరంవేపు చూడడానికైనా నీకు అర్హత లేదు,”

అని పిల్లిగోరోజనంతో అక్కడినుంచి తప్పుకుంది.

మచ్చలపిల్లికి కూడా చిరాకేసింది కానీ పోన్లే, పడ్డవాళ్లెప్పుడూ చెడ్డవాళ్ళు కారు అనుకుని ఆపూటకి వెళ్లిపోయింద వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ.

000

తెల్లపిల్లి తెల్లబోయింది. ఒక మచ్చలపిల్లిని పొమ్మంటే, ఇప్పుడు ఒక గుంపు కనిపిస్తోంది. ఇన్ని పిల్లులు ఎక్కడ్నుంచి వచ్చేయి చెప్మా అనుకుంటూ విస్తుపోయి చూస్తోంది.

“పొమ్మన్నాను కదా, ఇంతమంది ఎలా వచ్చేరు?” అని కసరింది.

“మేం ఎక్కడికీ పోలేదు. వాళ్లు మాపిల్లిపిల్లలు.”

“హా. ఎంత పొగరు, ఎంత ధైర్యం? ఎన్ని గుండెలు ఇక్కడిలా తిష్ఠ వేయడానికి? ఒకడికే చోటు లేదంటే పదిమంది చేర్తారా?” అంటూ పేట్రేగిపోయింది తెల్లపిల్లి.

“అడవిలో పులులూ, సింహాలూ అని చెప్పేం కదా. నువ్వు మాత్రం ఇక్కడ పుట్టేవేమిటి?”

“నేనిక్కడ పుట్టకపోతేనేం. మాదొర నన్ను లండనునించి తీసుకొచ్చేడు తెలుసా. అంటే ఏంటో తెలుసా? మాది సిసలైన ఆంగ్లోసాక్సనురక్తం. స్వచ్ఛమైన మేలుబంతి రాజవంశపు రక్తం. మిమ్మల్ని ఏడు పుఠాలేసినా మారక్తం మీకు రాదు,” అంది హుంకరిస్తూ.

“పోదూ బడాయి. పిల్లి పిల్లే. నువ్వూ పిల్లివే. మేఁవూ పిల్లులఁవే.” అంది మచ్చలపిల్లి ముందుపంజాతో  దులపరించేస్తూ.

తెల్లపిల్లికి మాచెడ్డ కోపం వచ్చేసింది. ఎగిరి మచ్చలపిల్లిమీద పడడానికి ఆయత్తమయింది.

ఇంతలో మరో తెల్లపిల్లి వచ్చింది ఏమిటేమిటి, ఏమిటి గోల అంటూ. మగపిల్లి ఘూర్ణిల్లుతో జరుగుతున్న కథ వివరించింది.

తెల్లపిల్లి ఆడతెల్లపిల్లి. ఆవిడకి తగువులిష్టం లేదు.

“పోనిద్దూ. మన్లాగే వాళ్లూను. మనకేంటి వాళ్ళు గేటుకవతల కదా ఉన్నారు. వాళ్ళక్కడ ఉన్నంతకాలం మనకి ఢోకా లేదు. మనదొర మనని చూసినట్టు వాళ్ళని చూడడు,” అంది ధైర్యం చెప్తూ. ఆ ఆడతెల్లపిల్లిని ఈమధ్యనే దొరసానిసలహామీద తీసుకొచ్చేరు. తెల్లపిల్లి ఒంటరితనంతో బాధ పడుతోందేమోనని.

ఈవిధంగా కొంతకాలం సాగింది. ఆ.తెల్లపిల్లి పిల్లల్ని పెట్టింది. అదుగో అక్కడ వచ్చింది తంటా. ఆ పిల్లిపిల్లల్లో ఒక పిల్లి మచ్చలతో పుట్టింది.

“హాత్. హూత్. అది నాపిల్లపిల్లి కాదు. నువ్వు కులటవి.” అంటూ ఎగిరిపడింది మ.తెల్లపిల్లి. ఇక్కడ వ్యాకరణం పరీక్ష పెట్టకండి. నాకు తెలియడంలేదు ఎలా రాయాలో. ఇంతకీ

ఆ.తెల్లపిల్లికి వళ్ళు మండింది, “ఛప్. దొరవేషాలెయ్యకు. ఆమాటకొస్తే ఆ దొరబాబుకే లేదు ఆ నీతి. మానవులనీతి మనకొద్దు.” అని కసురుకుని, నల్లపిల్లిపిల్ల మెడ కరిచి పట్టుకు చెట్టెక్కి కూచుంది.

మ.తెల్లపిల్లి గుర్రుగా చూసి మరో చెట్టెక్కి చుట్టూ చూడసాగింది. అలా దూరంగా చూస్తుండే హఠాత్తుగా తెలివెలుగుల ఆకాశం బూడిదరంగుకి మారుతూ కనిపించింది. “అదేంటి, పొగలా ఉందే” అంది.

ఆ.తెల్లపిల్లి కూడా అటు చూసి, “అలాగే ఉంది.” అంటూ చెట్టు దిగింది.

మ.తె.పిల్లి కూడా చెట్టు దిగిపోయింది ఇప్పుడు చేయవలసినది ఏమిటా అని ఆలోచిస్తూ.

మచ్చలపిల్లులూ అటువేపే చూస్తున్నాయి గాభరా పడిపోతూ. .

