ఒరులేయవి యొనరించిన

మనిషి ఏడుస్తూ వస్తాడు, పోయి ఏడిపిస్తాడు. ఆరెండు ఏడుపులమధ్యా ఉన్నంతకాలం ఏడుపులూ, నవ్వులూ అనుభవిస్తాడు.గత నాలుగైదురోజులుగా ఒక ప్రముఖరచయిత్రిమరణంగూర్చిన పోస్టులలో వేదనా, సానుభూతీ, చిరుకినుకా, కొన్ని ప్రశ్నలూ, తమకి తోచిన సమాధానాలు కనిపించేయి.

నేను సాధారణంగా ఎవరిమరణానికీ పత్రికాముఖంగా స్పందించను. “నావంతు ఎప్పుడో,” అనుకోడం తప్ప నాకు మరో ఆలోచన రాదు. సూచా వాచా మరణంవిషయంలో నాఅభిప్రాయాలు అప్పుడప్పుడు రాస్తూనే ఉన్నాను. మనిషి ఏడుస్తూ వస్తాడు. పోతూ పోతూ తనవారిని ఏడిపిస్తాడు. ఆ రెండు ఏడుపులమధ్య నవ్వులూ, ఏడుపులూ పడుగుపేకల్లా అనుభవంలోకి వస్తాయి బ్రతికి ఉన్న ప్రతివారికీ.

ప్రతివాళ్లూ -మీరు, వారు, వీరు కూడా రాసినప్పుడు, మాటాడినప్పుడు మరొకరికోసం, ఎదటివారిని మనసులో పెట్టుకు మాటాడుతారు. ఎవరిగురించి మాటాడుతున్నారో వారినైజం ఎవరికీ పూర్తిగా తెలీదు. ప్రతి మనిషి–రచయిత గానీ, మరోరంగంలో ప్రముఖుడు గానీ, తప్పనిసరిగా వారి భావప్రకటనలో దాపరికం ఉంటుంది. ఏ మనిషీ ఎప్పుడూ నూటికి నూరుపాళ్ళూ మనసులో మాట చెప్పరు. వినేవారిధోరణికి అనుగుణంగా మాటాడడమో రాయడమో చేస్తారు. అలాగే మనం–అంటే పాఠకులూ, శ్రోతలూ- మనఅభిప్రాయాలు ఆ రచయిత, వక్త, నాయకుడిగురించి మనకి అవగతమైనకోణంలో ప్రస్తావిస్తాం. ప్రస్తావిస్తున్నారు.

జగతిగారు తమజీవితాన్ని తమకి తోచినరీతిని అంతం చేసుకున్నారు. ఆమెకృషిని అభిమానించినవారు తమకి తోచినరీతిని తమఅభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. నాఅభిప్రాయంలో “నువ్వులేక నేను లేను” అంటూ పాడే ప్రేమ సినిమాల్లోనూ, కథల్లోనూ బాగుంటుంది కానీ నిజజీవితంలో అంతగా రాణించదు. అది భ్రమే కానీ వాస్తవం కాదు, ముఖ్యంగా సమాజంలో తమదైన ఒక వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకున్నవారివిషయంలో. ఆ అస్తిత్వం కేవలం ఆత్మీయుడైన ఒకవ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. అలా పరిమితమే అనుకోడం అమాయకత్వమే. బహుశా విరోధాభాసాలంకారం కూడాను.

అమితావేశంతోనో, పట్టలేని ఆవేదనతోనో, అనేక సాంఘిక, సాహిత్య కార్యక్రమాలతో అనుక్షణం కుతకుతలాడిపోతూ ఉక్కిరిబిక్కిరి అయిపోయేవారికి ఇలాటి ఒంటరితనం కూడా అనుభవంలోకి వచ్చి దుర్భరపరిణామాలకి దారి తీస్తుందేమో. లేకపోతే ఇంతమంది అభిమానులుండగా ఒంటరితనం ఎందుకు అనుభవమయింది అని నాకు అనిపిస్తుంది.

నాకు కలిగిన మరో ఆలోచన – అలా వెళ్ళిపోయేవారు, తాము పోయినతరవాత బాధపడేవారిగురించి,  విచారించేవారిగురించి ఆలోచించరా అని. విచారం ఒక్కటే కాదు. కుటుంబసభ్యులమీద అదొక కళంకంగా పరిణమించగలదు. ఆతరవాత ఆ కుటుంబసభ్యులు సమాజంలో అనేక దోషారాపణలు ఎదుర్కొవలసివస్తుంది. ఇలా ఆలోచించి ఉంటే, ఆత్మహత్యకి పూనుకునేవారు కారేమో.

మామూలుగా ఏదో ఒక సమయంలో “ఛస్తే భాగుండు” అనో, “నాకింక బతకాలనిలేదు, విసుగేస్తోంది,” అనో అనిపించడం అసాధారణం కాదు. ఎప్పుడోఒకప్పుడు తామింక జీవితంలో చేయవలసింది, చేయగలిగింది ఏమీలేదు, చావొక్కటే మిగిలింది అనిపించవచ్చు. నిరాశ, నిస్పృహ కారణాలు కావచ్చు. ఆత్మన్యూనతాభావం కావచ్చు. నిజానికి ఇలాటివి ఎదుర్కొనడంతో తక్షణమే ప్రాణాలు తీసేసుకోడం జరగదు. చాలా కొద్దిమంది మాత్రమే అలాటి పనికి పాల్పడతారు. అదొక క్షణికస్పందన ఒక పరిస్థితికో సంఘటనకో అయిఉంటుంది.

