పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి చంద్రునికో నూలుపోగు నవల

ఇల్లాలిముచ్చట్ల రచయితగా సుబ్రహ్మణ్యశర్మగారిని తెలియని తెలుగు పాఠకులు లేరనే అనుకుంటాను. ఆంధ్రజ్యోతి సంపాదకులుగా దాదాపు రచయితలందరికీ పరిచితులే. 

చంద్రునికో నూలుపోగు నవలలో తమదైన శైలిలో నలుగురు మిత్రులు, ఒక మిత్రురాలిజీవితాలను ఆవిష్కరించేరు. తమదైన అంటే వ్యంగ్యమూ, రవంత కసి, హేళనలతో మిళాయించి మంచి ఊపుతో గబగబ చదివించేసేలా అని. 

కళాపిపాసగల నలుగురు మిత్రుల జీవనప్రస్థానం. సూర్యనారాయణ చిత్రకారుడు. చిత్రాలు రాసి (రచయిత రాయు క్రియాపదమే వాడేరు) పేరు గడించుకోవాలన్నకాంక్షతో మొదలవుతుంది. ప్రసాదరావు నాటకరచయిత, శాస్త్రి వీరిద్దరికీ మద్దతునిస్తూ ఆజన్మబ్రహ్మచారినని చాటుకుంటూ మీరామీద ఓ కన్ను వేసి ఉంచుతాడు. మీరా చిత్రకారిణి. వీరందరికి సహకారం అందిస్తూ, జీవితాన్నిగురించిన నిత్యసత్యాలు బోధిస్తూ, గులకరాళ్ళలో అద్భుత సౌందర్యాలు దర్శించగల సౌందర్యారాధకుడు కృష్ణమూర్తిగారు. ఆయనసావాసం మీరాకి అండదండగా నిలిచి, ఆమెతాత్వికచింతనకి బలమిస్తుంది. 

ఈనవలలో మరోముఖ్యపాత్ర, కొంతవరకూ ప్రతినాయకుడు వరహాలు. సూర్యనారాయణ అతనిని తనమిత్రుడుగానే చెప్పుకుంటాడు. వరహాలు విలాసపురుషుడు. జీవితం ఆనందమయంగా జీవించడానికే అని అతని సిద్ధాంతం. నీభార్య నాకు కావాలి అని సూర్యనారాయణతో చెప్పడానికి వెనుదీయడు. సూర్యనారాయణకి అది అవమానకరంగా తోచదు. ఆతరవాత వరహాలు అతనికూతురు మీనాక్షిని లేవదీసుకుపోయినప్పుడు కూడా అతనికి బాధ లేదు. ఈపాత్రచిత్రణ చూస్తే, నాకు ఇవన్నీ లోతు లేని రేఖాచిత్రాల్లా అనిపించేయి. మీరా, కృష్ణమూర్తి పాత్రలు ఉదాత్తపాత్రలుగా కనిపిస్తాయి. 

కళారాధకులుగా విజయం సాధించాలని వీరు చేసేప్రయత్నాలే కథని సూత్రప్రాయంగా నడిపినా, రచయిత ప్రవేశపెట్టిన సంఘటనలు–నాటకరచన,నాటక ప్రదర్శనకి ముందు జరిగే చర్చలు, ఎదురుపడే అవస్థలు, కలకత్తాలో తెలుగువాళ్ళు, తెలుగుసంఘాలూ, గోవా విమోచనోద్యమం, పారిస్ లో ఫ్రెంచినాగరికత విశేషాలూ,  వివిధప్రదేశాలలో అద్వితీయ ప్రకృతిసౌందర్యం… ఇలా ఎన్నో సంగతులను విపులవర్ణనలతో ఆవిష్కరించడంచేత ఈనవల చదవడానికి చాలా బాగుంది. 

చదవడానికి బాగుండడానికి మరో ముఖ్యకారణం సుబ్రహ్మణ్యశాస్త్రిగారి భాష. ఇల్లాలిముచ్చట్లు కథనరీతి ఇక్కడ కూడా కనిపిస్తుంది. అధికంగా, రచయిత పాత్రికేయులు, అనేకప్రదేశాలు పర్యటించేరు. ఆ అనుభవాలసారం ఈనవలలో కనిపిస్తుంది. 

