పిలకా గణపతిశాస్త్రిగారి ప్రాచీన గాథాలహరి సం. 5

వెనక 3వ సంకలనం పరిచయం చేసేను. ఇది 5వ సంకలనం. ప్రచురణ 1967లో.  వెనకటి వ్యాసంలో పిలకా గణపతిశాస్త్రిగారి భాషాపాటవం, ప్రతిభావంతమైన శైలిగురించి వివరంగానే రాసేను కనక ఈపరిచయం సంక్షిప్తంగా ముగిస్తాను. (వెనకటి పరిచయానికి లింకు ఇక్కఢ)

పిలకా గణపతిశాస్త్రిగారు తమ ముందుమాటలో ప్రస్తావించిన కొన్ని సంగతులు ఇలా ఉన్నాయి. మొదటిది –  ఒక సంఘటననో, సన్నివేశాన్నో, శ్లోకాన్నో తీసుకుని, వేర్వేరు రీతులలో కథానికలుగా వ్రాసేరు. రెండోది, తాము ప్రచురించ దలచిన మూడు సంపుటాలు అనుస్యూతంగా కాక, దేనికది స్వతంత్రంగా చదువుకోడానికి అనువుగా కూర్చేరు. ప్రస్తుత సంకలనంలో తాము అనుకున్న 54 కథలూ సంకలనాలుగా పూర్తయేయని వ్రాసేరు.

అంతే కాదు. కథారచనకి ఉపయోగపడగల వస్తువు తీసుకుని “విభిన్న వినూత్న కల్పనలతో, వివిధ పాత్ర చిత్రణలతో” తమదైన శైలిలో మలచిన కథలివి అని కూడా గణపతిశాస్త్రిగారే చెప్పుకున్నారు. కథాంశాలు “కొన్ని చారిత్రకాలయితే, కొన్ని చారిత్రక పూర్వరంగంతో కల్పించిన స్వతంత్ర రచనలు” అనీ, “సంస్కృతకావ్యాలలోని కథలకి అనువాదాలు కానీ, అనుకరణలు కానీ కావు” అనీ కూడా స్పష్టం చేసేరు.

ఈవిషయాలు దృష్టిలో ఉంచుకుని చదవాలి ఈకథలు కూడా. ఈసంకలనంలో మొత్తం తొమ్మిది కథలు ఉన్నాయి. ఇందులో మొదటికథ రంగతురంగం విజయనగరప్రభువు ఒక సామాన్యకుటుంబంలో జన్మించిన ఉద్దండ చతురంగమేధావి చదరంగంఆట పందెం వేసుకోడం. గెలుపు ఓటమి ప్రధానమే అయినా కథ నడిపినతీరు చదరంగం ఆడినంత నేర్పుతోనూ సాగుతుంది.

నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకున్న కథ ఆచార్యవిభ్రాంతి. శంకరుడు, వరాహమిహిరుడు, ఉభయభారతి – ఈ ముగ్గురిమధ్య జరగిన వాదోపవాదాల నేపథ్యంలో సాగిన ఈకథ చదివేక నాకు రెండు సందేహాలు కలిగేయి. మొదటిది, శంకరుడు గృహస్థధర్మంగురించి తెలుసుకుని వెనక్కి వచ్చేక, ఉభయభారతితో వాగ్వివాదం కొనసాగించేడా లేదా అన్నది. నాకు తెలియలేదు. రెండోది, శంకరుడు గృహస్థధర్మంలోని సూక్ష్మాలు లోతుగా పరిశీలించి అవగాహన చేసుకోడంకోసమే కదా పరకాయప్రవేశం చేసింది. రాజుశరీరం ప్రవేశించేక ఆయనకి ఆ స్పృహ లేనట్టే ఈకథలో కనిపిస్తోంది. శంకరాచార్యులవంటి అద్వీతీయ జ్ఞాననిధికి ఇది ఆపాదించదగ్గకోణమేనా అని నా సందేహం. పైన రచయితగారే చెప్పినట్టు వారే కల్పించిన కథ అని అనుకుంటున్నాను.

ప్రత్యేకంగా చెప్పుకోవలసిన కథ, ఈనాటికీ అర్థవంతమైన కథ, పతితజనోద్ధరణ. సంఘసేవకులూ ఏకాలంలోనూ ఉన్నారు. సంఘసేవాతత్పరులు నిష్కల్మషమైన ఔదార్యంతోనే ప్రారంభిస్తారు తమ కార్యక్రమం. స్త్రీలని కావచ్చు, దీనజనులని కావచ్చు. బడుగుజీవితాలను కావచ్చు. అయితే వాటిని ఆచరణలో పెట్టేక తెలుస్తాయి వాటిల్లో సాధకబాధకాలు. కొన్ని తెలిసి చేసేవి, కొన్ని వాటంతట అవి ఎదుటికి వచ్చిన పరిణామాలు అవుతాయి.

