బొమ్మా బొరుసూ

ఏరాడకొండమీంచి

ఏడు సముద్రాలు దాటి

చేరుకున్నాను పరమపదం

భాష వేరు, భావాలు వేరు

ఆశలు వేరు, ఆశయాలు వేరు

విశ్వాసాలు ఇంకెంతో వేరు.

 

కళ్ళు పొడుచుకు చూస్తున్నా

మనవాళ్ళ మొహాలే మరోలా కనిపిస్తున్నాయి

ఆనాటి అలవాట్లూ, కట్టుబాట్లూ

అనువు కాని చోట ఆపద్దర్మాలు

గతంలో ఘనత వహించిన కులధర్మాలకి కొత్తభాష్యాలు

పుట్టుకతో వచ్చిన విలువలు జీడిమరకల్లా,

వదలవు ఎంత కాదనుకున్నా.

విధివశాత్తూ అక్కడా అక్కడా కలిసిన కొత్తమొహాలు

మనరక్తకణాల్లో ఇంకిపోయిన ఆచారాలకి ఆనవాళ్ళు.

 

పెళ్ళిళ్లకీ పుట్టినరోజులకీ,

పండుగలకీ పబ్బాలకీ, విందుభోజనాలకీ

సత్యనారాయణవ్రతాలకీ రారమ్మని పిలుపులు.

 

పరంపరాగత సంప్రదాయాలొక పక్కా

స్థానికమర్యాదలు మరో పక్కా

కొరుక్కుతింటున్నాయి చెదపురుగుల్లా.

 

బతుకంతా కలగాపులగం

గందరగోళం. అయోమయం

ఎటు చూసినా కటికచీకటి, అంధకారబంధురం.

మేలుకొలుపులు పాడిన మిత్రమా,

నువ్వే చెప్పు, ఈచిక్కు విడేదెప్పుడు

నామనోఫలకం కొత్తరంగులు పులుముకునేప్పుడు!?

000

(జులై 30, 2019)

 

 

 

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.