ఫ్రాన్సులో మీనాక్షి ఆలోచనలుగా శిల్పికీ, చిత్రకారుడికీ మధ్య గల తేడాను కథకుడివివరణ దాదాపు రెండున్నర పేజీలు చదవడానికి బాగున్నా, కొంత గందరగోళం కూడా ఉన్నట్టనిపించింది. చిత్రకారుడు బొమ్మ రాయడానికి కావలిసిన శారీరికశ్రమ తక్కువగానూ మేధాశ్రమ ఎక్కువగానూ పొందితే, శిల్పి హెచ్చు శారీరికశ్రమతోనూ తక్కువ మేధాశ్రమతో పని చేస్తారు అంటారు. ఒకవైపు చిత్రరచన మేధతో కూడినది, శిల్పనైపుణ్యం శారీరికశ్రమతో కూడినది అని చెప్తూనే, రెండు విద్యలలోనూ శ్రమ, మేద రెంటికీ విలువుంది అన్నట్టు కూడా అనిపిస్తుంది ఆరెండు పేజీలు చదవడం అయేసరికి. రచయిత అభిప్రాయం నాకైతే సరిగా అర్థం కాలేదు మరి

సుబ్రహ్మణ్యశర్మగారి వాక్యనిర్మాణం నాకు ప్రత్యేకంగా నచ్చుతుంది. కొన్నిచోట్ల ఒక్కవాక్యం ఒక పేరా నిడివి ఉంటుంది. శర్మగారికథల్లో నాకు ఇది చాలా నచ్చిన అంశం. మనం తెలుగువాళ్ళం ఆపకుండా మాటాడగలం. అలా మాటాడడానికి తెలుగు చాలా అనువైన భాష. అసమాకక్రియలతోనూ. ‘మరియు” అన్న అర్థం వచ్చే దీర్ఘాంత పదాలతోనూ ఎంతసేపయినా మాటాడుకుంటూ పోగలం. సుబ్రహ్మణ్యశర్మగారు రాసుకుంటూపోయేరు. ఇలాటివాక్యాలలో సిద్ధహస్తులు. ఈవాక్యాలవల్ల సౌకర్యం ఏమిటంటే పాఠకులు శ్రమపడక్కర్లేదు. ఆ పదాలే పాఠకులని లాక్కుపోతాయి.  

బహుశా ఆయనకాలానికి, పాఠకులమెదడుని అట్టే కష్టపెట్టకుండా చిన్నచిన్న వాక్యాలు రాయాలి అని శాస్త్రాలు బోధించే కథలబడులు రాలేదో, వచ్చినా ఆయన పట్టించుకోలేదో కానీ శర్మగారు మాత్రం తెలుగుభాష స్వభావాన్ని పుణికిపుచ్చుకు నిలబెట్టేరు తమకథనరీతిలో.  అలాగే భాషలోని ఇతరసౌకర్యాలు కూడాను. ఆయనే ఒకచోట అంటారు, “ఈ ధ్వని, శ్లేష వ్యంగ్యం అన్యాపదేశంగా మాట్లాడడానికి తెలుగుభాషలో ఉన్నంత సౌకర్యం మరెక్కడా ఉండదనుకుంటాను” అని. ఈభాషావైభవం అంతా చూస్తాం ఈనవలలో.  

ఈనవలకి చంద్రునికో నూలుపోగు అన్న శీర్షిక ఎలా నప్పుతుంది అని ఆలోచిస్తే, నాకు తోచిన సమాధానం, దేశం, సమాజం భ్రష్టు పట్టిపోయింది, నేను చేయగలిగింది ఇతే అన్న వేదన రచయిత ఆవిష్కరించేరేమోనని. 

నవల ఆర్కైవ్.ఆర్గ్ లో లభ్యం. వారి సౌజన్యంతో 2015.331547.Chandruniko-Nulupogu కూడా చూడవచ్చు.

000

(సెప్టెంబరు 10, 2019)

  

. 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.