కొంచెం చాంద్రాయణమే అయినా నేను తరుచూ ఆలోచించే ఒక ఆలోచన ఇక్కడ పంచుకుంటాను. స్త్రీజనోద్దరణగురించి. వీరేశలింగంగారు స్త్రీలకి చదువు కావాలన్నప్పుడు వారి ఉద్దేశ్యం సతీధర్మాలే. భర్తకి సేవ చేసే భార్యని తయారు చేయడమే వారి ధ్యేయం. కాలక్రమంలో స్త్రీవిద్య అందుకు భిన్నంగా సాగింది. సతీధర్మాలు కాక ఇంజినీర్లు, డాక్టర్లు అయేరు. ఆతరవాతికాలంలో చలం ప్రతిపాదించిన స్వేచ్ఛగురించి నేను అట్టే చర్చ పెట్టుకోను కానీ అది కూడా వికటించిందనే నాకు అనిపించింది. కుటుంబరావు ఆర్థికస్వాతంత్ర్యం స్త్రీలు సాధించడానికి కొంత కాలం పట్టింది. చదువుకుని, ఉద్యోగాలు చేసి సంపాదించుకున్న ధనం ఇచ్చిన స్వాతంత్ర్యం నిజమైన స్వేచ్ఛ కాలేదు. ఆసంపాదనలు మొదట పుట్టింట్లో, తరవాత అత్తింట్లో వాళ్లకి ఆసరా అయేయి కదా. ఇప్పుడు స్త్రీలు అనుభవిస్తున్న స్వేచ్ఛ, ఉంటే గింటే, ఎలా ఉందో నాకు తెలీదు. కానీ ఏ సిద్దాంతమైనా ఆచరణలో ఏరూపం పొందుతుందో చెప్పలేం అని మాత్రం చెప్పగలను.

పతితజనోద్ధరణ కథలో ఒక విధంగా చూస్తే మామూలు కథే అనిపించినా, కథలో ఉద్ధరణ మూలతత్వంగూర్చి జరిగిన చర్చ చదివి నిశితంగా ఎవరికి వారు ఆలోచించుకోవలసిన అవుసరం ఉంది. ఒక్క ఉద్ధరణ విషయంలోనే కాదు. నిత్యజీవితంలో ఒకరు మరొకరికి సాయం చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాను అని పరీక్షించి చూసుకోడానికి ఉపయోగపడతాయి ఈ వాదనలు.

నిష్కల్మషంగా ధర్మబుద్దితోనే మరొకరిని ఉద్ధరించబూనినవారు కూడా తమ ధ్యేయం ఎటు కొనసాగుతున్నదీ చూసుకోకపోవచ్చు. ఎవరు ఎవరిని ఉద్ధరించేరు, లేదా ఉద్ధరించుకున్నారు, ఏవిధంగా అన్నఅంశాన్నిగూర్చి అర్థవంతంగా సాగిన చర్చ ఇది. ఈ చర్చ ఈనాటి సంఘసేవకులకు స్ఫూర్తిదాయకం.

మిగతా కథల్లో పరీక్షలగురించి రెండు కథలు చమత్కారపూరితంగా ఉన్నాయి. రెండూ రెండు వేలఏళ్ళక్రితంనాటి కాశ్మీరప్రభువులకాలంలో జరిగినవి. అంచేత ఆనాటి సాంఘికవిలువలు, రాచమర్యాదలు చాలా చూస్తాం ఈకథల్లో. సామర్థ్యపరీక్ష కథలో గెలుపు కేవలం భుజబలం కాక తెలివితేటలు ప్రధానంగా నిర్ణయం జరుగుతుంది. ఇద్దరు రాకుమారులు ఒక ఫలితాన్ని ఆశించి హోరాహోరీ పోరాడుతుంటే మూడవవానికి ఆ ఫలితం సునాయాసంగా లభించగలదని చెప్పినకథ. ఎలా జరిగింది అన్నప్రశ్నకి సమాధానం ఈకథ. మరొక చిన్న విశేషం పాలేవత ఫలాలు అంటే ఆపిల్ పళ్లు. వాటి ఉరవు మనందరికీ తెలిసిందే. ఏ ఒక్కరికైనా వంద పళ్లు ఒక పాత్రలోకి ఎత్తుకోడం సాధ్యం కాగలదా? బహుశా రచయిత మరొకకాలంగురించి ప్రస్తావిస్తున్నారు కనక ఆరోజులలో రాజకుమారులు ఆజానుబాహులు, బలిష్ఠులు కనక సాధ్యమేనేమో. లేదా ఆరోజులలో ఆపిల్ పళ్లు అంత ఉరవు లేవు అనుకోవాలేమో. ఈభాగం నన్ను కొంత ఆలోచనలో పడేసింది కానీ చదవడానికి ఆసక్తికరంగానే ఉంది.