అందుకే, నాకీ సందేహం వచ్చింది- మనం ఆత్మహత్యతో ప్రాణాలు తీసుకున్నవారిని గానీ మరొక దుర్ఘటనకి పాల్పడినవారినిగానీ వేసే ప్రశ్నలు మనకి మనమే వేసుకుని, అదొక పాఠంగా చూడలేమో అని. అవతలివారిని ఎందుకిలా చేసేవు అని అడిగేకంటే నన్ను మరొకరు ఇలా అడగవలసిన పరిస్థితి కల్పిస్తానా అని.

ఒక ఆత్మహత్యవార్త విన్నతరవాత మీరు అడుగుతున్న ప్రశ్నలు, మీపరంగా ఆలోచించుకుంటే సమాధానాలు ఎలా ఉంటాయి? నిజానికి ఇది నేను కొత్తగా పరిచయం చేస్తున్న కొత్తభావం కాదు.

తిక్కన మహాభారతంలో ఉటంకించిన నీతి, ఆంధ్రపత్రిక దినపత్రికలో ప్రతిరోజూ కనిపించిన పద్యం

ఒరులేయవి యొనరించిన

  నరవర! యప్రియము తన మనంబునకగు తా

  నొరలకవి సేయకునికియె

  పరాయణము పరమధర్మపథముల కెల్లన్.

రచయితలు, సంఘసంస్కర్తలు, ఇతరరంగాలలో ప్రముఖుల వాక్కులను ప్రజలు గౌరవిస్తారు. వారి నిత్యజీవితాన్నినిశితంగా పరిశీలిస్తారు. వారి ప్రవర్తన వీరికి మార్గదర్శకం కూడా కావచ్చు. అంచేత  సంఘంపట్ల వారిబాధ్యత కొంచెం పైస్థాయిలో ఉంటుంది. మిగతావారిమాటేమిటి అని అడగవద్దు. నేను మిగతావారు ఎలా చేసినా ఫరవాలేదు అని అనడంలేదు. నిజానికి సంఘంలో ఏ ఒక్కరూ ఒంటరి కారు. ప్రతిఒక్కరినీ ఆత్మబంధువుగా చూచుకునే మనుషులు వారిచుట్టుపట్ల ఎప్పుడూ ఉంటారు.

నామటుకు నేను సమాజానికి దూరంగా ఉంటాను అని బంధువులతో, నాచుట్టూ ఉన్న సమాజంలోని మనుషులతో తెగతెంపులు చేసుకున్నాను. అలా అనుకున్నానే గానీ ఈనాడు నాకు ఈ బ్లాగుమూలంగానూ, ఫేస్బుక్కుమూలంగానూ దగ్గరయినవారు కనిపిస్తున్నారు. ఇది ఒకరకంగా నాజీవితంలో పరస్పరవిరుద్ధ పరిస్థితి అనుకోవచ్చు.

సూక్ష్మంగా చెప్పేదేమిటంటే,

జీవితంగురించి అదుపాజ్ఞలు లేని భ్రమలు కల్పించుకుని ఏదో చెయ్యాలన్న తపనతో, చేసేస్తున్నాం అన్న ఉత్సాహంతో అనుక్షణం ఆవేశపడిపోవడం, మరొకరిమీద మానసికంగా ఆధారపడడంవంటివి అర్థవంతంగా మలుచుకోవడంగురించి తీవ్రంగా ఆలోచించమని.

ఇది కూడా సమాజసేవలో, సాహిత్యసేవలో భాగమే. నన్నడిగితే ముఖ్యమైన భాగం. కేవలం తనబాధగురించీ, తాను పోగొట్టుకున్నదాన్ని(పోగొట్టుకున్నది ఏదైనా సరే)గురించీ బాధ పడడం స్వార్థమే, ఆత్మద్రోహమే. Self-centered అనిపిస్తుంది. అంతవరకూ చేసిన సాహిత్యసేవ, సామాజికసేవ అర్థరహితం అయిపోతాయి, నిజాయితీ లోపించి.

అందుకే అంటున్నాను, ఎవరు ఏదో ఒక దుర్ఘటనకి పాల్పడితే, వారిని అడగదల్చుకున్న ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకుచూడండి ఏమి సమాధానాలు ఇచ్చుకుంటారో మీకు మీరు చెప్పుకోండి. ఇది మీతో మీరే నెరుపుకునే చిన్న సంభాషణ. వేరే ఎవరికీ చెప్పక్కర్లేదు. మీనీతిమార్గం మీరు నిర్ణయించుకోడానికి పనికొస్తుందని అనుకుంటున్నాను.

000

(ఆగస్టు 26, 2019)

 

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.