అవునౌవునౌవును. పొగే, పొగే అది.

అడివివేపునుంచే వస్తోంది. అడవిలోనే పుట్టినట్టుంది.

ఓరి బాబో, పిలు, పిలు, దొరగారితో చెప్పు, పిలు, దొర, దొర అంది మ.తెల్లపిల్లి ఆతురపడిపోతూ.

మచ్చలపిల్లులు నవ్వేయి. “పొగే. అంతమాత్రానికే జడుసుకుంటావేమిటి? గొప్ప వీరుడివే? సాక్సను రక్తమూ నువ్వూను,” అంది ఓ కుర్ర మచ్చలపిల్లి.

“హే. నువ్వూరుకో. బయపడేవాళ్ళకి ధైర్యం చెప్పాలి కానీ …” అని తెల్లపిల్లివేపు తిరిగి, “అదేం లేదు అబ్బాయీ. ఎవరో వనభోజనాలు.”

అందే కానీ ఆమచ్చలపిల్లికి కూడా అనుమానంగానే ఉంది.

చూస్తూ చూస్తూండగానే, పొగలు ఉండలుండలుగా గాలిలోకి లేచేయి..

బూడిదరంగు నల్లగా దట్టంగా మారిపోతోంది.

ఆనలుపుమీదుగా పసుపు, ఎరుపూరంగులు.

భీభత్సం.

ఘోర కరాళ అగ్నిశిఖలు ఆకాశాన్నంటుతూ.

పొగలు సెగలు రేపుతూ వినువీధిని ఆక్రమిస్తూ

ఊళ్లో జనులు బల్చీలతో, కుండలతో, అండీలతో నీళ్ళు మోస్తూ అడవివేపు పరుగులు

అడవిలోని పులులూ, సింహాలూ శరవేగంతో ఊళ్లోకి ఉరుకులు

అరుపులు, పెడబొబ్బలు

ఏప్రాణి ఎటు సాగుతోందో తెలియనంత అయోమయం.

తెల్లపిల్లులు, మచ్చలపిల్లులు, సింహాలూ, పులులు, ఎలుగుబంట్లు, కోతులు, నక్కలు, కుక్కలు గుంపులుగుంపులుగా విసురుగా హడావుడిగా గందరగోళంగా ఉరుకులు, పరుగులు

ఏ పిల్లి ఏగుంపులో ఉందో తెలీడం లేదు.

— —  —

క్రమంగా అగ్ని చల్లారింది.

తెల్లపిల్లులు మచ్చలపిల్లులకి దూరంగా జరిగేయి.

“ఇదంతా మీనించే. మీరిక్కడికి రాకపోతే మాకసలు తెలిసేదే కాదు అక్కడో అడవుందని.”

“అడవుందని తెలీదా వేషాలు కాకపోతే.”

— — —

దొరగారు ఒకచేతిలో చేతికర్రతోనూ మరొకచేతిలో గుప్పెడు గడ్డితోనూ సింహద్వారంలో నిలబడ్డారు.

“ఏమిటాగోల నానిద్ర పాడుచేస్తూ.” అన్నారు అప్రసన్నవదనంతో.

తెల్లపిల్లులు, మచ్చలపిల్లులు, పులులు, ఎలుగుబంట్లు ఒక్కసారిగా తమతమ భాషలలో ఆ ఘోర సంఘటనని వివరించడానికి ప్రయత్నించేయి. ఆతరవాత తమలో తమకి గల కలహకారణం కూడా వివరించేయి. ఆకలహకారణమే అడవిలో దారుణ మంటలకి కారణం అని తెల్లపిల్లి ఆరోపించిందని నల్లపిల్లి నివేదన.

దొరగారికి కోపం రెట్టింపయింది. ఆయన గంభీరస్వరంతో గట్టిగా చెప్పేరు, “ఇదుగో, ఇక్కడ ఎవరిబతుకు వారిది. ఎవరూ ఎవరికీ జవాబుదారీ కాదు. నా నిర్ణయాలప్రకారం మీరంతా పడుండండి. తన్నుకుచావడం చస్తారో, తన్నుకోకుండా చస్తారో మీరే తేల్చుకోండి. అనవసరంగా నానిద్ర పాడుచేయకండి. మళ్లీ ఇలాటి గోల వినిపిస్తే మీ అందరిపనీ పచ్టస్తాను గట్టిగా ఒ ఉరుము ఉరిమి, తెలిసిందా?” అని ఒక్క ఉరిమినంత విసురుగా తమ అభిమతము వెలిబుచ్చి ఓ గుప్పెడు గడ్డి వాళ్ళమీదకి విసిరి, హుందాగా తమ ఏడంతస్తుల భవనంలోకి అంతర్ధానమయిపోయేరు.

తెల్లపిల్లి మొహం నల్లగా మాడ్చుకుని నల్లపిల్లివేపు చూసింది.

నల్లపిల్లి తెల్లబోతూ తెల్లపిల్లివేపు చూసింది.

మిగతా జీవులన్నీ తమతమ ముఖాలకి అనుగుణమైన రంగులు పులుముకుని చుట్టూ చూస్తున్నాయి దొరబాబు విసిరిన గడ్డిపరకలు నమల్తూ.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, పైవాడు వచ్చి గడ్డి పెట్టేవరకూ ఈ సమాజం ఇంతే.

000

(జలై 19, 2019)

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.