రెండవకథ నిశిత ధర్మదృష్టి. ఈ తొమ్మిది కథలలోనూ ఈకథ తలమానికంగా ఉంది. క్లిష్టతరమైన ధర్మనిర్ణయం చేయవలసివచ్చినప్పుడు ఆ నిర్ణయం ఎలా జరుగుతుంది అన్నదే ప్రధానాంశం. కాశ్మీర మహారాజు పాలనలో ధర్మం నాలుగు పాదాల నడుస్తోంది. బీదబ్రాహ్మణుడైన వీరేశ్వరభట్టారకులకూ, ఆయనకి సహాయం అందించిన మరొక బీదవానికీ మధ్య తగువు, ఇద్దరివాదనలూ ధర్మసమ్మతమే అయినప్పుడు, ప్రభువులు ఏవిధంగా తీర్పు చేసేరో, ఆమీదట ఆ ఇద్దరు వాదులు ఎలా ప్రవర్తించేరో అన్న అంశాలు అద్భుతంగా చిత్రించేరు రచయిత.

ఆ తగువు తీర్చిన విధానంనుండి ఈనాడు మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ధర్మనిర్ణయం అసిధారావ్రతంవంటిది అనీ, ఒకొకప్పుడు అధర్మమే ధర్మస్వరూపంలో లోకం కన్ను కప్పివేస్తున్నది, ఒకొకప్పుడు పరమధర్మమే వట్టి అధర్మంలా పరిణమిస్తున్నది అని (పు. 163) మహరాజే శలవిస్తారు ఆ తగువుతీర్పుకి ఉపోద్ఘాతంగా ప్రస్తావిస్తూ.

నన్ను ఆకట్టుకున్న వాక్యం– ప్రాచీనకాలంలో కేవలం మాటకట్టిడివల్లనే వ్యవహారాలన్నీ పరిపూర్ణ ధర్మపద్ధతిలో నడిచేవి, తగు మనుష్యుల సమక్షంలో జరిగిన ఒప్పందాలన్నీ తామ్రశాసనాలవలె, శిలాక్షరాలవలె సర్వులూ మన్నించి శిరసావహించేవారు అని శ్రీనగర న్యాయాధిపతి వాదం. ప్రభువులు వీరేశ్వర భట్టారకులమాట కేవలం మర్యాదతో, ఆదరంతో అన్నమాటగానే స్వీకరించాలి కానీ వాటి వాచ్యార్థం స్వీకరించరాదంటారు.

ఈకథలలో ప్రస్ఫుటంగా కనిపించే మరొక అంశం – ప్రభువులకీ సామాన్యప్రజలకీ మధ్యగల సుహృద్భావం. ఒకరియందు మరొకరు ప్రదర్శించే  గౌరవాదరాలు. ఇవి ఆదర్శనీయం.  ఆసమాజనీతిముందు ఈనాడు అందరూ సమానమే అంటూ అనుదినం అనుక్షణం పెట్టే ఘోష దిగదుడుపేనేమో ఆలోచించుకోండి.

సూక్ష్మంగా చెప్పాలంటే ప్రాచీనగాథలను ఆధునికభావాలతో సమన్వయపరిచి రాసిన కథలివి. ఎప్పుడో జరిగినవే లేదా జరిగినట్టు ఊహించి రాసినవే అయినా ఇప్పటికీ మనకి ఉపయోగపడగల సందేశాలను పొందుపరిచిన కథలివి.

ఈ సంకలనంలో చివరి రెండుకథలు ఇంతకు పూర్వం ఎక్కడా ప్రచురించలేదుట. అలా కొత్తకథలు చదివిన తృప్తి కూడా కలుగుతుంది పాఠకులకు ఈ సంకలనంతో.

ఈ సంకలనానికి లింకు, ఆర్కైవ్.ఆర్గ్ సౌజన్యంతో, praachiina-gaathaalahari

Archive.org లింకు https://archive.org/details/in.ernet.dli.2015.497527

000

(ఆగస్టు 23, 2019)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.